"ఏంటీ..... ఏంటీ.....?" అని కంగారుపడి ఆతర్వాత అక్కడేఆగి ఆలోచించి....." ఆవైరు నాకు తగిలించకముందే నీకు తగిలిస్తే! లేక గబుక్కున నిన్ను కౌగలించుకుంటే?" అన్నాడు పోతురాజు.
"నావంటిమీద ఎవరు చెయ్యివేసినా, వాడినన్నా చంపుతాను. నేనన్నా చస్తాను. అంతేగాని చచ్చినా లొంగిపడుండను." అంది సీత.
పోతురాజు ఆలోచిస్తూ వుండిపోయాడు.
"ఏంటి ఆలోచిస్తున్నావు? నే చెపుతున్నది అబద్దమనా? నా బుజ్జినాయనే. అబద్దమో, నిజమో రా, చూద్దువుగాని! నీకే చెప్పేది. రమ్మంటుంటే? చావటానికి నేనెప్పుడో తెగించేశాను. ఒకరినిచంపి చద్దామని....... అంతే, అప్పుడుగాని నాకసి తీరదు. ఊ.....నీకే, ఏంటీ మొద్దులా నుంచున్నావు? వస్తావా? రావా? చస్తావా?చావవా?" ప్రాణంతీసుకోటం, ప్రాణం తీయటం చాలా తేలికవిషయం అన్నట్లు వైరుని కిందికి' పైకి ఆడిస్తూ నిర్లక్ష్యంగా కవ్విస్తూ అంది సీత.
సీత అన్నింటికీ తెగించిందని పోతురాజు గ్రహించాడు. భయంతో ఓ అడుగు వెనక్కివేశాడు.
గది దద్దరిల్లేటట్లు నవ్వింది సీత.
"అరె! నువ్వింత పిరికివాజమ్మవా?"
"ఆయ్?" అంటూ ముందుకు దూకబోయి సీతచేతిలో వైరుచూసి ఆగిపోయాడు పోతురాజు.
"నేపోతున్నాను."
"నేరమ్మంటే వచ్చావా? పొమ్మంటే పోవటానికి? నీఇష్టం. పోతావో వుంటావో సతీఅనసూయతోచెప్పి వెళ్లు." అంది సీత.
"హూ!" అని పోతురాజు తలుపులు తీసుకుని బైటికెళ్ళిపోయాడు.
"పిరికిపంద, బుద్దితక్కువవాడు," అనుకుంది సీత.
సతీఅనసూయ తెలివిగా ఏ.సి.రూమ్ కట్టించింది. తలుపులకి లోపల గడియలులేవు. ఎటాచ్ డ్ బాత్ రూమ్. ఎటాచ్ డ్ లెట్రిన్ వున్నాయి. వాటికి లోపల గడియలేదు.
సీత ఆలోచించింది. తలుపులు గడియబెట్టి లోపలుండటానికి ఎన్ని గంటలుండగలదు? ఎన్ని రోజులుండగలదు? పారిపోవటానికి మార్గంలేదు. గదితలుపులు బైట గడియవేస్తున్నారు. బహుశా కాపలాకూడా వుందేమో? చేతనైనంతవరకు పోరాడటం, ఆతర్వాత.......? జరిగిం తరువాతగదా! నిర్ణయం. విజయమో! వీరస్వర్గమో! అన్నట్లు మొండిగా పోరాడాల్సిందే. కంఠంలో ఊపిరుండగా తననిర్ణయం మారదు.....మారదు.....ఈదఫా ఏం జరగనుందో! పోతురాజు పోయాడుగా! తెలుస్తుంది.
అమ్మ, అక్క, చెల్లి తనగురించి ఏమనుకుంటున్నారో? అమ్మ నోట్లో నాలుకలేనిది. తోడు చెల్లివుంది. కాని అది ఏంచేస్తుంది? కంసుడి లాంటి మామయ్య దాపురించాడు. అక్కడ వాళ్ళెలావున్నారో? తను మళ్ళీ వాళ్ళని చూడగలుగుతుందా? ఏమో? చూడమ్మా! ఇల్లువిడిచి రావటంవల్ల ఆడపిల్లకి ఎంతబాధో? ఇంట్లోవున్న అక్కమాత్రం బాధపడటంలేదా? ముందు సీత బాధగా కణతలు రుద్దుకుంది.
