Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 28



                                                                                       27
    మర్నాడు రాత్రి ఎనిమిదైంది.
    సీత అలనాడు సీతాదేవి లాగా అశోకవనంలో బహుశా అశోకవృక్షం కావచ్చు. దానికింది ఓ కాలు ముడుచుకుని, మరో కాలిమీద ముఖం ఆనించి, చేతులు ముడుచుకుని "రామా! రామా!" అని దుఃఖిస్తున్నట్లు కూర్చోలేదు.
    ఈ సీతాదేవి చేర్చబడింది వేశ్యాగృహంలో అయినా, దానిపేరు అశోకవనం అయినా, ఇక్కడ రావణుని బదులు సతీఅనసూయ వున్నా సీత ఓ కాలు ముడుచుకుని మరో కాలిమీద ముఖం ఆనించి ఏడుస్తూ కూర్చోలేదు. "ఇక్కడినుంచి ఎలా తప్పించుకోవాలి?" అని ఆలోచిస్తున్నది.
    సీత వున్న ఏ.సి. రూము, అశోకవనంలోలా చల్లగానే వుంది ఏ.సి. రూములో వెన్నెల పడదు కాబట్టి ఎలక్ ట్రిసిటీ లైటు  వెలుగుతున్నది.
    సీత కాలుగాలిన పిల్లిలా, బోనులోబంధింపబడిన సింహంలా అటూ ఇటూ తిరిగింది. కాసేపయిం తర్వాత కాళ్ళు నొప్పులుపుట్టాయి. వెళ్ళి సోఫాలో కూర్చుంది. కాసేపయిం తరువాత నడుంనొప్పిపుట్టింది. సోఫాలో కాళ్ళుజాచి పడుకుంది. ఆలోచిస్తున్నది. అయిడియా రావటంలేదు.
    సాయంత్రం సతీఅనసూయ తన మూకతో అంటే అరుంధతీ, అహల్య, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, సుమతి, శకుంతల, ద్రౌపతి, రుక్మిణి అలివేలుమంగలతో సీతవద్ద కొచ్చింది. అందరూ చక్కగా ఆలంకరించుకుని వున్నారు.
    "నేనెందుకొచ్చానో తెలుసా?" అంది సతీ అనసూయ నడుంమీద చేతులుంచుకుని.
    "నీ అవసరానికి" అంది సీత.
    "రైటే, అలా రైటుగా చెప్పటం నీకు బాగాచేతవు. మావాళ్లు చక్కగా రతీదేవిలా అలంకరిస్తారు, చెప్పినట్లు వినుకో. నీకంతా మంచే  జరుగుతుంది. రాత్రికి మాట్లాడిపెట్టాను. వాడు మంచివాడు, గట్టివాడు, కొత్తపిల్ల కావాలన్నాడు. వయసుకూడా పెద్డదేం కాదు. ముఫైదాటి నలభైలోపు."
    "ఇంకాపేసెయ్యి వెధవసోది." అంది సీత సాంతం వినకుండానే.
    అక్కడికది ఆపేసి "నీతో చెప్పటం నిజంగా సోది. వీళ్ళు అలంకరిస్తారు. నోరుమూసుకుని విను." అంది సతీఅనసూయ.
    "వీళ్ళచేత నువ్వే  ఆలంకరింపజేసుకుని వాడిదగ్గరకు నువ్వేవెళ్ళు." అంది సీత.
    "నోరు ముయ్యవే. ఏంచూశాధైర్యం. ఏం చూశా మిడిసిపాటు?" అంది సతీఅనసూయ.
    సీత బ్రెయిన్ కేదీ తట్టలేదు. అందుకే తిక్కతిక్కగా వుంది. సతీ అనసూయ రావటంతో తిక్క మరింత ఎక్కువయింది.
    "ఎవరినోరు ముయ్యను? నీ నోరా? నీ పెంపుడు కూతుళ్ళనోళ్లా?" అంది సీత. 
    "ఇదిగో పిల్లలూ! దీంతో లాభంలేదుగాని, నలుగురు పట్టుకుని దాన్ని అలంకరించండి." అంది సతీఅనసూయ.
    దాన్ని.....అంటే, సీతని పట్టుకోటానికి ఆ నలుగురూ దగ్గర కొచ్చారు.
