Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 6


    "మంచిది. పొద్దుటే వచ్చేసెయ్యి."
    "అలాగే," అని సీత, శాంతకుమారివద్ద సెలవు తీసుకుని మేడ దిగింది.
    సీతకి ఆశ్చర్యంగావుంది. ఒకటి...తన తెలివికి, రెండు... ఇంత తొందరగా ఉద్యోగం సంపాదించుకోగలిగినందుకు .....ఉద్యోగమంటే కలెక్టరాఫీసులోనే అక్కరలేదు. స్టేట్ బ్యాంక్ లోనూ అక్కరలేదు. రాళ్ళు మోయటం....వంట చేయటం....బట్టలుతకటం...గిన్నెలు తోమటం... అన్నీ ఉద్యోగాలే!
    అందుకే సీత తనకి దొరికిన ఉద్యోగానికి ఆనందించింది.
    "రేపటినుంచి అంజమ్మ హొటల్ కి నాకు రాం.... రాం... అంజమ్మ నీకూ నాకూ తూనాబోడ్."
    హుషారుగా ముందుకు సాగుతూ అనుకుంది సీత.
                                                                                            6
    హూటల్లోంచి మంచిగా బయటకొచ్చేకన్నా పోట్లాడి బయట పడితేనే మంచి జరుగుతుంది.
    సీత ఆలోచించింది.
    మంచితనంతో పనులుజరగవు. ఫలానాచోట నా నివాసం. అక్కడ చీకూ, చింతా లేకుండా పనిచేసుకు బతుకుతానని చెపితే, సంతోషించరు. కనీసం- పోనీలే పాపం అనికూడా అనరు, చేస్తున్నపని చెడగొట్టడానికి తయారవుతారు. చెడగొట్టి చేతులు దులుపుకుంటారు.
    పూర్తిగా పోట్లాడిపోతే పగబట్టి.....వెంటాడి....చావచితకగొడతారు. కాబట్టి....నెపం ఎదుటివాళ్ళమీద వేస్తే నోరు మూసుకు పడుంటారు. ఏం చేయాలి?......
    సీత ఆలోచిస్తే అయిడియా వస్తుంది.
    సీత ఆలోచించింది కాబట్టి అయిడియా వచ్చింది.
    క్రియలో పెట్టింది.
    "ఎక్కడికెళ్ళోచ్చావు?" అన్నాడు ఓబయ్య, మినపప్పు బుట్టకెత్తుతూ.
    "అమ్మో! ఇప్పుడే, ఎవరైనా ఇంటారు. ఎవరూ లేకుండా చెపుతాను." అంది సీత అటూ, ఇటూ భయ భయంగా చూసి.
    "అయ్య బాబోయ్! సీత ఎవరూ లేకుండా నాతో చేపుతుందట....ఏం విషయమో, ఏమో? ఏదయితేనేం, ణా అవసరం వచ్చింది. పోనీకుండా చూడాలి, నాబోంద! నేనసలే మొద్దెదవని." తనని తానే ముద్దుగా తిట్టుకున్నాడు ఓబయ్యా.
    "ఎక్కడికెళ్లోచ్చావు?" ఎవరూ చూడకుండా పుల్లారావడిగాడు.
    "ఎప్పుడో ఏదో పాపం చేశాను. ఆ బాకీ తీర్చడానికెళ్ళాను. ఈనాటితో శనివదిలింది." ఎవరైనా వింటారేమో అన్నాట్లు కంఠస్వరం తగ్గించి చెప్పి అవతలికెళ్ళిపోయింది సీత.
    "ఏంటబ్బా! పాపం అంటున్నది....? బాకీ తీర్చానంటున్నది-? శని వదిలిందంటున్నది ...? అబ్బో....! దీనెనక తెలుగు సినిమా కథంత కథున్నట్లుంది. ఛీ! ణా మగతనం ముండమొయ్య. దీని సంగతి చూడని మగాడిని.... నేనూ ఓ మగాడినేనా? చెప్తా, చెప్తా...." అనుకున్నాడు పుల్లారావు. అట్లా పిండి పల్చబడితే కాస్త గట్టిపడటానికి బియ్యప్పిండి కలపాల్సింది గ్లాసెడు నీళ్ళెత్తిపోశాడు సీత గురించి ఆలోచిస్తూ- తర్వాత నాలుక్కరుచుకున్నాడు.
    సాంబుకూడా సీతనడిగాడు ఎక్కడికెళ్లొచ్చాపని.
    "ఎవరితో చెప్పనంటే చెపుతా!" అంది సీత.
    "చెప్పను, ఒట్టు." అన్నాడు సాంబు.
    "మాబావా, నేనూ పోట్లాడుకున్నాం..." ఆగింది సీత.
    సీతకి బావ వున్నట్లు సాంబుకి తెలియదు. "బావా?" అంటూ నోరు తెరిచాడు.
    "పోలీసు బావ....!!" మళ్ళీ ఆగింది సీత.
    "పోలీసా?" సాంబు పూర్తిగా తెరిచాడు నోరు.
    సీత విసుక్కుంది.
    "ఇలా చెపితే నాకథ అందరూ వింటారు. ఎవరూ చూడకుండా చేపుతాలే,! ఎవరితో చెప్పకేం. నీమీద నమ్మకం కాబట్టి చెపుతానంటున్నాను. సరేనా?"
    సాంబు తల ఊపాడు.
    సీత అవతలికి వెళ్ళిపోయింది.
