Read more!
Next Page 
మరణ మృదంగం పేజి 1

                                 


                            మరణ మృదంగం


                                      -యండమూరి వీరేంద్రనాథ్.



    కరెంట్ లేదు. హరికెన్ లాంతరు వత్తి చివర మంట మినుక్కు మినుక్కుమంటూ వెలుగుతూంది.

    ముందు పుస్తకమైతే వుందిగానీ, ఉత్పలమాల ఆలోచన్లు ఎక్కడో వున్నాయి. గెడ్డం క్రింద చెయ్యి ఆన్చుకుని ఆమె దీపంకేసి చూస్తూంది.

    రాత్రి పదకొండు దాటింది. అందరూ నిద్రపోతున్నారు. ఆ గదిలోనే జంపఖానా మీద తమ్ముడు, చిన్నచెల్లి చంపకమాల పడుకుని వున్నారు.


    ఆమె తండ్రి విశ్వేశ్వర శాస్త్రి పండితుడు. కవిబ్రహ్మ. వచ్చిన అక్షరం తిరిగి రాకుండా, ఆశువుగా, లక్షణమైన సీసం చెప్పగలడని ప్రతీతి. ఆయన నిగర్వి. విశ్వనాథ వారి అనుంగు శిష్యుడు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారికి ఏకలవ్యుడు. ఆయన క్లాసులో పాఠం చేపుతూవుంటే సరస్వతీదేవి గుమ్మంలో నిల్చుని వినేదని సహధ్యాపకుల ఉత్ప్రేక్ష.

    ఆయన సరస్వతిని శాసించగల కుబేరుడు. పార్వతీ నామధేయురాలి పతిదేవుడు. లక్ష్మి విషయంలో మాత్రం కుచేలుడు. తెలిసిన వాడెవడూ గవర్నరు కాకపోవడంతో ఏ రాష్ట్రపు యూనివర్సిటీ ఆయన్ను పిలిచి డాక్టరేట్ ఇవ్వలేదు. స్వకులం వాడు ముఖ్యమంత్రి కాకపోవటంతో ఏ యూనివర్సిటికీ ఆయన ముఖ్యాధికారి కాలేకపోయాడు.

    ప్రతిభ కలవారు మూడు రకాలు!

    తమ కళని తామే ఆస్వాదిస్తూ, ఆ కళామృతపానంలో అద్వైత సిద్ధికి చేరుకునే వేదాంతులు. ఆమని ఎందుకు వస్తుందో, కోయిల ఎందుకు గానం చేస్తుందో, వీరు అందుకే కళని రవళింప చేస్తారు. వీరు ఉత్తములు.

    రెండోవారు కళా వ్యాపారులు. ప్రజల నాడి తెలిసిన వారు. తమ ప్రతిభని డబ్బు రూపంలో మార్చుకోవటం తప్పులేదని వాదిస్తారు. దానికి తగ్గట్టే అహర్నిశలు శ్రమిస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం కోరుకుంటారు. అందుకే వీరు  మధ్యములు.

    మూడో వారున్నారు. వీరు కూడా ప్రతిభా సంపన్నులే అయివుండవచ్చు. మనకి తెలీదు. ఎందుకంటే వీరేమీ చెయ్యరు. వీరి విలువ కేవలం ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది. ఉగాది ముందు కలం దులుపుతారు. సంక్రాంతి వరకూ నిద్రపోతారు. సాయంత్రాలు సాహితీ సమావేశాల్లో ఉత్తముల్ని పొగుడుతారు. మధ్యముల మీద  విరుచుకు పడతారు. ఈ ఆవేశం తగ్గటానికి రాత్రిళ్ళు  సురాపానాన్ని ఆశ్రయిస్తారు.

    ఉత్తమంలోంచి మాధ్యమంలోకి ఆయన్ను లాగటానికి ఆయన భార్య చేసిన ప్రయత్నాలు  ఫలించలేదు. "లక్ష్మి లేకపోతేనేం? సంతాన లక్ష్మి కరుణించిందిగా" అనేవాడు ఆయన.

