4. మరుత్తులారా ! మీ మహత్తు స్తవనీయము. మీ రూపము సూర్యునివలె దర్శనీయము. మా స్వర్గ ప్రాప్తికి మీరు సహాయకులగుడు. జలప్రియులయిసాగు మరుత్తులుమీరు "యాతామనురథా అవృత్సత"
5. మరుత్తులారా ! మీరు అంతరిక్షమున వర్షమును ప్రేరేపించండి. జల సంపన్నులారా ! మీరు వర్షము కలిగించండి. దర్శనీయులగు శత్రు సంహారకులారా ! మీకు ప్రియమగు మేఘము ఎన్నటికిని శుష్కించదు. జలప్రియులయి సాగు మరుత్తులుమీరు "యాతామనురథా అవృత్సత"
6. మరుత్తులారా ! మీరు రథమునకు అగ్రభాగమున 'పృషతీ' అశ్వమును జోడించినప్పుడు మీ బంగారు కవచమును విప్పివేయుదురు. మీరు సకల సంగ్రామములందు గెలుపొందుదురు. జలప్రియులయిసాగు మరుత్తులుమీరు "యాతామనురథా అవృత్సత"
7. మరుత్తులారా ! నదులు, పర్వతములు మీకు అడ్డంకులు కారాదు. మీరు వెళ్లదలచిన యజ్ఞాది స్థానములకు వెళ్లితీరుదురు. వర్షమునకుగాను మీరు ద్యావాపృథ్వులందు వ్యాపింతురు. జలప్రియులయిసాగు మరుత్తులుమీరు "యాతామనురథా అవృత్సత"
8. మరుత్తులారా ! పూర్వము చేయబడిన యాగాది కార్యమును ఇప్పుడు జరుగుచున్నవానిని మీరు తెలిసికొనుడు. వసువులారా ! మంత్రగతమయినవానిని స్తోత్రపాఠమయినవానిని తెలిసికొనుడు. జలప్రియులయిసాగు మరుత్తులుమీరు "యాతామనురథా అవృత్సత"
9. మరుత్తులారా ! మీరు మమ్ము సుఖవంతులను చేయండి. మేము ఏదేని అనిష్ట కార్యముచేసి ఉన్నచో అందువలన మీకు కోపము కలిగినచో మాకు బాధ కలిగించకండి. మాకు అత్యంత సుఖమును ప్రసాదించండి. మా స్తోత్రములను గ్రహించండి. మాతో స్నేహము చేయండి. జలప్రియులయిసాగు మరుత్తులుమీరు "యాతామనురథా అవృత్సత"
10. మరుత్తులారా ! మీరు మమ్ము ఐశ్వర్యమువైపు నడిపించండి. మా స్తోత్రములకు ప్రసన్నులు కండి. మమ్ము పాపములనుండి విముక్తులను చేయండి. మీకు మేము సమర్పించిన హవ్యమును స్వీకరించండి. అందువలన మేము బహువిధ ధనములకు అధిపతులము కాగలము.
ఏబది ఆరవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు, దేవత - మరుత్తు, ఛందస్సు - బృహతి.
1. అగ్నీ ! రోచమాన ఆభరణయుక్తులు, శత్రువులను పరాభవించువారు, యజ్ఞవిషయమున ఉత్సాహవంతులగు మరుత్తులను ఆహ్వానింపుము. నేటి యజ్ఞదినమున దీప్తిమంతమగు స్వర్గము నుంచి మాముందునకు విచ్చేయవలసిందిగా మరుత్తులను ఆహ్వానించుచున్నాము.
2. అగ్నీ ! మరుత్తులు అత్యంత పూజనీయులని నీవు ఎరుగుదువు. నీవు వారిని ఆదరింతువు. అట్లే ఆ మరుత్తులు ఉపకార భావమున మావద్దకు రావలెను. నీ ఆహ్వానమును విన్నంత మాత్రమున వచ్చువారు. భీకర రూపులగు మరుత్తులను హవ్యప్రదానమున వర్థిల్లచేయుము.
3. భూమిమీది మానవుడు మరొకరితో అవనింపబడును. అప్పుడు అతడు సత్వరమే బలవంతుడగు తనస్వామి వద్దకు పరుగెత్తును. అట్లే మరుత్సేన ఉల్లసితమయి మా వద్దకు రావలెను. మరుత్తులారా మీరు అగ్నివలె కర్మవంతులు. ఆ బోతులతో కోడిన గోవువలె దుర్ధర్షులు.
