Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 11


                                           5


    ఆహ్వాన మందిర వెంటనే యవకాశమునకై యెదురు చూచుచున్న గోరీ యసంఖ్యాకములగు సైన్యములతో మరల భారత భూమిపైకి దండెత్తి వచ్చెను. దేశాభిమాన శూన్యుఁడగు జయచంద్రుడు గోరీకి స్వాగతమిచ్చెను. మరికొందరు స్వార్థపరులగు రాజు లీ దురాక్రమణకుఁ దోడ్పడినారు.
    ఉభయపక్షములకు భయంకర సంగ్రామము జరిగినది. పృథ్వీరాజు తన యఖండసేనానీకముతో ననుపమాన ధైర్యసాహసములతో శత్రువుల నెదుర్కొనినాఁడు. సంయుక్తాది వీరనారీమణులు కవచములను ధరించి ఖడ్గధారిణులై దుర్గ సంరక్షణమునకు నిలిచినారు. కాని దైవము ప్రతికూలమైనది. ఈ పర్యాయము గోరీమహమ్మదుకు జయము ప్రాప్తించినది. పృథ్వీరాజు బందీకృతుఁడైనాఁడు. సంయుక్త మొదలగు సతీమణులు చితులసొచ్చి తమ మానములు రక్షించుకొనిరి.