    ఆయనకు నలుగురు కూతుళ్ళు.

    మాలిని, ద్విపద, ఉత్పల, చంపకమాల.

    ఒకడే కొడుకు.

    ప్రస్తుతం నిద్రలో వాడు "పులీ-పులీ" అని కలవరిస్తున్నాడు. వాడికి కరాటే ఆబ్సెషను. అప్పటివరకూ వాగానే వుంటాడు. ఉన్నట్టుండి ఒక చెయ్యి పిడికిలి బిగించి, మరో చెయ్యిగాలిలోకి సాచి "హ.....హ్హి...హ్హూ" అని కరాటే వీరుడిలా అరుస్తాడు. ఉత్పలకీ వాడికీ ఒక్క క్షణం పడదు. పడక పోవటం అంటే ఏమీ లేదు. వయోభేదం తక్కువ అవటం వల్ల ఆప్యాయత అల్లరిగా పరావర్తనం చెందటం.

    ప్రస్తుతం ఉత్పలమాల చేతిలో పుస్తకం వుంది. రేపే ఇంటర్వ్యూ.

    పండుగ రోజున పెట్టాడు డాక్టర్ హరనాథరావు ఇంటర్వ్యూ! అయనదంతా అదో రకమైన మనస్తత్వం. (ఈ ఇన్ఫర్మేషను తమ్ముడు తెచ్చాడు. హరనాథరావు మేనల్లుడి కొడుకూ, వీడూ ఒకటే టీమ్ లో క్రికెట్ ఆడతారు. ఆ విధంగా ఈ రహస్య సమాచారం సేకరించబడింది). హరనాథరావుకి పజిల్స్ పిచ్చివుంది (ట). ఆయన  రేపు ఇంటర్వ్యూలో రకరకాల పజిల్స్ మీద ప్రయోగం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. (ఇంతకీ ఆయనకి కావల్సింది నర్సుకన్నా తక్కువ స్థాయిలో ఒక అసిస్టెంటు.)

    అదిగో అప్పట్నుంచీ ఉత్పలమాల ఈ పజిల్స్  పుస్తకాలు, కాంపిటీషను సక్సెసూ, పెరల్మాన్ ఫిగర్స్ ఫర్ ఫన్నూ పట్టుక్కూర్చుంది.

    అయినా మనసక్కడ లేదు.

    రేపే పండగ!

    అది అవగానే పెద్దక్కా బావగారూ వెళ్ళిపోతారు. కొత్తగా పెళ్ళయిన చిన్నక్క మరికొన్ని రోజులుంటుంది. ఆ తరువాత తనుకూడా  వెళ్ళిపోతుంది. వెళ్ళి పోతుందనుకుంటే ఇప్పుడే ఏడుపోస్తుంది.

    పెళ్ళయి ఇన్నేళ్ళయ్యాక కూడా పెద్దక్క బయల్దేరుతుందంటే ఉత్పల బయటకురాదు. గదిలోనే గుడ్లనీరు కుక్కుకుంటూ కూర్చుంటుంది. అందరూ ఏడిపిస్తారు. ఈ లోపులో పెద్దక్క గబగబా లోపలికి వస్తుంది. 'ఏడవకే! ఇప్పుడే మయిందనీ, మళ్ళీ వచ్చేస్తాగా!' అంటుంది. అంటుందేగానీ  తనకీ  ఏడుపోస్తుంది. ఈ లోపులో పక్కనుంచి తమ్ముడు పదిలంగా అల్లుకొన్న పోదరిల్లూ మాది' అని పాడతాడు.

    తండ్రి వాడిని తిడతాడు. పాట పాడి అక్క నేడిపించినందుకు కాదు. 'అల్లూకొన్న' అని దీర్ఘం తీసి తెలుగు సాహిత్యాన్ని పాడు చేస్తున్నందుకు.....

