ఓబయ్య హొటల్లో పిండిరుబ్బే మనిషి. చిన్న ఏనుగ్గున్నలా వుంటాడు.
"ఓబయ్యా!" పుల్లారావు పెద్దగా కేకపెట్టాడు. వెనక వసారాలో ఓబయ్యాకినబడేటట్లు.
ఒక్క పిలుపులోనే ఓబయ్య పిండిరుబ్బుతున్నచేత్తో వచ్చాడు.
"ఓబయ్యా! పిండి తరువాత రుబ్బవచ్చు, పత్రం పట్టుకు ఇలారా పనిబడింది." అంది సీత ఓరగా తనని పేరడిగినవాడిని చూస్తూ.
రక్షణలేని ఆడదాన్ని మాట్లాడినంత చులకనగా రక్షణున్న ఆడదాన్ని మాటలనలేడు మగాడు." అనుకుంది సీత. గబగబా తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నవాడిని చూచి.
సంగతి తెలియని ఓబయ్య "పోత్రం దేనికి?" అన్నాడు.
"వద్దులే, వెళ్లు నీపని చూసుకో." అంది సీత ఇంకో అతని చేతిలో బిల్లు తీసుకుంటూ.
పైకనే ధైర్యంలేక గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు ఓబయ్య.
పుల్లారావుకి సమయం దొరికింది.
"నిన్నగాక మొన్నవచ్చింది. పెత్తనం చలాయిస్తున్నది. ఇది రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, దీనబ్బ సొమ్మంతా పెట్టినట్లు, ఎప్పటినుంచో వున్న, మన్నే దబాయిస్తున్నది. దీందా హొటలు! అంజమ్మదా?" ఆరాత్రి పుల్లారావు, ఓబయ్యతో అంటుంటే సీత వింది.
అంతకు గంటకుక్రింత "చిన్నపిల్లవయినా, నా అంతటిదానివి." అంటూ ఆరోజు వచ్చిన డబ్బు లెక్కచూసుకుంటూ అంజమ్మ అన్న మాటకు పొంగిపోతూన్న సీత పుల్లారావు మాట విని మనసు పిండేనట్లు బాధపడింది! తను వుండాల్సినచోటు ఇదికాదు. తను పుట్టింది, పెరిగింది ఇలాంటి ప్రదేశంలోకాదు. తను, తనవారు ఇలాంటివారు కాదు. దీంది.... దీనబ్బ....లాంటి మాటలు అనరు, పడరు. తనెవరినీ అనలేదు. కాని... పడుతున్నది. అనవసరంగా అన్యాయంగా....ఎందుకు...? ఎందుకో తెలుసు, తెలిసి ఏమీ చేయలేక.... అవును...ఏమీ చేయలేక...!" అనుకుంది సీత.
ఓబయ్య, బీడీ ముట్టించి పుల్లారావుతో హుషారుగా మాటలు మొదలుపెట్టాడు.
సీత వింటూ పడుకుంది.
సీత నిద్రపోయిందనుకున్నారో, లేక నిద్రపోయినా ఫరవాలేదనుకున్నారో, మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఓబయ్య, పుల్లారావులు. హొటల్లో పనిచేసే సాంబుకూడా వాళ్ళతో చేరాడు.
సీత సీత పక్కన అంజమ్మ పడుకున్నారు. తడిక అవతలగా పుల్లారావులు, ఓబయ్య, సాంబు ఉన్నారు. వాళ్ళ పడకలు అక్కడే. సూరిబాబు పక్క సందులోవున్న తనింటి కెళతాడు రాత్రిళ్లు పడుకోటానికి, మిగిలినఇద్దరూ రెండోఆట సినిమాకని వెళ్ళారు.
సీతకి నిద్రపట్టలేదు.
అంజమ్మ చిన్నగా గురకతీస్తూ నిద్రపోతున్నది.
మాటలతోనే పుల్లారావుకి ఓబయ్యకి కైపైక్కింది.
"సీత చదువుకున్నది. చూస్తే బేమ్మలనిపిస్తున్నది కదూ?" అన్నాడు సాంబు.
"ఛ.నీకేం తెలియదు! బేమ్మల పిల్లలు ఇంట్లోంచి లేచిరారు! ఇది ఇంట్లోంచి లేచొచ్చింది! అసలెందుకు లేచొచ్చిందంటావ్?" ఓబయ్య అనుమానం వెళ్ళబుచ్చాడు!
