ఆలోచనామృతము :
1. ఒక్కొక్క వస్తువును చేర్చుటకు పదిచోట్ల తిరుగుట కష్టము. అన్నియు ఒకేచోట లభించిన సులభము అగును.
ఒక్కొక్కదానికి ఒక్కొక్క దేవతను వేరువేరుగ పూజించుట, ప్రార్థించుట కష్టము. అన్నింటికి ఒకే దేవతను అర్చించుట సులభము.
ఆ సూత్రమును అనుసరించియే ఇంద్రుని ప్రభువును చేయుట జరుగుచున్నది. ఏడవ- సూక్తమున ఇంద్రుని మరింత బలవంతుని చేసినారు. వేదములు మూడును ఇంద్రునే స్తుతించుచున్నవి అని, అన్యదేవతల స్తుతులు ఇంద్రునకు చాలవు న్నాడు. ఇంద్రుని వజ్రధరునిగా, సంపన్నునిగా, బలవంతునిగ అర్పించినాడు.
ఆబోతు ఆవులను చేరుట, ఇంద్రుడు వర్షసహితుడయి నరులను చేరుట సుందర భావన. ఆబోతువలననే గోవులకు సంతాన సంపద, దుగ్ధసంపద కలుగుచున్నది. వర్ష సహితుడయిన ఇంద్రుడే నరులకు సకల సంపదలు కలిగించుచున్నాడు.
2. ఎనిమిదవ సూక్తమున "ధనము" వచ్చి చేరినది. యుద్ధము సహితము అవతరించినది. ధనము వలన యుద్ధములందు గెలువవచ్చును. అను నమ్మకము ఏర్పడినది.
మానవ ప్రయత్నమునకు ప్రాధాన్యత వచ్చినది. మా ప్రయత్నములకు నీవు సాయపడుము అని ఇంద్రుని ప్రార్థించినారు.
3. ముఖము సముద్రము. దవడలు కొండలు. దవడల మధ్య నాలుక మేఘము. త్రాగినది నీరు. ఉబ్బినది ఉదరము ! అందమయిన అభిభాషణ ! 7వ మంత్రము.
ఇంద్రుడు యజమానికి ఫలములు నిండిన కొమ్మ వంటివాడు ! ఎంత సుందరముగా వచించినాడు !
4. రెండు సూత్రముల మధ్యకాలము ఎంతయో ఎరుగము ! ఎన్ని శోధనలు, ఎన్ని తపస్సులు, ఎందరి త్యాగముల తరువాత ఒక సూత్రము అవతరించినదో? దానిని గమనించిన ఆశ్చర్యము కలుగును.
తొమ్మిదవ సూక్తము-ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు,
దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.
1. సోమరస యుక్తములు అన్నములు సిద్ధముగా ఉన్నవి. ఇంద్రా ! రమ్ము. ఆరగింపుము. బలవంతుడవు గుము. శత్రువులను జయించుము.
2. అభిషవించిన సోమము సిద్ధముగా ఉన్నది. ఆ సోమము బలమును, గర్వమును కలిగించును. సమస్తకార్యములు నిర్వహించగల సామర్ధ్యము కలిగించును. అధ్వర్యులారా ! ఋత్విజులారా ! ఆ సోమమును చమస పాత్రలతో నింపుడు. మరొకసారి ఇంద్రునకు అందించుడు.
3. ఇంద్రా ! నీవు అందగాడవు. స్తవనీయుడవు. మాయజ్ఞములందలి సోమమును సేవించుటకు అన్య దేవతల సహితుడవయి విచ్చేయుము.
4. ఇంద్రుడు తన ఇష్ట ప్రకారము వర్షములు వర్షించును. అతడు యజమానుల కోర్కెలు తీర్చును. ఇంద్రుని ప్రసన్నుని చేయుటకు నేను ఈ స్తుతులను రచించినాను. అవి శతక్రతువును సేవించుచున్నవి.
