18
ఆ మర్నాడు.....
అనసూయ కారేసుకుని అంజమ్మ హొటల్ కి వచ్చింది.
"భయపడకు వాళ్ళడిగే ప్రశ్నలన్నింటికీ చక్కగా జవాబులు చెప్పు." అంది అంజమ్మ.
సీత తల వూపింది.
అనసూయ కారులో మొదటిసారిగా సీత ఎక్కింది.
కారు, విమానంలా దూసుకుపోయి, అరగంట తర్వాత ఓమూడంస్తుల భవనం ముందు ఆగింది.
మూడంతస్తుల భవనం పెద్దది. వెడల్పునిబట్టి చాలా గదులున్నట్లు బైటికే తెలుస్తున్నది. మెడచుట్టూ విశాలమైన ఖాళీస్థలం వుంది. పలురకాల పూలమొక్కలు, క్రోటన్స్, అందంగా బారులుతీరి వున్నాయి. చూడగానే మైసూర్ గార్డెన్ కాకపోయినా అందమైన గార్డెన్ లా వుంది. అది చూస్తుంటే కన్నుల పండుగలా వుంది. వాకిట్లో గూర్ఖా కాపలా ఉన్నాడు.
కారుదిగి అనసూయ, సీత లోపలికి వెళ్ళారు. గొలుసుకు కట్టేసి చిన్న గాడిదఅంత కుక్కవుంది. గొలుసుకి కట్టేయకుండా బొచ్చుకుక్క వుంది. పెద్దకుక్క గుర్రుమంటూచూస్తే చిన్నబొచ్చుకుక్క కళ్ళచుట్టూ తిరిగి కాలు నాకింది. దాన్ని ముద్దుగా "పోవే ణా ముజ్జిముండా," అంది. అనసూయ. ఆ తర్వాత సీతవైపు తిరిగి "మూగజీవాలంటే నాకు ప్రాణం" అంది. ఇంతలో పక్కగదిలోంచి పహిల్వాన్ లాంటివాడు బైటికొచ్చాడు. వాడ్ని చూపించి 'మా వంటవాడు, వాడిపేరు దేముడు,' అనిచెప్పి దేముడు వైపుతిరిగి 'కాఫీ, టిఫెన్ పైకిపట్రా,' అంది.
దేముడు సీతని ఎగాదిగాచూసి 'సరే' అన్నాడు.
మేడెక్కటానికిమెట్లున్నాయి. సీతనిమెట్లెక్కనివ్వలేదు అనసూయ.
మేడకి లిప్టువుంది. అదేక్కారు, మేడమీద దిగారు.
సీత, అనసూయ నాలుగు గదులు దాటి అయిదోగదిలోకి వెళ్లారు అది ఎయిర్ కండిషన్ గది. అందుకే చల్లగావుంది.
గదిలోకి వెళ్ళింతరువాత......
అనసూయ బల్లమీద బెల్ నొక్కింది.
బెల్ నొక్కింతరువాత.....
బిలబిలమంటూ పదిమంది అమ్మాయిలు తలుపుతోసుకుని గదిలోకి వచ్చారు. అందరూ అందమైన సీతాకొకచిలకల్లా వున్నారు.
"కూర్చోండి." అంది అనసూయ.
అందరూ కూర్చున్నారు.
"కూర్చో." అంది అనసూయ.
సీత కూర్చుంది.
"ఇహమంచి ఇది నీగది. వీళ్ళంతా నీ అక్కలు, చెల్లెళ్లు." అంది అనసూయ.
"ఇదెట్టా తనగదో, వీళ్ళంతా తనకి అక్కలు చెల్లెళ్ళు ఎలాగో సీతకి తెలియలేదు.
"నేచేప్పేది వివరంగా విను సీతా! ఎవరినీ కష్టపెట్టటం నాకిష్టం వుండదు. నిన్ను సుఖపెట్టటానికే ఇక్కడికి తీసుకువచ్చాను. సుఖానికీ, సౌఖ్యానికి అర్థం నీ సిష్టర్స్ చెపుతారు. తెలివిగలదానివి విని సరిగ్గా అర్థం చేసుకుని మంచిగావుండు నాపేరు ఉత్త అనసూయగాదు. సతీఅనసూయ. నాగురించీ నీ ఉద్యోగం గురించి, నీ సిస్టర్స్ చెపుతారు విను. అర్జంటుగా బైటకెళ్ళాల్సివచ్చింది. మళ్ళీ కలుస్తాను." అని సతీఅనసూయ బైటకెళ్ళిపోయింది.