4. పొగరుబోతు గుఱ్ఱమువలె మరుత్తులు స్వబలమున అనాయాసముగ శత్రువును పరాజితుని చేయుదురు. వారు తమ గమనమున శబ్దాయమానము, వ్యాప్తము, లోకములను పూరించు జలగర్భ మేఘమును ప్రేరేపింతురు.
5. మరుత్తులారా ! ఉత్తిష్ఠ. జలరాశివలె సమృద్ధశాలి, బలసంపన్న, అపూర్వ మరుత్తులను స్తోత్రమున వర్థిల్లచేసి ఆహ్వానించుచున్నాము.
6. మరుత్తులారా ! మీ రథమున అరుషి ఆడ గుఱ్ఱమును పూన్చండి. రథ సమూహమును రోహితవర్ణ అశ్వయుక్తము చేయండి. బరువులు మోయుటకుగాను హర్యశ్వములను జోడించండి. మోయుటకు గట్టివానిని కట్టండి.
7. మరుత్తులారా ! మీ రథమునకు కట్టిన అశ్వములు దీప్తిమంతములు. విశేషధ్వనికారులు. దర్శనీయులు. అవి మీ ప్రయాణమున జాగు చేయరాదు. రథమునగల అశ్వములు ఆలస్యము చేయకుండ వానిని ప్రేరేపించండి.
8. మరుద్గణముల రథము అన్నపూర్ణ. ఆ రథమున చక్కని జలములు, ధరించిన మరుత్తుల వెంట రోదసి ఆసీనమయి ఉన్నది. అట్టి రమ్య రథమును మేము ఆహ్వానించుచున్నాము.
(రోదసి=రుద్రపత్ని, మరుత్తుల మాత వాయుపత్ని. మాధ్యమికాదేవి.)
9. మరుత్తులారా ! మీ రథము శుభంకరము దీప్తిమంతము. పూజనీయము. మేము ఆరథమును ఆహ్వానింతుము. ఆ రథ మధ్యమున సుజాత, సౌభాగ్య శాలిని 'మీహలుషీ' మరుత్తులతో పాటు పూజింపబడును.
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగువ అష్టకము ఐదవ మండలమున నాలుగవ అనువాకము సమాప్తము)
అయిదవ అనువాకము ఏబది ఏడవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు దేవత - మరుత్తులు, ఛందస్సు 7,8 త్రిష్టుప్, మిగిలినవి జగతి.
1. మరుత్తులారా ! మీరు పరస్పర కరుణా హృదయులు. సువర్ణమయి రథారూఢులు, ఇంద్రుని అనుచరులు. రుద్ర పుత్రులు. మీరు సుగమ్య యజ్ఞమునకు విచ్చేయండి. మేము మిమ్ము స్తుతింతుము. మీరు తృషార్తుడు, జలాభిలాషి గోతముని కొఱకు స్వర్గము నుండి జలము తెచ్చి ఇచ్చినారు. అట్లే మా వద్దకు విచ్చేయుడు.
2. సమృద్దులగు మరుత్తులారా ! మీ రక్షణ సాధనములగు ఆయుధములు ఛురక, ఉత్కృష్ట ధనుర్బాణములు, శ్రేష్ఠ అశ్వము, రథము అగును. మీరు అస్త్ర సజ్జితులు కండు. పృశ్ని పుత్రులారా ! మాకు శుభములు కలిగించుటకు విచ్చేయండి.
3. మరుత్తులారా ! అంతరిక్షమున మీరు మేఘములను వెల్లడించుడు. హవ్యదాతకు ధనము ప్రదానము చేయుడు. మీరు వస్తున్నారన్న భయమున అడవులు గడగడలాడును. పృశ్ని పుత్రులారా ! ఆగ్రహవంతులగు బలశీలులారా ! మీరు జలములు కురిపించుటకు మీ రథమునకు 'పృషతి' అశ్వములను జోడించినపుడు పృథ్విమీద మీ ఆగ్రహమును ప్రదర్శింతురు.
4. మరుద్గణములు దీప్తిమంతులు. వర్షకారకులు. కవలలవలె తుల్యరూపులు. దర్శనీయులు. శ్యామ, అరుణ అశ్వాధిపతులు. నిష్పాపులు, శత్రుక్షయ కారకులు. వారు విశాల ఆకాశమువలె విస్తీర్ణులు.
5. మరుత్తులు వర్షకారకులు. ఆవరణధారులు. ఉజ్వల మూర్తులు. అక్షయ ధనసంపన్నులు. సుజన్ములు. వక్షమున హారధారులు. పూజనీయులు. వారు ద్యులోకము నుండి రావలెను. అమృతజలమును ప్రసాదించవలెను.
