Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 9


    9. ఇంద్రా ! నీవు యుద్ధ వీరుడవు. నీకు హవిస్సులు అందించుచున్నాము. నీవు మాకు సంపదలు ప్రసాదించుము.

    10. ఇంద్రుడు సంపదల రక్షకుడు, గుణాధికుడు, సత్కర్మలు చేయువాడు, యజమానులందు స్నేహభావము కలవాడు. ఇంద్రాయ గాయతః అట్టి ఇంద్రుని స్తుతింతుము.

    ఆలోచనామృతము :

    1. మూడవ సూక్తము వరకు దేవతలను స్తుతించినారు. ప్రతి ఫలము యాచించలేదు. ఈ సూక్తమున ప్రతి ఫలాపేక్ష స్పష్టము.

    ఇంద్రుడు శత్రు సంహారకుడు. ఫలప్రదాత. అందువలన అతనిని యాచించుట జరిగినది.

    2. సూత్రములు ఎంతో అందముగా ఉన్నవి. గోపాలుడు పిలువగనే ఆవు వచ్చి పాలిచ్చుట బొమ్మ కట్టి చూపుచున్నది. ఇంద్రుడు పాడియావు. యజ్ఞములు చేయువారు గోపాలురు.

    3. ఇంద్రుని నిందించువారు కూడ ఉన్నట్లు విదితము అయినది.

    4. శత్రువును గెలుచుటకు, యుద్ధములందు విజయములకు, సంపదలకొఱకు ఇంద్రుని ప్రార్థించుచున్నాము.

    5. యజమానికి హోతమీద నమ్మకము సన్నగిల్లినట్లున్నది. హోత ఇంద్రుని ధ్రువపత్రము కొఱకు యజమానిని పంపుచున్నాడు.

                            అయిదవ సూక్తము, ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు,
                                          దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.


    1. స్తోత్రగానములు చేయు మిత్రులారా ! ఋత్విజులారా ! త్వరగా రండు. కార్యము సాగింపుడు. కూర్చొనుడు. 
ఇంద్రుని స్తుతింపుడు.
     
    2. ఇంద్రుడు శత్రుమర్దనుడు. వరదుడు. అతని కొఱకు సోమము సిద్ధముగా ఉన్నది. గానముల ఇంద్రుని స్తుతింపుడు.

    3. ఇంద్రుడు పురుషార్థములు సాధించుగాత. ధనమును ఆర్జించునుగాత. బుద్ధిని సంపాదించునుగాత, ఇంద్రుడు అన్నిటితో మా వద్దకు వచ్చునుగాత.

    4. యుద్ధములందు ఇంద్రుని రథము దరిచేరుటకు శత్రువులు వెరతురు. తస్మా ఇంద్రాయ గాయతః అటువంటి ఇంద్రుని స్తుతింపుడు.

    5. సోమములు పవిత్రముగా అభిషవించబడినవి. పెరుగుపోసి శోధించబడినవి. ఈ సోమములు సోమపాయుల కొఱకు సిద్ధముగా ఉన్నవి.

    6. ఇంద్రా ! నీవు శుభకార్యములు చేయువాడవు. నీవు దేవతలలో ఉన్నతుడవు అగుము. అందుకు ఈ సోమమును పానము చేయుము. ఆనందమున తేలియాడుము.

    7. ఇంద్రా ! నీవు స్తుతి ప్రియుడవు. జ్ఞానవంతుడవు. సోమములు సర్వత్ర వ్యాపించి ఉన్నవి. అవి నీకు సుఖప్రదములు కావలెను.

    8. ఇంద్రా ! మేము చేయు సామవేదస్తుతులు, ఋగ్వేదస్తుతులు నిన్ను ఉప్పొంగించును. మా స్తోత్రములు నీకు హర్షము కలిగించును.

    9. సోమమున సమస్త పౌరుషములు కలవు. అది యజ్ఞమున బహు సంఖ్యాకముగ ప్రవర్తించును. అట్టి సోమరూపమగు ఆహారమును ఇంద్రుడు రక్షించునుగాత.