5. ఇంద్రా ! నీవు వరేణ్యుడవు. విభుడవు. ప్రభువవు. నీవద్ద సమస్త ధనములున్నవి. మాకు నానారూప ధనములను ప్రసాదించుము.
6. ఇంద్రా ! నీవు సంపన్నుడవు. మేము ధనము, యశస్సుకొఱకు యత్నించుచున్నాము. మాకు ప్రేరణ కలుగజేయుము.
7. ఇంద్రా ! నీవు సంపన్నుడవు. మాకు అవినాశ్యము అగు గోధనమును, సద్గుణధనమును, సంపూర్ణ ఆయుష్య ధనమును ప్రసాదించుము. విశ్వాయుర్ధేహ్య క్షితమ్
8. ఇంద్రుడు ధనపతి. ఋక్కులు తెలిసినవాడు. యజ్ఞములను ఎరుగువాడు. అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాము. ఆహ్వానించుచున్నాము. అతడు మా ధనములను రక్షించవలెను.
9. ఇంద్రుడు బలవంతుడు. స్వస్థానమున ఉండును. యజమానులు ఇంద్రుని కొఱకు అభిషవించిన సోమము సమర్పింతురు. అతని బలమును కీర్తింతురు.
పదవ సూక్తము
ఋషి-వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, దేవత- ఇంద్రుడు, ఛందస్సు-అనుష్టుప్.
1. శతక్రతువగు ఇంద్రా ! ఉద్గాతలు నిన్ను సామమంత్రముల గానము చేయుదురు. అర్చకులు అర్చనీయుడవగు నిన్ను అర్చింతురు. ఋత్విజులలో ఒకడగు బ్రహ్మ వెదురుగడ అంతటి ఉన్నతుడవు అని శ్లాఘించును.
2. యజమాని సోమయాగము సంకల్పించును. సోమలతకై కొండలు కోనలు గాలించును. అప్పుడు ఇంద్రుడు యజమాని స్థిర సంకల్పమును గ్రహించును. మరుద్గణ సహితుడయి వర్షించుటకు వెడలును.
3. సోమపాయి ఇంద్రా ! హరి యనునవి నీ అశ్వములు, వానికి మూపురమున వెంట్రుకలు ఉన్నవి. నడుమునకు పటకాలున్నవి. వాటిది వర్షించు స్వభావము. వానిని నీ రథమునకు పూన్చుము. మా స్తోత్రములు వినుటకు సాగుము. ఉపశ్రుతించర
4. ఇంద్రా ! నీవు నివాసములకు కారణభూతుడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. మా స్తుతులను మెచ్చుము. పొగడుము. మమ్ము ప్రోత్సహించుము. మా యజ్ఞములను వర్ధిల్లచేయుము. యజ్ఞంచవర్ధయ
5. ఇంద్రుడు మాకు పుత్రులను, మిత్రులను ప్రసాదించుచున్నాడు. ఇంద్రుడు శత్రుసంహారకుడు. అతనిని మేము సంతోషింప చేయదలచినాము. ఉక్థమ శస్త్రమంత్రములచే ఇంద్రుని స్తుతించుచున్నాము.
6. స్నేహమునకు ఇంద్రునే ఆశ్రయింతుము. ధనమునకు ఇంద్రునే ఆశ్రయింతుము. ఇంద్రుడు మాకు ధనములను ఇచ్చును. శకదింద్రో వసుదయమానః
7. ఇంద్రా ! నీవు కొండలను కూల్చగలవు. నీవు ప్రసాదించిన ధనములే సహజములు. వర్ధమానములు. నీవు మా కొఱకు గోగణములను విడువుము. ధనము దానము చేయుము.
8. శత్రుంజయా ! ఇంద్రా ! నిన్ను భూమి, ఆకాశము భరింపజాలవు. ఆకసమునందలి జలమును విడువుము. గోవులను ప్రసాదించుము.