"నేను చెపుతా వినండిరా ఆమధ్య మనమో సినిమా చూశాంగుర్తుందా? ప్రేమించినవాడిని తీసుకుని లేచిపోతుంది. ఆడదాన్ని అనుభవించి కడుపుచేసి వెళ్ళిపోతాడు. అదేమో కూలీపని చేసుకు బతుకుతుంది...."
పుల్లారావుకి మధ్యలో అడ్డుతగిలాడు ఓబయ్య.
"సీత కధ సరిగ్గా అంతే అనుకో! మరి....చూడటానికి ఇడ్లీ ముక్క లాగుంది. మళ్ళీ ఎవడూ ఏం చేయలేదంటావా?"
"ఆ....చెయ్యకుండావుంటాడా ఏంటి? మనలాంటివాళ్లు ఏదన్నా అంటే గయ్యిమంటుందిగానీ, చదువుకున్నాళ్ళయితే ఎస్, అంటే ఎస్సూ.... బుస్ అంటే బుస్సూ."
సీత, అంజమ్మచెయ్యి గట్టిగా గిల్లింది.
"ఏంటీ....ఏంటీ?" అంటూ అంజమ్మ లేచి కూర్చుంది.
సీత మాట్లాడలేదు. ముడుచుకు పడుకుంది.
"సీతా! సీతా!" అంది అంజమ్మ; సీతని కుదిపి లేపుతూ.
అప్పుడే నిద్రలేచినట్లు లేచి "ఏమిటి? ఏం జరిగింది?" అంది సీత.
"ఎవరు నన్నుగిల్లింది?" చెయ్యి రాచుకుంటూ అడిగింది అంజమ్మ.
"జ్వరం పడ్డమనిషివి, భ్రమకలిగుంటుంది."
"అంతే నంటావా? మరి చెయ్యి నొప్పిపడుతున్నదే?"
"భ్రమంటే ఏమిటి? నిజంగా జరిగినట్లుండటం, ఓసారి ఏమయిందంటే...!" తడికవతల వాళ్ళినేటట్లు ఓకథ మొదలు పెట్టింది సీత.
తడికవతల మాటలు ఆగిపొయ్యాయి.
అంజమ్మ మళ్ళీ వెంటనే నిద్రపోయింది.
సీత కథ చెపుతూ, చెపుతూ, కళ్ళుమూసుకుంది.
4
మధ్యాన్నంపూట అంజమ్మతోచెప్పి సీత ఊళ్ళోకి బైలుదేరింది.
ఊళ్ళో ఎవరున్నారు? ఎవరూ లేరన్నావే? ఏం పని?" అంది అంజమ్మ.
"ఓ గంటలో వస్తాను." అంది సీత, అడిగిందానికి జవాబు చెప్పకుండా.
అంజమ్మ ఏమనుకుందో, "సరే నీయిష్టం, తొందరగా రా." అంది"
రెండు మూడుసార్లు అంజమ్మతో బజారు వెళ్ళటం, అన్ని పేటల పేర్లూ బస్సు నెంబర్లు ఇంకా వివరాలు తెలిసికొని వుండటంవల్ల సీత నిర్భయంగా వంటరిగా నడిచి గవర్నరుపేట చేరింది. పాత పరిచయం వున్నట్లు ఓ ఇంటికెళ్ళి తలుపుకొట్టింది.
"ఇంటివాళ్ళు తలుపు తీశారు.
ఒక మగ, ఇద్దరాడాళ్లు బయటికొచ్చారు.
సీత ముందే ఆలోచించి బయలుదేరింది. కాబట్టి తడుముకోవాల్సిన పనిలేకపోయింది.
"సుబ్రహ్మణ్యంగారు పంపించారు. నిన్న సాయంత్రం సీతాపతిరావుగారు సుబ్రహ్మణ్యంగారికి కనిపించి చెప్పారట. వారు నన్ను పిలిచి ఈ ఉదయం చెప్పారు." అంది సీత.
సుబ్రహ్మణ్యం ఎవరో, సీతాపతి ఎవరో, తెలియని ఇంటివాళ్లు తెల్లబోయి ఒకరి మొహం ఒకరు చూచుకున్నారు.
"చిన్నదాన్నని అనుమాన పడుతున్నట్లున్నారు? ఒళ్లువంచి పనిపాటలు చేయటానికి వయసుకాదు. గుణం, ఆరోగ్యం ప్రధానం." అంది సీత.
సుబ్రహ్మణ్యంగారు ఎవరు?" మగతను అడిగాడు.