6. మరుత్తులారా ! మీ మొలలందు ఆయుధవిశేషములు బాహుద్వయమున శత్రునాశకబలము శిరసున సువర్ణ కిరీటము - రథమున ఆయుధ ప్రభృతులు, అవయవములందు శోభకలిగి విరాజిల్లుచున్నారు.
7. మరుత్తులారా ! మీరు మాకు అనేక గోవులను, అశ్వములను, రథములను, ప్రశస్త పుత్రులను, హిరణ్యమును, అన్నమును ప్రసాదించండి. రుద్రపుత్రులారా ! మీరు మా సమృద్ధిని రక్షించండి. మేము మీరు ప్రసాదించిన స్వర్గీయ రక్షణను అనుభవించవలెను.
8. మరుత్తులారా ! మీరు నేతలు. అనంత ఐశ్వర్యవంతులు. అవినశ్వరులు. జలవర్షకులు. సత్యఫల ప్రసిద్ధులు. జ్ఞానసంపన్నులు. తరుణులు. విశేష స్తుతియుక్తులు. నిరంతర వర్షకారులు. మీరు మాకు అనుకూలురు కావలెను.
ఏబది ఎనిమిదవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. మరుత్తులు శీఘ్రగాములు. అశ్వాధిపతులు. దీప్తిమంతులు. స్తుతియోగ్యులు. బలపూర్వకముగ అంతటికి చేరగలవారు. జలాధిపతులు. నిజప్రభతో ప్రభావాన్వితులు, నేటి యజ్ఞమున మేము మరుత్తులను స్తుతింతుము.
2. మరుత్తులు దీప్తిమంతులు, బలశాలులు. వలయమండిత హస్తులు. కంపన విధాయకులు. ధనదాతలు. హోతా ! నీవు మరుత్తులను పూజింపుము. సుఖదాతలు, అపరిమిత మహంతులు, అతులిత ఐశ్వర్యవంతులు, నేతలగు మరుత్తులకు ప్రణమిల్లండి.
3. విశ్వవ్యాపులగు మరుద్గణములు జలములను స్పందింప చేతురు. జలవాహకులగు మరుత్తులు మీ వద్దకు చేరవలెను. జ్ఞానసంపన్నులు, యవ్వనవంతులగు మరుత్తులారా ! మీ కొఱకు అగ్ని ప్రజ్వలితమయినది. ఆ అగ్నివలననే మీకు ప్రీతి లాభము కలుగును.
4. పూజనీయులగు మరుత్తులారా ! మీరు యజమానికి లేక రాజుకు దీప్తివంతుడు, రూపవంతుడు, శత్రుసంహారకుడగు పుత్రుని ప్రసాదించుడు.
మరుత్తులారా ! మీ వలననే స్వభుజ బలమున శత్రువులను వధించువాడు, బాహుబల ప్రేరకుడు, అసంఖ్య అశ్వాధిపతియగు పుత్రుడు కలుగగలడు.
5. రథపు మేకులవలె మరుత్తులు ఒకేసారి పుట్టినారు. దినములవలె వారు పరస్పర సమానులు. పృశ్ని పుత్రులు సమానరూపమున పుట్టినారు. ఏ ఒక్కరు దీప్తి విషయమున తగ్గరు. వేగవంతులగు మరుద్గణములు స్వతః ప్రవృత్తులయి చక్కని వర్షము కలిగింతురు.
6. మరుత్తులారా ! 'పృషతి' అశ్వములు కట్టిన దృఢచక్ర రథమును ఎక్కి మీరు ఏ తెంచినపుడు జలరాశి వర్షించును. అడవులు పడిపోవును. సూర్యకిరణ సంపృక్త జలవర్షణకారి పర్జన్యుడు అధోముఖుడయి వర్షమునకుగాను శబ్దము చేయును.
7. మరుత్తులు రాగా పృథ్వికి ఉర్వరత ప్రాప్తించును. పతి భార్యకు గర్భము కలిగించునట్లు మరుత్తులు భూమిమీద గర్భస్థానీయమగు జలమును స్థాపింతురు. రుద్ర పుత్రులు వేగవంతములగు అశ్వములను రథపు ముందు భాగమున కట్టి వర్షము కలిగింతురు.
8. మరుత్తులారా ! మీరు నేతలు. విపుల ఐశ్వర్యవంతులు. అనశ్వరులు. జలవర్షకులు. సత్యఫల ప్రసిద్ధులు. జ్ఞాన సంపన్నులు. తరుణులు. ప్రచుర స్తుతియుక్తులు. సమృద్ధ వర్షణకారులు. మీరు మాకు అనుకూలురు కండు.
