ఓసారి చెరచబడినందున పతితలు కారు. ఎందుకంటే మీరు ఎదురుతిరిగారు. మీ హృదయం పవిత్రంగానేవుంది. బలవంతానా చెరచబడ్డారు, అంతే. కాబట్టి మీ శీలం పోలేదు. శీలం పోయిందనుకుని మరో సారి, మరోసారి మగాడికి లోంగిపోతూ, ఈ మురికికూపంలో వుండి స్వర్గాన్ని వూహించుకుంటూ, బ్రతుకుతున్నారే. ఇప్పుడు మీ మనసుకీ శరీరానికీ మలినం అంటింది. ఈ మలినమైన మనసు, శరీరంతో మగాళ్ళని రెచ్చగొడుతున్నారు. ప్రోత్సహిస్తున్నారు. చేతులు జాచి రారమ్మని పిలుస్తున్నారు. ఎక్కడుందీ లోపం మీలో?
వాడు ముండల ముఠాకోరు. అని మగాడిని అంటారు. మగాడిని పిలిచే ముండలే లేకపోతే ముండల ముఠాకోర్లు ఎక్కడుంటారు? చెప్పండి? తప్పెవరిది? లోపం ఎక్కడుంది? మాట్లాడరేం....? మాట్లాడరా...... సమాధానం చెప్పరా.......? సరే, నేనే చెపుతాను....దీనికి కారకులు మీరూ.......మీలాంటివారు......"
గది దద్దరిల్లేటట్లు చప్పట్లుమోగాయి. అందరి మొహాల్లో నవ్వు.
ఆవేశంగా, దీర్ఘ ఉపన్యాసమిచ్చిన సీత రొప్పుతూ సోఫాలో కూర్చుండిపోయింది. "మీరు మారారా?" అంది నిరాశగా. వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఎక్కడా మారేట్లు కనపడలేదు.
"మారటమా? ఏదీ? నీ స్పీచ్ విని? భలేదానివేమ్ ఇదేం సినిమా అనుకుంటున్నావా? మా పరిస్థితులు మమ్మల్నిలా చేశాయి, మాది తలోకథ. తలోరకం కథ అయినా, ఇప్పుడు ఒకే కతలో ఇమడక తప్పలేదు. మేం చెప్పింది విను. మా పరిస్థితులలో నీవున్నా మాలాగా కాకతప్పదు." అంది అలివేలుమంగ.
"మీలాగా అవుతానో, కాదో, అది తర్వాత సంగతి. మీరంతా బలీయమైన పరిస్థితులలో చిక్కుకుని ఇక్కడికి రాబడ్డ కథలేమిటో చెప్పండి. లోపం ఎక్కడుందో అయినా తెలుస్తుంది." అంది సీత.
"వింటావా? అయితే అందరంచెబుతాము మా జీవితాలు-మా కథలు."
"మంచిది, కానీండి."
ముందుగా రుక్మిణి మొదలుపెట్టింది, నా కథ చెపుతానంటూ.
"నా పేరు రుక్మిణి....."
"పేరు తెలుసులే, కథకానియ్." అంది సీత.
22
"మాది పల్లెటూరు. మా నాన్నా మధ్యరకం కుటుంబీకుడు. మా అమ్మ రోగిష్టిది. పీలగా దిష్టిబొమ్మకు చీరకట్టినట్లు, ఆకారానికి ఓ ఆడమనిషిలా వుండేది. మా నాన్నా ఆంబోతంత మనిషి, ఆంబోతులాగానే ఊరికే రంకెలేస్తుండేవాడు. మా అమ్మ సహనానికి, మానాన్న కోపానికి సరిపోయింది. ఇంట్లో ముచ్చటగా ముగ్గరు వెధవముండలుండేవారు. మా నాయనమ్మ, మా మేనత్త, మా పెద్దమ్మ. వాళ్ళముగ్గురూ మూడు పొయ్యిరాళ్లు. ముగ్గురూ ఒకే ఇంట్లో వున్నారు కాబట్టి పల్లెటూరులో కాలక్షేపం కాదుకాబట్టి, కాసేపు వాళ్ళమీద, వీళ్ళమీద చాడీలు చెప్పుంటూ, కాసేపు పోట్లాడుకుంటూ....మరికాసేపు ఎవరికన్నా తగాదాలు పెడుతూ......హాయిగా పిడిరాళ్లులా వుండేవారు.
