యయాతి దేవయాని సుఖముగా ఉన్నారు. వారికి యదువు, తుర్వసుడు అను ఇద్దరు కుమారులు కలిగినారు.
శర్మిష్ఠ యౌవనమున ఉన్నది. పొందుకోరి ఉన్నది. ఒకనాడు ఆమె వనమున ఉన్నది. యయాతి వచ్చినాడు. ఆమె యయాతిని ప్రార్ధించినది:-
"రాజా! నేను దేవయానికి దాసిని. నన్ను ఏలుదానికి నీవు పతివి. అందువలన నీవు నాకును భర్తవగుదువు. భార్య, దాసీ , పుత్రుడు మనుజునుకు సమాన ధనములు. ఇది లోకధర్మము. కావున నన్ను పొంది నాకు పుత్రులను ప్రసాదించుము."
అందుకు యయాతి శుక్రుడు విధించిన నియమము వవరించినాడు. "నేను అందుకు సమ్మతించినాను. ఇప్పుడు ధర్మ విరుద్ధముగా వర్తించలేను." అన్నాడు.
అందుకు శర్మిష్ఠ మరొక నీతి చెప్పినది.
న నర్మయుక్తం వచనం హినస్తి
నస్త్రీషు రాజన్! నవివాహకాలే
ప్రాణాత్యయే సర్వధనాపహరే
పంచానృతాన్యాహు రపాతకాని
హోసోక్తులందు, స్త్రీల విషయమున , వివాహకాలమందు, ప్రాణమునకు ప్రమాదము ఏర్పడినప్పుడు, సర్వధనము అపహరింపబడునపుడు ఈ పంచానృతములు పాతకములు కావు.
యయాతి శర్మిష్ఠ మాటలకు సంతసించినాడు. ఆమెతో సంభోగించినాడు. ఆమెకు ముగ్గురు పుత్రులు కలిగినారు. వారు ద్రుహ్వీ, అనుడు, పూరుడు.
వారిని చూచి దేవయానికి అనుమానము కలిగినది. అడిగినది. ఒక ముని దయవలన కలిగినారని శర్మిష్ఠ చెప్పినది. దేవయాని అనుమానము తీరలేదు. యయాతిని అడిగినది. అతడు బదులు చెప్పలేదు. మిన్నకున్నాడు. దేవయాని అనుమానము పెరిగినది.
ఒకనాటి మాట. అందరు తోటలో ఉన్నారు. శర్మిష్ఠ పుత్రులు దూరముగా ఉన్నారు. ఆడుకొనుచున్నారు. దేవయాని వారి దగ్గరికి వెళ్ళినది. వారు యయాతి రూపమును పుణికి పుచ్చుకున్నారు. దేవయాని వారిని "మీ తలిదండ్రులు ఎవరు?" అని అడిగినది. వారు శర్మిష్ఠ ను యయాతిని చూపినారు.
దేవయాని మండిపోయింది. అగ్గి బుగ్గి అయినది. అట నుండి బయలుదేరినది. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు అపాయము శంకించినాడు. దేవయాని వెంట వెళ్ళినాడు.
దేవయాని గోడుగోడున ఏడ్చినది. కన్నీరు జలజల రాల్చినది. తండ్రికి జరిగినది వివరించినది. తనను తిట్టుకున్నది. తండ్రిని నిందించినది.
శుక్రుడు దేవయాని మాటలు విన్నాడు. మండిపడినాడు. యయాతిని శపించినాడు:-
"రాజా! యౌవన గర్వమున నా కుమార్తె కు అన్యాయము చేసినావు. నీవు ముసలివాడవు అవుదువుగాక"
యయాతి శుక్రుని పాదముల మీద పడినాడు. దాసీ సహితము భార్య యగును అను నీతిని వివరించినాడు. దేవయాని వలన తనకు విషయవాంచలు తీరలేదు అన్నాడు. అనుగ్రహించ వలసినదని ప్రార్ధించినాడు.
శుక్రుడు గ్రహించినాడు. అనుగ్రహించినాడు :-
"రాజా! నీ వార్ధక్యమును నీ కుమారులలో ఒకరికి ఇమ్ము. అతని నుండి యౌవనము గ్రహింపుము. విషయ వాంచలు తీర్చుకోనుము. యౌవనమును మరల అతనికిమ్ము. అట్లు నీకు యౌవనము ఇచ్చిన వాడే రాజ్యమునకు అర్హుడు అగును. అతడే వంశ కర్త అగును."