ఏబది తొమ్మిదవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - జగతి 8 త్రిష్టుప్.
1. మరుత్తులారా ! హవ్యదాతలు. తమకు శుభములు కలుగవలెనని మిమ్ము విశేషముగ స్తుతింతురు. హోతా ! నీవు ద్యుతిమంతుడగు ద్యుదేవుని స్తుతించుము. మేము పృథ్విని స్తుతింతుము. మరుద్గణములు సర్వవ్యాపి వర్షమును కురిపింతురు. వారు అంతరిక్షమున సర్వత్ర సంచరింతురు. మేఘములతో కూడ తమ తేజస్సును ప్రకాశింపచేతురు.
2. మనుష్యులు నిండిన పడవ నీటిమధ్యన వడికినట్లు మరుత్తుల భయమున భూమి వడకును. వారు దూరమున దృశ్యమానులు అయినప్పటికి చలనము ద్వారా గోచరులగుదురు. నేతలగు మరుత్తులు ద్యావా పృథ్వులమధ్య హవ్యభక్షణకు ఉపక్రమింతురు.
3. మరుత్తులారా ! మీరు అలంకారమునకుగాను ఆవుకొమ్మువంటి ఉత్కృష్ట శిరోభూషణము ధరింతురు. దినములనేత సూర్యుడు తన వెలుగులను విస్తరించినట్లు మీరు వర్షము కొఱకు సర్వప్రకాశదీప్తి విస్తరింతురు. మీరు అశ్వమువలె మనోహరులు వేగవంతులు. యజమానులు మున్నగువారు యజ్ఞాది కర్మలను ఎరిగినట్లు మీరుకూడ ఎరుగుదురు.
4. మరుత్తులారా ! మీరు వాన కురిపించుట వలన భూమి కిరణమువలె కదలాడును. మీరు పూజనీయులు. మిమ్ములను ఎవడు పూజించగలడు? మీ పరాక్రమమును ఎవడు ప్రకటించగలడు? ఎవడు మిమ్ము స్తుతించుటకు సమర్థుడగును?
5. మరుత్తులు అశ్వమువంటి వేగవంతులు. దీప్తిమంతులు. సమాన బంధువులు. వారు వీరులవలె యుద్ధకార్యమున నిమగ్నులగుదురు. సమృద్ధి సంపన్నులగు మానవులవలె మరుద్గణములు అత్యంత శక్తిశాలురయి వర్షమున సూర్యచక్షువును ఆవరింతురు.
6. మరుద్గణములందు ఒకరు చిన్న, ఒకరు పెద్ద కారు. శత్రుసంహారక మరుత్తులలో మధ్యముడు ఉండడు. అందరు తేజో విశేషమున వర్ధమానులగుదురు.
సుజన్ములు, మానవహితకరుల పృశ్ని పుత్రులగు మరుత్తులారా ! మీరు ద్యులోకునుండి మాకు అభిముఖముగా విచ్చేయండి.
7. మరుత్తులారా ! వరుసకట్టి ఎగురు పక్షులవలె మీరు బలపూర్వక విస్తీర్ణము సమున్నత నభోమండలపు పైభాగమున అంతరిక్షము వరకు సంచరించెదరు. మీ అశ్వములు మేఘము నుండి వర్షము కురిపించును. ఈ విషయము దేవతలు - మానవులు ఇరువురు ఎరుగుదురు.
8. ద్యావాపృథ్వులు మాపుష్టి కొఱకు వర్షము కలిగించవలెను. నిరతిశయ దానశీల ఉష మాకు శుభములు కలిగించుటకు యత్నించవలెను. ఋషీ ! ఈ రుద్రపుత్రులు నీ స్తుతినివిని ప్రసన్నులయి వర్షము కురిపించవలెను.
ఆరువదవ సూక్తము
ఋషి - శ్యావాశ్వుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - 6,8 జగతి, మిగిలినవి త్రిష్టుప్.
1. నేను శ్యావాశ్వ ఋషిని. స్తోత్రములతో రక్షకుడగు అగ్నిని స్తుతించుచున్నాను. అతడు ఇప్పుడే యజ్ఞమునకు విచ్చేసి ప్రసన్నముగా ఆ స్తోత్రమును గ్రహించవలెను. రథము కోరిన స్థలమునకు చేరినట్లు - అన్నాభిలాషులమగు మేము స్తోత్రములతో మా కోరికలు నెరవేర్చుకుందుము. ప్రదక్షిణచేసి మేము మరుత్తుల స్తోత్రములను వర్థిల్లచేతుము.