"అమ్మా!" అంటూ కేకపెట్టి ఒక్క అంగలో ముందుకి దూకింది.
సీతమ్మ పొట్టిగా వుంటుంది. అవసరమయి ఏదన్నా సామాను ఆటక మీదనుంచి తీయాలంటే స్టూలుపీటేసుకున్నా అందదు. అందుకని చిన్న నిచ్చెన చేయించుకుంది. అటక్కెక్కాలంటే ఆ నిచ్చెన వాడుతుంది.
శృతి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఆటక్కి నిచ్చెనవేసి ఎక్కుతున్నది సీతమ్మ.
ముందుకు దూకిన శృతి గబుక్కున నిచ్చెన పట్టుకుని "దిగు దిగు.....అమ్మా!" అంది గాభరాగా.
నిచ్చెన మూడో మెట్టు మీద కాలు బెట్టబోతున్న సీతమ్మ ఆత్రుతగా కిందకు దిగి శృతి భుజం పట్టుకు ఊపుతూ "అదేమిటి శృతీ! అంత కేక పెట్టావ్? కళ్ళలో ఆ భయమేమిటి?" అంది.
తనను తాను నిలదొక్కుకుంటూ "ఇంకా నయం, నిచ్చెన ఎక్కావుకాదు. అంది శృతి.
"ఏం! ఆటకమీద దెయ్యముందా?"
"ఆటకమీద దెయ్యంలేదు. నిచ్చెనమెట్లు లూజుఅయ్యాయి......"
"అవి నువ్వు గమనించకఎక్కితే.....అమ్మో,....అక్కడ నుంచి కింద పడితే ఇంకేమయినా వుందా! సుబ్బమ్మత్తయ్యగారు బావిదగ్గర కాస్త జారిపడితేనే తుంటి కీలు విరిగింది. అయినా ఆటకమీదికి ఈ పెద్దతనంలో నీవెక్కకపోతే ఏమమ్మా? ఏదయినా కావాలంటే నేను ఎక్కి తీయనూ?" అంటూ నిచ్చెన తీసేసింది శృతి.
సీతమ్మ బుగ్గన వేలేసుకుంది.
"ఏం విచిత్రమే నా తల్లీ! ఆటకమీద కెక్కి ఏదయినా సామాను దింపవే అంటే ఓ పట్టాన వినవు. ఊళ్ళో వాళ్ళందరికీ గిన్నెలు నువ్వే సప్లయి చేయాలా? అని గుణుపు....."
"అప్పుడు వేరు." అని నాలిక్కొరుక్కుంది శృతి.
"ఇప్పుడేమయిందే"?
"సుబ్బమ్మత్తయ్యగారి కాలు కేసిన పెద్ద ప్లాస్టరు, ఆవిడ బాధ చూసిన తరాత్వ బుద్దోచ్చిందమ్మా! ఇంకెప్పుడు బరువు పనులు, అటకెక్కటం లాంటివి నీచేత చేయించకూడదని గట్టిగా అనుకున్నాను. పెద్దదానివయ్యావు. నేను నీకు సాయంచేయాల్సిందిపోయి ఇంకా చిన్న పిల్లలా గారాంపోతూ అన్ని పనులు నీచేత చేయించటం.....ఉహూ......నా కిష్టం లేదమ్మా?"
"మా అమ్మే....మా అమ్మే.....అంతమాటన్నావు చాలు అయినా పిల్లల పనులు చేయటం తల్లికి కష్టమటే." అంది సీతమ్మ ప్రేమగా మెటికలు విరచి.
"తల్లి విషయంలో పిల్లలు అలా ఉండటం ధర్మం" అంటూ నిచ్చెన తీసుకెళ్ళి దొడ్లో పెట్టి వచ్చింది శృతి.
