Previous Page Next Page 
మోడల్ పేజి 11


    "బావుందా.....?" అడిగాడు చిరునవ్వుతో మంగళవైపు ఓరగా చూస్తూ.

    "ఫైన్."

    "మొహమాటానికి అంటున్నారు. నల్లపిల్లగదా....."మంగళ పెదవుల మాటున చిరునవ్వు దాచుకుంది. మనోహర్ తనని నల్లపిల్ల అంటూ ఏడిపించడం సరదాగా, తమాషాగా వుంటుంది మంగళకు.

    "తెల్లగా, నాజూగ్గా, కృత్రిమంగా, పిండిబొమ్మల్లా ఉండే మోడల్ కంటే చాలా బావుంటుంది___నలుపైనా" అంది కమలిని మంగళవైపు అభిమానంగా చూస్తూ.

    "ఆకలి దంచేస్తోంది మంగళ, మీరుకూడా భోంచేయగూడదూ?" అడిగాడు కమలిని వైపు చూస్తూ.

    "మోడల్స్ కి ఆ అదృష్టం ఎక్కడుంది? మేం సాయంత్రాలు భోం చేయం. కావాలంటే మీతో కూచుంటాను."

    మంగళ లేచి డైనింగ్ టేబుల్ పై డిన్నర్ సిద్ధం చేసింది.

    మనోహర్, మంగళ భోంచేస్తున్నారు. కమలిని అక్కడే కూర్చుని రా క్యారెట్స్ తింటూ "నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి....."అంది.

    "మాట్లాడండి."

    "నీవిచ్చిన పేపర్ ప్రకటన చూశాను. అర్థంకాలేదు. ఎందుకిచ్చావ్."

    "ఎందుకంటే అందమైన ఫ్రెష్ మోడల్ కోసం.

    ఇంతకుముందు ప్రకటనలిచ్చే మోడల్స్ ని ఫికప్ చేశావా."

    "కాని....."ఆగాడు మనోహర్.

    మంగళ శ్రద్ధగా వింటోంది వాళ్ళ సంభాషణ.

    "రోమాకౌర్ అందగత్తె కాదా? రూపా చక్రవర్తి అందగత్తె కాదా?"

    "సందేహం ఎందుకు?"

    "వార్ని ఎలా పికప్ చేశావ్?"

    "జస్ట్ ఆన్ కన్ వెన్షనల్ పికప్."

    "అలంటప్పుడు ఇప్పుడైనా అలాగే పికప్ చేయలేవా? చేయగలవు నీకా టాలెంట్ వుంది. అయినా ప్రకటన ఇచ్చావ్. దానికి చాలా డబ్బు ఖర్చయి వుంటుంది. ఎందుకిచ్చాన్?"

    మనోహర్ ఏం చెబుతాడో విందామని మంగళకు కూడా ఆసక్తిగా వుంది. నిజానికి ఆ సందేహం తనూ తీర్చుకోవాలని అనుకుంది.

    మనోహర్ మాట్లాడకపోవడం గమనించి "రహస్యమా? నాక్కూడా చెప్పకూడదా? నన్ను నమ్మలేవా?" అడిగింది కమలిని.

    ఆ మాటకు మనోహర్ కొద్దిగా ఫీల్ అయ్యాడు.

    "నేను మనవృత్తిలో నమ్మేది నలుగుర్నే. మీరు, మధు, రాంభూపాల్, కిరణ్."

    "మరి చెప్పటానికేం? నాలుగురోజులుగా రాంభూపాల్, కిరణ్ కనిపించటంలేదు.

    రోమాకౌర్  ప్రదీప్ సక్సేనా యూనిట్ లో చేరిందని తెలిసింది.

    నీకు ప్రదీప్ కు గొడవలొచ్చాయని చాలామంది అనుకుంటున్నారు.

    నువ్వు కోరమాండల్ ఇండస్ట్రీస్ తో డైరెక్టు కాంట్రాక్టు పెట్టుకొని ప్రదీప్ ఏజన్సీని ఓవర్ లుక్ చేసి, యాడ్ ఫిల్మ్స్ తియ్యబోతున్నట్లు తెలిసింది.

