Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 1

                                 


                    సంపూర్ణ గోలాయణం


                                      -పొత్తూరివిజయలక్ష్మీ



    పొద్దున పదకొండు గంటలు అయింది. మే నెల ముప్పై ఒకటవ తేది. ఎండ మండిపోతుంది! తన ప్రతాపాన్ని లోకానికి చూపిస్తున్నాడు, మార్తాండుడు. అదో నాలుగంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిటకిటలాడిపోతుంది. సుమారు ఎనభైమంది దాకా యువతీ యువకులు అక్కడ ఉన్నారు.

    శ్రీ సూర్యా కంపెనీ ఫ్రైవేటు లిమిటెడ్  వారు పక్షంరోజుల క్రిందట ఓ ప్రకటన వేయించారు. మా వద్ద  పనిచేయుటకు టైపిస్టు కావలెను....అనేసి వారికి క్కావలసిన  అర్హతలు ప్రకటించి,  వారిచ్చే జీతం ప్రకటించి ఉత్సాహం ఉన్న వారిని ఫలానా రోజున స్వయంగా వచ్చి సంప్రదించమన్నారు.

    భారతదేశంలో నిరుద్యోగానికి కొరతలేదు. కావలసినంత మంది ఉన్నారు.

    డిగ్రీని అందుకుని ఆనంద పరవశుడైపోతాడు అబ్బాయి. అమ్మయ్యా! నా డిగ్రీ నా కొచ్చేసింది. ఇక  ఉద్యోగం చూసుకుంటాను. నాన్నగారికి ఆసరాగా ఉంటాను. అమ్మకి  చీర కొనిపెడతాను, చెల్లాయిని సినిమాకి తీసుకెళ్ళతాను. అని పెద్దరికం నెత్తిన వేసుకుని బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధపడతాడు గాల్లో తెలిపోతాడు.

    డిగ్రీ వచ్చీరాగానే ఉద్యోగం దొరికే అదృష్టం ఏ కొద్ది మందికోమాత్రమే లభిస్తుంది. మిగిలిన వాళ్ళకి కన్నా కలలు ఎండ మావులు అయిపోతాయి.

    నిరీక్షణ ప్రయత్నం ఆశ, నిరాశ అనేక సంఘర్షణల మధ్య  కొట్టుమిట్టాడుతూ ఉంటాడు నిరుద్యోగి, విద్యార్థి దశలోని నరదాలన్నీ మరుగునపడిపోతాయి ఆలంకరణ మీద శ్రద్ధ తగ్గిపోతుంది. సినిమాకి వెళ్ళాలని  ఉన్నా తండ్రిని డబ్బులు అడగడానికి విపరీతంగా అభిమాన  పడతాడు.

    క్రమంగా అన్నం తినడానికీ కాఫీ తాగడానికీ కూడా మొహమాట పడిపోతాడు. ఏదో ఉద్యోగం చూసుకోవాలి. ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం కావాలి అదే ధ్యాస  అయిపోతుంది. ఎడ్వర్ టైజ్ మెంట్ కనబడటం ఆలస్యం అప్లయి చేస్తారు.

    ఇప్పుడలాటి నిరుద్యోగులే ఆ హల్లో పడిగావులు పడుతున్నారు పదిగంటల కల్లా వచ్చి కలుసుకోమన్నారు. కాబట్టి అభ్యర్థులు అంతా తొమ్మిదిన్నరకే వచ్చేశారు.

    పదకొండు గంటలు కావస్తున్నా ఇంకా ఇంటర్వ్యూ మొదలవ్వలేదు. విసుగు వేస్తుంది వాళ్ళకి. పోనీ బయటికి వెళ్ళి కాసిని కాఫీ నీళ్ళు తాగివద్దామంటే తీరా అటు వేళ్ళగానే ఇంటర్వ్యూకి పిలుస్తారేమో అని భయం.

    పదకొండు పదిహేను నిముషాలకి బూట్లు టకటక లాడించుకుంటూ లోపలికి వచ్చాడు. హల్లో ఒక్క క్షణం నిలబడి అందరివంకా చూసి చిరునవ్వు నవ్వేడు. చూసీ  చూడగానే తెలిసిపోతుంది ఎవరో శ్రీమంతుల ముద్దులవుత్రుడని, హల్లోని వారంతా అసూయగా అతని వంక చూశారు.

    అందరి వంక నవ్వుతూ చూసి తలుపు దగ్గరికి వెళ్ళాడు దర్వన్ ముఖం చాటంత చేసుకుని "వచ్చారా! చినబాబుగారూ! ఇంత ఆలస్యం అయిందేం పెద్దయ్యగారు తమకోసం చూస్తున్నారు" అన్నాడు.

    "ఆలస్యం అయిపోయింది మాస్తానూ! ఇంటర్వ్యూలున్నాయి కదా! కొత్త బట్టలు వేసుకొద్దాం అనిపించింది. బజార్నించి బట్టలు తెచ్చుకుని వేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఇంతకీ ఎలా  వున్నాయి నా బట్టలు?" కుతూహలంగా అడిగాడు.