అటకమీద మురారిదేముణ్ని అమ్మ చూస్తే ఇంకేమయినా వుందా? దొంగ దొంగ అని అరచి పదిమందినీ పోగుచేసేది. అంత టైము కూడానా, ఈ లోపలే మురారిదేముడు అటకమీదనుంచి కిందకి ఓ గెంతు గెంతి అమ్మని..... ఈ రోజెంత ఆపద తప్పింది.
తల్లితో అబద్దం ఆడదు శృతి. నిచ్చెన విషయంలో అబద్దం ఆడినందుకు విచారిస్తున్న శృతి ఆపద తొలిగిందన్న ఆలోచన కలగగానే ఎంతో ఆనందించింది. వరసపెట్టి దేవతలందరికీ శతకోటి నమస్కారాలు పెట్టుకుంది మనసులో.
"పెద్ద భాండీ కావాలని గిరిజమ్మగారి మనుమడోచ్చాడు. వాడినే అటకెక్కి తియ్యరా అన్నాను. వాడికేమో మోకాలు బెణికిందట. అటకెక్కలేనన్నాడు. నువ్వొస్తావేమో అని చూశాను, రాలేదు. భాండీకోసం కబురంపి అరగంటయింది. సరే నేనే తీద్దామని నిచ్చెనేశాను. నువ్వొచ్చావ్!" అంది సీతమ్మ.
"భలేదానివే. అసలు ఆ భాండీ ఆటకమీదలేదు. వంటింట్లో మూలనే పడేసివుంది. నువ్వు ఊరికెళ్ళేటప్పుడు భాండీ ఆటకమీద పడెయ్యమని చెప్పి వెళ్ళావా? బద్దకించి నే అక్కడే వుంచాను." అంది శృతి.
"నీ బద్ధకం నాకు తెలియదా! ముందు వంటింట్లో చూస్తే పోయేదానికి ఆటక్కి నిచ్చెనేశాను. సరేలే. ఇప్పుడేమైందిగాని, ఆ భాండీ ఇటు తెచ్చిపెట్టు. గిరిజమ్మగారికి యిచ్చి వస్తాను." అని ఓ నిట్టూర్పు విడిచింది సీతమ్మ.
"ఇప్పుడు నువ్వెళ్ళపోతేనేమమ్మా!" అంది శృతి.
"పనేంలేదు భాండీ ఇచ్చి కాసేపు కూర్చుని వస్తాను. అన్నయ్యవచ్చినా నువ్వుంటావుకదా ఇంట్లో!"
"ఊ అని భాండీ తెచ్చి యిచ్చింది శృతి.
తలుపు జాగ్రత్తంటూ గిరిజమ్మగారింటికి బైలు దేరిందిసీతమ్మ.
తల్లి అటు వెళ్ళగానే తలుపు బిగించింది శృతి.
"అమ పెత్తనాలుచేసి వచ్చేటప్పటికి దాదాపు రెండు గంటలు పడుతుంది. అన్నయ్య అరగంట అటూ ఇటుగా రావచ్చు. అమ్మ, అన్నయ్య వచ్చేలోపల ఈదేముడి సంగతి చూడాలి." అనుకుంటూ పెద్దస్టూలు పీట వేసుకుని ఎక్కింది శృతి.
ఆటక మీద మురారిదేముడు ముడుచుకొని అటు తిరిగి పడుకుని వున్నాడు. "ఇష్.....ఇష్...." అని పిలిచింది శృతి. అలాగే పడుకుని ఉన్నాడు. "ఏయ్ నిన్నే" అంది కాస్త స్వరం హెచ్చించి ఊహూ! కదలలేదు.
"నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆటకమీద ఎలా ఉన్నాడో పాపం! అని తను జాలిపడింది గాని, అతనికేం దుర్జాగా ఈస్ట్ మస్ కలర్ కలలు కంటూ నిద్రపోతున్నాడు. అతనేం మామూలు మనిషా,బాధ పడడానికి? దొంగ, హంతకుడు, రాక్షసుడు" అని తిట్టుకుని ఆటక మీద గట్టిగా కొట్టి చప్పుడు చేసింది శృతి.