    ఇవన్నీ తెలిశాక నాకెందుకో ఆందోళనగా వుంది.

    అసలేం జరిగింది, ఏం జరగబోతోంది?"

    కొత్త కొత్త విషయాలు కమలిద్వారా తెలియటంతో మంగళకు కూడా ఆందోళనగా వుంది. మనోహర్  వృత్తి గురించి అంతగా అవగాహన లేకపోయినా, జరుగుతున్న సంభాషణనుబట్టి మనోహర్ రిస్క్ లో పడినట్లు తోస్తోంది మంగళకు. అన్నింటికీమించి మనోహర్ దగ్గర కమలినికి అంత చనువు వుండటం ఆశ్చర్యం కలిగించింది మంగళకు.

    "చాలా విషయాలు తెల్సుకున్నారు" అన్నాడు మనోహర్  సాలోచనగా.

    "కొన్ని తెలిసాయి. కొన్ని తెలుసుకున్నాను. ఇంతకీ అసలేం జరిగింది......?"

    "మనోహర్ ఏదో చెప్పబోయేలోపు బజర్ మ్రోగింది.

    మనోహర్ లేవబోయాడు వచ్చిందెవరో చూసేందుకు.

    "నువ్వు కూర్చో! నేను చూసోస్తాను" అంటూ కమలిని ముందుగదిలోకి వచ్చి తలుపు తీసింది.

    ఎదురుగా గిరీష్ బ్రీఫ్ కేస్ తో నిలుచున్నాడు.

    కమలిని తమ బాస్  ఇచ్చే ప్రాముఖ్యం గుర్తున్న గిరీష్ "గుడ్ ఈవెనింగ్ మేడమ్. ఈరోజు షూట్ చేసిన ఫిల్మ్ రష్ కాఫీ తెచ్చాను లేబ్  నుంచి. మనోహర్  గార్ని పిలిస్తే ఇచ్చి వెళ్ళిపోతాను" అన్నాడు.

    "కూర్చో పిలుస్తాను." అంటూ లోనికివెళ్ళి గిరీష్ వచ్చిన విషయం మనోహర్ కి చెప్పింది.

    మనోహర్ ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత మెల్లగా తనలోతనే నవ్వుకున్నాడు.

    డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న గిరీష్ కి ఆ టైమ్ లో కమలిని అక్కడకు రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    మనోహర్ డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. ఆ వెనుకనే మంగళ, కమలిని వచ్చారు.

    మంగళని గుర్తు పట్టాడు గిరీష్.

    "గుడ్ ఈవెనింగ్ మేడమ్" అన్నాడు.

    మంగళ గిరీష్ విష్ చేసింది.

    "రష్ వచ్చిందా? అడిగాడు మనోహర్.

    "తెచ్చానుసార్."

    "వెరీగుడ్, అక్కడపెట్టి, మీరు నాతో రండి" అంటూ బయటకు నడిచాడు మనోహర్ . ఆ వెనుకే గిరీష్ బయటకు నడిచాడు. ఇంటిముందు లాన్ లో వేసుకున్న కుర్చీలో మనోహర్ కూర్చుని, గిరీష్ ని కూర్చోమన్నట్లుగా సైగ చేసాడు.

    "హొటల్ నుండి రూమ్ కెళ్ళి షూస్ మార్చుకుని లేబ్ కెళ్ళి వస్తున్నారన్నమాట" తాపీగా అన్నాడు మనోహర్.

    ఖంగుతిన్నాడు ఆ మాటలకు గిరీష్. ఏ వస్తువైనా, మనిషయినా మనోహర్ దృష్టిలో ఒక్కసారి పడితేచాలు తన ఫోటోగ్రాఫిక్ మెమొరీలో నిక్షిప్తం చేసుకుంటాడు.

    బాత్ రూమ్ తలుపు క్రిందనుంచి తన షూస్ చూసుకుంటాడు. తనే షూస్ వాడుకుంటాడో గుర్తుపెట్టుకోవటంవల్ల ఈ ప్రమాదం జరుగుంటుంది. గిరీష్ పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు.

