Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 12


    2. ఉద్యతాయుధులగు రుద్రపుత్ర మరుత్తులారా ! మంచి గుఱ్ఱములు లాగునదియు, శుభంకరమగునదియు, అక్ష సమన్వితమగు రథము నెక్కి సాగుడు. మీరు రథములు నెక్కినపుడు అడవులు భయమున గడగడలాడును.

    3. మరుత్తులారా ! మీరు మరింత భయంకర శబ్దము చేసినపుడు మహా మహా పర్వతములు కూడ గడగడలాడును. అంతరిక్షమున ఉన్నత, విస్తృత ప్రదేశములో కూడ కంపించును. మరుత్తులారా ! మీరందరు ఆయుధపాణులు. మీరు ఆటలాడినప్పుడు నీటివలె పరుగులు పెట్టుదురు.

    4. వివాహయోగ్యుడు, ధనవంతుడగు యువకుడు స్నానాదుల ద్వారాను, బంగారునగలతోను తన తనువును అలంకరించుకొనును. అట్లే సర్వశ్రేష్ఠ బలశాలురగు మరుత్తులు రథమున ఆసీనులయినపుడు శరీర శోభకుగాను తేజస్సును వహింతురు.

    5. మరుద్గణములు ఒకే సమయమున పుట్టినారు. వారు సమాన బలవంతులు. వారిలో వారికి పెద్ద, చిన్నలు లేవు. వారు అన్నదమ్ములవలె సౌభాగ్యముతో వర్థిల్లుదురు. నిత్య తరుణులు, సత్కర్ములగు మరుత్తుల తండ్రి రుద్రుడు జననీ స్వరూపిణి, దోహన యోగ్య పృశ్ని మరుత్తులకుగాను శుభదినములను కలిగించవలెను.

    6. సౌభాగ్యశాలురగు మరుత్తులారా ! మీరు ఉత్తమ ద్యులోకమున మధ్యమ ద్యులోకమున అధమ ద్యులోకమున వర్తింతురు. ఆ స్థానముల నుండి మా వద్దకు విచ్చేయండి.

    అగ్నీ ! మేము నేడు సమర్పించు హవిని తెలియుము.

    7. సర్వజ్ఞులగు మరుత్తులారా ! మీరును, అగ్నియు ద్యులోకపు ఉత్కృష్టతర ఉపరి ప్రదేశమున ఉందురు. మీరు మా స్తోత్రములకు, హవ్యములకు ప్రసన్నులుకండు. శత్రువులను కంపింపచేసి నష్టపరుచుడు. యజమానులకు కోరిన ధనము ప్రసాదించుడు.

    8. మరుత్తులు శోభాయమానులు, పూజనీయులు, సంఘీభావులు, ఆశ్రయప్రదాతలు, పవిత్రులు, ప్రీతిదాయకులు, చిరంజీవులు.

    వైశ్వానరాగ్నీ ! పురాతన జ్వాలా సమూహయుక్తుడవయి మరుత్తులతో కూడి సోమపానము చేయుము.

                                       అరువది ఒకటవ సూక్తము

        ఋషి - శ్యావాశ్వుడు, దేవత - మరుత్తు ఛందస్సు - గాయత్రి, 9 బృహతి.

    1. శ్రేష్ఠతములగు నేతలారా ! మీరు ఎవ్వరు? అంతరిక్షమునుండి ఒక్కొక్కరుగా విచ్చేయండి.

    2. మరుత్తులారా ! మీ అశ్వములు ఎక్కడ? కళ్లెములు ఎక్కడ? గుఱ్ఱములు వడిగా వెళ్లగలవా? వాటి నడక ఎట్టిదగును? గుఱ్ఱపు వెనక భాగమున పటకా, నాసికాద్వయమునకు త్రాడు ఉండును.

    3. శీఘ్రగమనమునకుగాను గుఱ్ఱపు జఘన భాగము కశాఘాతము (కొరడా దెబ్బలు) పడును. ప్రసవ సమయమున రమణుల తొడలు విడదీసినట్లు మరుత్తులు అశ్వపు ఊరుద్వయమును విడదీయుదురు.