    సీత నలుగురినీ దగ్గరకు రానిచ్చింది. సీతకి పల్లెటూరివాళ్ళ కొన్ని పట్లువచ్చు. చిన్నపిల్లప్పుడు చూసి నేర్చుకుని, వంటరిగా స్నానం చేసేటప్పుడు స్వయంగా  సాధన చేసేది. స్నానాలగదిలో చేసేది కాబట్టి అదెవరికీ తెలియదు. సీత తల్లి సీతని అప్పుడప్పుడూ "నువ్వుమగాడిగా పట్టాల్సినదానివి. పొరపాటున ఆడదానిగా పుట్టించాడు. అన్నీ మగరాయుడి వేషాలే." అంటూ ముద్దుగా కోప్పడుతుండేది. కారణం.....? సీత  అవలీలగా చిన్న బియ్యబ్బస్తాలెత్తి అవతల పెట్టటం. పెద్ద నీళ్ళకాగు వుంది- దాన్ని సీత ఒక్కటే మోయటం.  అన్నీ ఇలాంటి చిన్నచిన్న పనులు చేసే సీతని వాళ్ళమ్మ "మగరాయుడివి కావలసింది."  అంది.
    సీతకి కొన్నిపట్లు వచ్చుగాబట్టి నలుగురినీ దగ్గరకు రానిచ్చింది. "నన్ను  ముట్టుకున్నారంటే మీ కీళ్ళు విరుగుతాయి." అంది.
    "మేమేం చేతులు ముడుచుకు కూర్చోలేదు." అంటూ సీతని పట్టుకోబోయారు. సీతకి ఎన్ని నీతులు చెప్పినా పతివ్రతగా వుండటం వాళ్ళకి కష్టంగా వుంది. వీళ్ళవద్ద లేంది సీతవద్డ వుంది. అది పోతేగాని ఏళ్లబాధ తీరదు.
    సీత ఉత్త చేతులకిమాత్రమే పనికల్పించింది.
    "ఫట్.....ఫట్......ఫట్......ఫఠా......ఫట్......
`    నలుగురూ ఎగిరెళ్లి అంతదూరాన పడ్డారు. తలోకీలు వూడిందో లేదోగాని "అయ్యో, అమ్మో."  అంటూ అయ్యని, అమ్మని తలుచుకుని గావుకేకలేశారు.
    నలుగురు కింద పడేటప్పటికి మిగిలిన ఆరుగురూ ముందుకి దూకారు.
    స్టంట్ సినిమాలో హీరోలా రెడీగా నుంచుంది సీత.
    "ఆగండి." పెద్దగా అరిచింది సతీఅనసూయ.
    ఆరుగురూ ఆగారు. నలుగురు "అయ్యో, అమ్మా!" ఇంకా ఆప లేదు.
    "దాన్నలా వదిలేయండి. పోతురాజుని పంపిస్తాను." వాళ్లతో అని సీతవైపు తిరిగి "పోతురాజంటే ఎవరనుకున్నావు? యమధర్మరాజు కొడుకు రాత్రికి వాడొస్తాడు. సర్దాగా కు కుస్తీపట్టు. నీకురాని కొత్తపట్లు నేర్పుతాడు." అంది సతీఅనసూయ.
    "పోతురాజు దేనికి?  యమధర్మరాజునే పంపు." అంది సీత."
    "తెల్లారితేగాని నీ పొగరణగదు." అని తనవాళ్లందరినీ వెంటబెట్టుకుని సతీఅనసూయ గదిలోంచి వెళ్లిపోయింది.
    "తనని మామూలువాడు లొంగదీసుకోడని సతీ అనసూయ గ్రహించింది. అందుకే ఏ దున్నపోతునో పంపటానికి నిశ్చయించుకుని ఆమాట చెప్పి వెళ్లి పోయింది. కొత్తవాడిని పంపదు. అందుకే తనని ఇలాగే వదిలేసింది. దాని మోచేతి నీళ్లు తాగే రౌడీవెధవ రాబోతున్నాడు. ఏంచేయాలి?"
    "ఏంచేయాలి?" అనేది సాయంత్రం నుంచి సీత ఆలోచిస్తూనే వుంది.
    మెల్లగా తలుపులు తెరుచుకుంటున్నాయి. సీత తలుపువైపు చూస్తూ లేచి నిలబడింది.
    దేముడు భోజనం పళ్లెంతో వచ్చాడు.
    సతీఅనసూయ అప్పుడే ఈనిన ఆడపులిలా చూస్తూ గుమ్మంవద్దనుంచుంది.
    వాళ్లిద్దరినీ తోసి గదిలోంచి బైటకెళ్లటం కష్టం  అని సీతకి తెలుసు.