    10. ఇంద్రా ! నీవు స్తవనీయుడవు. మా శత్రువును తొలగించ సమర్థుడవు. వారు మాకు ఎట్టి హాని కలుగజేయకుండునట్లు కాపాడుము.

                     ఆరవ సూక్తము-ఋషి-వైశ్వామిత్ర మధుచ్ఛందుడు,
                       దేవతలు 1,2,3,10 ఇంద్రుడు, 4,6,8,9 మరుత్తులు
                       5,7 మరుత్తులు - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రుడు సూర్యరూపమున ఉన్నాడు. అగ్నిరూపమున ఉన్నాడు. వాయురూపమున ఉన్నాడు. అట్టి ఇంద్రుని సమస్తప్రాణులు సమస్తకార్యములకు స్తుతించుచున్నారు. రోచన్తేరోచనాదివి ఇంద్రుడే ఆకాశమున నక్షత్ర రూపము దాల్చినాడు.

    2. ఇంద్రుని రథపు అశ్వములు ఎర్రనివి. శత్రువును జయించునవి. నరులను వహించునవి. హరి అనుపేర్లుగలవి. వానిని ఇంద్రుని రథమునకు కట్టుదురు.

    3. ఇంద్రునిది ఆదిత్యరూపము. అతడు వేడికిరణములతో ఉదయించును. అతడు జ్ఞానహీనులకు జ్ఞానమును, రూప హీనులకు రూపమును ప్రసాదించును.

    4. మరుత్తులు ఇంద్ర రూపులు. వారిది యజ్ఞార్హమగు నామము. వర్షకాలము గడచిపోవును. అప్పుడు వారు మరల జలమును గర్భమున పునః ఏరిరే మరల దాల్తురు.

    5. మరుత్తులు దృడము, దుర్గమములయిన వానిని సహితము భేదించగలరు. వహించగలరు. అట్టి మరుత్తుల యుక్తుడయి ఇంద్రుడు గోవులను విడిపించినాడు.

    6. ఋత్విజులు దేవత్వము కోరుచు ఇంద్రుని స్తుతింతురు. మరుత్తులు ధనవంతులు. విఖ్యాతులు. ప్రౌఢులు. ఋత్విజులు మరుత్తులను ఇంద్రుని వలెనే స్తుతింతురు.

    7. భయరహితుడగు ఇంద్రునితో మరుత్తులు కూడును. అప్పుడు ఉభయులు సమానకాంతి గలిగి నిత్య సంతోషమున ప్రకాశింతురు. ప్రత్యక్షమగుదురు.

    8. మరుత్తులు ఆకాశమున వ్యాపించి ఉన్నారు. వారిని అర్థించవచ్చును. వారు ఇంద్ర సహితులయి బలవంతులు కావలెను. అదికోరి దోషరహితమయిన యజ్ఞము చేయుచున్నాము.

    9. మరుత్తులు సర్వత్ర సంచరించుచున్నారు. ఈ యజ్ఞమున ఋత్విజులు మరుత్తులను స్తుతించుచున్నారు. మీరు దివి నుండి గాని, ఆదిత్య లోకము నుండిగాని ఆగాహి విచ్చేయుడు.

    10. ఇంద్రుడు కంటికి కనిపించు భూలోకమునుండిగాని, దివోలోకమునుండిగాని, రజోలో- కమునుండిగాని రావచ్చును. అట్టి ఇంద్రుని ధనము ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఇంద్రం పాతిం అధి ఈమహే

    ఆలోచనామృతము :

    1. ఇంతకుముందు ప్రకృతిశక్తులను దేవతారూపమున వేరువేరుగా భావించుట, స్తుతించుట, అర్థించుట జరిగినది. ఇచ్చట అన్వేషణము ఒక ప్రధాన మలుపు తిరిగినది.

    ఒకే ఇంద్రుని సూర్య, అగ్ని, వాయు రూపముగల వానిగా వచించినాడు. ఒక కేంద్ర ఆధిపత్య కల్పనకు ఇది ఒక ప్రయత్నము. ఇంద్రుని సూర్యునిగా వచించినాడు. కాని మరుత్తులను స్వతంత్రులుగా చెప్పినాడు. గోవులను సాధించుటకు ఇంద్రుడు మరుత్తుల సాయము తీసుకున్నాడు. ఇంద్రుని, మరుత్తులను సమాన తేజస్సుగలవారిగా వచించినాడు.