తర్వాత ధైర్యంగా తననితానే సమర్తించుకుంది, సతీఅనసూయగాని మరెవరైనా గాని వస్తారేమో అని సీత అర్థరాత్రిదాకా మెలకువగావుంది. ఎవరూ రాలేదు.
ఒంటిగంట తర్వాత సీత నిద్రపోయింది.
28
తెల్లవారింది. టైమ్ ఏడయింది.
రాత్రి ఒంటిగంటదాకా మేలుకునివుండటంవల్ల సీతకి అప్పుడు మెలుకువవచ్చింది. కళ్ళు నులుముకుంటూ, ఆవలించి ఒళ్ళువిరుచుకుని లేచికూర్చుంది.
రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది. స్విచ్ కి వేలాడుతున్న వైర్ ని చూసి నవ్వుకుంది. "చావంటే ప్రతివాళ్ళకీ భయమే. మరి తనకో? చావుకి తెగించిన తను భయపడటమేమిటి? డోంట్ కేర్. ఇవాళైనా రేపైనా మృత్యుదేవత దర్శనం తప్పదు. ఎస్.....తప్పదు." అనుకుంది. లేచివెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. తీరుబడిగా సోఫాలో కూర్చుంది.
పావుగంటయింది.
ఇంతవరకు సతీఅనసూయ దర్శనంకానందుకు సీతకి ఆశ్చర్యంగా వుంది. కారణం ఊహించలేకపోతున్నది.
ఉన్నట్లుండి గదిలో చల్లదనం ఆగిపోయింది. లైటు ఆరిపోయింది. గదంతా చీకటి ఆవరించింది.
సీతది బ్రిలియంట్ బుర్ర. జరిగింది ఊహించి నవ్వుకుంది.
ఐదునిముషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
తలుపులు బార్లాతెరవటంవల్ల గదిలోకి వెలుగువచ్చింది.
సతీఅనసూయ, ముగ్గురు మగవాళ్ళు గదిలోకి వచ్చారు. మగవాళ్ళ చేతులకి రబ్బరుతొడుగులున్నాయి.
సీత సోఫాలోంచి లేవలేదు. మామూలుగా కూర్చున్నదల్లా వీళ్లని చూసి కాలుమీదకాలు వేసుకుంది.
ఇద్దరు మగవాళ్లు ఒకేఅంగలో సీతనిచేరి సోఫాలో అటోకడు, ఇటోకడు కూర్చొని సీతచేతులు గట్టిగాపట్టుకున్నారు. ఇంకోడు స్విచ్ బోర్డువన్ద కెళ్ళాడు.
సీత మాట్లాడలేదు, గింజుకోలేదు, గుంజుకోలేదు.
స్విచ్ బోర్డువద్ద కెళ్ళినవాడు పకపకా నవ్వుతూ ఇవతలికి వచ్చాడు.
"ఏమైంది?" అంది సతీఅనసూయ.
"భలే......భలే......భలే భలే, ఏంతెలివి? స్విచ్ కి రాగివైరు కనపడకుండాచుట్టి వైరుకనపడేటట్లుచేసి భలేబాగా బెదిరించింది, ఇదిముట్టుకుంటే షాక్ కొట్టదు, చావరు." అన్నాడు వాడు.