    "ఏమయ్యా దేముడూ. ఇవాళేంచేశావు అన్నంలోకి ఆధరవులు?" అంది సీత."
    "ఇది పిల్ల కాదు, పిడుగు." అనుకుంది సతీఅనసూయ.
    తీరుబడిగాకూర్చుని కావాలని మధ్యమధ్య సతీఅనసూయని చూస్తూ సుష్టుగా భోం చేసింది సీత. చేసి....చెయ్యి కడుక్కుంటూ....." బాగుందోయ్ దేముడూ! భోజనం. నీ పేరు దేముడేమిటి శుభ్రంగా భీముడు మార్చుకో." అంది.
    సతీఅనసూయ అక్కడే వుండటంవల్ల దేముడు మాట్లాడలేదు. సీత తిన్న ఎంగిలి పళ్లెం తీసుకున్నాడు.
    "రెడీగావుండు. పదింటికి పంపుతాను." అంది సతీఅనసూయ.
    "రెడీగానే వున్నాను." అంది సీత.
    సతీఅనసూయ "నీ పోగరెంతసేపులే." అన్నట్లు చూసి దేముడితో వెళ్లి పోయింది.
    "తను రెడీగా వున్నావుండకపోయినా తప్పదు. ఎలా ఎదుర్కోటం?" అని భోజనం అయింతరువాత తీరుబడిగా ఆలోచించింది కడుపునిండటంవల్ల బుర్ర చురుగ్గా పనిచేసింది. కారణం.........బల్లమీద వైరుముక్క రెండుబారలున్నది కనిపించింది.
    కొందరికి ప్రమాదం ముంచుకొస్తుంటే వెంటనే ఏం చేయాలి అనేది ఎదుర్కోటం, మొండి ధైర్యం, తెగింపు వస్తాయి. సీత ఆ కొందరిలో ఒకతి.
    సీత చురుగ్గా లేచి వైరు అందుకుని స్విచ్ బోర్డ్ వద్దకు నడిచింది.
    ఓ స్విచ్ కి వైరు కనపడకుండా ముడేసింది. తర్వాత వెళ్ళి సోఫాలో కూర్చుంది.
    రాత్రి పదిన్నరయింది.
    తలుపులు మెల్లగా తెరుచుకోటం సీత చూసింది. ఒక్కంగలో స్విచ్ బోర్డ్ వద్దకెళ్ళి నిలబడింది. వైరుని చేతిలోకి తీసుకుంది.
    ఆంబోతులావున్న పోతురాజు గదిలోకి వచ్చి తలుపేశాడు. సీత సంగతి సతీ అనసూయ చెప్పి పంపిందేమో? పోతురాజు గదిలోకి రాగానే తొడమీద, జబ్బమీద చరుచుకున్నాడు- నా బలంచూడు అన్నట్లు.
    "ఏడ్చావ్?" అన్నట్లు చూసింది సీత.
    పోతురాజు రంకెవేశాడు. "పిల్లోయ్! నా సంగతి తెలీదులా వుంది" అన్నాడు.
    "ఏంటోయ్ నీ సంగతి." అంది సీత.
    "అబ్బ......అబ్బ.....ఏం పొగరు?  ఏం చూపు? తస్సదియ్య. ఆడదలా చూస్తూంటే చెట్టంత మగాడు  అయిసైపోతాడు కదే?" అంటూ పోతురాజు సీతవద్దకు రాబోయాడు.
    "ఆగు. దగ్గరకొచ్చావంటే చస్తావ్!" అంది సీత.
    "సీతమ్మవారిని కాదు, సీతని. చూడు నా చేతిలో ఏముందో? ఎలెక్ట్రిక్ వైరు దీని చివర చూశావా? రాగితీగ కనపడుతున్నది. ఈ తీగ అటువైపు స్విచ్ కి బిగించాను. అంటే ఇప్పుడు దీంట్లోంచి కరెంటు పాస్ అవుతున్నదన్నమాట. నాకు మంత్రాలు రావు. శాపం పెట్టటమూరాదు. ఎలెక్ట్రి సిటీతో వైరింగ్ పనివచ్చు. నువ్వొస్తావని రెడీచేశాను. నన్ను ముట్టుకుంటే మాడి మసికావుగాని, ఈ వైరు చివరిభాగం నీకు తగిలిస్తే కన్నుమూసి తెరిచేంతలో నీవుండవ్ మసిబారిన నీ శవం వుంటుంది." అంది సీత.

 Previous Page Next Page