Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 26


    సీత మాట్లాడలేకపోయింది.
    "ఏం కన్నతండ్రి చెరిచాడంటే నమ్మశక్యం కావటం లేదా? వింతగా వుందా? తండ్రి అంటే మగవాడు. వాదిబుద్ది చూపించాడు. నావిషయం చూడు. నాపేరుసుమాతి. మాఅమ్మ  పేరు శాంతమ్మ. పేరుకితగ్గట్లే శాంతంగా వుండేది. మానాన్న లేరు. మేము ఐదుగురం అప్పచెల్లెళ్ళము. మమ్మల్ని పోషించటానికి తననితాను పోషించుకోటానికి కుట్టుమిషన్ ఆధారంతో జీవితాలు వెళ్ళదీసేది. ఇంట్లో మేము, లోకులు అదేనిజం అనుకున్నాము. కానీ అది నిజంకాదు. అమ్మకో విటుడున్నాడు. వాడు లారీడ్రైవరు. మధ్యమధ్య అమ్మదగ్గరకువచ్చి అమ్మ అవసరం, తనవసరం తీర్చుకుపోయేవాడు. వాడికళ్ళు ఓరోజు నామీదపడ్డాయి. అమ్మ ఆమోదించి వాడితో నన్ను సినిమాకని పంపింది. అంతక్రితం వాడు మాయింటికొచ్చి వెళ్తుంటే అమ్మకి దూరపుబంధువు, మామయ్య వరసయ్యేవా డనుకున్నాము. వాడు నన్ను సినిమాకు తీసుకెళ్ళలేదు. వాడి రూమ్ కి తీసుకెళ్ళి- వాడూ ఇంకో డ్రైవరుకలిసి నోరుతెరవటానికి వీలులేకుండా ఒకడు సాయంచేస్తుంటే వాడిముందే వీడు, వీడిముందే వాడు చెరిచారు. తర్వాత అతిజాగ్రత్తగా అమ్మకి అప్పగించారు. అమ్మ కోప్పడలేదుసరికదా? పెద్దఖాతాలు నాలుగు చూసుకుంటే సుఖంగా బ్రతకుతానని ఏడ్చాను. అమ్మ వినిపించుకోలేదు. నన్ను ఆ డ్రైవరుగాడే  వాళ్ళకి, వీళ్ళకి తార్చేవాడు. ఎక్కువడబ్బు అమ్మకిముట్టేది. ఓరోజు ఓకొత్తాయనతో వుండాల్సివచ్చింది. వాడు  నన్ను సతీఅనసూయకి అప్పగించాడు. ఆ తర్వాత కథ నాకుతెలియదు. ఇదే నాలోకం, వెళ్లే నావాళ్ళు. అమ్మ ఏనాడు నన్ను డ్రైవరుకి అప్పగించిందో ఆనాడే  నాదృష్టిలో మరణించింది. ఆరోజునుంచి అమ్మ నాకులేదు. ఏనాడోచచ్చిన అమ్మకోసం నేనెందుకు బాధపడాలి? చెప్పుసీతా! ఇందాక కన్నతండ్రి ఇలా చేశాడా? అని ఆశ్చర్యపోయావు, కన్నతల్లి ఇలాచేస్తుందా?" సుమతి కఠినంగా ప్రశ్నించింది.
    సీత పెదవులు కదులుతున్నాయి. మాట బైటికిరావటంలేదు.
    సీత ఆలోచిస్తున్నది.
    "ఏమిటీ కథలు! ఈ సీతాకోకచిలుకల వెనుక ఇంతంత కథలున్నాయా? ఎక్కడో ఏదోఒకటి జరుగుతుంది. ఎవడో దుర్మార్గుడు రేప్ చేస్తాడు. ఎక్కడో ఓ స్త్రీకిమాత్రమే అన్యాయం జరుగుతుంది. దీనికంతా కారణం పురుషుడు. అంతే, ఈ నగ్నసత్యాలన్నీ వింటుంటే లోకంమీద బ్రతుకుమీద ఏవగింపు కలుగుతున్నది. తెగించటానికి ఎందుకు భయపడాలి? తెగించి ఎదురుతిరిగి తాడోపేడో తేసుస్తే? పోనీ చస్తే......? ఉండి సాంధించలేనివాళ్ళు చచ్చిసాధించాలి. చావటానికే ౩క్కువధైర్యం కావాలి? వీరులు అందుకనే విజయమో వీరమరణమో కోరుకునేవారు. కంఠంలో ఊపిరున్నంతవరకు ఎదురుతిరిగి పోరాడాలి. ఎదురుతిరిగి పోరాడితే విప్లవం చెలరేగుతుంది. విప్లవంలేపేది వీరులు వీరులు తలుచుకుంటే విజయం.  ఒకరు మారితేచాలు వందమంది మారటానికి దారేర్పాడుతుంది కాబట్టి......."
    "సీతా!"
    సీత ఆలోచనలు చెదిరాయి.
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" సావిత్రి అంది.
    "మీగురించే!"