    4. వీరులారా ! శత్రుసంహారకులారా ! మానవ కళ్యాణ కారులారా ! శోభన జన్మవంతులారా ! మరుత్పుత్రులారా ! మీరు అగ్నిలో కాలిన రాగివలె ప్రదీప్తులయి కనిపించుచున్నారు.

    5. శ్యావాశ్వుడు ఎవనిని స్తుతించినాడో, ఎవడు వీరుడగు 'తరంతు' ని భుజపాశ బద్ధుని చేసినాడో, ఆ తరంతుని భార్య 'శశీయసి' మాకు గుఱ్ఱములు, ఆవులు, వందల బఱ్ఱెల పశు యూధమును ప్రదానము చేసినది.

    6. దేవతలను ఆరాధించని ధన దానము చేయని పురుషునికన్న శశీయసి సర్వవిధములు శ్రేష్ఠురాలు.

    7. ఆ శశీయసి వ్యధితుల బాధలు ఎరుగును. దప్పిగొన్నవారిని ఎరుగును. ధనాభిలాషిని ఎరుగును. దేవతల ప్రీత్యర్థము ఆమెకు దానబుద్ధి ఉన్నది.

    8. శశీయసి భర్త తరంతుని స్తుతించియు పూర్తిగా స్తుతించినట్లు భావించము. ఏలననగా దానవిషయమున వారిద్దరిది ఒకేమాట.

    9. యవ్వనవతి శశీయసి ముదిత మనమున శ్యావాశ్వునకు దారిచూపినది. ఆమె ఇచ్చిన రెండు లోహిత వర్ణ అశ్వములు మమ్ము యశస్వి, విజ్ఞుడగు 'పురుమీహ్లు' ని వద్దకు చేర్చును.

    10. విదదశ్వుని పుత్రుడు 'పురుమీహ్లుండు' కూడ తరంతుని వలెనే మాకు వంద ఆవులు. బహుమూల్య ధనము మున్నగునవి ఇచ్చినాడు.

    11. మరుద్గణములు వడిగల గుఱ్ఱములను ఎక్కి, సంతసము కలిగించు సోమరసము త్రావుచు ఈ చోటుకు వచ్చిఉండిరి. ఆ మరుద్గణములకు ఇక్కడ బహువిధ స్తోత్రములు లభించును.

    12. మరుత్తుల కాంతికి ద్యావాపృథ్వులు వెలుగొందును. పైన ద్యులోకమున వెలుగొందు ఆదిత్యునివలె మరుద్గణములు రథముపై వెలుగొందుదురు.

    13. మరుత్తులు నిత్య యవ్వనులు. దీప్తిరథ విశిష్టులు - అనింద్యులు. సుందరులు - సంచారులు. అప్రతిహతగతిమంతులు.

    14. జలవర్షము కొరకు పుట్టినవారు, శత్రువులను కంపింపచేయువారు నిష్పాపులగు మరుత్తులు ఏ స్థానమున తృప్తులయినారో ఆ స్థానమును ఎవడు ఎరుగును?

    15. స్తోత్రప్రియులగు మరుత్తులారా ! మిమ్ము స్తుతించి ప్రసన్నులనుచేయు యజమానికి అతడు కోరిన స్వర్గాది స్థానములను చూపెదరు. యజ్ఞమునకు ఆహుతలయిన మీరు ఆహ్వానమును ఆలకించెదరు.

    16. శత్రుసంహారక, పూజనీయ, వివిధ ధనశాలురగు మరుత్తులారా ! మీరు మాకు కోరిన ధనమును ప్రసాదించండి.

    17. ధాత్రీదేవీ ! నీవు మావద్దనుండి రథవీతివద్ద మరుత్ స్తుతిని అందుకొనుము. ఇది మరుత్తుల కొఱకు రచించబడినది. రథి వివిధ వస్తువులను రథమున ఉంచి గమ్యస్థానమునకు చేర్చినట్లు మా ఈ సకల స్తుతులను వహింపుము.

    18. ధాత్రీదేవీ ! సోమయజ్ఞము ముగిసిన పిదప రథవీతితో నీ కూతురు విషయమున మా కోరిక తక్కువదికాదు, అన్నట్లు చెప్పుము.

    19. ధనవంతురాలగు రథవీతి గోమతి తీరమున నివసించును. హిమాలయ ప్రాంతమున గృహము కలదు.

