19
"ఏమంటున్నది సీత?" సతీఅనసూయ గదిలో కాలు పెడుతూనే అడిగింది.
సతీ అనసూయ రాకముందు సీత చాలా అనుకుంది. సతీ అనసూయ రాగానే ఈడ్చి చెంపదెబ్బ కొడదాము, ముఖాన వుమ్మేద్దాము, తిడదాము, ఇలా ఎన్నో అనుకున్న సీత ఏం మాట్లాడలేదు. దీర్ఘంగా ఆలోచిస్తుంది. సతీ అనసూయతో వీలయిన విధంగామాట్లాడి, గుట్టులాగి ఇక్కడ నుంచి తప్పించుకునే విధానం చూస్తున్నది.
పదిమంది పతివ్రతల పేర్లుగల పదిమంది పతితలు, ఇంకా సీతని వదల్లేదు. దేముడు తెచ్చిన కాఫీ, టిఫెన్ తిని సీతున్న గదిలోనే కూర్చున్నారు.
"అడుగుతుంటే ఒక్కరూ మాట్లాడరేమిటి?" సీతవైపు చూస్తూ అంది సతీ అనసూయ.
"ఏం మాట్లాడమంటారు?"
"చెప్పింది విని పిల్ల బెదిరిందని చెప్పుమా?"
"ఏడ్చి గోలచేసిందని చెప్పమా?"
"ఆపండి కాకిగోల. అసలు చెప్పక అవకతవక మాటలు మాట్లాడతారేమిటి? అరుంధతీ! నువ్వు చెప్పు." అంది సతీ అనసూయ.
నోరు తెరిచినవాళ్ళు నోరు మూసుకున్నారు.
సీత నిర్లక్ష్యంగా గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంది.
అరుంధతి చలాకీది, మాటకారి, మొదలుపెట్టింది.
"దేముడు కాఫీ, టిఫెన్ ఇచ్చాడు. తినలేదు. ఇక్కడి కథంతా మేం చెప్పాము వరసపెట్టి అందరినీ తిట్టింది. కొత్తమ్మయిలు కొందరు వింటూనే మూర్చపోయేవారు. ఏడ్చి కాళ్ళు పట్టుకుని ఇంటికి పంపమని గోలపెట్టెవారు. ఎందరినో చూశాము కదా? ఈ సీత అలాంటిది కాదు. తీరుబడిగా విని తాపీగా తిట్టింది. డోంట్ కేర్, అలాంటివి లెక్కచేయమనుకో. తిట్టి తిట్టి, నోరు నెప్పిపుట్టింది కదా? అందుకు ఇప్పుడు నోరు మూసుకుంది." అరుంధతి చెప్పింది.
సతీ అనసూయ "అలాగా?" అని సీత దగ్గరకు వెళ్ళి సోఫాలో సీత పక్కనే కూర్చుంది "సీతా!" పిలుపులో ప్రేమంతా రంగరించి పిలిచింది.
"ఇదేనా నీవు నాకిచ్చే జాబు? మీ ఆయనకీ, నీకూ ఉదారబుద్ది తగలడిందా? లెటర్స్ చదవటం, రాయటం, రెండొందల ఎనభై జీతం, ఆహా.....ఎంత కళకళలాడుతున్నది. రంభా , ఊర్వశి , మేనక, తిలోత్తమలు, స్వర్గలోకంలాగా వుంది. ఈ స్వర్గంలో దేముడుకూడా వున్నాడు. చాలా బాగుంది సతీ అనసూయగారూ?" అంది సీత పళ్ళ బిగువన కోపం ఆపుకుంటూ.
సతీ అనసూయ అలవాటుప్రకారం చిరుమందహాసం చెయ్యలేదు. "ఇదేం పిల్ల? ఈ జానెడు పిల్లకి ఇంత ధైర్యమా? ఔరా?" అని ఆశ్చర్యపోయింది. తర్వాత..... "నువ్వు బాగా పనికొస్తావ్, చురకత్తి లాంటిదానివి." అంది.
"అవును, చురకత్తినే, సమయం చిక్కితే చురకత్తి ఏం చేయగలదో ఎలా చర్రున గుండెలో దిగగలదో చూపుతాను."
"ఛా.....ఛా.....ఇంత ధైర్యంకలదానివి, ఇలాగేనా మాట్లాడాల్సింది. కాలుమీద కాలేసుకుని హాయిగా ణా దగ్గర బ్రతక్క, బ్రతకటానికి రకరకాల ఉద్యోగాలు, ఇదో ఉద్యోగం అనుకో, పిచ్చి పిల్లా? చదువుకున్న దానిలావున్నావ్, పిలిచి ఉద్యోగం ఇచ్చేరోజులు పోయాయని ఆమాత్రం తెలీదా?"
