"నీతో మాట్లాడాలి. అవసరం నాది. నేను రావటమే న్యాయంగదా" అన్నాడు.
"ఏ విషయం గురించి?"
"ఏదో చెప్పటానికి నోరు తెరిచిన మనోహర్ ఆగిపోయి కనుబొమ్మలు ఎగురవేసి "అలా లాబీలోకివెళ్ళి మాట్లాడుకుందాం" అన్నాడు.
దీ ఒకందుకు మంచిదే అనుకున్న రూపా మనోహర్ వెనుకే బయటకు నడిచింది.
తెరిచి వున్న బాత్ రూమ్ తలుపు వెనుక వున్న గిరీష్ ఊపిరిపీల్చుకున్నాడు.
"నీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోను ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేస్తే"
"ష్యూర్......ష్యూర్......మనోహర్ జీ"
"వృత్తిరీత్యా నీదగ్గరకు ఎంతోమంది వస్తుంటారు. నువ్వు ఎంతో మంది దగ్గరకు వెళుతుంటావ్. పొరపాటున వారిదగ్గర నోరుజారితే నన్ను, నా వృత్తిని నాశనం చేసిన దానవు అవుతావు."
"లేదు. నా వ్యక్తిగత బలహీనతలకు లొంగి మీకిచ్చిన మాట తప్పను. మీరంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. మీరు క్షేమంగా ఉంటేనే నాలాంటి మోడల్స్ బ్రతికేది. మీరు నన్ను పూర్తిగా విశ్వసించవచ్చు. చెప్పండి."
రూపా మాటల్లో నిజాయితీ ఉందనిపించింది మనోహర్ కు.
"నీవు ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చేముందే నీకు ఫోన్ చేశాను గుర్తుందా?" రూపాతో మాట్లాడుతూనే నలువైపులా జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
"అవునవును. మా చెల్లెలు సోఫియా గురించి అడిగారు. కాని దాన్ని నాలాగే మోడలింగ్ లోకి దింపాలకోవటంలేదు. సంసారపక్షంగా పెళ్ళిచేసి పంపాలనుకుంటున్నాను. అందుకే ఈ మధ్య వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకొని త్వరగా పూర్తి చేస్తున్నాను.
ఆమె ధోరణికి విస్తుపోయాడు, ఫోన్ లో మాట్లాడినప్పుడు ఒప్పుకుంది. ఇప్పుడు కాదంటుంది. ఇది వ్యాపార లౌక్యం కాదుకదా!
బిజినెస్ నే డెవలప్ చేసే బిజినెస్ మోడలింగ్. కానుక లౌక్యం దానంతటదే వస్తుంది.
ఇప్పుడు రూపా మొండికేస్తే తన ప్రాజెక్టు గతి? సోఫియా స్టిల్స్ తో ఫైల్ కోరమాండల్ కంపెనీకి వెళ్ళిపోయింది. పూర్తి అంగీకారంతోపాటు కాంట్రాక్టు పై సైన్ తీసుకోకుండా సోఫియాను మోడల్ గా పెట్టుకోవటం తన పొరపాటు. ఎలాగైనా రూపాను వప్పించాలి. లేకుంటే తను వేసుకున్న పథకం తల్లక్రిందులైపోతుంది.
"నీ చేతిలో ఇప్పుడెన్ని ఆఫర్లు ఉన్నాయి?"
"దాదాపు ఆరు"
"ఒక్కొక్కదానికి ఎంత తీసుకుంటున్నావ్?"
"పదివేలు దాకా"
"అంటే అరవైవేలు వస్తాయి. నీ చెల్లె పెళ్ళి చేయటానికి ఎంత డబ్బు కావాలి?"
"దాదాపు లక్ష"
"మరి మిగతా నలభై వేలు?"
"అదే ఆలోచిస్తున్నాను."
ఆశ్చర్యపోయాడు మనోహర్.
"వస్తున్న డబ్బంతా ఏం చేస్తున్నావ్?"
ఇబ్బందిగా ముఖం పెట్టింది.