    "నేను చిన్నవాడిని, సీత చిన్నది, మాజంట "ఓ ప్రేమకథ" సినిమాలో హీరో హీరోయన్లులాగా వుంటుంది." సాంబు ఓ ప్రేమకథలో హీరోలాగా పగటికల అర్జంటుగా కనేశాడు. సీత, సాంబు కొడై కెనాల్ లో పాట అందుకుని చరణం పూర్తీకాకుండానే బృందావన్ గార్డెన్ లో దూరి, చరణం పూర్తయేసరికి నాగార్జునసాగర్ డామ్ మీదకి చేరి, రెండో చరణానికి గోదావరి మధ్యలో పడవమీదుండి, అది పూర్తయేటప్పటికి మద్రాసు బీచిలో గంతులేస్తూ..." "ఠప్" చేతిలో కప్పు, సాసరు కిందపడి నూరు ముక్కలయ్యాయి.
    సాంబు తెలివి తెచ్చుకుని  కంగారుగా ముక్కలేరటం మొదలు పెట్టాడు.
    సీత అందరికీ అందీ అందని తలోమాట చెప్పింది. ఆ మాట పట్టుకుని తలో కథా అల్లుకుంటూ పరధ్యానంలో పదిపోయారు.
    సీత, ఓబయ్య చూడకుండా గారెల పిండిలో గట్టి ఉప్పు కలిపింది.
    పుల్లారావు బీడీ తాగటానికి అవతలికెళ్ళగానే కూరలో గిద్దెడు కారం, నాలుగు బొద్దింకలను వేసింది.
    సాంబు జాగ్రత్తగా ఓ మూల దాచిన పగిలిన కప్పు, సాసరు ముక్కల పై మరో అరడజను కప్పు, సాసర్లు పగలగొట్టి ఆ ముక్కలు కలిపింది.
    ఎవరూ చూడకుండా ఇంకా చాలా పనులు చేసింది సీత.
    ఏం జరిగిందో! ఏం జరగనుందో? అంజమ్మకి తెలియదు. సీత ముడుచుకు పాడుకోటం చూసి సీత దగ్గరకొచ్చింది.
    "ఏమయింది, పడుకున్నావేం?" అంది అంజమ్మ.
    "ణా మనసు బాగుండలేదు. రెండుసార్లు పసరు వాంతి వెళ్లింది. కళ్లు తిరుగుతున్నాయి. నువ్వేమో ఎవరినీ కోప్పడవు. నన్ను చూస్తే అందరికీ అలుసే! పోనీ నీతో చెబుదామంటే, మొగబుద్దే అంత, చూసీ చూడనట్లు పో అంటావు. నే చెప్పటమెందుకు? నువ్వే ఓ కంట చూడు. ఎప్పటినుంచోవద్దు- ఇప్పటినుంచే." అని అటుతిరిగి పడుకుంది సీత.
    "మనసు బాగుండకపోవటానికి, వాంతికి, మొగబుద్ధికి, నే చూడటానికి, ఏంటబ్బా సంబంధం?" అంజమ్మకి అర్థం కాలేదు.
    "సరిగ్గా చెప్పు?" అంది అంజమ్మ.
    "నే చెప్పను. ఈ చావు నే చావలేను. నువ్వే చూడమన్నాగా? చూడు, తెలుస్తుంది." అంది సీత
    "ఎప్పుడు చూడను?"
    "ఇప్పటినుంచే చూడు."
    "సరే__" తలాడిస్తూ అంజమ్మ వెళ్లి పోయింది.
    సీత ముణగదీసుకు పడుకుంటే హొటల్లో పనిచేసే మగ పురుగుల వంటిమీద తేళ్ళూ, జెర్రులు పాకాయి. కాళ్లు నిలవ నన్నాయి. మనసైతే మరీ అథ్వాన్నంగా వుంది.
    ఎవరికి వారికి సీతని వంటరిగా పలకరించాలని వుంది. అందరూ అదే ప్రయత్నంలో వున్నారు కాబట్టి ఎవరికీ వంటరి సమయంచిక్కలేదు. సీతని ఒక్కసారంటే ఒక్కసారి పలకరించాలి....ఎలా??
    పడుకున్నదన్నమాటే గాని సీతకి అంతా తెలుస్తూనేవుంది. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ హాయిగా పడుకుంది.
    పనిచేసే కుర్రాళ్ళలో ఏదో మార్పు వచ్చిందని వాళ్ళనో కంట చూస్తున్న అంజమ్మ గ్రహించింది. అంతేగానీ మార్పు ఫలానా అని కనిపెట్టలేక కౌంటర్ లో కూర్చుని తికమక పడుతున్నది.
    పోపు మాడ్చాడు పుల్లారావు.
    రుబ్బిన పిండి రోలుచుట్టూ పడితే గమనించే స్థితిలోలేడు ఓబయ్య.
    సాంబు కాఫీ డికాషన్ లో ప్లేట్లు, కప్పులు కడిగిన నీళ్లు, పాలు అనుకుని పంపేశాడు.
    పనికిమాలిన పనులు చాలా జరిగాయి.
    ఎలాగో అలా సమయం చూసి అరనిమిషం ఒకడు, నిమిషం ఒకడు సీతని పలకరించారు.
    సీత ఏడ్పు ముఖంపెట్టి ఉత్తుత్తి కళ్ళనీళ్లు తుడుచుకుని అటుతిరిగి పడుకుంది- ఓ మాటా, మంచీ లేకుండా.
    "బాదపడకు! నే వున్నాగా?" తననెవరైనా  గమనిస్తున్నారేమో అని భయంగా నలువైపులా చూస్తూ అన్నాడు ఓబయ్య.
    సీత వెక్కిళ్లు పెట్టింది. నే ఏడుస్తున్నా సుమా! అన్నట్లు.....

 Previous Page Next Page