"సుబ్రహ్మణ్యంగారు తెలియదా? భలేబాగుంది. లాయరు బి.సుబ్రహ్మణ్యంగారు. ఇంకా మీకు తెలియలేదా? సరేలేండి సీతాపతిరావుగారిని పిలవండి. వారితోనే మాట్లాడతాను."
"సీతాపతిరావు ఎవరో మాకు తెలియదు. ఈ ఇంటి ఓనర్ ని నేను, నా పేరు రామ్మూర్తి." అన్నాడు రామ్మూర్తి.
"సీతాపతిరావుగారి ఇల్లు ఇదే అని సుబ్రహ్మణ్యంగారు చెప్పి పంపారు. వారింట్లో వంటకి, పైపనులకి మనిషి కావాలని చెప్పారట.... ఇదివరకున్న సూరమ్మగారు పోయింతరువాత మనిషి కుదరలేదట..... ఈ వీధిలో సీతాపతిరావుగారు ఇల్లు తెలిస్తే చెప్పండి, వెళతాను."
"మాకు తెలిసినంతవరకూ ఆ పెరుగలవారూ ఎవరూ ఈ వీధిలో లేరు."
"ఆలశ్యంచేస్తే అనుమానానికి ఆస్కారం అవుతుందని తెలుసు సీతకి. వెళ్ళటానికి సిద్దమయినట్లు అయి..."మీకవసరమయితే చెప్పండి. వంట, పైపనులు చేయగలను." అంది.
"నువ్వు వంట చేస్తావా? అంటే.....అంటే...." ఇద్దరాడవాళ్ళల్లో ఒకామె రవంత ఆశ్చర్యపోతూ అర్థోక్తిగా ఆగిపోయింది.
ముగ్గురూ సీతని చూస్తూ వుండిపోయారు.
వంటచేయటం అంటే వంటమనిషి అని అర్థం, వంటమనిషి అంటే జిడ్దోడుతూ, విధవ అయినా అయి వుండాలి. ముట్టయిదువయితే బీదరికం చాటేగుడ్డలతో మసిబారిన రూపంతో అన్నా వుండాలి. ఆ ఇంటి వారి అభిప్రాయం అది. సీత వాళ్ళ వూహకి విరుద్దంగా కాలేజీ గరల్ లాగా మధ్యతరగతి కుటుంబం అమ్మాయి వేషధారణతో, అప్పుడే రేకులు విప్పిన మొగ్గలావుంది.
"మీ సంశయం అర్థమయింది. వంటమనిషి అంటే ఓ రూపం ధరించి వుండాలని లేదే! బట్లర్ లా వంట చేసేవారికి దుస్తులు లేవు. ముఖాలుచూసి చెప్పలేంకదండీ? వీరు వంటమనిషి. వీరు తాసీల్ దారు భార్య అని....? మా అమ్మ వంటమనిషి...." తన తల్లి వంటమనిషి అని చెప్పేటప్పుడు సీత పట్టు బలవంతానా లోలోపల బాధను దిగమింగి సామాన్యంగా మాట్లాడుతున్నట్లు అంది.
"వంట మనిషి కూతురు వంటలుచేసి బతకాలని లేదు. కాని..... కొందరి విషయంలో విధి చిన్న చూపు చూస్తుంది. మా అమ్మ వంటలుచేసి నన్ను చదివించింది. గొప్ప ఉద్యోగం చేస్తాను. ఊళ్ళేలతాను అని మురిసిపోతూ చదివించింది. కాని....పరిస్థితులు తారుమారయ్యాయి. అమ్మచేసేపని నేను చేస్తున్నాను తప్పా?"
ఎవరూ మాట్లాడలేదు. సీతవైపు జాలిగా చూచారు.
"మీకుగాని, మీకు తెలిసినవారుగాని వుంటే చెప్పండి. వంట చేస్తాను. వైపనులకి సాయపదతాను." అంది సీత.
"చదువుకున్నావుకదా, ఏదో ఒక ఉద్యోగం చూసుకావాల్సింది."
"రికమండేషన్లు, ముడుపులు చెల్లించినా ఉద్యోగాలు దొరకని ఈ రోజుల్లో నాబోటి సామన్యురాలికి ఎవరిప్పిస్తారండీ ఉద్యోగం? పోనీ మీ రిప్పిస్తారా?"
ఎవరినోట్లోంచి మాట రాలేదు.
"ఉద్యోగానికి తొందరలేదు. దయచేసి మీకు తెలిసినవారెవరయినా వుంటే చెప్పండి. అవసరమయితే వారికి సాయంచేసి నాపోట్ట, మా ఇంట్లో వారి పొట్టలు, మాడ్చుకోకుండా కాలం గడుపుతాము."