    ....గడియారం పన్నెండు కొడుతూ వుండగా కరెంట్ వచ్చింది. ఉత్పల హరికెన్  లాంతరు వత్తి తగ్గించి  గదిలో మూలగా  పెట్టింది. అస్తవ్యస్తంగా వున్న పుస్తకాన్ని టేబిల్ మీద ఒక మూలకి సర్దింది.

    క్రింద నిద్రలో చంపకమాల ఇట్నుంచి అటు కదిలి వెల్లకిలా పడుకోటంతో పరికిణీ మోకాళ్ళ పైకి జరిగి తొడలు తెల్లగా కనపడుతున్నాయి. ఆమె వంగి దాన్ని క్రిందికి సర్దింది.

    ఇప్పుడిప్పుడే ఓణి పరికిణీలు వేస్తూంది చంపకమాల. లక్షసార్లు చెప్పి వుంటుందీపాటికి-పడుకునేటప్పుడు కాస్త ఒద్దిగ్గా, సరీగ్గా పడుకోవే - అని. అది వినదు. పెద్దక్క వచ్చినప్పుడు దానికి ఫిర్యాదు చేసింది, "చూడవే ఇది. పెద్దవుతున్నా పెద్దబుద్ధులు రావటం లేదు" అని, అయితే పెద్దక్క దానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. "పోన్లేవే. మనింట్లోనే నయం. మా ఇంట్లో అయితే ఆడపడుచులంతా ఇంతే. మా అత్తగారయితే, ఇక నిద్రపోతే వళ్ళూపై తెలీదు....." అన్నది.

    .....బయట్నుంచి చల్లగాలి వీస్తూంది. ఆమె లేచి, చెల్లికీ తమ్ముడికీ దుప్పటి కప్పింది.

    తరువాత తనుకూడా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించింది. ప్రతిరాత్రీ పడుకోబోయే ముందు దేవుణ్ణి తల్చుకోవటం ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి. అలా తల్చుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అయితే ఈ సారి కేవలం  తల్చుకోవటమే కాదు. ప్రార్థించింది కూడా!".......భగవంతుడా! రేపా హరనాథరావు నన్ను పిచ్చి పిచ్చి పజిల్స్  అడిగి కంగారు పెట్టకుండా చూడు. ఎక్కువమంది కాంపిటీషను లేకుండా చెయ్యి. ఆ అసిస్టెంటు నర్సు ఉద్యోగం  నాకు వచ్చేలా చూడు. అన్నట్టు మర్చిపోయాను. రేపా ఉద్యోగం వచ్చాక మొత్తం విషయమంతా అమ్మకి చెప్పవలసి వచ్చినప్పుడు, తను కాళికాదేవిలా ఎగిరిపడి, "ఇంత బ్రతుకూ బ్రతికి ఈ ఉద్యోగం చేస్తావుటే? ఠాట్. వీల్లేదు" అని కొట్టేసి పడెయ్యకుండా చూడు. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు తోడయినట్టు నాన్నకు నేను తోడ్పడేలా చెయ్యి. అసలే నాన్న ఆరోగ్యం ఈ మధ్య బావుండటంలేదు. నాకీ వుద్యోగం చాలా అవసరం" అంటూ కళ్ళు మూసుకుంది.

    బయట్నుంచి బలంగా వీచే గాలి శబ్దం లోపలికి వినిపిస్తుంది. ముందు హాల్లోనే పెద్దబావా అక్కా పడుకున్నారు. పెళ్ళయిన ఆరేళ్ళకే నలుగురు పిల్లలు పుట్టటంతో వారికి వేరే  గది అవసరం లేకపోయింది. చిన్నక్క బావగారు పక్క గదిలో నిద్రపోతున్నారు.

    హాల్లోంచి తండ్రి దగ్గు వినబండింది. అంతలోనే తల్లి కంఠం.......... 'కొంచెం అమృతాంజనం రాయనా', అని అడుగుతూంది.