9. ఇంద్రా ! నీ కర్ణములు అంతటిని ఆకర్ణించగలవు. జాగుచేయక మా పిలుపు వినుము. నీవు మిత్రుల మధ్య ఉన్నను, వారినికాదు మాస్తుతుల మన్నింపుము. (మమ్ము మిత్రులను మించి ఆదరింపుము)
10. ఇంద్రా ! నీవు చక్కగా వర్షించువాడవు. యుద్ధములందు మా పిలుపులను వినగలవాడవు. అది మాకు తెలియును. నీవు మాకు వేల విధముల ధనమును ప్రసాదించినావు. వానిని రక్షించు సిద్ధవృష్టి వర్షింపుము. రారమ్ము.
11. కౌశిక ఇంద్రా ! ఆలస్యము చేయకుము. త్వరగా రమ్ము. చక్కగా సిద్ధము చేయబడిన సోమరసము ఉన్నది. సేవింపుము. పూర్తి ఆయువును ప్రసాదింపుము. నన్ను వేల ప్రయోజనములుగల ఋషిని చేయుము. సహస్రసామృషీమ్
12. ఇంద్రా ! స్తవనీయుడవు. మేము చేయుస్తుతులు నీవలె అధిక ఆయువుగలవి. విస్తార యశస్సు గలవి. అట్టి స్తుతులు నిన్ను సర్వత్ర సేవించవలెను. నిన్ను మా విషయమున ప్రసన్నుని చేయవలెను.
ఆలోచనామృతము :
1. 9వ సూక్తము 7వ మంత్రమున ధనములను వివరించినాడు. ధనము అవినాశ్యము కావలెను అన్నాడు. అట్లనిన మరల మరల కలుగు సహజ ధనము అని అర్ధము వడిసిపోవు ధనమును అర్థించరాదు.
మరొకచోట సంపదలు అనేకములు అన్నాడు. సహస్రసా వేల విధములు అన్నాడు.
2. సంకల్ప బలము ఉన్న వర్షము సాధ్యమగును. అంతేకాదు సకలము సాధ్యమగును. 10-2.
10వ సూత్రము 11వ మంత్రమున ఇంద్రుని 'కౌశికుడు' అన్నాడు. అందును గురించిన వివరణ :- (i) కుశిక పుత్రుడు విశ్వామిత్రుడు. కౌశికుడు. ఇతడు పురాణముల ఋషి. రామాయణమున బాలకాండలో ప్రధాన పాత్రవహించినాడు. ఆ కాండమున అతని కథ ఉన్నది. వేదములకు పురాణములకు మధ్య అనంతమగు కాలపు అగాధమున్నది.
(ii) శాయనాచార్యులు ఒక వృత్తాంతము చెప్పినారు. కుశికుడు ఇంద్రుని వంటి పుత్రునికోరి, బ్రహ్మచర్యమున, వేల సంవత్సరములు తపము చేసినాడు. ఇంద్రుడు కుశికునకు అడిగిన వరము ఇచ్చినాడు. అనంతర కాలమున కుశికునకు విశ్వామిత్రుడు జన్మించినాడు. విశ్వామిత్రుడు ఇంద్రసముడు. కావున ఇంద్రుని 'కౌశికుడు' అన్నారు.
(iii) కుశములతో కట్టిన చన్నును పితికినవాడు కాన కౌశికుడు, అని స్కంద స్వామి వ్యాఖ్యానించినారు.
పృశ్నికి నాలుగు చన్నులు. ఒకదానికి కుశలుకప్పి ఉన్నందున దేవతలు మూడు చన్నులు పిండుకున్నారు. కుశిక బద్ధమయిన నాలుగవ చన్నును ఇంద్రుడు కనుగొన్నాడు. పితిక్షివాడు. అందువలన కౌశికుడు అయినాడు.
(iv) నాకు తోచినది :- కుశికుడు బ్రహ్మ చర్యమున తపము చేసినాడు. ఇంద్రుడు తననే పుత్రుని చేసుకొమ్మని కుశికునకు వరము ఇచ్చినాడు. అట్లు ఇంద్రుడు కౌశికుడు అయినాడు.