సతీ అనసూయ ఎప్పుడూ ఇంతఅధ్వాన్నంగా తెల్లబోలేదు. పెద్ద పెద్దవాళ్లని బోల్తాకొట్టిన తను.....నిజాయితీగల ఇన్ స్పెక్టరొస్తే తెలివిగా గుట్టుచప్పుడుగాకుండా వ్యవహరించే తను ఈ పిల్లచేతిలో యింతఘాటుగా మోసపోవటమా? రాత్రి తను అబ్బీపేటలోవున్న యింటికివెళ్లింది. కొట్టమ్మాయిలను తనవాళ్లు పట్టుకురావటంవల్ల ఇద్దరమ్మాయిలూ రంభా ఊర్వశి నిమించిన అందంతో వున్నారు. ఐతే వాళ్లవయసు పన్నెండుమ్ పద్నాలు గేళ్లు మాత్రమే. వాళ్లని బాంబేలో హొటల్ కికాని, యితరదేశానికిగాని అమ్మొచ్చు. బోలెడులాభంకూడా. వచ్చినచిక్కల్లా ఆపిల్లలు పెద్దపదవిలో ఉన్నా ఒకాయన కూతుళ్లు. ఏకొంచెం బైటపడ్డా తన అన్నికొంపలూ మునుగుతాయి. పలుకుబడి, ధనము రెండూ ఎక్కువగానే వున్నాయన కాబట్టి వెంటనే అన్నిచోట్లకి ఫోన్లుపోయాయి. గాలింపు, బందోబస్తు ఎక్కువైంది. అందుకే తను జాగ్రత్తగా రెండోకంటికి కానరానిచోట దాచింది వాళ్లని. అలాంటి తనని ఈసీత ఇంతఘాటుమోసం చేస్తుందా? దీన్నేం చేస్తే లొంగుతుంది.
"ఏంచేయమంటారు?" తనుచెప్పిన మాటకి షాక్ తగిలి చచ్చిందేమోనని సతీఅనసూయ మొహంలో మొహంపెట్టి అడిగాడు వాడు.
"వెళ్లు. వెళ్ళి మెయిన్ స్విచ్ వెయ్యి. వెధవలాగా నాముఖం చూస్తావేమిటి?" గయ్యిమని లేచింది సతీఅనసూయ.
సతీఅనసూయ మోచేతినీళ్లు తాగేవాడు కాబట్టి తలోంచుకుని బైటి కెళ్ళిపోయాడు వాడు.
సతీఅనసూయ సీతవద్డకొచ్చింది. లాగిచెంపకేసి ఒక్కటిచ్చుకుంది. సీత కయ్యిమనలేదు.
"నిన్ను చంపినాపాపంలేదు. నిన్ను కృష్ణలో కాళ్లూ చేతులూకట్టి పడేసినా పాపంలేదు వందమందిచేత వరసగా చితకదొక్కించినా పాపం లేదు." పాపంమాటలంది సతీఅనసూయ.
సీత నోరువిప్పలేదు.
సతీఅనసూయకి సీతని చూస్తున్నకొద్దీ చాలా అవమానం జరిగినట్లు ముల్లులా అంతరంగంలో పొడుస్తున్నది. "చాతగాని దద్దమ్మా!" అని ఎవరో అన్నట్లు వినిపించింది. ఎప్పుడూ ఆలోచించనంత దీర్ఘంగా ఆలోచించింది. తల పంకించింది. కసిదీర నవ్వుకుంది. తన తెలివికి తనే మురిసిపోయింది.
సతీఅనసూయ మనసు చల్లబడింది.
గదిలో లైటు వెలిగింది, గదంతా చల్లదనం ఆక్రమించుకుంది.
సతీఅనసూయ స్విచ్ నొక్కింది.
బిలబిలమంటూ పదిమంది పతితలు వచ్చారు. రాగానే "ఏంటేంటి?" అన్నారు. నైట్ డ్యూటీ చేసుండటం వల్ల నలిగిపోయివున్నారు, అలిసిపోయివున్నారు. కళ్లు తెరుచుకునే వున్నారుగాని, ముఖాలు నిద్రపోతూనే వున్నాయి.
సతీఅనసూయ జరిగిందంతా చెప్పింది. జరగబోయేది చెపుతా వినమంది.
అందరూ వినటానికి చెవులప్పగించారు, సీత కూడా.
"ఈ సీత నన్ను చాలా అవమానం చేసింది. కాబట్టి నేను వూరుకోను. ద్రౌపతి కథ తెలుసు కదా?" అంది సతీఅనసూయ.
"నా కథ వీరందరికీ తెలుసుగా! మళ్లీ దేనికి?" అంది ద్రౌపతి.
"నీ కథ కాదు, భాగవంతలో ద్రౌపతి." అంది సతీఅనసూయ.
"భాగవంతలో ద్రౌపతి లేదు- భారతంలో వుంది." సీత నవ్వుతూ అంది.
"నువ్వు నోరు మూద్దూ! పెద్ద పతివ్రతవి బైలుదేరావు." అని కసిరింది.
సీత మరోసారి నవ్వి వూరుకుంది.