Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 12


    "అవును అప్పుడీ స్థానంలో కొయ్యాకాలు పెడతారు" చాలా తేలిగ్గా చెప్పాడు మురారిదేముడు.

    "ఇదిగో నీకసలు దిగులు, చింతలేదు. హాయిగా అటకెక్కి కూర్చున్నావ్. ఇప్పుడు ఏం జరిగినా అవస్థపడేది నేను. ఇక్కడ నుంచి నీవు వెళ్ళడమే మంచిది"

    "ఏం చేయాలో నాకు తెలుసు. బజారు నుంచి నే చెప్పినవి తెచ్చావా?"

    "తేలేదు. తేను"

    "శృతీ!" ఆవేశంగా కుర్చీలోంచి లేచినుంచున్నా మురారిదేముడు కాలు కలుక్కుమనగా బాధతో గిలగిలలాడుతూ కుర్చీలో నిస్సహాయంగా అలా కూర్చుండిపోయాడు.

    శృతి చూస్తూనే ఉంది.

    అతను దంతాలు బిగపట్టి నొక్కి ఉంచడంవల్ల దవడ ఎముకలు పొడుచుకు వచ్చి ముఖం వికృతంగా మారింది. ఎంతో శ్రమకోర్చి ఆవేశాన్ని అదుపులో పెట్టుకో ప్రయత్నిస్తున్నాడని ముఖకవళికలే చెబుతున్నాయి.

    శృతి ఏమనుకుందో, కిటికీ దగ్గర నుంచి కదిలింది. బజారు నుంచి తెచ్చి దాచిన కాటన్, మందులు అతని ముందుంచింది.

    అని చూడగానే మురారిదేముడు ముఖం వికసించింది. మాటలలో కృతజ్ఞత వెల్లి విరుస్తుండగా, "థాంక్స్, నీకు  బుణపడిపోతున్నాను. నీలాంటి మంచిపిల్ల బుణం తీర్చుకునే రోజు వస్తుందా?" అన్నాడు.

    "ఏ జన్మలోనో నీకు బుణపడి ఉంటాను. ఈ జన్మలో ఇప్పుడు నా పీకమీద కూర్చుని తీర్చుకుంటున్నావు. చాలు చాలు. నేను ఆపదలపాలు కానూ అక్కరలేదు, నీవు రక్షించనూ అక్కరలేదు."

    ఏమనుకున్నాడో మురారిదేముడు ఆ విషయం వదిలేశాడు. "ఓ గిన్నెతో వేడి నీళ్ళిస్తే కాలు శుభ్రంచేసి గాయానికి కట్టు కట్టేస్తాను. ఉంటే ఓ కప్పు కాఫీ కూడా!" అంటూ నాన్చుతూ ఆగాడు.

    మౌనంగా వంటింట్లోకి దారితీసింది శృతి.

    శృతి స్టౌవ్ మీద నీళ్ళుపడేసి కాఫీ కలుపుకుని వచ్చింది. శృతి వచ్చేసరికి పక్కనే అరమరలో వున్న థర్మామీటరు తీసి చూసుకుంటున్నాడు మురారిదేముడు. శృతిని చూస్తూనే "నూట నాలుగు" అన్నాడు.

    "జ్వరమా?" కంగారుగా అంది శృతి.

    "కాదు, బైట ఎండ ఎన్ని డిగ్రీలు కాస్తుందోచెప్పాను." వ్యంగ్యంగా అని శృతి చేతిలో కాఫీ కప్పు విసురుగా లాక్కున్నాడు మురారిదేముడు.

    "ఓ పక్కన చస్తున్నా పులిలాగాండ్రింపు, జరుగుతుంటే సరి" అనుకుంది శృతి. ఏమన్నా మాట్లాడితే ప్రయోజనంలేని మాటలు పెరగటం తప్పు ఏముంది.

    మురారిదేముడు కాఫీ తాగటం పూర్తిచేసేసరికి శృతి వేడినీళ్ళు, తను బజారు నుంచి తెచ్చిన కాటన్, మందుసామగ్రి అతని ముందు పెట్టింది.

    అతని వేళ్ళు చకచకా పనిచేస్తుంటే చూస్తూ నుంచుంది శృతి.

    మురారిదేముడు గాయాన్ని శుభ్రం చేశాడు. ముందుగా చీము నొక్కేసి డెట్టాల్ తో తుడిచి మందు రాచి గాజుగుడ్డ పైనకప్పి కట్టుకట్టేశాడు. అనుభవమున్న డాక్టరులా ఆ పని పూర్తిచేసి ఇంజక్షన్  చేసుకోవటానికి సిరంజిలోకి మందెక్కించాడు. అప్పుడు తల పైకెత్తి శృతిని చూస్తూ "ఇంజక్షన్ చేయటం వచ్చా?" అని అడిగాడు.

    "నేను నర్స్ ని కాదు" అంది శృతి.

    "ఆమాట కొస్తే నేను డాక్టర్ నీ కాదు." అంటూ జబ్బలోకి సూది పోనిచ్చి ఒకచేత్తో తానే ఇంజక్షన్ చేసుకున్నాడు మురారిదేముడు.

    శృతి ఆశ్చర్యపోవటం చూసి "ఎందుకలా నోరు తెరుచుకు చూస్తావ్? నోట్లోకి ఈగలుపోతాయ్." అన్నాడు నవ్వుతూ!

    "నేనేం నోరు తెరుచుక్కూత్చోలేదు. నాకిదే పనా? ఈ కాలంలో గుడ్డి ముసలమ్మ కూడా ఇంజక్షను తనకి తానే చేసుకోగలదు." అంటూ గయ్యమంది శృతి.