"తెలుసు, అవి గౌరవం గలవి, బాధ్యతగలవి, అందుకే బొట్టుపెట్టి పిలవరు, నువ్వుమాత్రం పిలుస్తావా! నీ విచ్చే ఇంతోటి ఉద్యోగానికి దీనికి తగ్గ రూప లావణ్యాలు చూసుకుంటావే, ఏమిటో పత్తిత్తులా గీతోపదేశం చేస్తున్నది."
సీత ఏమాత్రం జంకకుండా మరీ ముఖాన అంటుంటే సతీ అనసూయకి తన తల నరికి చేతిలోనే పెట్టినట్లు వుంది. పతితలందరికీ పరిశుద్దమైన పాలతో పరవాణ్ణం తాగినట్లువుంది.
"సీతా! మంచిగా మాటలతో లొంగని వారిని ఎలా లొంగదీసుకోవాలో నావద్దవున్న ఆయుధాలు చూస్తే తెలుస్తుంది. అప్పటికీ లొంగకపోతే నీలాంటివారిమీద ప్రయోగించి మరీ లొంగదీసుకుంటాను. గౌరవం, బాధ్యతమ్ ఇంతోటి ఉద్యోగం అంటూ ఏమిటేమిటో వాగుతున్నావు, గౌరవానికి అర్థం తెలుసా? నీ కళ్ళతో నువ్వు చూశావా? తెలిసీ తలియకుండా మాట్లాడకు. మాది కనపడుతుంది. ప్రపంచంలో జరిగేది కనపడదు."
"ఓహొ, నీకు కనపడిందికాబోలు."
సీత వ్యంగ్యంగా తన్నో పురుగుని చూసినట్లు చూస్తూ అనేటప్పటికి సతీ అనసూయకి ఎక్కడమండాలో అక్కడే మండింది.
"గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించినట్లు, పిల్లోచ్చి తల్లికి నీతి బోధించనట్లు చెపుతున్నావే? కొందరు పనిపిల్లలు లేక పాచిపని చేసేవాళ్ళు, అమ్మగార్లు కడుపోచ్చో, కాలు నొచ్చో పుట్టింటి కెళ్ళినప్పుడు, అయ్యగార్లకు తాత్కాలికంగా, రూపాయికీ, అర్థకీ ఇల్లాళ్ళపుతున్నారు. అమ్మగారు పుట్టింటి నుంచి రాగానే గప్ చిప్.
స్టూడెంటు కుర్రోళ్ళు గదులూడవటానికీ, మంచినీళ్లు తేవటానికి కాస్త నదునుగా, చదునుగా వున్నవాళ్ళని పెట్టుకుంటారు. ఇంటివాళ్ళకి తెలిస్తే ఇల్లు ఖాళీచేసి పొమ్మంటారాని, డబ్బిచ్చి మనిషిని రప్పించుకోకుండా, బోలెడు డబ్బు పోసి పరాయిచోట కెళ్ళకుండా పావలా, అర్థా చేతిలో పెట్టి పనిపిల్లలతో ఆపని కూడా అయిదునిమిషాల్లో ముగించుకుని కుతి తీర్చుకుంటున్నారు.
ఇల్లాళ్లున్నారంటే ఈ భూ ప్రపంచంమీద సగం నిజం పతివ్రతలు సగం కల్తీ పతివ్రాతలు, మొగుడి సంపాదనలో ఇల్లు గడవటం కష్టం. భార్య కష్టసుఖాలు మొగుడి సంపాదనలో ఇల్లు గడవటం కష్టం. భార్య కష్టసుఖాలు మొగుడిగా పట్టించుకోడు. ఎవరితోనో ఒకరితో మొగుడటు ఆఫీసు కెళ్ళగానే సంబంధం పెట్టుకుంటారు. రెండూ, మూడు సంపాదించి వేణ్ణీళ్ళకు చన్నీళ్ళు తోడులా సంసారం ఈదుతుంటారు. ఈ భాగోతం కొందరి మొగుళ్ళకి తెలీదు. కొందరి మొగుళ్ళకి తెలిసి చూసీ చూడనట్లు పోతారు. పెళ్ళాంకథ తెలియనివాడు వెధవ, తెలిసీ నోరుమూసుకున్నోడు వెధవన్నర వెధవ, ఈరకం ఇల్లాళ్ళు ఉపోషాలు, దైవభక్తి, నీతులు, దేముడి గుడిలో సాష్టాంగా నమస్కారాలు, పక్కా పతివ్రతలనుకో?" ఊపిరి పీల్చుకోటానికి సతీ అనసూయ ఒక్క నిమిషం ఆగింది.
"ఈ కథలన్నీ ఎవడిక్కావాలి?" అంది సీత.