అప్పటికే సీతకి సగం అర్థమైపోయినట్లు అనిపించింది. "చా! పాదాలోచన, పనికిమాలిన అనుమానం." అనుకుని సిస్టర్స్ వైపు చూసింది.
సిస్టర్స్ అంతా సీతవైపు చూస్తున్నారు.
ఒకమ్మాయి అడిగింది 'నీపేరేంటి?' అని.
"సీతాదేవి." అంది సీత.
సీతపేరు వినగానే వాళ్ళంతా ఒక్కళ్ళమొహాలొకళ్ళు చూసుకున్నావు నవ్వుకున్నారు. మళ్ళీ సీతని చూశారు.
"నాపేరు సావిత్రి."
"నాపేరు అరుంధతి."
"నాపేరు అహల్య."
"నాపేరు శకుంతల."
"నాపేరు సుమతి."
"నాపేరు ద్రౌపతి."
"నాపేరు రుక్మిణి."
"నాపేరు అలివేలు."
"నాపేరు లక్ష్మి."
"నాపేరు సరస్వతి."
పదిమంది అమ్మాయిలు టకటక టైపుకొట్టినట్లు, వీణమీటినట్లు తమ పేర్లు చెప్పేశారు.
అందరమ్మయిలు సోఫాలో కూర్చునేవున్నారు. అరుంధతిమాత్రం సోఫాలోంచి లేచింది.
అప్పటివరకూ వారిపేర్లువింటూ వారిముఖాలు పరిశీలనగా చూడటం వల్ల సీత గ్రహించింది. వాళ్ళంతా తనీడు అమ్మాయిలుకాదని ఇరవై దాటి ముఫైఅయిదువరకు తలోరకంవయసూ వుందని, మేకప్ వల్ల అమ్మాయిల్లాగా కనిపిస్తున్నారని, మేకప్ కి తోడు సహజంగా అందమైనవాళ్లు కాబట్టి వయసు కొట్టొచ్చేటట్లు కనిపించటంలేదని.....ఇంకాకూడాగ్రహించి ఓనిట్టూర్పువిడిచి ఏంజరిగినా, ఏంవిన్నా రెడీఅన్నట్లు దైర్యంగా, మేకపోతు గాంభీర్యం అంటారే అలా కూర్చంది సీత.
అరుంధతి అటూ, ఇటూ మెత్తనితివాసీమీద పచార్లుచేస్తూ చెప్పటం మొదలుపెట్టింది.
"తమాషాచూశావా సీతా! పేరుపెట్టి పిలుస్తున్నానని ఏమీ అనుకోకు. ఇక్కడందరం ఒకరినొకరం పేరుపెట్టి పిలుచుకుంటాం. నువ్వు మమ్మల్ని పేరుపెట్టి పిలవవచ్చు. నోఅబ్జక్షన్.
ఇక్కడున్న అందరిపేర్లు పతివ్రతలపేర్లు. ఇంతవరకు సీతపేరు గల అమ్మాయి రాలేదని మధ్యమధ్య మాలో మేము జోక్ చేసుకుంటూ వుండేవాళ్ళం. ఈరోజుతో మాజోక్ కట్. సీతాదేవి ప్రవేశించింది.
ఈ ఇంటిపేరు అశోకవనం. వంటవాడిపేరు దేముడు. ఇంటియజమానురాలు అంటేమన యజమానురాలు పేరు సతీఅనసూయ. సతీ ఏమిటి? ఇంటిపేరా? అని నీఅనుమానం. సో కొందరింటిపేర్లు సతివుండవచ్చు. మతి వుండవచ్చు. కాని ఈ అనసూయకు సతీఅనేది బిరుదు. అందుకే తనపేరు ముందు సతి తగిలించుకుని సతీఅనసూయ అయింది....."
"నేనేం అడగకపోయినా చెప్పటం మాధర్మం. ఎందుకంటే ఇది అమ్మగారి ఆజ్ఞ. అమ్మగారంటే సతీఅనసూయ. ఎదురుగావుంటే అమ్మగారు. ముఖంచాటయితే సతీఅనసూయఅనే అంటాం. అది మాయిష్టం. ఇక్కడ మనమంతా కలసికట్టుగా వుండాలి. మనలో ఐక్యత లేకపోతే మనజాతి గౌరవమే నశించిపోతుంది. ఎలా మెలగాలో ఏంచేయాలో చెప్పమంటావా సీతా!"