    ఆలోచనామృతము

    1.  స్త్రీకి ఏకాలమునను పురుషునితో అన్ని విషయములందు సమాన ప్రతిపత్తిలేదు. కొందరు మహిళలు తం ప్రతిభాపాటవములతో పురుషులను మించిన ఉదాహరణలు ఉన్నవి. అవి వ్యక్తిగతములు. సమాజమున స్త్రీకి గౌరవము, ఆదరము ఉన్న కాలములు ఉన్నవి. లేనికాలములు ఉన్నవి. కాలము పాదరసమువంటిది. ఒకచోట నిలువదు. అది పరిణామ శీలము. కావున స్త్రీల విషయమునను హెచ్చుతగ్గులగుట సాధారణము. 

    వేదకాలము మొత్తమున స్త్రీకి ఏ స్థాయి ఉన్నది నిర్దిష్టముగ చెప్పుట సాధ్యపడదు. కాని స్త్రీకి పురుషుని నుండి ఆదరాభిమానములు లభించినవని మాత్రము చెప్పవచ్చును. స్త్రీకి నీచదశ లేకుండెను.

    ఈ సూక్తమున 'శశీయసి', అను స్త్రీ వృత్తాంతము పేర్కొన్నబడినది. ఆమె స్వతంత్రముగా దానము చేయునది. ఆమెను గురించి

    "వియా జానాతి జసురిం వితృష్యతం వికామినమ్ | దేవత్రా కృణుతేమనః" అన్నది మంత్రము.

    శశీయసి వలననే భర్తకు కీర్తి కలిగినదని 8వ మంత్రమున చెప్పబడినది.

    2.  శాయణాచార్యులు ఈ సూక్తమునకు సంబంధించి ఒక వృత్తాంతమును ఉదాహరించినారు. "అత్రాశ్చర్యం పురావృత్తమాహురాగమపారగాః" ఆగమ పారగులు చెప్పు ఆశ్చర్యకరమగు పూర్వవృత్తాంతము అన్నాడు.

    రథవీతి అను రాజు ఆత్రేయ వంశజుడయిన అర్చనానుని హోతగా ఏర్పరచినాడు. యజ్ఞ సందర్భమున హోత రాజు కూతురును చూచినాడు. ఆమెను తనకొడుకు శ్యావాశ్వునకు ఇవ్వవలసినదని రాజును అడిగినాడు. రాజు అందుకు సిద్ధపడినాడు. కాని రాణిని సంప్రదించదలచినాడు.
   
    రాణి శ్యావాశ్వునకు తన కూతురును ఇచ్చుటకు అంగీకరించలేదు. ఋషి కానివానికి తమ కుటుంబమున పిల్లను ఇవ్వలేదన్నది.

    శ్యావాశ్వునకు ఆ పిల్లమీద మనసయింది. తాను ఋషి కాదలచినాడు. కఠోర నియమములు పాటించినాడు. భిక్ష చేయుచు సంచారము సాగించినాడు.

    సంచార సందర్భము శశీయసివి కలిసినాడు. ఆమె అతనిరాకను గురించి భర్తకు చెప్పినది. శశీయసి భర్త తరంతరుడు వచ్చినవానిని ఆదరించమని చెప్పినాడు.

    శశీయసి పశువులను ఆభరణములను శ్యావాశ్వునకు ఇచ్చినది. తరంతరుడు సహితము అనేక ధనము ఇచ్చినాడు. శ్యావాశ్వుని రాజు తన తమ్ముడు పురుమీహ్లునివద్దకు పంపినాడు.

    శ్యావాశ్వుడు పురుమీహ్లుని వద్దకు వెళ్లుచుండగా మార్గమధ్యమున మరుత్తులు దర్శనమిచ్చినారు.

    శ్యావాశ్వురుడు వారిని స్తుతించినాడు. మరుత్తులు అతనిని ఋషిగా గుర్తించినారు. అతనిని వేద స్తోత్రముల ద్రష్టను చేసినారు.

    ఆవిధముగా ఋషియయి శ్యావాశ్వుడు రథవీధిని చేరినాడు. అతడు తన భార్య సమ్మతితో తన కూతురును శ్యావాశ్వునకు ఇచ్చి వివాహము చేసినాడు.