అర్థమైంది మనోహర్ కి. అవకాశంకూడా చిక్కింది. రిచ్ లైఫ్ కి అలవాటు పడిన మోడల్స్ వచ్చింది వచ్చినట్లు తగలేస్తారు. ఒంట్లో అందం, ఆకర్షణ తగ్గాక వెనక్కు తిరిగి చూసుకుంటే ఏం మిగలదు. కాని తాముమాత్రం తమ అందాలతో కోట్లు ఆర్జించి పెడతారు కంపెనీలకు.
"మిగతా నలభై వేల గురించి నువ్వేం వర్రీ కానక్కర్లేదు. ఒక్క సారే యాభై వేలిస్తాను, ఒకేఒక్క ఫిల్మ్ లో నీ చెల్లెల్ని యాక్టుచేయిస్తే"
దెబ్బతిన్నట్లుగా చూసింది రూపా.
"అయామ్ మనోహర్ జీ. నేను డబ్బు మనిషినికాను. ముఖ్యంగా మీ దగ్గర నేను నా తల్లిదండ్రులకు కూడా ఇవ్వనంత గౌరవం ఇస్తాను మీకు....."మాటలు మింగేసింది రూపా ఆపైన మాట్లాడలేక.
"అయామ్ సారీ రూపా. కాని నా పరిస్థితి పెద్ద ఇరకాటంలో పడుతుంది నువ్వు ఒప్పుకోకపోతే. క్లయింట్స్ నా మీద కేసుకూడా పెట్టవచ్చు. నీ చెల్లులుతో యాడ్ ఫిల్మ్ తీస్తానని యాక్సెస్టన్స్ మీద సంతకం కూడా చేశాను......నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు అయామ్ సారీ.....కానీ....."
నో.....నో....మీరు సారిచెప్పొద్దు. ఎందుకంటే మా మోడల్స్ లో సగానికి పైగా డబ్బుకోసమే కక్కుర్తి పడతారు కానుక నన్ను అలాగే ఊహించి ఉంటారు.
భోగలాలసకు అలవాటుపడే మోడల్స్, సినిమా స్టార్స్ డబ్బును బాగా ప్రేమిస్తారు___మనుష్యులకన్నా, అదిచ్చే సుఖాలకోసం. కానీ నేను మాత్రం సిన్సియర్ గానే నా చెల్లి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. తద్వారా నన్నా నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని. నా ముసలి తల్లి దండ్రులకు, చెల్లెలికి నేనే ఆధారం. ఏ కొద్దిమందో తప్ప మిగతా మోడల్స్ తెలియక మొదట్లో, తెలిసినా తప్పక తరువాత, తెలియకపోయినా, తెలిసినా అలవాటు పడి తరువాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇక అందులోంచి బయటకు రాలేరు. గ్లామరస్ అంటే గ్లిట్టరింగ్ మోడల్ వరల్డ్ అనే దీపం చుట్టూ పురుగుల్లా మారిపోతారు. దాని చుట్టూ పరిభ్రమించి, పరిభ్రమించి అందులోనే మాడిమసైపోతారు. ఒక్క ఫిల్మ్ లోచేసి ఆగగలుగుతుందా నా చెల్లి? అలవాటు పడి, భ్రమలకు లోనై నాలా అవుతుందా? ఇదే నా భయం....."
హిపోక్రసీ లేకుండా ఎంత నిర్భయంగా చెప్పగలుగుతోంది. తమలోని లోపాల్ని, బలహీనతల్ని!
"ఓకే......మీ కోసం ఒకే ఒక్కఫిల్మ్ కి మా చెల్లెల్ని మీ మోడల్ గా అంగీకరిస్తాను. అది మీమీద నాకున్న రెస్పెక్టు కోసం."
"థాంక్స్ . నాలుగు ఫిల్మ్స్ తీస్తాను. అన్ని విధాలుగా నీ చెల్లెలికి ప్రొటెక్షన్ ఇస్తాను."
"మీ మీద నాకా నమ్మకం ఉంది."
"అయితే ఆ తరువాత ఆమె మరే విధంగాను మోడలింగ్ చేయకూడదు......"
