సీత మాటలు జాలిగొల్పాయి వాళ్ళకు.
"వెంటరావుగారని మాకు తెలిసినాయన వున్నారు. పక్కవీధిలోనే వారుండేది. డాక్టర్ వెంటరావు అంటే ఎవరైనా ఇల్లు చూపిస్తారు. వారంరోజులక్రితం పనిమీద వారింటికెళ్ళాను. వంటావిడ మానేసిందని చెప్పారు. ఇన్నాళ్లు వారు మనిషిని కుదుర్చుకోకుండా వుండరు. అయినా వెళ్లి ఒకసారి కనబడితే, ఎలావుంటుందో చెప్పలేను." అన్నాడు రామ్మూర్తి.
"అమ్మయ్య దూరం తిరక్కుండానే ప్లాన్ ఫలించింది." అనుకుంది సీత.
"సీతాపతిరావుగారి ఇల్లు చూసుకొని, మీరు చెప్పిన వెంకటరావుగారింటికెళతాను. వస్తానండి, మీకు అనవసరంగా శ్రమకలిగించాను." అని సీత బయలుదేరింది.
"పాపం సుఖపడి కష్టంలోకి వచ్చినవారి అమ్మాయిలా వుంది. వయసెంత? చేసే పనేంటి?"
సీతకి వెనకనుంచి చిన్నగా వాళ్ళనుకునే మాటలు వినిపించాయి. నవ్వుకుంది.
"ఉద్యోగం అంటే గబుక్కున దొరకదు. వంటపని, కూలీపని అయితే ఫరవాలేదు, దోరుకుతుంది. కానీ నావయసు దానికి అడ్డంవస్తుంది. ఏ హొటల్లోనో చేరితే ఆ చిల్లరమనుషులమధ్య అడ్డమైనమాటలూపడుతూ, అవసరమయితే శరీరాన్నికూడా మలిన పరుచుకుని బతకాలి గౌరవమయిన పెద్దింట్లో వంటచేసినా, పైపని చేసినా తప్పులేదు.
"నేను వంట చేస్తాను పనిస్తారా!" అంటే ఎవరూ ఇవ్వరు. అనుమానించి సవాలక్ష ప్రశ్నలేస్తారు. ఇలా అయితే మనిషి అవసరం ఏ ఇంటి వారికో తెలుస్తుంది. నిర్భయంగా వెళ్ళొచ్చు. ఎక్కువ శ్రమ పడకుండానే దారి కనబడింది. వీళ్ళ పుణ్యమా, అని....వీళ్ళెవరో మంచి వాళ్ళే." అనుకుంటూ రామ్మూర్తి చెప్పిన పక్కవీధికెళ్ళింది.
ఎవరూ చెప్పకుండానే డాక్టర్ వెంకటరావు ఇల్లు కనుక్కుంది సీత, వాకిలిముందున్న నేమ్ ప్లేటుచూసి.
సీత సరాసరి ఇంట్లోకి వెళ్ళింది.
5
డాక్టర్ వెంకటరావు భార్య పేరు శాంతకుమారి.
నర్స్ దారిచూపిస్తే సరాసరి సీత మేడమీదకెళ్ళింది.
డాక్టర్ వెంకటరావుది పెద్దమేడ, కింద హాస్పిటల్, పైన సంసారం, నర్స్, సీతని శాంతకుమారివద్ద వదిలి కిందకెళ్ళిపోయింది.
సీత, శాంతకుమారిని చూస్తూనే మీకు వంటమనిషి కుదిరిందాండీ?" అంది.
శాంతకుమారి, విచిత్రంగా చూసింది సీతని, "ఈపిల్ల ఎవరు? చూడటానికి చదువు సంస్కారంకలదానిలావుంది. వయసు చూడబోతే ఇరవై ఏళ్లు కూడా దాటినట్లు లేదు. బిడియంలేకుండా నుంచుంది. మా ఇంట్లో వంటమనిషి కుదిరితే దేనికి కుదరకపోతే దేనికి?" అనుకుంది.
శాంతకుమారి తనని నఖశిఖ పర్యంతం చూస్తుంటే ఇబ్బందిగా కదిలింది సీత. ముఖంమాత్రం అమాయకురాలిలా పెట్టింది.
"కూర్చో!" అంది శాంతకుమారి ఎదురుగుండావున్నా సోపాచూపిస్తూ.
సీత కావాలని ముడుచుకుని ఒదిగి సోఫాలో కూర్చుంది. కావాలనే అలా కూర్చుంది.
"నీ పేరు?"
"సీతాదేవి, సీత అనిపిలుస్తారు."