    "ప్రతి వృత్తిలోనూ కొన్ని ఎథిక్స్ వుంటాయి. అలాగే మన వృత్తిలోనూ వుంటాయి. అవునా?"

    గిరీష్ కి ముళ్ళమీద కూర్చున్నట్లుగా వుంది.

    "వాటిని అతిక్రమించకూడదని నిన్ను చేర్చుకున్నప్పుడే చెప్పాను. బాస్ గా  ఇప్పుడు  బెదిరించటంలేదు.

    మనకు తరచూ అద్భుతమైన అందగత్తెలు తారసపడుతుంటారు.

    బలహీనతకు లోనయ్యామా మనల్ని ఎవరూ రక్షించలేడు.

    మనలో వీక్ నెస్  వీసం మాత్రం ఉంటేచాలు, ఎలాగోలా దాన్ని పైకి లాగేందుకు ప్రయత్నిస్తారు మోడల్స్. తమ అందంతో, అవయవాల ఆకర్షణతో మనల్ని వారి గుప్పెట్లోకి తీసుకుంటారు. ఇక అప్పటినుండి మనల్ని డామినేట్ చెయ్యటం ఆరంభిస్తారు.

    తమమీదనే ఎక్కువ షాట్స్ తీయమంటారు. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వమంటారు. తమ డేట్స్ తామే నిర్ణయించుకుంటారు. ప్రతి ఫిల్మ్ లో తమనే మెయిన్ మోడల్ గా  తీసుకోమంటారు. కష్టపడి వర్క్ చేయరు. ఏ షాట ఓకే చేయాలో కూడా వారే చెబుతారు. వీటిని కాదనలేం. ఎందుకంటే రాత్రుళ్ళు స్వర్గానికి దగరగా తీసికెళతారు. గనుక, రాత్రిళ్ళు సుఖానికి బానిసలం. పగలు రాత్రుల సుఖాలకు, ఆ సుఖాల తాలూకు మనుష్యులకు , ఆ స్మృతులకు బానిసలం అవుతాం.

    వీటిని మనం ఆపలేం. దాంతో మన క్రియేటివిటీ పడిపోతుంది. మన క్లాయింట్స్ ఆశించే క్వాలిటీ తీసుకురాలేం. వీటన్నింటికిమించి మనమంటే మోడల్స్ కు భయభక్తులుండవు. దాంతో మన వెనుక మన  గురించి చెడుగా ప్రచారం చేస్తారు.

    మనం చెప్పినట్లు చేయవల్సిన మోడల్స్ మనల్ని డిమాండ్ చేసి చేయించుకుంటారు" మనోహర్ సౌమ్యంగా హెచ్చరిస్తున్నా  మాటల్లో కరుకుదనం స్పష్టమవుతోంది. తన వృత్తిపట్ల, ఆ వృత్తి వెర్రితలలు వేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్సు గురించి మనోహర్ అంత నిర్దుష్టమైన  ఆలోచనలున్నట్లు ఖచ్చితమైన అభిప్రాయాలున్నట్లు ఈరోజే గ్రహించాడు గిరీష్.

    తల వంచుకొనివింటున్నాడు గిరీష్.

    "గిల్టీగా ఫీలవ్వకు. ఇలాంటివి ఇకముందు జరక్కుండా చూసుకో.

    భవిష్యత్ లో నువ్వు మంచి ఫోటోగ్రాఫర్ అవుతావనే నానమ్మకం.

    ఇలాంటి పనులుచేసి నీ భవిష్యత్ నాశనం చేసుకోకు.

    నీ బాస్ గా  నీకు చెడ్డపేరు తేవద్దు. ఇలాంటి పనులు ఏ కొద్దిమంది చేసినా యాడ్ ఫోటో గ్రఫీ వృత్తికే చెడ్డ పేరొస్తుంది. ఈసారికి మందలింపుతోనే వదిలేస్తున్నాను మరో విషయం. ఇకముందు నా ఫిల్మ్ లో రూపా చక్రవర్తిని తీసుకోబోవటంలేదు. నీకు తెలుసు నేనొక నిర్ణయం తీసుకుంటే డానికి తిరుగుండదని. పూర్ గర్ల్.....నీ వలన తను  నష్టపోతోంది నౌ.....యూ కెన్ గో ....." అన్నాడు స్థిరంగా.