"ఏంచేయాలో, ఎలా చేయాలో నాకు బాగాతెలుసు." అంది సీత.
"వాట్!" అంది అరుంధతి.
బైటఅనుభవం చాలావున్నట్లుంది." అంది సుమతి.
"కాని తలపండలేదే?" లక్ష్మి అందుకుంది.
"స్టాప్ ఇట్" సీత అరిచింది.
"ఒసేయ్. ఇంగ్లీషులొ అరుస్తున్నదే." లక్ష్మి అంది.
"ఈఇల్లు ఏమిటో, మీరెవరో అర్థమైంది. ఆ సతీఅనసూయని రానీండి. గొంతుపినికి గోడవతల విసిరేస్తాను. ఆతర్వాత అంజమ్మ ఆ నయవంచకురాలిని సాంబారుడేకిసాలొకుక్కి వుడికిస్తాను. వరదరాజులు. వాడే దీనికి నాగురించి తెలియజేసివుంటాడు. వాడిని పోలీసుల కప్పజెప్పిబొమికల్లో సున్నంఠాలేటట్లు చితగబొడిపిస్తాను. ఈ నిప్పులో దూకమంటే దూకేరకంకాదు. నలువైపులా నిప్పుముట్టించి లంకాదహనంచేసి మరీ చూపిస్తాను."
"ఏంటీ నువ్వే?" ఆశ్చర్యపోయింది సావిత్రి.
"వాట్.....వాట్?" అంది అరుంధతి పరభాషలో ఆశ్చర్యపోతూ.
"ఇక్కడినుంచి ఎలా బైటపడతావు చెల్లమ్మా? తెలుగుసినిమాలో హీరోయిన్ పెద్దడైలాగు చెప్పినంత డైలాగు ఏకదమ్మున చెప్పావు నాటకాల్లో వేషాలేశావేమిటి?"
"బైటపడాలి అనుకుంటే బైటపడవచ్చు. మనిషి సాధించలేనిది ఏదీలేదు. ఒక్క మృత్యువుతప్పు." అంది సీత.
"చూసు సీతాదేవీ! నువ్వోచ్చింది షాపింగ్ కు కాదు. మహిళాసభలో స్పీచ్ ఇవ్వటానికీ కాదు. ఇది అశోకవనం అని చెప్పాకదా! నిన్నురక్షించాలంటే వానరమూకతో బైలుదేరివచ్చే శ్రీరాముడూలేడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే దేముడు దిగిరాడు. దెయ్యం పట్టుకుం....."
తలుపు తీసుకుని దేముడు వచ్చాడు.
"వచ్చాడు....వచ్చాడు...దేముడు ఏం కావాలో కోరుకో, ఉత్తకాఫీయా! కాఫీతోపాటు టిఫెన్ కూడానా?" అంది సావిత్రి.
సీత మాట్లాడలేదు. దేముడివైపు కోపంగా చూసి వూరుకుంది.
"కాఫీ, టిఫెన్ ఇక్కడికే తేనా?" అడిగాడు దేముడు.
"ఊ....ఇక్కడికే." అంది అరుంధతి.
దేముడు తలుపుతీసుకుని మాయమయి, మరో పదినిమిషాల తర్వాత కాఫీ, టిఫెన్ తో ప్రత్యక్షమయ్యాడు.
"టిఫెన్ తిను, కాఫీ చల్లారిపోతుంది." అందిసుమఅల్లప్పచ్చడిలో ఇడ్లీ నంచుకుంటూ.
"చచ్చినా నే తినను. అది కూడా మీరే తినండి." అంది సీత.
"ఇవాళ తినకపోతే రేపటినుంచి తినదేమిటి ఆవురావురుమంటూ, నాకు తెలీవి కథా ఏమిటి?" అన్నాడు దేముడు.
"నువ్వు దేముడివికదూ? నీకు తెలీని కథుంటుందా? దేముడటదేముడు, థూ...." అంది సీత.
దేముడి ముఖం అవమానంతో నల్లబడింది.
అందరూ సీత మాటలకి పగలబడి నవ్వారు.