    "మా గురించా? ఏమిటి?"
    "మీ సున్నితమైన హృదయానికి గట్టిదెబ్బతగిలి హృదయం కరకు వారిపోయింది. గతానికి బాధ్యులెవరైనాకానీ, ఇప్పుడు మనం దీనికి బాధ్యులం కావద్దు. మారదాం, సమాజంలో మార్పుతెద్దాం. మార్పనేదిఇప్పటికిప్పుడు జరక్కపోయినా మరో పదేళ్ళకైనా తప్పక జరుగుతుంది. నాతో చేతులు కలపండి, ఏంచేయాలో చెపుతాను. 'ఎస్', 'నో' ఏదోఒకటి చెప్పండి."
    "నో."
    "నో."
    "నో."
    అందరి నోట్లోంచి కూడబలుక్కున్నట్లు "నో" అనే వచ్చింది.
    "జీవితంలో బ్రతకనేర్వటం చేతగాక సంసారసౌఖ్యం తెలియక ప్రతిచోట మీకథలాంటి కథే వుంటుందని అనుకుంటున్నారు." సీత ఏదో చెప్పబోయింది.
    "నువ్వు మారవు, మమ్మల్ని మార్చలేవు. ఐనా మేము మరము. చివరిగా ఒకటిచెపుతాము-నమ్మి తేనమ్ము! లేకపోతేలేదు. ఏఊరిదాకానో వద్దు. ఈవూరే తీసుకుందాం. పెద్దపెద్దవాళ్ళు మావద్దకొస్తుంటారు. చీఫ్ రకాలు పేవ్ మెంటుమీద చీకటిసందుల్లోకి పోతుంటారు. చాలీచాలని జీతాలతో కష్టపడలేక, సుఖపడలేక ఉట్టికి స్వర్గానికి మధ్యలో  ఊగులాడుతుంటారు మధ్యరకం సంసారులు. వాళ్ళల్లోమళ్ళీ ఇంటింటికోకథ. భార్యా భర్తలుకీచులాడుకోరు, ఏకాభిప్రాయంతోనేవుంటారు. వెతికివెతికి అద్దెఇల్లు మారుమూలగానో, వంటరిగా మేడమీదనో తీసుకుంటారు. స్నేహితుల్లా వచ్చిపోతుంటారు విటులు. అక్కడ భర్త బ్రోకర్ గా వ్యవహరిస్తాడు.
    ఆఫీసులో ప్రమోషన్ రావాలి. అయ్యగారికి పెళ్లానప్పగిస్తాడో ప్రబుద్దుడు. ఉద్యోగంకావాలి ఒకడికి. నీభార్యని ఓరాత్రి నా దగ్గరకు పంపితే ఉద్యోగం ఇస్తానంటాడు. ఉద్యోగం కావాల్సినవాడికి పెళ్ళయి వుండదు. మాలాటివారిని తాత్కాలికంగా ఓరోజు పెళ్ళాంగా నటించడానికి డబ్బిచ్చి తీసుకెళతారు. ఇదే నాభార్య అని అప్పగిస్తాడు.
    ఓ ఇల్లాలు భర్తని ఆఫీసుకి పంపిస్తుంది. మధ్యాహ్నంపూట ఎవరినో ఒకరిని రప్పించుకుని మూడునాలుగు సంపాదిస్తుంది. కోరికలు మహా విచిత్రంగా వుంటాయి. ఒకేసారి ఇద్దరుముగ్గురు పురుషులు ఒకేగదిలో వుండి ఒకస్త్రీతో గడుపుతారు.
    వింటున్న సీత "ఛీ....." అంది.
    "ఛీ, కాదు వాస్తవం చెపుతున్నాను. అలా చేసేది ఎవరో తెలుసా? మామూలు సంసారం చేస్తూ. మధ్యతరగతి గృహిణులు, అద్దెకుండేవారి భాగోతం ఇంటివారికి తెలియదు. ఇలాఇంటా, బైటా, చాటునా, మాటునా సంసారాల్లోనూ, సానికొంపల్లోనూ, ఒకే కథలు జరుగుతున్నాయి." అంది అహల్య.
    సీతకేం మాట్లాడాలో తెలియలేదు.
    వాళ్ళు మారరు- తేలిపోయింది. లోకంలో ఏం జరుగుతున్నాయో అదీ తెలిసిపోయింది. తను..... తను..... ఏం చేయాలి?
    "ఏమిటి సీతా ఆలోచిస్తున్నావ్?"
    "ఆ.....ఆ.....ఏం లేదు. న్యాయం ఎక్కడేడ్చింది? పోలీసులే మయ్యారు? అని ఆలోచిస్తున్నాను."