    2. మరుత్తులు: వీరు ఒక్కరుకారు. పలువురు. వీరిది బహువచనము.

    మరుత్తులు రుద్రుని పుత్రులు. స్ఫురద్రూపులు. బలవంతులు, పాపరహితులు, శత్రుంజయులు, పావకులు, వీరు ఆభరణములు దాల్తురు. ఆయుధము-గదాయుధము భుజముపై ధరింతురు. వీరు నిర్భయముగా, నిరాటంకముగ ఆకసమున విహరింతురు.

    మరుత్తులు యుద్ధవీరులు, మానవులయెడ ఉదారులు, ధనవంతులు, ధనదులు. వీరు మేఘముల వాహనములపై పయనింతురు. ప్రాణప్రదమయిన వర్షమును నేలకు తెత్తురు.

    మరుత్తులు ఇంద్రునకు ప్రధాన మిత్రులు. వారు ఇంద్రుని విడువరు. విడిచి ఉండరు. సమస్త దేవతలు ఇంద్రుని విడిచినారు. కాని మరుత్తులు అతని పక్షముననే నిలిచినారు.

    3. మేఘము మరుద్రూపమని వేదము కనుగొన్నది. 4వ మంత్రమున వర్షము గడిచిన వెనుక మరుత్తులు పునర్గర్భత్వమేరిరే మరల గర్భము దాల్చినవి అని చెప్పబడినది. అనగా మరల నీటిని ధరించినవి. ఎండకాలమున నీటిని ధరించిన మేఘములు వర్షకాలమున వర్షించుట నిత్య సత్యము.

    4. 5వ మంత్రమును గురించి కొంత వివరణ అవసరమయి ఉన్నది. ఇది పునరావృతమగు- చుండును. ఇంద్రుని గురించి శాయనాచార్యులు ఒక వృత్తాంతము చెప్పినాడు.

    దస్యులు, దొంగలు. దేవతల గోవులను దొంగిలించినారు. వాటిని దుర్గమమగు గుహలో ఉంచినారు. వాటిని విడిపించుటకు ఇంద్రుడు ఎంతో ప్రయత్నము చేసినాడు. సాధ్యపడలేదు.

    ఇంద్రుడు అప్పుడు మరుత్తులను వెంట తీసుకున్నాడు. మరుత్తుల సాయమున గోవులను విడిపించినాడు.

    గోవులను సూర్యకిరణముగా సహితము చెప్పవచ్చును. సూర్యరూపముగల ఇంద్రునకు మేఘములు అడ్డము వచ్చినవి. మరుత్తుల సాయమున ఇంద్రుడు మేఘములను పారద్రోలినాడు. కాంతులు పరచినాడు.

    ఆత్మకు మాయ కమ్మినది. జ్ఞాన కిరణములచే మాయ విడిపోయినది. ఆత్మ వెలిగినది. ఇది కూడ కావచ్చును.

  ఏడవ సూక్తము - ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, దేవత - ఇంద్రుడు. ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రుని గాయకులగు ఉద్గాతలు సామ మంత్రముల స్తుతించినారు. హోతలు ఋగ్వేద మంత్రముల స్తుతించినారు. అధ్వర్యులు యజుర్వేద మంత్రముల స్తుతించినారు.

    2. ఇంద్రుడు వజ్రవంతుడు. స్వర్ణవంతుడు. కాంతివంతుడు. ఇంద్రుని మాటమాత్రమున అతని హర్యశ్వములు రథమున పూనును. (ఇంద్రుని అశ్వములు అంతటి సుశిక్షితములు)

    3. ఇంద్రుడే దర్శనీయుడయిన సూర్యుని ఆకసమున నిలిపినాడు. సూర్యకిరణములతో పర్వతము మున్నగు సమస్త వస్తువులను ప్రకాశింపచేసినాడు.

    4. ఇంద్రా ! నీవు ఉగ్రుడవు. నీ రక్షణ భద్రమయినది. మమ్ములను సాధారణ యుద్ధములందును, అసామాన్య యుద్ధములందురు రక్షింపుము.