"ఈ కథలన్నీ ప్రపంచమంతా సూటికి తొంభై తొమ్మిది మందిలో వున్నాయని చెప్పటానికి."
"చెపితే ఏం ప్రయోజనం?"
"నువ్వు మంచిమాటలతో మారతావని."
"కథలకి, కాకరకాయలకి మారేదికాదు ఈ సీత, నువ్వు చెప్పావే, ఈ ప్రపంచంలో నూటికి తొంభైతొమ్మిది మందిలో మంచి లేదని......ఆ.....తొంభై తొమ్మిది మందిలో నేను లేను. సూరోదాన్ని నేను. కాబట్టి....ఈ సీత మారదు. నీ నీతులకు మూతి కట్టెయ్యి."
"ఊఁ...... నా సంగతి నీకు తెలియక ఏంటేంటో నీతులు చెపుతున్నావు. ఆఖరి మాట విని నీ నిర్ణయం చెప్పేసెయ్యి. నా నిర్ణయం చెపుతాను, సరే, నిన్ను వదిలేస్తాను. బయటికెళతావు. వంటరాడదాన్ని ఈ మొగకాకులు ఊరుకోవు. తరిమి తరిమి, ముక్కులతో పొడుచుకుతింటాయ. కాదు, హాయిగా ఏ మగాడివో పెళ్ళాడి సౌఖ్యంగా సంసారం చేస్తానంటావు. సంసారికన్నా- సాని, సన్యాసి సుఖంగా బ్రతుకుతున్నారు. నీ మొగుడు అనుమానం వాడు కావచ్చు. తల్లిమాటినేవాడు కావచ్చు. వెరైటీ సరుకు కావాలని కొంపలు తిరిగే రకం కావచ్చు. నిన్ను రోజుకో సారి బడితపూజ చేసేవాడయి ఉండవచ్చు. పెళ్ళాన్ని, పిల్లలని పోషించటం చేత గాకపోయినా ప్రతిగంటా నీ శరీరం కావాలని ప్రతి ఏడాదికో పిల్లకి తల్లిని చేయొచ్చు. చవటమొగుడు, చచ్చు పిల్లలు, అప్పులు ఆకిలిబాధలు, చావలేక బ్రతకటం......ఎందుకొచ్చిన గోల! చూస్తూ, చూస్తూ నిన్నేవడూ సినిమాలోలా లక్షాధికారొచ్చి పెళ్ళి చేసుకోడు. మీ అయ్య ఎవడో నీకు తెలుసుగాని, నాకు తెలియదు. అయ్య లక్షాధికారయితే- కూతురికి ఆఫీసర్ నో, ఇంజనీర్ నో, డాక్టర్ నో అల్లుడిగా తెస్తాడు. మీ అయ్య లక్షాధికారయితే నువ్విలా రావు?"
"అయిందా ఉపన్యాస నీతిగాథ?" అంది సీత.
"అబ్బే.....అప్పుడే ఎక్కడయింది? పెళ్ళి చేసుకుంటే అన్ని సౌఖ్యాలు వదులుకోవాలి. చీరలు, నగలు, సినిమాలు, అన్నీ- దేవుడా, రాముడా! అని కొనుక్కోవాల్సిందే గాని, దర్జాగా కొనుక్కోటానికి లేదు కదా? ఇక్కడళాకాదు. నువ్వు కోరినవి వళ్ళోవచ్చి వాలుతాయి. వచ్చిన మగాడితో కాస్త సర్దుకుపోవటం తప్ప మరెటువంటి బాధాలేదు. ఈ మగగొడ్లు రకరకాలుగా వస్తుంటాయి. చావటలుంటారు, వెధవలుంటారు, రాక్షసులుంటారు. అయినా బాధలేదు. ఏ వెధవ కెలాంటి మంత్రమేస్తే నోరు మూసుకుంటాడో ఆ మంత్రాలు మన దగ్గర రెడీగా ఉన్నాయి. అదీగాక....."
"చాలు, చాలు.....ఇలాంటి కథలు, నీతులు రాత్రింబవళ్ళు నూరిపోసినా, నేనుమారేదిలేదు- నీకు లొంగేది లేదు. నన్నిక్కడనుంచి పంపిస్తావా, లేదా.....?" అంది సీత, సతీ అనసూయ మాటలకు మధ్యలో అడ్డుతగిలి.
"నిన్ను పంపించటానికి తీసుకురాలేదు. వెయ్యి రూపాయలు పోసి కొన్నాను. మంచిగా చెప్పాను, వినలేదు.....నీ ఖర్మ."
"ఖర్మా?"
"అవును, ఖర్మే..... బలవంతానా మా పనిలోకి దింపుతాం. మొదటఎదిరిస్తావు, ఏడుస్తావు- తర్వాత చచ్చినట్లు పడుంటావు. నేనెంత మందిని చూడాలేదేమిటి నీ లాంటివారిని.......? నా తలమీద ఎన్నెంత్రుకలున్నాయో అంతమందిని చూశాను."