    శృతిని తేరి పారచూసి "నువ్వు కోపంలో మరింత అందంగా వుంటావు శృతీ!" అన్నాడు మురారిదేముడు.

    శృతి ఛర్రున పక్కనే వున్న టేబుల్ మీది పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంది.

    చటుక్కున ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు మురారిదేముడు.

    వీధి గేటు తీసిన చప్పుడు, కిర్రుమన్న తలుపు శబ్దం అయింది.

    శృతి చేతిలోంచి పేపర్ వెయిట్ జారిపోయింది.

    మురారి దేముడు టకీమని కుర్చీలోంచి లేచి స్ప్రింగ్ లా ఎగిరి ఆటక ఎక్కాడు.

    శృతి ఏమాత్రం ఆలస్యం లేకుండా వేడినీళ్ళగిన్నె, కాటన్ తదితర సామాన్లు అక్కడనుంచి తీసేసింది.

    "అమ్మాయ్ శృతీ! తలుపుతియ్యి." సీతమ్మ బైట నుంచి తలుపు తట్టుతూ పిలిచింది.

    "వస్తున్నానమ్మా !" అంది శృతి.

   
                                                                         9

    గుమ్మంలో కాలు లోపల పెడుతూనే "ఏమిటో ఏదో కంపుకోడుతోంది" అంటూ ముక్కు ఎగబీల్చింది సీతమ్మ.

    గతుక్కుమంది శృతి.

    కనిపెట్టేసింది సీతమ్మ. "ఆ....మందు వాసన, ఆస్పత్రిలో కాలు పెడితే చాలు ఇదే వాసన. అవునూ మనింట్లో.........?"

    సీతమ్మ మాట పూర్తి చేయకముందే అందుకుంది "అదా? ఆ వాసన డెట్టాల్ ది. ఇందాక అలమర సర్దుతుంటే చేయిజారి సీసా కిందపడింది. ఇంకా నయం, పగలలేదు. కాస్త వలికింది అంతే" అంది.

    "అదీ, అలా చెప్పు" అని, "ఇస్సు" అంటూమూలిగి కుర్చీలో కూర్చుండిపోయింది.

    "అందరిని పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కున్నావా అమ్మా!" నవ్వుతూ అడిగింది శృతి.

    "నీకంతా వేళాకోళు, వెక్కెరింతాను! నేను వూరి నుంచి వచ్చినందుకు అంతా ఎంత సంతోషించారని? మన  కాలనీయే చిన్న బోయిందన్నారు. నన్ను చూసి ఎన్నో ఏళ్ళయినట్టుందన్నారు. నేను లేందీ మావాళ్ళేవారికీ తోచలేదుట. "సీతమ్మా! నువ్వు పదిమంది పెట్టమ్మా?" అని ఒకరంటే "సీతమ్మ ఒక్కతే వంద మంది పెట్టర్రా" అంది నాగరత్తమ్మ. ఆ ఆప్యాయతలు అవీ వేరనుకో. "మాలో ఏం జరిగినా వెంటనే సలహాఇస్తావు నీవు లేవంత కాలం మా చేతులు కాళ్ళూ ఆడితేనా? ఓ చెయ్యి విరిగినట్టే వుంది." అంటూ ఒకటే ఇది చేశారనుకో."

    "పాపం వాళ్ళకేమవసర మొచ్చిందో, నువ్వుత్త బోళామనిషివి. ఉబ్బేసి అవసరాలు గడుపుకుంటారు. ఏ అమ్మకి రోకలి కావాల్సివచ్చిందో, ఏ అమ్మకి అరిశ లొత్తి పెట్టాల్సివచ్చిందో." అంది శృతి.

    "అలా అనకు. మనిషికి మనిషి సాయం. నోరు మంచి దయితే ఊరు మంచిదన్నారు. పదిమందిలో మంచిగా వుంటే  అవసరానికి ఆ పదిమందీ ఓ చెయ్యేస్తారు."

    "ఆ......ఆ.....వేస్తారు. చిన్న పొరపాటు కనపడనియ్యి. వేలెత్తి చూపించి చెవులుచెవులు  కొరుక్కుంటారు.

    "లోక సహజం" చాలా తేలిగ్గా అంది సీతమ్మ.

    "ఈ కాలానికి తగ్గదానివి కాదమ్మా!" చిన్నగా నిట్టూర్చి అంది శృతి.

    "నేనేం పడుచుదాన్నిటే, ఈ కాలం పోకడలు పోవటానికి? ఆ కాలం ఆ మనుషులు.......ఆ..." అని ఇంకేదో చెప్పబోయి సిద్ధార్థ రావటం చూసి "సిద్దూ వస్తున్నాడు. ఇందాకనే రాలేదా?" అంది సీతమ్మ.

    "ఉహూ, నీకూ, అన్నయ్యకు ఊళ్ళో రాదకార్యాలు ఎక్కువ. ఎవరెట్లా వున్నారో, ఎవరికే రాచకార్యం పడిందో, ఆది మనం చెయ్యగలమో లేదో....."

    శృతి మాట పూర్తి చేసేటప్పటికి సిద్దార్థ లోపలి కోచ్చేశాడు.

    "ఓ గ్లాసు మంచినీళ్ళివ్వవే" అంటూ చెప్పులు మూలన విడిచి పడక కుర్చీలో కూర్చుండిపోయాడు.

    "దీనిమాట విన్నావురా సిద్దూ?" అంది సీతమ్మ.

    "ఏదమ్మా! ఇప్పుడేగా ఇంట్లో కాలుపెట్టాను. ఏం, ఏమన్నా ఫిర్యాదు చేస్తున్నదా? దానిపని నేరం ఆరోపించటం ఫిర్యాదులు చేయటం" అంటూ నవ్వాడు సిద్దార్థ.

 Previous Page Next Page