                           6


    జయచంద్రుడు ఢిల్లీ సింహాసనముపైఁ గూర్చుండి కులుకుచున్నట్లే కలలు గాంచుచున్నాఁడు. అతఁడు తన మిత్రుఁడగు మహమ్మదుగోరీని పంపివేసి తానే భారత సార్వభౌమపదవి నలంకరించుటకై యువ్విళ్లూరుచున్నాఁడు.
    జయచంద్రునకు మెలకువ వచ్చినది. అతఁడు సౌధోపరిభాగమునుండి క్రిందికి దిగబోయినాఁడు. ఇంతలో నొకసేనా నాయకుడు వచ్చి "మహారాజా! మీరు క్రిందికి దిగుటకు వీలులేదు" అని పల్కెను. జయచంద్రుఁడాగ్రహా వేశముతో "ఇది యేమి" అని ప్రశ్నించెను. ఇది "గోరీ వారి యాజ్ఞ" అని సేనాపతి బదులుచెప్పెను.
    "తెల్లవారుచున్నది. నేను ఢిల్లీ సింహాసన మెక్కవలెను. నన్ను పోనిమ్ము!"
    "గోరీ దాని నీపాటి కెక్కియేయుండును!"    
    "అయిన మేము మా సైన్యములతో మా రాజధానియగు కన్యా కుబ్జమునకుఁ బోవలయును."
    "సైన్యములు మీ రాజధానికి నిన్ననే పోయినవి."
    "ఎవరి సైన్యములు!"
    "మహమ్మద్ గోరీ సైన్యములు."
    "ఎందులకు?"
    "మీ రాజ్యము నాక్రమించుకొనుటకు."
    జయచంద్రుని నెత్తిపైఁ బిడుగు పడినట్లయ్యెను. తన ప్రాణమిత్రుఁడగు గోరీ తన్నింత ద్రోహముచేయునని యా బుద్ధిహీనుఁడూహింపలేదు. "అయినచో మేమీ సౌధములో బంధింపఁబడితి మన్నమాట!" అని యతఁడు సేనాపతిని ప్రశ్నించెను. "అందులకు సందేహమేమున్నది" అని సేనాధ్యక్షుఁడు ప్రత్యుత్తరమిచ్చెను.
    జయచంద్రుఁ డామాటవిని నిశ్చేష్టుఁడయ్యెను. తానుచేసిన పాపమున కిది ప్రాయశ్చిత్తముగా నతనికిఁ దోఁచెను.
    ఇంతలో నొక సేవకుఁడరుదెంచి "మా గోరీ ప్రభువు మీ కీ యుత్తరము పంపినారు. ఇది మీ కుమార్తెయగు సంయుక్త మీకు వ్రాసినదట" అని లేఖను జయచంద్రునికిచ్చి వెడలిపోయెను. జయచంద్రుని గుండెలు దడదడ కొట్టుకొన్నవి. కరములు గడగడ వడఁకినవి. ఆ లేఖను స్పృశించుటకు సైతము తన కధికారము లేదని వాని మానసముతో ప్రతిధ్వనించెను.
    అతఁడట్లే నిలఁబడి లేఖను విప్పెను. తనముద్దుల బిడ్డ ముత్యములవంటి యక్షరముల నతఁడు గుర్తించెను. అతని కన్నులవెంట బాష్పబిందువులు జలజలరాలెను. అందలి ప్రతివాక్యమును జయచంద్రుని గుండెలను గలంచి వైచెను. ప్రతిపదమును హృదయము నుఱ్ఱూతలూపెను. ప్రత్యక్షరమును బాకువలె గ్రుచ్చుకొనెను."
    అతఁడా లేఖను గద్గదస్వరముతో నిట్లు పఠించెను.
    "తండ్రీ! నమస్కారము! నా తప్పు క్షమింపుఁడు! మీయల్లుని యపరాధమును మన్నింపుఁడు! మాపైఁగల యాగ్రహముచే భారతదేశమును పారతంత్ర్యపాశములలో శాశ్వతముగా బంధింపకుఁడు!
    ప్రియజనకా! మీరు పెద్దలు. అనుభవము గలవారు. మంచిచెడ్డలు తెలిసినవారు. ఒక్కమాటు నిండు హృదయముతో నాలోచింపుఁడు! ఒక్కపర్యాయము వెనుకకు తిరిగి చూచుకొనుఁడు! ఒక్కసారి పవిత్ర మాతృభూమిని వీక్షింపుఁడు!
    పూజ్యపితా! నాపై మీకాగ్రహము గలదేని, పృథ్వీరాజును మీరు సాధింపనెంచితిరేని మీరే స్వయముగా ఢిల్లీ రాజ్యముపై దండెత్తి రండు. మమ్ములను జయించి సింహాసనము స్వాధీనము చేసికొండు. అంతేకాని విదేశీయుల నాహ్వానింపకుఁడు. జన్మభూమి దాస్యమును జేతులార కొని తెచ్చుకొనకుఁడు. వ్యక్తిగత ద్వేషములతో దేశమును దిక్కులేని దానినిగాఁ జేయకుఁడు. అంతఃకలహములు పెంచుకొని యాత్మగౌరవమును గంగలోఁ గలుపకుఁడు. మచ్చరములు హెచ్చించుకొని మాతృదేశ సౌభాగ్యమును మంటఁబెట్టకుఁడు.
    తండ్రీ! మీరు తప్పుమార్గమునఁ బోవుచున్నారు. దురాక్రమణపరులకు ద్వారములు దెఱవఁ బోవుచున్నారు. సస్యశ్యామలయగు మాతృదేవి రత్నగర్భమును ఉక్కుపాదాలతోఁ ద్రొక్కివేయఁబోవుచున్నారు. ఇది మీకు తగదు. ముమ్మాటికిని తగదు.
    నాయనా! తొందర పడకుఁడు! తరతరాలకు, యుగయుగాలకు, భావిభారతపౌరులు మిమ్మెంత దూషింతురో తలంచితిరా? భారతదేశ చరిత్రలో మీ చరిత్ర మెంత నీచాతి నీచముగ, హీనాతి హీనముగ లిఖింపఁబడునో స్మరించితిరా? కాచి కాపాడవలసిన కన్నతండ్రులవంటి మహారాజులే కయ్యములకుఁ గాలుదువ్విన దేశమున శాంతి భద్రతల కిక తావుండఁబోదని యూహించితిరా? 'జయచంద్రుఁడు దేశద్రోహి'యని మీ మ్మాబాగోపాలము దుమ్మెత్తి పోయుదురని కొంచెమైన భావించితిరా?
    ఆలోచింపుఁడు తొందరపడకుఁడు. చేతులు కాలిన వెనుక నాకులు పట్టుకొనినఁ బ్రయోజనముండదు. కర్తవ్యమును గుర్తింపుఁడు. దురాలోచన త్యజింపుఁడు. దురాలోచన చేయుఁడు! ఈ లేఖను హృదయ పూర్వకముగఁజదివి నా ప్రార్థనమును వ్యర్థము చేయకుఁడు.
                                                                                  ఇట్లు
                                                                        మీ ముద్దుల కుమారి,
                                                                                సంయుక్త.

 Previous Page Next Page