Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 12


    జయచంద్రుఁడిఁక నిలఁబడ లేకపోయెను. అతని తల తిరిగి పోవుచుండెను. "ఆహా! నేనెంత పాపాత్ముఁడను. దేశమును సర్వనాశనము చేసితిని. దురాగ్రహముతో, దురావేశముతో పృథ్వీరాజుపైఁ గత్తిగట్టితిని.
    అయ్యో! ఇది యుద్ధమునకుముందు వ్రాసిన యుత్తరమే! ఇది నాకిప్పుడు చేరుట యేమి? ఓహో తెలిసినది. ఇది యంతయు గోరీ సేసిన కుతంత్రము. ఈ లేఖ వాని చేతికిఁజిక్కియుండును. దీనిని నేను జూచినచో మనస్సును మార్చుకొందునేమో యని తన యొద్దనే దాచియుంచి యిప్పుడు నా కంపినాఁడు.
    ఆహా! నేను ద్రోహిని! దేశద్రోహిని! మహావీరాధి వీరుఁడగు పృథ్వీరాజునకు మామయను మర్యాద దక్కించుకొనలేకపోయితిని. సాధ్వీశిరోమణియగు సంయుక్తకు జనకుఁడనను గౌరవము నిలఁబెట్టుకొన లేకపోయితిని. నా స్వార్థమే నన్నింత చేసినది."
    జయచంద్రుఁడు పొంగివచ్చు దుఃఖావేశము నాపుకొనలేకపోయెను. అతడు చరచర తన గదిలోనికిఁ బర్వెత్తి గవాక్షమునుండి క్రిందికి తొంగిచూచెను.
    యమునానది గంభీరముగఁ బ్రవహించుచుండెను. ఆ ప్రవాహము పరతంత్రయైన భారతమాత "కాటుక కంటినీరు"వలె జయచంద్రుని కన్నులకుఁ గాన్పించెను. ఆ ప్రవాహ మధ్యమున భగభగ మండుచున్న చితియున్నట్లును, అందులోఁబడి భస్మమై పోవుచు సంయుక్త 'తండ్రీ తండ్రీ' యని తన్ను పిలుచుచున్నట్లును అతనికిఁదోఁచెను. ముప్పది మూడు కోట్ల భారతీయుల కంఠములు "నీచాత్ముఁడా!" యని తన్ను నిందించుచున్నట్లు విన్పించెను.
    జయచంద్రుఁడా భయంకర శబ్దమును వినలేకపోయెను. గవాక్షము నుండి యతఁడా నదీజలములలోనికి దుమికెను. యమున గంభీరముగ నట్లే ప్రవహించుచుండెను.


                              7


    అది గాఢాంధకారబంధుర మగుకారాగారము. ఆ చీకటికొట్టులో నొక మూల భారతచక్రవర్తి బందీకృతుఁడై పడియున్నాఁడు. ఆయన శరీరము ధూళిధూసరితమై యున్నది. ఏ వీరశిరోమణి, ఏ యుదార హృదయుఁడు, ఏ దయాసముద్రుఁడు చేఁజిక్కిన తన్ను క్షమించి సగౌరవముగ విడిచిపెట్టెనో ఆ పృథ్వీరాజును గోరీ కృతఘ్నుఁడై కన్నులూడఁబెఱికించి కారాగారములోఁ ద్రోయించినాఁడు.
    చెరసాలలో శృంఖలాబద్ధుఁడై క్రుంగికృశించిపోవుచుఁ గూర్చుండియున్న చక్రవర్తికి "మహారాజా" అను పిలుపు వినిపించినది. పృథ్వీరాజున కాకంఠస్వరము సుపరిచితమైనదే.
    "ఎవరు? మహాకవి చాంద్ భట్టా?"
    "అవును ప్రభూ! నేనే?"
    "మహాకవీ! మిమ్మలను దర్శించుటకు నయనములు లేవు. కౌఁగిలించు కొనుటకు హస్తముల కీ కఠోర శృంఖలాలు-"
    చక్రవర్తినోట మాటరాలేదు. మహాకవి పృథ్వీరాజును గాఢాలింగన మొనర్చుకొని బాలునివలె వలవల ఏడ్చెను. కన్నులు గోల్పోయి కళావిహీనమైయున్న చక్రవర్తి ముఖము వీక్షించినంతనే చాంద్ భట్టునకు గుండెలు నీరయ్యెను.
    "మహారాజా! ఏమిటీ యాకారము! నా ప్రభువున కెంతలో నెంత మార్పువచ్చినది?"
    "మహాకవీ! సంయుక్త మొదలగు రాణివాసపు స్త్రీలగతి యేమైనది?"
    "ప్రభూ! వారందరూ చితులలో దుమికి తమ సతీత్వమును నిలుపుకొనిరి. గోరీ బూడిద రాసులతో శ్మశాన ప్రాయమైయున్న ఢిల్లీకోటలోఁ బ్రవేశించి రాజసింహాసనము నధిష్ఠించినాఁడు."
    "మహాకవీ! ఈనికృష్టజీవితము నేనిఁక భరింపఁజాలను. నీ చేతిలోఁ గృపాణమున్నచో నా గుండెలలో గ్రుచ్చి నీ ప్రభువునకు శాశ్వతముక్తిని ప్రసాదింపుము."
    "మహారాజా! కొంచెము కాల మోర్చుకొనుఁడు. రేపీపాటికి మన యిర్వురకు శాశ్వతవిముక్తి సంప్రాప్తింపఁగలదు. దానికి ముందు కృతఘ్నుఁడగు గోరీకి ప్రతీకారము జరిగితీరవలెను."
    "మహాకవీ! నీ విచ్చట కెట్లు రాఁగలిగితివి?"
    "ఫకీరువేషము ధరించి కవిత్వముచెప్పి గోరీ యాస్థానములో మంచి గౌరవము సంపాదించితిని. ఢిల్లీ కోటలో నేఁడు నా మాటకు తిరుగులేదు."
    "మహాకవీ! దేశద్రోహి జయచంద్రుఁడేమైనాఁడు?"
    "ఆ దుర్మార్గునకుఁదగిన దుర్మరణమే ప్రాప్తించినది. ఢిల్లీ పట్టణము స్వాధీనము చేసికొనిన వెంటనే గోరీ కన్యాకుబ్జముపైకిఁగూడ సైన్యములను బంపినాఁడు. జయచంద్రుని బందీకృతుని జేసినాఁడు. ఆ పాపాత్ముఁడు తన పాపమునకుఁ బశ్చాత్తాపపడి తల బ్రద్దలుకొట్టుకొని యమునలో దుమికి ప్రాణములు గోల్పోయినాఁ డని ప్రజలు చెప్పుకొనుచున్నారు."
    "మహాకవీ! భారతదేశమునకెట్టి దుర్దశప్రాప్తించినది"
    "మహారాజా! కడచిన దానికి విచారింపకుఁడు. రేపే గోరీమహమ్మదు సభ జరుపును. ఆ దర్బారులో మీ శబ్దభేది విద్యాప్రదర్శనము - ప్రతీకారము - శాశ్వతవిముక్తి - శాశ్వతశాంతి - అన్ని యేర్పాట్లు సిద్ధము చేసితిని."
    "మహాకవీ! హృదయమునకు శాంతి కల్గించితివి. ఈ యంత్య సమయమునఁ గూడ నన్ను మఱచిపోలేని నీ రాజభక్తికి ధన్యవాదములు. అఖండమైన నీ దేశభక్తికి జోహారులు!"
    ఇట్లు మరికొంతసేపు మహాకవి పృథ్వీరాజుతో నేమేమియో మాటాడి సెలవు గైకొని వెడలిపోయెను.