మా నాన్న ధర్మమా అని మా అమ్మ రోగిష్టిదయినా తొమ్మిది మంది పిల్లల్ని కంది. తొమ్మిదిమందిలో ఆరోదాన్ని నేను. నా ఆరేళ్ళ వయసప్పుడు మా అమ్మ తొమ్మిదో సంతానాన్ని కని బాలింతరాలుగా వుంది. ఆచారం పేరిట ఎన్నో అధర్మాలు జరుగుతున్నాయి. మా మామయ్యకి పెళ్ళాం చచ్చిపోయింది. వయసు ముఫై అయిదేళ్లు. మేనమామ కదా అని వాడిపై జాలిదలిచి ఆరేళ్ల పిల్లని నన్నిచ్చి పెళ్లిచేశారు. ఇంకో ఆరేళ్లు కళ్లు మూసుకుంటే కాపురాని కొస్తుందని పెద్దల అభిప్రాయం. ఆరేళ్ళదాన్ని మరో ఆరేళ్లు పెద్దయ్యాను. వెంటనే మామయ్యా గాడి అవసరానికి పెద్దమనిషిని అయ్యాను.
పెద్దమనిషినైన నెలలోపల మంచిరోజు చూసి మామయ్యాగాడినీ నన్నూ శాస్త్రప్రకారం అన్నీ చేసి గదిలోకి నెట్టి బైట గొళ్ళెం పెట్టారు. పన్నెండేళ్ళపిల్ల దానికి ఏం తెలుస్తుంది? శరీరం ఎంతవరకు ఎదుగుతుంది?
పెద్దవాళ్ళకి బుర్రంటుందిమ్ ఎందుకు? తల బద్దలుకొట్టను? ఏమీ తెలియని పసివయస్సు చెట్టంత మామయ్యగాడు పిట్టంత నన్ను పట్టుకుని తన దాహం తీర్చుకుంటుంటే నా ప్రాణం ఆర్చుకుపోయింది. ఏడ్చాను, కేకలుపెట్టాను. ఇంటినిండా పెద్దవాళ్లున్నారు ఇసుమంతయినా జాలి చూపలేదు.
ఓ యేడాది ప్రతి రాత్రీ నరకం చూస్తూ కాపురం చేశాను. మనుషులకే బుద్దిలేదనుకుంటే, దేముడికి లేదని తెలిసిపోయింది. పదమూడు నిండుతుండగా కడుపోచ్చిన ఆరో నెలలో అయిదురోజులు బాధపడిన తర్వాత కడుపుకాస్తా పోయింది. కడుపునెప్పి బాధ ఓ పక్క నాటు మంత్రసాని మొరటువైద్యం మరోపక్క, అదలా అయిపోయింది.
పద్దెనిమిదేళ్ళొచ్చాయి. శరీరం , మనసు వికసించింది. మామయ్యగాడు 'హరీ' అన్నాడు. అట్ట దొంగతనం, భర్త రంకుతనం నేర్పుతాడని సామెత. అలాగే భర్త వల్ల సుఖపడకపోయినా కోరికలు శరీరాన్ని దాహిస్తుంటే నాలుగో విధవ ముండగా ఇంట్లో తిరుగుతున్న నేను అనుకోకుండా పక్కింటివాళ్ళ అబ్బాయితో సంబంధం కుదిరింది. చూపులు కలిసాయో, మనసులే కలిశాయో తెలియదుగాని వాడితో పొందు స్వర్గంలా వుండేది. చాటుమాటు నాలుగునెలలు సుఖపడ్డాను, కడుపోచ్చింది. ఏంచేద్దాం! అని వాడితోచెప్పి ఏడ్చాను.
వాడు ఏడ్వకని ఓదార్చి, ఆ మర్నాటినుంచి పత్తాలేకుండా ఏదో ఊరెళ్లిపోయాడు. నాఏడ్పు నాకు మిగిలింది? నాసంగతి తెలిసిన తర్వాత నాగురించి మావాళ్ళకి ఏడ్పు ఎక్కువైంది. కొప్పంతో చావగొట్టారు. ఎక్కడ చస్తానో అని చెవులు మూశారు. ఎవరన్నా వింటారేమో అని నా నోరు మూశారు. మా అమ్మ పతివ్రత. మా నాన్న పెద్దమనిషి ఎవరూ చూడనప్పుడు చాలామంది ఆడాళ్ళకి పెనిమిటి. మాఅత్తయ్య, మాపెద్దమ్మ అనేకసార్లు మడికట్టడం దేముడిగుడికెళ్ళటం, పూజలుచేయటం, ఉపోషా లుండటంలాటి గౌరవప్రదమైన పనులు పైకి చేస్తూ "వెధవ ముండని నాకేం కావాలి?" అని వెధవవేదాంతం చెపుతూ చాటుమాటుగా ఏవెధవన్లో కలుసుకుంటూ వుండేవారు అదీచూశాను, ఇదీచూశాను. కాని వాళ్ళపనులు బైటపడేవికాదు. నాబోటిదానికి బైట పెట్టాలన్నా ధైర్యంలేదు, వాళ్ళు తిరిగినా కడుపురాలేదు. నాకు కడుపోచ్చింది____అంతే తేడా.