'ఎదిరించటం ఏడ్వటం, చచ్చినట్లుపడుండటం ఇది నీ తలవెంట్రుకల ఖర్మేమో! చావో- బ్రతుకో, నాది ఒకే నిర్ణయం. నా కంఠంలో ఊపిరుండగా, బలవంతానా ఏ మగాడికి లొంగను. ఆ పరిస్థితే ఎదురయితే, వాడ్ని చంపటమో, నేను చావటమో చేస్తాను."
"లొంగిపోయిన తర్వాత కూడా!?" ఆశ్చర్యపోతూ అంది సతీ అనసూయ.
"పోయిన తర్వాత నోరు మూసుకోను. అప్పుడూ చంపటమో, చవటమో చేస్తాను."
"ఇదేం పిల్లరా దేముడా?' అనుకుంది సతీ అనుసూయ. వంటచేసే దేముడ్నికాదు, నిజం దేముడ్ని తలుచుకుంది.
"నీ నిర్ణయం ఏదయినా నిన్నిక్కడ్నుంచి చచ్చినా పంపేదిలేదు. రేపే కాస్త గట్టివాడ్ని చూసి ఇద్దర్నీ కలిపి తోస్తాను గదిలోకి."
"ఛీ_______సిగ్గులేనిదానా.....ఆడపిల్లతో బలవంతంగా వ్యాపారం చేయించే నీవు- పురుగులుపడి చస్తావు. గట్టివాడ్నే పంపుతావో, రాక్షసుడ్నే పంపుతావో పంపు. వాడి పీక నొక్కి, నా పీక తెగకోసుకుంటాను. పో,పో______" అంది సీత పురుగును విదిలించినట్లు విదిలిస్తూ.
సతీ అనసూయ సోఫాలోంచి లేచింది.
"చూడండర్రా, చిలకలూ.....! ఈ సీతకి మన వివరాలు, సుఖాలు. శిక్షలు అన్నీ తెలియజేయండి. కాదంటే దానిఖర్మ." అని సతీఅనసూయ తలుపుతీసుకు బయటికెళ్ళిపోయింది.
"పాపం.....తలనొప్పి వచ్చినట్లుంది." అంది సీత.
అందరూ ముఖముఖాలు చూసుకున్నారు.
20
"ఏమర్రా! మీకూ తలనొప్పి వచ్చిందా? పాపం......వెళ్ళి రెస్ట్ తీసుకోండి." అంది సీత అక్కడున్న అందరి వైపు జాలిగాచూస్తూ.
"మాకేం తలనొప్పి రాలేదు. నీకింకా తలనొప్పి రాలేదేమన్నదే మా కాశ్చర్యంగా వుంది." అంది అరుంధతి.
"అలా ఆశ్చర్యపోతూ కూర్చోండి." అంది సీత.
సతీ అనసూయ తమ కప్పజెప్పిన బాధ్యత గుర్తు కొచ్చింది. ముందుగా అహల్య మొదలుపెట్టింది.
"సీతా! నేనూ మొదట్లో నీలాగే బీరాలు పలికి, బలవంతానా లొంగిపోయి, ఇప్పుడు బ్రతుకులో హాయిని తెల్సుకున్నాను."
"మంచిది." ముక్తసరిగా అంది సీత.
అహల్యకి ఏం మాట్లాడాలో తెలియలేదు.
రుక్మిణి సోఫాలోంచి లేచొచ్చి- సీత పక్కనే కూర్చుంది.
"సీతా! ఇక్కడి సంగతి పూర్తిగా నీకు తెలియదు. ఒకడికి లోంగేర్కానివి గాకపోతే ఒకేసారి ముగ్గుర్ని, నల్గుర్ని ఏకకాలంలో నీ మీదికి తోలుతుంది సతీ అనసూయ. వాళ్లు కసాయి వాళ్ళలాగా, నరరూప రాక్షసుల్లాగా ఒకరి తర్వాత ఒకరు..... కనీసం నాలుగు గంటలు నీలో అణువణువు జుర్రుతారు. అప్పటికీ లొంగకపోతే ఆ కార్యక్రమం అలా సాగుతూనే వుంటుంది. ఇది ఒక శిక్ష. రెండోది కఠినంగా వుండదు. మొదట్లో కాస్తదానికే లొంగిపోతారు. అంటే నీ వాళ్ళని అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరింపు. వెంటనే భయపడి లొంగిపోతారు. మూడోది సిగ్గు, ఏడ్పు, బిడియం గలదాన్ని లొంగదీసుకునే విధానం. అంటే మంచిగా మాతో సినిమాకి పంపుతుంది.