                              8


    మఱునాఁడు మహమ్మదుగోరీ కొలువుదీర్చినాఁడు. రాజ పరివారముతో సభ కిటకిటలాడుచున్నది.
    "ఏఁడీ యింకను రాజు రాలేదే?" అని గోరీ ఫకీరును జూచి పలికెను.
    "తొందరపడకుఁడు. అడుగో! వచ్చుచున్నాఁడు" అని ఫకీరు ప్రత్యుత్తర మొసంగెను.
    ఇంతలో రాజభటులు శృంఖలాబద్ధుఁడైన పృథ్వీరాజును సభలోనికిఁ గొనివచ్చిరి. చేతులనున్న గొలుసు లూడఁదీసిరి. ధనుస్సును బాణములను చేతి కందిచ్చిరి.
    ఏ సింహాసనముపై పృథ్వీరాజు కూర్చుండి గోరీని క్షమించి విడిచిపెట్టెనో ఆ సింహాసనముపై నేఁడు గోరీ యుపవిష్టుఁడై యుండెను. గోరీ పృథ్వీరాజును జూచి "మహారాజు గారు మాకు కొంచెము వినోదము కల్గింతురా?" యనెను. ఫకీరు "కొంచెము కల్గించుటయేమి? రాజుగారు తమ శరప్రయోగచాతుర్యముచే సంపూర్ణముగనే మీకు సంతోషము కల్గింతురు" అని యుచ్చైస్స్వరమునఁ బల్కెను.
    గోరీ గంభీరముగాఁ దలయూపెను. దూరమున గంట మ్రోగింపఁ బడుచుండెను. రాజు విల్లెక్కుపెట్టెను. ఫకీరు పృథ్వీరాజు నాలోకించి "మా సుల్తానుగారు ముందుగానే నీ గ్రుడ్లుపీకించి కనులకు గంతలు కట్టవలసిన పనిలేకుండ చేసినారు. ఏదీ నీ శబ్దభేది విద్యావిశేషము! ఆ గంటను కొట్టుము. నీ తెలివితేటలకు మెచ్చుకొని ప్రభువులు బహుమానమిత్తురు" అని పలికెను.
    మఱల గంట మ్రోగెను. ధనుస్సునుండి రివ్వున బాణము వెడలెను. గంట ముక్కలు ముక్కలై నేలపైఁబడెను. సభ్యులందఱు "మేలు మే"లని కరతాళ ధ్వనులు చేసిరి. గోరీమహమ్మదు "సెబాసు సెబాసు" అని యఱచెను. తత్ క్షణమే మరియొక బాణము రివ్వున వచ్చి గోరీ గుండెలలో గ్రుచ్చుకొనెను. గోరీ యార్తనాదముచేసి నేల కొరగి ప్రాణములఁ బాసెను.
    వెంటనే "మహారాజా!" యని ఫకీరు పృథ్వీరాజును కౌగిలించుకొనెను. పృథ్వీరాజు "మహాకవీ!"యని ఫకీరును కౌగిలించుకొనెను. గుప్తఖడ్గములతో నొకరినొకరు పొడుచుకొనిరి. రాజసభ రక్తప్లావితమయ్యెను.
    వారిరువురి యాత్మలకు శాశ్వత శాంతి లభించెను.
    చంపఁదగిన శత్రువు చేతఁజిక్కినను తన యుదారస్వభావముచే నేడు పర్యాయములు విడిచిపుచ్చిన భారత చక్రవర్తి వీరచరిత్ర మీవిధముగా విషాదాంత నాటకము వలె సమాప్తమయ్యెను.


                                         * * * *

 Previous Page Next Page