పదకొండవ సూక్తము
ఋషి-మధుచ్ఛంద పుత్రుడు జేత, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-అనుష్టుప్.
1. ఇంద్రుడు సముద్రమంతటి విశాలుడు. రథికులకు రథికుడు, ఆహారములకు ఈశ్వరుడు. సత్పురుషులకు బాలకుడు. అందువల్ల మేము ఇంద్రుని గురించి చేసిన స్తపములు వర్ధిల్లుచున్నవి.
2. ఇంద్రా ! నీవు బలములకు ప్రభువవు. నీ సఖ్యమువలన మేము సమృద్ధులమయినాము. భయములేనివారము అయినాము. నీకు యుద్ధములందు పరాజయములేదు. నీవు జయంతుడవు. నిన్ను మేము ఎంతో నుతింతుము.
3. ఇంద్రుడు అనాదిగా దానము చేయుచున్నాడు. అయినను అతని సంపదలు తరుగవు. యజమాని యజ్ఞ సమయమందు ఋత్విజులకు ఇచ్చిన గోధనాదులు వలన ఇంద్రుడు ప్రసాదించిన సంపద ఇసుమంతయు తరుగదు.
4. ఇంద్రుడు అసురుల నగరములను భేదించగలవాడు. యువకుడు. మేధావి. అధికబలవంతుడు. సర్వకర్మలను పోషించువాడు. వజ్రాయుధధారి. బహువిధ స్తుతులకు అర్హుడు అగును.
5. వజ్రధారీ ! ఇంద్రా ! బలాసురుడు గోవులను గుహలో దాచినాడు. నీవు వానిని విడిపించినావు. అప్పుడు దేవతలు నిర్భయులు అయినారు. నిన్ను కొలిచినారు.
6. ఇంద్రుడు శూరుడు. అతడు నానావిధ దానములు చేసినాడు. నేను సోమమును వర్ణించినాను. ఇంద్రుని వద్దకు వెళ్లినాను. ఇంద్రుడు స్తుతిప్రియుడు. ఋత్విక్కులు కూడ అతనిని చేరినారు.
7. శుష్ణాసురుడు మాయావంతుడు. ఇంద్రా ! మాయలతోనే వానిని హింసించినావు. ఇంద్రుని ఈ ఘనకార్యమును మేధావులు ఎరుగుదురు. ఇంద్రుడు వారి ఆహారములను వృద్ధి చేయును.
ఇంద్రుడు వేలకు వేలు దానములు చేసినాడు. అందువలన ఋత్వికులు ఇంద్రుని సర్వత్రా స్తుతించుచున్నారు.
(ప్రథమ మండలమున మూడవ అనువాకము సమాప్తము.)
ఆలోచనామృతము :
1. ఇంద్రుడు గోవులను విడిపించు వృత్తాంతము ఆరవ సూక్తమున వివరించబడినది.
2. మాయల వానిని మాయలతోనే ఇంద్రుడు జయించినాడు. వజ్రం వజ్రేవ భిద్యతే. వజ్రాన్ని కోయడానికి వజ్రమే కావలెను.
3. అసురుల సంగతి ఇచటనే ప్రస్తావించబడినది.
నాలుగవ అనువాకము - పన్నెండవ సూక్తము
ఋషి - కణ్వపుత్రుడు మేధాతిథి, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.
1. అగ్ని దేవతల దూత అగును. అతడు సకల ధనములు కలవాడు. ఈ యజ్ఞమును చక్కగా నడిపించువాడు. అటువంటి అగ్నిని సేవించుచున్నాము.
2. అగ్ని ప్రజలను పాలించును. దేవతలకు హవిస్సులు అందించును. అతడు విశ్వప్రియుడు అట్టి అగ్నిని మంత్రముల ఆహ్వానించుచున్నాము.