                                        అరువది రెండవ సూక్తము

        ఋషి - ఆత్రేయ శ్రుతవిది, దేవత - మైత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. సూర్యమండలము మీకు ఆధారభూతము. అది నీటితో కప్పబడినది. శాశ్వతము. సత్యభూతము. ఆ స్థానమందున్న అశ్వములను కిరణములను స్తోతలు విడిచిపెట్టుదురు. ఆ మండలమున వేలకొలది రశ్ములు ఉన్నవి. తేజోవంతుడగు అగ్ని మున్నగు సాకార దేవతలమధ్య మేము సూర్యుని శ్రేష్ఠమండలమున దర్శించినాము!

    2. మిత్రావరుణులారా ! మీ మహాత్మ్యము అత్యంత ప్రశస్తము. మీ మహత్తువలననే నిరంతర పరిభ్రమణకారి సూర్యుడు తనదైనిక గతులందు స్థావరజలరాశిని పిదుకును. మీరు స్వయముగా భ్రమణకారి సూర్యుని ప్రీతిదాయక దీప్తిని వర్థిల్లచేయుదురు. మీ ఇద్దరి ఒకే రథము అనుక్రమమున పరిభ్రమించును.

    3. మిత్రావరుణులారా ! స్తోతలు మీ అనుగ్రహమున రాజపదము పొందుదురు. మీరు మీ సామర్థ్యమున ద్యావాపృథ్వులను భరించి నిలిచినారు. మీరు శీఘ్రదాన కర్తలు. ఔషధములను గోవులను వర్థిల్ల చేయండి. వర్షము కురిపించండి.

    4. మిత్రావరుణులారా ! మీ రథము అశ్వయుక్తమయి మిమ్ము వహించవలెను. సారథి ద్వారా నియంత్రితమై సాగవలెను. మూర్తిమంతమగు జలము మిమ్ము అనుసరించును. మీ అనుగ్రహమున పురాతన నదులు ప్రవహించుచున్నవి.

    5. మిత్రావరుణులారా ! మీరు అన్నవంతులు. బలసంపన్నులు. మీరు దేహదీప్తిని వర్థిల్ల చేయుదురు.

    యజ్ఞము మంత్రమున రక్షించబడినట్లు మీ వలన భూమి రక్షించబడును. మీరు యజ్ఞభూమి మధ్యనున్న రథము ఎక్కండి.

    6. మిత్రావరుణులారా ! యజ్ఞమున మిమ్ము శోభన స్తోత్రముల స్తుతించు యజమాని విషయమున మీరు దానశీలురుకండు. అతనిని రక్షింపుడు. మీరు రాజులు, క్రోధహీనులాయి ధనమును సహస్రస్తంభ సౌధమును వహించుడు.

    7. వీరి రథము హిరణ్మయము. మేకులు సహితము బంగారపువి! వారి రథము అంతరిక్షమున విద్యుత్తువలె విరాజిల్లును. మేము యూపయష్టి సమన్విత యజ్ఞభూమియందు రథముపైన సోమరసము స్థాపించెదము.

    8. మిత్రావరుణులారా ! ఉషఃకాలమున సూర్యోదయమయినపుడు లోహకీల సమన్విత హిరణ్మయ రథమున మీరు యజ్ఞమునకు వెళ్లుటకు ఎక్కండి. అట్లే దితి, అదితులను అవలోకించండి.

    ("అదితి మఖండనీయ భూమిం దితిం ఖండితాం ప్రజాదికాం" శాయణుడు. అదితి అనగా అఖండభూమి. దితి అనగా ఖండిత - ముక్కలయిన ప్రజలు మున్నగువారు.

    భూమి ఎల్లప్పుడు అఖండమే ! ప్రజలే ఖండితులు !! గొప్ప ఆలోచన !!)

    మిత్రావరుణులారా ! మీరు దానశీలురు. విశ్వరక్షకులు. మీరు అనుభవించు సుఖము విఘాత రహితము. అచ్చిన్నము. బహుముఖము. ఆ సుఖముతోనే మమ్ము రక్షించండి. మాకు అభిలషించిన ధనలాభము శత్రువిజయము కలుగవలెను.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఐదవ మండలము మూడవ అష్టకమునమూడవ అధ్యాయము సమాప్తము)

 Previous Page Next Page