    "మొగుడు 'ముండా' అని తిడితే ముష్టికొచ్చినవాడు కూడా అది విని 'ముండా! బియ్యం వెయ్యవే; అన్నాట్ట. అలాగే సగంమంది పోలీసోళ్ళు మా వద్దకొచ్చి పోతుంటేమ్ ఇంకాథేంటి? ఓవేళ పెద్ద ఇన్ స్పెక్టర్ బాబు గట్టివాడయి వుండి మా ఆచూకీ లాగి రెయిడ్ చేసి పట్టుకుంటే శిక్ష జుల్మానా, మాకు, ఆ వచ్చే పోరంబోకు వెధవలు వదిలేయబడతారు. మమ్మల్ని వదిలి వాళ్ళకి కఠినశిక్షలేస్తే కథే వుండదు. అలాంటి రూల్స్ ఇంకా రాలేదు." అంది అరుంధతి.
    సీత నిట్టూర్పు విడిచింది. "ఈ రోజు నాతో ఇంతసేపు కబుర్లు వేసుకున్నారు, మీకు పనిలేదా?" మాట మార్చి అడిగింది.
    ఉహూ! వారానికోరోజు పుల్ రెస్టు, ఓ బేచ్ అనగా పదిమంది వర్క్ చేస్తారు రేపో పదిమంది ఇలా మారుతుంటాము. వారనికోరోజు పదిమంది గ్రూప్ కి రెస్టు వస్తుంది." అహల్య చెప్పింది.
    "ఏమిటీ? మీ పదిమందిగాక ఇంకా వున్నారా?"
    "ఆ......సతీఅనసూయకి లబ్బీ పేటలో ఓ మేడ, గవర్నర్ పేటలో ఓ మేడ, వన్ టవున్ లో ఓ మేడ, ఇక్కడో మేడ వున్నాయి. అన్నిచోట్లా కాపలా, మంది మార్భలం, మాబోటివారున్నారు."
    "ఇలాంటి సతీఅనసూయలు కూడా చాలామంది వుండి వుండవచ్చుగా?"
    "ఉన్నారు. రంగాజమ్మ, కనకతార, నాగరత్తం, బుడ్డి సత్తెమ్మ, ఇలా కొందరున్నారు. అయితే గ్రేట్ సతీ అనసూయది."
    "అహా......! ఇంతకూ మీరు మారేదేం లేదుగా?" సీత అడిగింది.
    "ఉహూ, మేము మారము.....మారము...... నీసంగతి చెప్పు?" అంది అహల్య.
    "నేనూ, మారను....మారను......మారను.....ఈ  సీతంటే ఏమిటో చూద్దురుగాని అలనాడు అశోకవనంలో సీతని మీరేం చేయలేరు. పేరు అశోకవనం, ఇక్కడవున్నది పతివ్రతల పేర్లుగలవారు, కనీసం  పేర్లన్నా మార్చుకున్నారా? రంభనో, రాక్షసనో, పెట్టుకోవాల్సింది. ఈ అశోకవనాన్ని శోకవనం చేయకపోతే నా పేరు సీతాదేవి కాదు. సీతాదేవి. సరేనా?" గర్జిస్తున్నట్లు అంది సీత.
    "శ్రీరామచంద్రుడు వస్తాడని ధైర్యంలా వుంది." అహల్య అంది.
    "ఏ కోతి అయినా రోల్డ్ గోల్డ్ ఉంగరంతెచ్చి ఇచ్చిందేమిటి?" అంది అరుంధతి.
    "వారధి కట్టడం పూర్తయిందంటావా?" సావిత్రి అంది.
    "వేరే వారధి సారధి దేనికి కృష్ణమీదనుంచి రైళ్ళేళతాయి, బస్సులెళతాయి, స్కూటర్లు, లారీలు, చిన్నకార్లు, ఎద్దుబళ్ళు....."
    "చాలుతల్లీ! మొదలుపెడితే అపవ్." అడ్డుతగులుతూ అంది సుమతి.
    సరస్వతి నోరు మూసుకుంది.
    లక్ష్మి కిసుక్కుమని నవ్వింది.
    సీత వీళ్ళ నవ్వులని పట్టించుకోలేదు. కడుపు మాడ్చుకుంటే ఓపికపోతుంది శక్తివుంటే పోరాడొచ్చు అనుకుంది.
    "ఓసారి దేముడినిపిలవండి." అంది సీత.
    ఏ దేముడిని? నీ శ్రీ రామచంద్రుడినా? మా వంట దేముడినా?" అంది లక్ష్మి.
    "మీ దేముడినే పిలవండి, నాకు ఆకలి మండిపోతున్నది. కాఫీ,  టిఫెన్ కావాలి." అంది సీత.
    "బాబోయ్  సీత మారిపోయింది. దేముడూ! ఓదేముడూ!ఒరేయ్." కేకలు పెట్టింది అహల్య.
    "ఒసేయ్, అహల్యా! ఇది ఎ.సి. రూమ్. నీమతి తగలడినట్లే వుంది. బెల్ నొక్కు." అరుంధతి గదమాయించి అంది.
    అహల్య పొరపాటుకి నాలుక కరచుకుని బెల్ నొక్కింది.
    రెండు నిమిషాలలో దేముడు ప్రత్యక్షమయ్యాడు.

 Previous Page Next Page