    5. ఇంద్రుడు వజ్రము ధరించును. యుద్ధమందు నీకు సాయము చేయును. అందువల్ల అల్పధనము కొఱకును అనల్పధనము కొఱకును ఇంద్రుని ఆహ్వానింతుము.

    6. ఇంద్రుడు మా అభీష్టములను తీర్చును. మాకు వర్షము ప్రసాదించును. అట్టి ఇంద్రా ! మేఘములను పారద్రోలుము. (వెలుగును ప్రసాదించుము)

    7. అన్యదేవతలను స్తుతించుటకు స్తవములు ఉన్నవి. అవి ఇంద్రునకు చాలవు. అతడు వజ్రధరుడు.

    8. గంభీరముగా నడుచు ఆబోతు ఆలమందను చేరును. సమర్థుడు, వరదుడు, ఇంద్రుడు. అతడు వర్ష సహితుడయి మానవులను చేరును.

    9. ఇంద్రుడు ఒక్కడే నరులకు, ధనములకు అధిపతి. అయిదు లోకములకు ఇంద్రుడే అధిపతి. ఇంద్రః పంచక్షితీనామ్

    10. ఋత్విజులు ఇంద్రుని విశ్వమంతటి కొఱకు ప్రార్ధింతురు. కాని ఇంద్రుడు మాకు మాత్రమే చెందవలెను. అస్మాకమస్తు కేవలః

                     (ప్రథమ మండలమున రెండవ అనువాకము సమాప్తము.)

                       మూడవ అనువాకము - ఎనిమిదవ సూక్తము
        ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.


    1. ధనము వలన శత్రువులను సహించవచ్చును. జయించవచ్చును. ఇంద్రా ! అట్టి ధర్మధనమును మా రక్షణ కొఱకు గోనిరమ్ము.

    2. ఇంద్రా ! నీవు మాకు రక్షకుడవు. యుద్ధమున పదాతుల పిడికిటిపోట్లనుండి, అశ్వములబారినుండి రక్షించుకొనుటకు తగిన ధనమును ప్రసాదించుము.

    3. ఇంద్రా ! నీవు మాకు రక్షకుడవు. నీ వజ్రము ఘనమైనది. దానిని మేము తీసుకొనుచున్నాము. వజ్రమున యుద్ధములందు శత్రువులను జయింతుము.

    4. శూరులు, ఆయుధపాణులు అయిన భటులు మాతో ఉందురు. నీవు సహితము మాతో కూడుము. అప్పుడు మేము సేవా సహితులయిన శత్రువులను ఓడించగలము.

    5. ఇంద్రుడు గొప్పదేహము కలవాడు. గొప్పగుణవంతుడు. వజ్రసహితుడయిన ఇంద్రుడు మరింత మహిమాన్వితుడు అగును. అతని బలము ఆకసమంత విస్తరించును.

    6. కొందరు ఇంద్రుని యుద్ధములందు సాయము అర్థింతురు. కొందరు సంతానము కోరుదురు. విప్రులు జ్ఞానము కొఱకు ప్రార్థింతురు. విప్రాసోవాధియాయవః

    7. సముద్రము వంటి ముఖమున దవడల మధ్య ఉన్న నాలుకతో సోమపానము చేయుటవలన ఉదరము ఉబ్బినది.

    8. ఇంద్రుని వాక్కు యుద్ధములందు హెచ్చరించును. గోవులను ఇచ్చును. మహత్తుకలది. సత్యప్రియమైనది అగును. అట్టి ఇంద్రవాక్కు యజమానికి ఫలములు నిండిన కొమ్మవంటిది అగును. పక్వాశాఖానదాశుషే 

    9. ఇంద్రా ! నీకు ఉన్న అయిశ్వర్యములు, సంపదలు హవిస్సులు అందించువారికీ రక్షాకవచములు అగుచున్నవి.

    10. ఇంద్రుని స్తుతించు ఋగ్వేద, సామవేద మంత్రములు ఇంద్రుని సోమపానమునకే అయి ఉన్నవి. ఇంద్రాయ సోమపీతయే 

 Previous Page Next Page