యయాతి సంతృప్తి చెందినాడు. శుక్రుని అనుమతి బడసినాడు. దేవయాని సహితముగా బయలుదేరినాడు. స్వస్థలము చేరినాడు.
యయాతి కొడుకులను పిలిచినాడు. తన కోరిక వ్యక్తపరిచినాడు. యదు, తుర్వస, ద్రుహ్వీ, అనువు అందుకు అంగీకరించలేదు. "యౌవనము , వార్ధక్యము భగవంతుని ప్రసాదములు అవి ఉన్నవారు అనుభవించవలసినదే" అన్నారు.
యయాతి కొడుకుల మాటలు విన్నాడు. కోపగించినాడు. అన్నాడు:-
"యదు వంశము వారు రాజ్యమునకు అర్హులు కారు. తుర్వసులు కిరాతక రాజ్యమును ఏలుదురు. ద్రుహ్యా వంశము వారు నీటి ఆధారములేని చోటికి రాజులగుదురు. అనువుకు ముసలితనము ప్రాప్తించును."
యయాతి అట్లు శపించినాడు. పూరుని పిలిపించినాడు. తన కోరిక చెప్పినాడు. రాజ్యమును ఇత్తునన్నాడు.
పూరుడు అందుకు అంగీకరించినాడు. తండ్రి ముసలితనము గ్రహించినాడు. తన యౌవనము తండ్రికి ఇచ్చినాడు.
యయాతి వేయేండ్లు కామ సుఖములు అనుభావించినాడు. తిరిగి తన యౌవనమును పూరునికి ఇచ్చినాడు. పూరునికి పట్టము కట్టినాడు. యయాతి అడవులకు వెళ్ళినాడు. వానప్రస్థము అవలంబించినాడు.
ఆలోచనామృతము
1. శాస్త్రజ్ఞులకు ప్రాధాన్యత ఉన్నదను అంశము ఈ కధవలన మరింత స్పష్టమయినది. వృషపర్వుడు కూతురును దాసిని చేయుటకు అంగీకరించినాడు. కాని శుక్రుని వదులుకొనలేదు.
2. వివాహము మానవ చరిత్రలోను, జీవితమందును అతి ముఖ్యమయిన వ్యవస్థ. అందుగురించి నాటి నుంచి నేటి వరకు ప్రయోగములు జరుగుచున్నవి. శుక్రుడు యయాతి దేవయానుల వివాహమునకు అంగీకరించుట యాదృచ్చికముగా కనిపించును. అతడు పుత్రికా వాత్సల్య మాత్రమున అందుకు అంగీకరించినాడని తోచదు. అతడు కచ దేవయానుల వలన శత్రు పక్షముల సమైక్యత సాధించ తలచినాడు. అది వమ్మయినది. ఇప్పుడు కులాంతర వివాహమును ప్రోత్సహించినాడు.
3. అబద్ధములు ఎక్కడ అడవచ్చునో నిర్దేశించుట జరిగినది.
4. తండ్రీ కొడుకుల సంబంధము విచిత్రమైనది. తాను కోరినది కొడుకు చేయవలె. అనుకును తండ్రి. కొడుకు తనకు స్వేచ్చ ఉన్నదనుకొనును. ఇది అడికాలము నుండి నేటి వరకు ఉన్న సమస్య. ఇది తరముల అంతరము.
యౌవనము ఇచ్చి పుచ్చుకోనుటకు సాధ్యమయినది కాదు. యౌవనము సంకేతము. తండ్రి కోరిన అతి ఇష్టమయినది సహితము ఇవ్వవలెననుట. ఉద్దేశ్యము. ఇది ఈనాడు సమంజసముగా కనిపించదు. ఏ పరిస్థితిలో అట్టి ఆచారము వచ్చినదో అధ్యయనము చేయవలెను.
5. ఇంతకు యయాతికి కొడుకులు యవ్వనము ఇవ్వలేదు. పూరుడు రాజ్యము కొఱకు యౌవనమును విక్రయించినాడు. యయాతి రాజ్యమిచ్చి అది కొనుక్కున్నాడు.
6. యయాతి కొడుకులను శపించిన తీరులో ఒక ఆసక్తి కరమయిన విషయమున్నది. ద్రుహ్యవంశమువారు నీటి ఆధారములేని చోటుకు రాజులగుదురు అన్నాడు. వీరు ఎడారులలో వసించు అరబ్బు జాతివారు కారు కదా! శాస్త్రజ్ఞులు పరిశోధించవలెను.