    "వద్దు వద్దు. నువ్వెందుకు లేచావ్? పడుకో - పడుకో" మందలిస్తున్నాడు తండ్రి. ఆ అర్దరాత్రి నిశ్శబ్దంలో, ఆయన స్వరంలో భార్యపట్ల  ప్రేమా, జీవిత సహచరిణి పట్ల కృతజ్ఞతా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి.

    నిద్రలోకి జారుకుంటూ ఉత్పలమాల అనుకుంది.

    'నిజమే!.... మేడంటే మేడాకాదు. గూడంటే గూడూ కాదు. పదిలంగా అల్లూకున్నా..... ఛా.... అల్లుకున్న పొదరిల్లుమాది...'


                                                          2

                                                    'స్టాక్ హొం'


    ఎనిమిది అంతస్థుల  భవనం గేటులోకి, అనూష కారు బాణంలా దూసుకు పోయింది. బిల్డింగు లోపల  కార్లు పెట్టటానికి వరుసగా గీతలు గీసి వున్నాయి. రెండు గీతలమధ్య, కీచుమన్న బ్రేకు చప్పుడుతో ఆమె కారు ఒక్కసారిగా ఆపింది. అలా ఆపటంలో వచ్చిన జెర్క్ కి  ఆమె శరీరం లేత ఆకులా  కదిలింది.

    కారు దిగి తాళం వేస్తూండగా వాచ్ మెన్ పరుగెత్తుకుంటూ వచ్చి "మాడమ్! ఈ స్థలం  జి.ఎమ్. (జనరల్ మేనేజరు) కారు పెట్టుకునేది" అన్నాడు.

    అనూష చుట్టూ చూసింది. వరుసగా కార్లు వున్నాయి. ఎక్కడా  ఖాళీ లేదు.

    "మీ జి.ఎమ్. ఉద్యోగంలో లేరుగా".

    "లేరనుకోండి" నసిగాడు.

    "మరింకేం? నేను ఆ ఇంటర్వ్యూకేవచ్చాను. పర్వాలేదులే" అంటూ ఆమె మెట్లెక్కి లిప్ట్ దగ్గిరకి వెళ్ళింది.

    లిప్ట్ నాలుగో అంతస్థులో ఆగింది. ఎడమ పక్క చైర్మెన్ గది. కుడి పక్క బోర్డ్  రూమ్. మొత్తం ఆ అంతస్థంతా ఎయిర్  కండిషన్ చేయబడ్డట్టు వుంది. కాళ్ళ క్రిందనుంచి గోడ చివర వరకూ మెత్తటి తివాచి పరచబడివుంది. హాలంతా ఒక రకమైన సుగంధ పరిమళం నిండి వుంది. ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చుంది.

    అప్పటికే ముగ్గురు ఉన్నారక్కడ. ముగ్గురూ మొగవాళ్ళే. ఒకరికి ముప్పై అయిదేళ్ళుంటాయి. లొడలొడా వాగుతున్నాడు. ముప్పై ఏళ్ళు  దాటాక కూడా అంతలా మాట్లాడుతున్నాడంటే ఆ మనిషి డెప్త్ తక్కువైన వాడయివుంటాడు. స్టాక్  హొం లాటి సంస్థ అలాటి వాడిని చాల సులభంగా గుర్తించి నిరాకరిస్తుంది.

    రెండో వ్యక్తి కూర్చున్న భంగిమా, మిగతా  వారికన్నా తను  ఎక్కువా అన్న బాడీపొజిషన్ బట్టి అతను రికమండేషన్ కాండిడేట్ అని గుర్తించింది.

    మూడవ అభ్యర్థి మౌనంగా వింటున్నాడు. అవతలి వ్యక్తి మాట్లాడే నానా చెత్తనీ మౌనంగా వింటూ, అందులో కూడా తనకి పనికి వచ్చేది ఏదైనా వుందేమో అని వెతుకుతున్నాడంటే, అతను తెలివైనవాడు అయివుంటాడు..... బహుశా తనకి పోటీ అతడే కావొచ్చు!

Next Page