"అహాఁ! మాఇంట్లో వంటచేసే ముసలమ్మ నీకు బంధువా?"
గతుక్కుమంది సీత. "కాదండి!" అంది వెంటనే.
"మరి వంటమనిషి కుదిరిందా? అని ఎందుకడిగావ్?"
"మీకు వంటమనిషి కావాలని తెలిసి....!"
"ఊ....తెలిస్తే ఏమిటి?" శాంతకుమారి అర్థంగాక అడిగింది.
"వంటావిడ కుదరకపోతే, నేను మీఇంట్లో కుదిరి వంటచేద్దామని..."
"ఏమిటీ...."సోఫాలో నిటారుగా కూర్చుని కళ్ళార్పకుండా సీతని చూస్తూ అంది శాంతకుమారి.
"లాభంలేదు. ఈ డాక్టరుగారి భార్యకి మొగుడు బుద్దులన్నీ అబ్బినట్లున్నాయి. చూపులు ఎక్స్ రేలా, మాటలు ఆపరేషన్ కి సిద్డంచేసిన కత్తుల్లా వున్నాయి. ఈవిడముందు నిజం బయటపడిందంటే డాక్టరుగారి చేత ముక్కూ, చెవులూ కోయించి. నోరు కుట్టించి పంపించేటట్లుంది. చల్లగా జారుకోవల్సిందే!" సీత అనుకుంటూ తల వాల్చుకు కూర్చుంది.
"సీతదేవీ!" శాంతకుమారి ఆశ్చర్యంలోంచి తేరుకుని అంది.
"సీత అనండి చాలు!"
"సరే, సీతా! నువ్వు వంట చేస్తావా?"
"నేను కలెక్టర్ కూతురిని కాదు. జమిందారు బిడ్డనీకాదు మా ఇంటి పరిస్థితులు మొదటినుంచీ సరిఅయినవి కావు. రోజు రోజుకీ దిగజారిపోతున్న మా సంసారానికి ఆధారం నేను. 'ఆడ? మగ?' అని ఆలోచించకపోతే మా అమ్మాకి ప్రధమ సంతానాన్ని! ఆడా, మగ, రెండూ నేనే."
"మాకు వంటమనిషి కావాలని ఎవరు చెప్పారు?"
"సుబ్రహ్మణ్యంగారింట్లో పనిచేస్తున్నాను. అవసరం అని ఫ్రండ్ సీతాపతిరావు గారింటికి పంపారు. వారిల్లు వెతుకుతుంటే రామ్మూర్తిగారు కనపడి మీ సంగతి చెప్పారు. అవసరమయితే చూడొచ్చని మీ అడ్రస్ తీసుకుని సీతాపతిరావుగారింటికెళ్ళాను. వారికి ఒకరోజే అవసరం, ఆ ఒక రోజూ చేశాను. మీఇల్లు వెతుక్కుంటూ వచ్చాను." సీత వినయంగా నమ్మదగినట్లు చెప్పింది.
"సుబ్రహ్మణ్యంగారన్నావే వాళ్ళింట్లో నాలుగు ఆకులు ఎక్కువే తిన్నది." అనుకుంది సీత.
"సుబ్రహ్మణ్యంగారింట్లో నెలంతా చేయనండి. బాపమ్మగారు. అంటే సుబ్రహ్మణ్యంగారి భార్య 'బయట' చేరినప్పుడు కబురు పంపుతారు ఆ మూడు రోజులూ వంటా, ఇంటిపని చేస్తాను." అని సీత సోఫాలోంచి లేచింది. "మీకు వంటచేయటానికి ముసలమ్మ కుదిరిందిగా! వస్తానండి." అంది.
"కూర్చో!" అంది శాంతకుమారి.
సీత కూర్చుంది "ఎందుకండీ?" అంది. నిజంగా ఎందుక్కూర్చోమందో అర్థంకాకనే అడిగింది.
"మాఇంట్లో వంటకి కుదిరిన ముసలమ్మ నిన్ననే మానేసింది."
"ఎందుకని?"
దేముడిమందిరంలో వున్న ముడుపుకట్టిన రూపాయిబిళ్ళని బొడ్లోదోపుకుంటుంటే చూశాను. మామూలుగా అలమరలో డబ్బులుంటే దొంగిలించటంకాదు. దేముడుమందిరంలోవీ పైగా ముడుపుకట్టినవి...!"
"ఉండండుండండి. దొంగిలించేబుద్ది కలగనేకూడదు. కలిగిందా....? దేముడిమందిరమనీ చూడరు, అలమారా అనియా చూడరు ఎలాదొంగలించాలి? ఎక్కడ డబ్బుంది? అని మాత్రమే చూస్తారు. బుద్ది సవ్యమైనది అనుకోండి. కళ్ళపడినాచెయ్యి వెయ్యరు. అది డబ్బయేది, బంగారమయేది!"