కొట్టటం, తిట్టటం అంతా అయింతరువాత కడుపుపోవటానికి మందుమింగించే ప్రయత్నంలో పడ్డారు. మాఊళ్ళోనే కడుపుపోవటానికి మందుమింగించే ప్రయత్నంలో పడ్డారు. మా ఊళ్ళోనే కడుపుపోవటానికి మందుమింగింది కనకరత్నం అనే ఆమె. కడుపుపోక వారంరోజులు వెర్రి కేకలేస్తూ బాధపడి ప్రాణంవదిలింది.
మందుమింగితే అలాగే ప్రత్యక్షనరకం అనుభవించి చస్తానేమోనని ఓ అర్థరాత్రి ఇంట్లోవాళ్ళ కన్నుగప్పి పొలాలకడ్డంబడి పరుగులుతీసి రైలుస్టేషన్ కొచ్చి రైలెక్కాను. విజయవాడలో దిగాను.
రైలుదిగి ఊళ్లోకి బైలుదేరాను. తిరిగితిరిగి అలసిపోయి ఓ కొట్టుమూల చోటుచేసుకుని ముడుచుకు పడుకున్నాను. వెంట ఇరవై రూపాయలు, మూడుచీరలు పెట్టుకున్న సంచీమాత్రం వుంది. సంచీని తలకింద పెట్టుకున్నాను. గాఢనిద్ర పట్టింది.
నామీద ఏదోబరువుకి మెలుకువ వచ్చింది. ఒకడు అప్పుడే నామీద పడివున్నాడు. "అరిచావా మావాడు చంపేస్తాడు. కాసేపు మెదలకుండా వుండు." అన్నాడు.
రెండోవాడు పక్కనేవున్నాడు. వాడిచేతిలో కత్తివుంది. భయంతో బిగుసుకుపోయ్యాను.
మొదటివాడు, రెండోవాడు, మళ్ళీ మొదటివాడు, మళ్ళీ రెండో వాడు నానోరు మెదపనియ్యకుండా వాళ్లపని కానిచ్చుకున్నారు.
నీవాలకం సాయంత్రం నుంచీ కనిపెడుతూనేవున్నాము. వంటరిగా ఎక్కడనుంచి వచ్చావు? ఏవూరుమీది పిల్లా!" పనంతా అయింతరువాత తాపీగా బీడీముట్టించి అడిగాడు వాడు.
ఏదో నానోటికొచ్చింది చెప్పాను. "హాయిగా తిండీ బట్టా కరువు లేని చోటుచూపిస్తాము పద." అని నాఇష్టం కనుక్కోకుండానే రిక్షాపిలిచి రిక్షాలో నన్నుకూర్చోపెట్టి ఒకడు నాపక్కన ఇంకోడు నా కాళ్ళదగ్గర కూర్చున్నారు.
సతీఅనసూయదగ్గర బ్రోకర్ నన్ను కొన్నాడు, వాళ్లకి ఓ వంద చేతిలోపెట్టి. తర్వాత సతీ అనసూయవద్ద వెయ్యిపుచ్చుకుని నన్ను అమ్మేశాడు.
సతీఅనసూయ కళ్లముందు స్వర్గంచూపించింది. బాధలేకుండా కడుపు తీయించింది. అప్పటినుంచి హాయిగా జరిగిపోతున్నది. నాఇంట్లో కష్టాలు ఇక్కడలేవు. హాయి....స్వర్గం....సంతోషం...సౌఖ్యం...ఇది మా ఇంట్లోవుంటే దొరికేదా? చెప్పు సీతా!" అంది రుక్మిణి.
"హాయి..... స్వర్గం.... సంతోషం..... సౌఖ్యం..... తియ్యగా చెపుతున్నావు. నిజమే. ఇవన్నీ మీఇంట్లో దొరక్కపోవచ్చు. కాని.....నాఅనే వాళ్లందరూ వున్నారే. వాళ్లనెలా వదల బుద్ధయింది? పసితనం నుంచీ నీ జీవితంలో అన్యాయం, బాధతప్ప మరొకటి అనుభవించలేదు. నీ జీవితం అలా జరగాల్సివుంది జరిగింది. వేదాంతం చెప్పాలంటే నీ లలాటాలిఖితం అది వాస్తవం చెప్పాలంటే అన్నీతెలిసి తెలివితక్కువగా నీ జీవితం మలిచిన పెద్దలది. తర్వాత నీ వయసు ప్రభావం. ఆనకట్టవేయలేని కోరికతో కళ్లు మాసుకు ప్రవర్తించటం. పల్లెటూరి వాతావరణంలో పెరిగి చదువులేక ఏంచేద్దామని ఈ బస్తీవచ్చావు. సతీఅనసూయ కంపెనీచేరి సర్వ సౌఖ్యలు అనుభవిద్దానునా?