నెమ్మదిగా అటునుంచి ఇటు తిరిగాడు మురారిదేముడు.
"ఇంటో ఏవరూ లేరు, కిందకు దిగిరా, నీతో మాట్లాడాలి."
"ఏమిటి?"
"నీకంతా ఆటలుగా వున్నట్లుంది. లేక ఇంకా నిద్ర దెయ్యం వదలలేదా! కిందకి దిగిరమ్మంటున్నాను వినపడిందా?"
"ఊ!"
"శృతి స్టూలుమీంచి దిగింది.
మురారిదేముడు వెంటనే ఆటకమీదనుంచి దిగాడు.
బాత్ రూమ్ కు వెళ్ళి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తలెత్తి అతన్ని చూడలేదుగాని, గమనిస్తూనే వుంది శృతి.
"ఉదయం మా అమ్మ ఊరినుంచి వచ్చింది కాబట్టి రాత్రి బవళ్ళు ఇంట్లోనే వుంటుంది. నువ్వు అవసరానికి కిందకు దిగడాని కుండదు. ఇప్పుడోగంట అలా వెళ్ళోస్తానని తెలిసిన వాళ్ళింటికి వెళ్ళింది. ఇహముందు ఇల్లు కదలదు. ఈ ఒక్కరోజే అన్నయ్య నైట్ డ్యూటీకి వెళ్ళేది. నాలుగు రోజులూ ఇంటిపట్టునే వుంటాడు. మహా అయితే ఓ అరగంట అలా బజారు వెళ్ళోస్తాడేమో అంతే....."
"ఇదంతా నా కెందుకు చెపుతున్నట్లు?"
శృతికి వళ్ళు మండింది. "ఏం తోచక నీతో కబుర్లు చెబుదామని చెబుతున్నాను. అర్థమయిందా!" అంది కోపంగా.
అర్థమయిందన్నట్లు తలాడించాడు మురారి దేముడు.
"ఇదిగో, నే చెప్పవలసింది చెప్పాను. ఆ పైన నీయిష్టం మావాళ్ళుండగా రాత్రి, పగలు కిందకు దిగకుండా ఎంతకాలం ఆటకమీదుంటావ్? అనలెలా ఉంటావ్? తిండి ఎట్లా? బాత్ రూమ్ కి వెళ్ళటం ఎట్లా?"
"తిండి మానేస్తే తతిమ్మా అవసరాలు పెద్దగా కలగవు"
కిటికీ కమ్ములు పట్టుకుని అటుతిరిగి నుంచునిమాట్లాడుతున్న శృతి కోపం పట్టలేక ఛర్రున ఇటు తిరిగి మురారి దేవుణ్ని నమిలి మింగేసేటట్లు చూసింది.
తనకేం పట్టనటు కాలు నొక్కుకుంటూ కూర్చున్నాడు మురారిదేముడు.
"ఆటక మీదనే సజీవ సమాధి అయిపోదల్చుకున్నావా?"
"నాకా కోరిక లేదు" అంటూ తలెత్తి శృతి కళ్ళలోకి చూచాడు తీవ్రంగా.
కెంపుల్లా వున్న మురారిదేముడి కళ్ళుచూచి ఉలిక్కి పడింది శృతి. "నీకేం కోరికలున్నాయో నా కనవసరం. ఇందాక నేను ఇంటోలేను. నిచ్చెన వేసుకుని అమ్మ అటక ఎక్కబోయింది.
"ఊ.....ఆపైన....."
నీకంతా తమాషాగా వున్నట్లుంది. సమయానికి నేను రావటంతో అమ్మని ఆటక ఎక్కనీయకుండా చేశాను. అది తల్చుకుంటేనే భయంగా ఉంది. అప్పటి గుండె దడ ఇప్పటి దాకా అలానేవుంది."
"చ్చొ......చ్చొ.............