సీత మాటలు నచ్చాయి శాంతకుమారికి.
"మాఇంట్లో మొత్తం సభ్యులంఅయిదుగురం. గెస్టులు వస్తుంటారు! వంటగాక, ఉదయం, సాయత్రం, కాఫీతోపాటు టిఫెన్ చెయ్యాలి. ఉదయం భోజనాలు పదకొండు మొదలు రండుదాకా తలోటైమ్ కాబట్టి అవుతూనేవుంటాయి. రాత్రి పదకొండు అవుతుంది. నిన్ను కుదుర్చుకుంటే చిన్నదానివి-నీ యిబ్బంది....?"
"ఫరవాలేదు. మాఇల్లు చాలాదూరం. రోజూ రానూ పోను ఇబ్బంది. నా జీతం సగం సిటీబస్సుకే పోతుంది. మావాళ్ళని రెండు రోజులకొకసారి చూసివస్తుంటాను. మీకభ్యంతరంలేకపోతే రాత్రీ, పగలు ఇక్కడే వుంటాను. కింద నర్స్ లుంటారుకదా? అక్కడ పడుకుంటాను. వంట చేయటం అంటారా? నే చెప్పరాదు. మీరు వినరాదు. నే చేయాలి మీరు తినిచూసి చెప్పాలి."
సీత మాటల్లో స్పష్టత, నిజాయితీ శాంతకుమారికి నచ్చాయి. కానీ.... సీతని చూస్తుంటే ఈపిల్ల ఏమిటి? వంటమనిషి ఏమటి? అనిపిస్తుంది. శాంతకుమారికి ఊరుకోబుద్ధికాలేదు.
"సీతా! నిన్ను చూస్తుంటే....!" అంటూ ఆగిపోయింది.
"చూడండి! సుందరి పేరుగులామె పరమ వికారంగా పుట్టివుండవచ్చు. ధర్మారావు దొంగయి వుండవచ్చు, కలెక్టరుగారి అబ్బాయి దొండపండులా గాక ముళ్ళపందిలావుండొచ్చు, ముఖాలు చూసి వాళ్ళు చేసే ఉద్యోగాలు చెప్పలేం కదండీ! వంటమనిషి ముఖంకా నా ముఖం వుండక పోవటం నా తప్పు కాదు. మీకు ఎలాంటి అభ్యంతరం వున్నా చెప్పండి, క్షమించండి. నాకు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. మా అమ్మ నన్ను చివాట్లు పెట్టనిరోజు లేదు. మనం చేసే ఇంతోటి ఉద్యోగానికి ఇలా మాట్లాడకూడదు." అంటుంది, నేనేం చేయను? కరెక్ట్ గా మాట్లాడటం కరెక్ట్ గ పనిచేయటం నా అలవాటు."
శాంతకుమారికి ఇంకేం మాట్లాడాలో అర్థంకాలేదు. సీత ఫామిలీ గురించి అడిగింది. సీత రెడీగా ఆలోచించిపెట్టుకున్న రెడీమేడ్ కథ చెప్పేసింది.
"మాఇంట్లో వుంటానంటే మరీ మంచిది. ఏ నిమిషాన ఎవరోస్తారో తెలియదు. కాఫీ టిఫెన్, భోజనం.... అన్నీ మాతోపాటే, ఏడాదికోసారి కొట్టచీర, పోతే జీతం సంగతి....?" శాంతకుమారి అర్థోక్తిగా ఆగింది.
"మీరు ఇదివరకు ఎంతిచ్చేవారో అంతే ఇవ్వండి."
"భోజనం మాదే కాబట్టి రెండు చొప్పున రోజుకి లెక్కవేసి అరవై ఇచ్చేవాళ్ళం."
సీత మాట్లాడలేదు. అయిష్టంగా ముఖం పెట్టింది.
"నీకిష్టంలేకపోతే ఎంతకావాలో అడుగు. నీవు కోరింది నాకు ఇష్టమో, అయిష్టమో, తెలిసిపోతుంది."
"మీకు కష్టంగా తోచకపోతే అరవైకి ఇరవై చేరిస్తే సంతోషం. పోనీ, నాపని చూసింతరువాత ఓ నిర్ణయానికి రండి."
సీతని వదులుకోవాలనిపించలేదు శాంత కుమారికి "సరే, పనిచూసి పెంచుతాను, ఎప్పటినుంచి వస్తావు?" అంది.
"రేపటినుంచే వస్తాను." అంది సీత సోఫాలోంచి తేచి.