    గిరీష్ లేచాడు.

    "సారీ సర్" అన్నాడు బాధగా.

    "ఇట్సాల్ రైట్! రేపటి అరెంజ్ మెంట్స్ చూడండి. రేపటితో బ్యాలన్స్  వర్కంతా అయిపోవాలి. ఎల్లుండి నుంచి కొత్త ప్రాజెక్టు వర్క్స్ మొదలు కావాలి" అని లేచాడు మనోహర్.

    గిరీష్ మనోహర్  కి గుడ్ నైట్ చెప్పి కదిలాడు. తప్పుచేస్తూ, చిక్క గూడని వారికే చిక్కిపోవటం అంత అవమానకరమైన  విషయం మరొకటి లేదు. గిల్టీనెస్ గుండెల్ని కోస్తున్నట్లుగా ఫీలయ్యాడు గిరీష్ తప్పుచేయబోయింది ఇద్దరం. శిక్ష పడింది ఆమెకు. అని ఓ క్షణం  ఆమెపై జాలిపడ్డా, ఫీల్ అవుతున్న అవమానం అంతన్నా పెద్ద శిక్షగా చప్పున గ్రహించాడు.

    తను చేయబోయిన తప్పు తాలూకు భావాలు ఓ ప్రక్క గుండెనిమెలిపెడుతున్నా, మరోప్రక్క మనోహర్ వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాల్ని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు. అంతలోనే గిరీష్ ఆలోచనలు మరో  వైపు మళ్ళాయి. ఆ టైమ్ లో బాస్ రూపా  దగ్గరకు ఎందుకొచ్చాడు? రూపాతో ఏం మాట్లాడాడు? ఎంత ఆలోచించినా తోచలేదు గిరీష్ కి రూపాని అడిగితే సమాధానం చెప్పకుండా దాటవేసింది. ఇందులో ఏదో రహస్యం వుంది......ఇలా ఆలోచిస్తూనే రూమ్ కెళ్ళిపోయాడు-మరలా రూపా దగ్గరకు వెళ్ళాలని వున్నప్పటికి.

    మనోహర్ లోపలి రాగానే అడిగింది కమలిని. "గిరీష్ వెళ్ళిపోయాడా?"

    "ఆ.....వెళ్ళిపోయాడు. రష్ చూద్దాం పదండి" అంటూ గిరీష్ లేబ్ నుంచి తెచ్చిన రష్ ఫిల్మ్ వున్న బ్రీఫ్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు.

    అంతలోనే ఆగి "పదకొండు కావస్తోంది. మీకు లేట్ అవుతుందేమో" అన్నాడు  కమలినివైపు చూసి.

    "నో ప్రాబ్లమ్.....కారుందిగా వెళ్ళిపోగలను. రష్ చూస్తాను ఎలా  వచ్చిందో" అంటూ లేచింది కమలిని. ముగ్గురూ ప్రాజెక్టింగ్ రూమ్ లోకి నడిచారు.

    మనోహర్ బ్రీఫ్ కేసులోంచి ఫిల్మ్ తీసి ప్రొజెక్టర్ వీల్స్ లో ఫిక్స్ చేసాడు. కమలిని, మంగళ సోఫాలో కూర్చున్నారు. "చూద్దామా?" అన్నాడు ఇద్దరివేపు చూస్తూ మనోహర్.

    "అవును.....అసలు విషయం చెప్పలేదు......!" మరలా అడిగింది కమలిని.

    "మీ దృష్టి ఆ విషయాలమీదే వున్నట్లుంది. చెబుతాను. ముందు రష్ చూద్దాం. ఇందులో ఒక గమ్మత్తు చూపిస్తాను మీకు" అంటూ గదిలో లైట్ ఆర్పేసి ప్రొజెక్టర్ ఆన్ చేశాడు.

 Previous Page Next Page