ఆశ్చర్యపోయింది రూపా.
"లిరిల్ మోడల్ కారెన్ లూనెల్ లాగా అన్నమాట!"
"అవును."
"మీ కోసమే వప్పుకుంటున్నానుగాని, మోడల్ గా కొనసాగించటానికి కాదు."
"అయితే శ్రద్ధగా విను. నేనేక్షణం కబురుచేస్తే ఆ క్షణం కావాలి. పదిరోజులు చాలు. ఈ విషయం నీవుగాని, ఆమెగాని మూడో కంటికి తెలియనివ్వకూడదు. ఇది చాలా ముఖ్యం? పైపెచ్చు ఇది తెలిస్తే మీకు నాకు ప్రమాదమే. రహస్యంగా నేను రమ్మన్న లోకేషన్స్ కి వచ్చి, రహస్యంగానే వెళ్ళిపోవాలి. నీ వర్క్ రేపు పూర్తవుతుంది. రేపు ఇక్కడి నుండి బొంబాయి వెళతానన్నావ్ గనుక ప్లయిట్ లో టిక్కెట్ బుక్ చేయించాను. బొంబాయిలో నీ కొత్త ఎస్సైన్ మెంట్స్ పూర్తిచేసుకొని ఢిల్లీ వెళ్ళటానికి వారం పట్టవచ్చు. ఇప్పుడు ప్రతి నిమిషం నాకు చాలా విలువైంది కానుక నీ చెల్లెల్ని ఒప్పించేందుకు ఈ రాత్రే ఫోన్ చేయి ఢిల్లీ కి. నీవు ఢిల్లీ వచ్చేలోపు సాధ్యమైనన్ని యాడ్ ఫిల్మ్స్, యాడ్ మేగజైన్స్ చూడమను, వాటిని బాగా స్టడీ చేయమను. నీవు ఢిల్లీ వెళ్ళేసరికి ఆమెకు మోడలింగ్ లో బాగా తర్ఫీదివ్వు. ముఖ్యంగా స్విమ్మింగ్, బాతింగ్, స్విమ్మింగ్ పూల్ లోకి డైవ్ చేయటం లాంటివి. బికినీ డ్రస్ వేసుకోవటం నేర్పు. ఆ డ్రస్ లో ఫ్రీగా మూవ్ అయ్యేలా చూడు. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్స్ లో ఈజ్ బాగా రావాలి" ఆగాడు ఓ క్షణం. రూపా వింటోందో లేదోనని పరిశీలనగా చూశాడు.
"హేట్సాఫ్ టు యువర్ ప్రికాషన్స్ మనోహర్ జీ....నేను చాలా మంది పోటోగ్రాఫర్స్ తో కలిసి వర్క్ చేశాను. కాని మీలో కనిపించే శ్రద్ధ ఏమాత్రం వారిలో మచ్చుకైనా కనిపించదు. అందుకే మీ ప్రతి కేంపైన్ సక్సెస్......"
ఆమె కాంప్లిమెంటుకి కొద్దిగా ఇబ్బందిపడ్డాడు మనోహర్.
"దేనిమీద తీస్తున్నారు. సోప్ మీదా? షాంపోమీదా?" అడిగింది రూపా.
మాట్లాడవద్దని ఆమెకు సైగచేశాడు. రూపా ప్రక్కరూమ్ తలుపు కదులుతున్నట్టనిపించింది మనోహర్ కి. స్ప్రింగ్ డోర్ ఊగేందుకుఅవకాశం లేదు. తలుపు తెరుచుకొని లోనికివెళ్ళగానే దానంతట అదే స్ప్రింగ్ ఏక్షన్ వలన మూసుకుపోతుంది. ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ కి అలాటి తలుపుల్ని ఫిక్స్ చేస్తారు.
కొద్దిగా తెరిచినట్లు వుండే అవకాశంలేదు. పైగా ఊగదు.
డోర్ పూర్తిగా మూసుకుంటే లాబీలో మాట్లాడే మాటలు వినపడవు. ఆ తలుపు వైపు అడుగువేస్తూనే తల త్రిప్పి రూపాకి సైగ చేశాడు.