"నీ చ్చొ చ్చో చ్చోలు, సానుభూతి నాకేం అక్కరలేదు. ఇక్కడుండడం ప్రమాదం. రాత్రికి మకాం మార్చేయి."
"ఎవరికి ప్రమాదం?" శాంతంగా అడిగాడు. మురారి దేముడు.
రెండు చేతులలో తల ఇరికించుకొని కణతలు నొక్కుకుంటూ వుండిపోయిందిశృతి.
"తలనొప్పా?"
"నువ్వేనాకో పెద్ద హెడేక్."
"ఇది చెప్పడానికా, నన్ను రాజసౌధం నుంచి కిందకు దింపావ్?"
"ఆ నవ్వొకటి, సిగ్గు లేకపోతేసరి! జానెడు బెత్తెడు ఆటక మీద ఇరుక్కుని కాలంగడుపుతున్నావ్. రాజసౌధంట, రాజసౌధం! అమ్మో, అన్నయ్యో నిన్ను చూస్తే అరవడమో మరేదో జరుగుతుంది. నీ క్షేమం కోసం మా ప్రాణం తీస్తావు. చల్లగా సాగుతున్న మా సంసారం నాశన మవుతుంది."
అంతవరకూ తీవ్రంగా వున్న శృతి గొంతు జాంగురపోయింది. కళ్ళ నిండుగా నీళ్ళు ఉబికి వచ్చాయి. కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు. "ఇందాక అమ్మ భాండీ కావలసివచ్చి నిచ్చెన వేసుకుని ఆటక ఎక్కబోయింది. సమయానికి నేను వచ్చి అమ్మని ఆటక ఎక్కనీయకుండా చేశాను. నేను అప్పుడు రాకపోతే ఏమయేది? ఆటకమీద వున్న నిన్ను అమ్మచూచి దొంగ దొంగ అని కేకలు పెట్టేది. నీవు అమాంతం ఆటక మీదనుంచి దూకి అమ్మని నీ రివాల్వర్ కి బలిచేసేవాడివి.
"తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టె రకాన్ని కాదు శృతీ. ఈ మురారిదేముడు ముద్దుకి ముద్దు, గుద్దుకి గుద్దు ఇస్తాడు. నీ వూహ, నీ భయం అనవసరం అమ్మ చూసేది, అయ్యా చూసేది ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి కదిలేదిలేదు."
మురారిదేముడి మీద అసహ్యాన్ని చూపుల్లోను, కోపాన్ని పళ్ళు పటపట లాడించడంలోను చూపింది శృతి. అతన్ని ఏమీచేయలేని నిస్సహాయతతో కంపించిపోయింది.
"నీ కోపాగ్ని జ్వాలలకే శక్తివుంటే మాడి మసి అయిపోయేవాడిని శృతీ! నీ పరిస్థితి నాకు తెలుసు. కానీ ఈ సమయంలో అసహాయుడిని. నిన్ను అర్థం చేసుకున్నాను ఒక్కసారి నన్నూ అర్థం చేసుకోటానికి ప్రయత్నించు..... కాలు సెప్ టిక్ అయింది. అడుగుతీసి అడుగు పెట్టడానికి నావల్ల కాదుకదా, నన్ను పుట్టించిన బ్రహ్మకి కూడా అసాధ్యం." అంటూ లుంగీ పైకిలాగి కాలు చూపించాడు మురారిదేముడు.
చీముతో బురబురలాడుతున్న ఆ గాయాన్ని చూడగానే శృతి గుండె ఆగినంత పనయింది. "ఆరి భగవంతుడా! ఇతను మనిషా, మానా? ఆ కాలు నీలంగా అయిపోయింది. వాపు, చీము, నిజంగా సెప్ టిక్ అయింది. ఇలాగే మరో నాలుగు రోజులుంటే డాక్టరు కాలు కొట్టేస్తాడు." లోపలే అనుకోబోయిన శృతి అప్రయత్నంగా పైకే అనేసింది.