    "ఎక్స్ లెంట్ గా ఉన్నాయండీ! దినిమాలో చిరంజీవిల ఉన్నారు" మెచ్చుకున్నాడు మస్తాన్.

    లోపలికి వెళ్ళిపోయాడు చిట్టిబాబు యిదంతా చూస్తున్న వారికి చిరాకేసింది చిట్టిబాబు దర్జాచూసి అందరికి మంటగానే ఉంది ఆ మంట బయట పెట్టలేక__

    "ఏవయ్యా ఇందాక అడిగితే చిన్నయ్యగారు రావాలి. ఇంటర్వ్యూ మొదలవ్వాలి అన్నావుగా, ఆయన గారు వచ్చినట్లున్నారు. ఇకనైనా మాకు ముక్తీ మోక్షం ఉన్నాయా?" అని దర్వాన్ మీద దండెత్తారు.

    వాళ్ళ గోల తట్టుకోలేక "ఇంకెంతసేపు. క్షణంలో లోపలికి పిలుస్తారు!" అని  హామీ ఇచ్చేశాడు దర్వాన్ లోపలికి వచ్చిన కొడుకుని కళ్ళారా చూసుకొని మురిసి పోయాడు గోవర్థనరావు చూశావుట్రా బావా! నీ అల్లుడు ఎలా మెరిసిపోతున్నాడో!" అన్నాడు పక్కన కూర్చున్న బావమరిదితో పళ్ళు పదహారూ బయట పెట్టి నవ్వేడు బంగారయ్య.

    గోవర్ధనరావు వాళ్ళ వంశంలో నాలుగు తరాలుగా అందరూ ఏదో ఓ వస్తువు అమ్ముతూనే ఉన్నారు. ముత్తాతలు నారా పీచూ అమ్మారు. తాతలు నువ్వులూ, బెల్లం అమ్మారు. తండ్రులు, చింతపండూ జీడిపప్పు అమ్మేవారు వీళ్ళతరం పొగాకు, పంచదార అమ్ముతున్నారు.

    ఈ నాలుగు తరాల వాళ్ళు పంచెలు తప్ప పాంట్లు ఎరుగరు.వేలి ముద్రతప్ప సంతకం పెట్టిన పాపాన పోలేదు అలా లక్ష్మీటాక్షం తప్ప సరస్వతీ కటాక్షం ఏ మాత్రం లేని ఆ కుటుంబంలో తప్ప బుట్టాడు వెంకట సత్యనాగదుర్గ వరప్రసాద్ ఉరఫ్ చిట్టిబాబు.

    తన వంశంలో తప్ప బుట్టిన కొడుకుని చూసి ఆ తండ్రి ఆనందం వర్ణనాతీతం. కొడుకుని అందలం ఎక్కించాడు. రాజభోగాలు అనుభవిస్తూనే ఎక్కడా పట్టుబడ కుండా డిగ్రీ తెచ్చేసు కున్నాడు చిట్టిబాబు.

    చదవరాని చదువు  చదువుతున్న మేనల్లుడిని చూసి ముచ్చట పడిపోయి, నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోవాలి. సరేనంటావా సరే, లేదూ నీ ఇంటి ముందు ప్రాణత్యాగం చేస్తా అని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నారు గోవర్ధనరావు బావమరిది బంగారయ్య.

    బంగారయ్య వంశంలో కూడా తాతముత్తాతల కాలం నుండీ వ్యాపారమే. అయితే గోవర్ధనరావు పెద్దల లాగే వీళ్ళు రకరకాల వ్యాపారాలు  వెలగబెట్టలేదు. ఆనాటి నుండి ఈనాటి దాకా వడ్డీ వ్యాపారాన్నే నమ్ముకున్నారు.

    మెనకొడలిని చేసుకోవడం గోవర్ధనరావుకి అంగీకారమే అయింది. చిట్టిబాబుకికూడా మరదలు వెంకట అనంత పద్మావతీ అలివేలు మంగాతాయారు అంటే ఇష్టమే ఫలితం ప్రధానం జరిగింది.

    అబ్బాయి చదువుకున్నాడు. చురుకయినవాడు. ఇదుగోరా అబ్బాయి మా వ్యాపారాలు నీ చేతిలో పెట్టేస్తాం అన్నారు తండ్రీ, మామగారు.

    చాకులాంటి కుర్రాడు అతను. తండ్రిలా ఉప్పు, ఉల్లిపాయా అమ్మడానికి ఇష్టపడలేదు. వడ్డీ వ్యాపారం చచ్చినా చెయ్యను పొమ్మన్నాడు. నా మార్గాలు నాకున్నాయి అన్నాడు. అన్నట్లే అనుభవజ్ఞూలని అండగా తీసుకొని చకచక ముందుకి సాగిపోయాడు.

Next Page