అతని భావాన్ని పసిగట్టిన రూపా మనోహర్ ఎదురుగా ఉన్నట్లుగానే భావించుకొని మాట్లాడటం మొదలెట్టింది.
ఇదంతా కొన్ని సెకన్లలో జరిగింది.
మనోహర్ ఆ తలుపు దగ్గరకు నడిచి, గుండెలనిండా ఊపిరి పీల్చుకొని డోర్ హేండిల్ మీద చేయివేసి బలంగా తోచాడు. ఎవరూ కనిపించలేదు. బహుశా డోర్ వెనుక వుండి వుండాలి. క్రింద చూశాడు. మోర్ బ్రాండ్ సిగరెట పీకలు నలుగు కనిపించాయి. ఒక్కొక్కటి త్రాగటానికి రెండు నిముషాలు పట్టినా, ఎనిమిది నిముషాల నుంచి డోర్ కొద్దిగా తెరిచి ఉందన్నమాట. అంతకు ముందు పొదలో కనిపించిన మోర్ సిగరెట్ పీకలే ఇక్కడా.....!
మనోహర్ గిరుక్కున వెనక్కు తిరిగి రూపా దగ్గరకు వచ్చి చెప్పిన విషయాలు గుర్తుంచుకో. తలుపులు జాగ్రత్తగా వేసుకొని పడుకో. వీలైతే బాత్ రూంలో వున్న నీ బాయ్ ఫ్రండ్ ని రాత్రికి ఉంచుకో నీ భద్రతకు. ఫో న్ మాత్రం అతని ముందు చేయకు" అంటూ గబగబా వెళ్ళి పోయాడు మనోహర్.
రూపా ఉలిక్కిపడింది. అంటే గిరిష్ ని మనోహర్ చూశాడా? ఎలా సాధ్యం? మనోహర్ రూమ్ లో ఉన్నది కొద్ది సెకండ్లు మాత్రమే.
తమ వ్యవహారం మనోహర్ కి తెలిసిందన్న భయంకన్నా, అంతసునిశితంగా ఎలా పసిగట్టాడన్న ఆలోచనే భయం కల్గించింది రూపాకు.
అంతలో గదిలో ఉన్న గిరీష్ గుర్తుకొచ్చాడు. మరలా ఆమెలో కోర్కెలు బుసలు కొట్టాయి. కాని చెల్లెలికి ఫోన్ చేయాల్సిన విషయం గుర్తుకొచ్చింది.
ప్రక్కగది తలుపు వెనుక వుంది ఎవరు? ఎందుకని అక్కడ కాపుకాశాడు? అదే సమయంలో అదే హొటల్ లో రెండో ఫ్లోర్ లో వున్న గీతా బెహల్ ప్రక్కగదిలో మరోమనిషి కాపుకాసి ఉన్నట్లు రాంభూపాల్ తో సుఖాలు పంచుకుంటున్న గీతాబెహెల్ కి తెలియదు.
మనోహర్ ఇంటికి వచ్చేసరికి పది అయింది. డ్రాయింగ్ రూమ్ లో కమలిని, మంగళ కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
కమలిని ఆ వేళప్పుడు తనింటికి రావటం ఆశ్చర్యం కలిగించింది మనోహర్ కు.
"హలో.....ఎప్పుడొచ్చారు......?"
"గంటకు పైగా అయింది. ఈ వేళప్పుడు వచ్చానేమిటా అని ఆశ్చర్యపోతుంటారు. అవునా?" ప్రశ్నించింది కమిలిని.
మనోహర్ మాట్లాడలేదు వారికి ఎదురుగా కూర్చున్నారు.
"ఇంటికి ఫోన్ చేశాను. మంగళ ఫోన్ ఎత్తి నీవు లేవని చెప్పింది.
మంగళ గురించి నీ నోటిద్వారా వినడమేగాని నేనెప్పుడూ చూడలేదుగదా. మా మనోహర్ కి భార్య కాబోయే అదృష్టవంతురాలు ఎలా వుంటుందో చూద్దామని వచ్చాను" అంది.