మీవాళ్లు మందో, మాకో ఇప్పించేవారు. ఆ కడుపేదో పోయేది. లేక ఆ కనకరత్నానికి పోయినట్లు ప్రాణంపోయేది. అంతేనా? రోజు కొకడిదగ్గర పడుకోటం బాగుందన్నమాట మీఇంట్లో అందరూ కఠినాత్ములైనా కన్నతల్లివుందే! ఆమెకోసం పారిపోరాదనే రవంతజాలికూడాలేదా? తల్లిప్రాణం నీకోసం ఎంత అలమటిస్తుందో ఒక్కసారంటే ఒక్కసారి ఆలోచించావా?
స్వర్గం, సౌఖ్యం అంటూ కబుర్లుచెపుతున్నావు. ఉన్నట్లుండి బ్లడ్ కేన్సర్, హార్టుకిసంబంధించిన జబ్బుల్లాంటివి వచ్చాయనుకో, లేక నీఅందం తరిగిపోతుందనుకో! సతీ అనసూయ కన్నావాళ్లలా నిన్ను చూస్తుందా? గజ్జి కుక్కకన్నా హీనంగాచూసి వీధిలోకి తరిమేస్తుంది. అదే నీవాళ్లయితే మంచో, చెడో తప్పదని విసుక్కుంటూఐనా సరే చచ్చిందాకా చేస్తారు. నిన్ను కనిపెట్టుకునేవుంటారు. కుక్కనితోనట్లు వీధిలోకి తొలి పీడవిరగడైంది అనుకోరు. నేచెప్పింది సరైందా కాదా రుక్మిణీ?" సీత అంది.
"బాగుంది, చెయ్యికాలుతుందని వంటచేసుకోటం మానేశాడట వెనకటికో ప్రబుద్దుడు. అలావుంది నువ్వు చెప్పేది. ఎప్పుడో రోగం రావచ్చు అప్పుడు నీగతి.....? అంటూ సిల్లీప్రశ్నలేస్తావేమిటి? మాఇంట్లోవుండి అందరికీ వెధవచాకిరీచేస్తూ.... అబ్బబ్బ......గతాన్ని గుర్తుచేసి నామనసు పాడుచేయకు." విసుక్కుంది రుక్మిణి.
"నీవొకమనిషిని, నీదోజీవితం, నీకొమనసు." అనుకుంది సీత.
"రుక్మిణికథ పాతచింతకాయపచ్చడి. నాకథ వింటే తెలుస్తుంది." అంది అహల్యం.
"నీ కథాకానియ్యి, ఆలస్యం ఎందుకు? టైమ్ వేస్టు." అంది సీత.
23
"మాదిపల్లె, పట్నంకాని మధ్యరకం ఊరు. మేము లేని వాళ్ళమూకాదు, ఉన్నవాళ్ళమూకాదు. అమ్మా నాన్నకి నేనొక్కదాన్నే సంతానాన్ని నా పదోయేటవరకూ ఉన్నంతలో అల్లారుముద్దుగా పెరిగాను. నాకు పదినిండింది. మా అమ్మ హార్టు ఎటాక్ తో అకస్మాత్తుగా మరణించింది.
అమ్మ శవంముందు "నువ్వెళ్ళిపోయావు నేనెలా బ్రతకను?" అని పెద్దపెట్టున శోకాలుతీసిన మానాన్న అమ్మవుండగా పరాయి ఆడదాన్ని కన్నెత్తిచూడని మా నాన్న అమ్మచనిపోయిన ఏడాదితిరక్కముందే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
మాపిన్ని చిన్నసైజు రాక్షసి. నేను సవతికూతుర్ని నన్ను కష్ట పెట్టినా తిట్టినా అర్థంవుంది. మానాన్నని నానామాటలనేది. నాకు పెళ్లీడు వరకు అమ్మప్రేమకి, నాన్నప్రేమకి దూరమైబ్రతికాను. పిన్నికి ముగ్గురు పిల్లలు పుట్టారు. వాళ్ళకోసం ప్రతిపైసా దాచేది. నాకు చిరిగినగుడ్డలు తప్ప. పట్టుమని పావలాపూలు ఎరగను.
బస్తీలో కుర్రాడితో పెళ్లిచేస్తే ముఖపడతానని మా నాన్న పిన్నికి కాస్తఎదురుతిరిగి నాలుగువేలు కట్నం పోసి కుమార్ అనే అతనికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లయింతరువాత అత్తవారింటి కొచ్చాను. నేనూ, ఆయన రెండు గదుల్లో అద్దెకుండేవాళ్ళం. మా అత్తగారువాళ్ళు పల్లెటూరిలో వుండేవారు.