Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 19


    అంతటిలో పోనీయలేదు సీత. "ఈయనకీ, హొటల్ కి సంబంధం ఏమిటి?" అంది, లా పాయింట్ లాగుతూ.
    "ఈ హొటల్ నా మొగుడు కట్టించాడు." వరదరాజులు సకిలిస్తూ చెప్పాడు.
    పుల్లారావుకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక చేతులు నులుముకుంటున్నాడు.
    "అంజమ్మ నీ మొగుడా?" హేళనగా అంది సీత.
    "ఏయ్___"అ న్నాడు వరదరాజులు.
    "ఏంటోయ్?" అంది
    "ఏమిటే నీ ఇది?" నిర్లక్ష్యంగా అన్నాడు వరదరాజులు.
    "నిన్ను....నిన్ను..... ...." అంది సీత పళ్ళు కొరుకుతూ కుర్చీలోంచి లేచి.
    "ఏం చేస్తావ్? సిగ్గుపడక చెప్పు." మొదటిరాత్రి మొగుడడిగినట్లు అడిగాడు వరదరాజులు.
    "పుల్లారావు, ఓబయ్యా, సాంబు, బాలకృష్ణ ముందుకి రాలేదు. వరదరాజులుని పట్టుకోలేదు. అందరికీ ఒకేసారి అంటురోగం తగిలినట్లుగా చేతులు మలుముకుంటూ నుంచున్నారు.
    హొటల్లో తింటానికొచ్చిన వాళ్లు చోద్యం చూస్తున్నారు పైసా ఖర్చులేకుండా.
    సీత అవమానభారంతో తలోంచుకోలేదు. జరుగుతున్న అన్యాయానికి నిప్పులు కురిసే కళ్ళతో అందరినీ చూస్తున్నది. ఏం  చేయాలో తోచలేదు. బోనులో బంధింపబడ్డ ఆడ సింహంలా, రాజ్యం పోయినా అహంకారం తగ్గని క్లియోపాత్రలా ముఖంపెట్టింది.
    వరదరాజులుకి విజయగర్వంతో ఒడలు పొంగిపోయాయి. "ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు సీతతో.
    "తిన్నది అరగలేదేమో! మరోసారి లోపలికెళ్ళి పొట్టపగిలేలా తినిరా! ఎవరూ ఏమీ చేయకుండానే, అన్యాయం తిండి తినేవారికి ఆ తిండే శిక్ష విధిస్తుంది." అంది సీత.
    "తనిప్పుడు జంకితే చులకనయిపోతుంది. అలా అని గట్టిగా నిలబడదామంటే స్థానబలంలేదు. హొటల్లో వెధవలంతా వెధవ ముఖాలేసుకుని నిలబడ్డారు. ఇప్పుడు తను తగ్గకుండా, హెచ్చకుండా వుండాలి." అందుకే అటూ, ఇటూగాని మాట అని ఊరుకుంది సీత.
    "భలే......భలె, భలె,భలె...... జోకులుకూడా వేస్తావే!" నవ్వి  వెళ్లి పోయాడు వరదరాజులు, బుడ్డిగాడితో.
    "మీకు బుద్దుందా?" అంటూ అందరి మీద ఎగిరిపడింది సీత.
    "అంజమ్మ వచ్చిన తర్వాత  అడుగు. మాకు  బుద్దుంది." అన్నారు ఏకగ్రీవంగా అందరూ.
    అంజమ్మ వచ్చిందాకా ఎవరితోను మాట్లాడలేదు సీత.
    అంజమ్మ గంట తర్వాత వచ్చింది.
    సీత జరిగిందంతా చెప్పింది.
    అంజమ్మ  వింది......"సీతా! వరదరాజులు ఉత్త వెధవ, వచ్చి రౌడీ, ముండల ముఠాకోరు, ఖూనీకోరు, అలాంటివారిని చూసీ చూడనట్లు పోవాలి. వాడితో జగడం పెట్టుకున్నామనుకో, ఏం చేస్తాడో తెలుసా?" అంది.
    వరదరాజులు ఏంచేస్తాడో తెలియదుకాబట్టి సీత మౌనం  వహించింది.
    "నన్ను ఖూనీ చెయ్యొచ్చు, హొటల్ కి  నిప్పంటించవచ్చు. బల్లలు కుర్చీలు విరగగొట్టి పోవచ్చు. వెధవపనులు ఎన్నయినా చెయ్యవచ్చు రౌడీ ఎదవలకేమిటి, తెగించిన ముండాకొడుకులు." అంది అంజమ్మ.
    "ఇలాంటి రౌడీ వెధవలవల్లే దేశం ఇలామండిపోతున్నది. పోలీసు రిపోర్టు యిచ్చి, పట్టిస్తే, ఇలాంటి చీడపురుగులు నాశనం అవుతాయి." ఆవేశంగా అందిసీత.
    "ఏంటీ! పోలీసులకా! రిపోర్టు యివ్వటమా? ఇంకానయం కొరివితో తల గోక్కుందామని అనలేదు. పోలీసులకన్నా రౌడీలే నయం, సమయం వచ్చినప్పుడు. ఇదిగో ఈ కష్టం వచ్చిందని చెపితే , "అయ్" అంటూ మనతరపున నిలిచి కష్టంతీరుస్తారు. పోలీసోళ్ళు మామూలు అంటూ తేరగా  తిని వెళతారు." అయ్యా! ఈ కష్టం వచ్చిందని" చెప్పుకుంటే, "ఏదీ, నా మామూలియ్యి, చూస్తా" అని ఓ పది జేబులో వేసుకుని తిరిగి చూడకుండా పోతారు. ఆయనే వుంటే మంగలాడెందుకన్నట్లు, న్యాయం జరిగేటట్లయితే ఉచితంగా వీళ్ళని మేపటం దేనికి?" అంది అంజమ్మ.
    అంజమ్మ అనుభవంమీద చెపుతున్నది.
    సీత ఏమంటుంది? గోళ్ళు కొరుక్కుంటూ వింటున్నది.
    అంజమ్మ గీతోపదేశం చేస్తూనే వుంది ఆ రోజంతా.
                                          17
    ఈమధ్య హొటల్ కి తరచు వస్తున్నాడు వరదరాజులు.
    వరదరాజులొచ్చినప్పుడల్లా సీత తప్పుకు తిరుగుతున్నది.
    కావాలని వరదరాజులు, సీతని పలకరించేవాడు. ఆ పలకరింపులొ హేళన లేదు, వ్యంగ్యం లేదు, గర్వంలేదు. శాంతంగా చనువుగా, తనంత మంచివాడు లేడుసుమా, అన్నట్లు పలకరించేవాడు.
    సీత పిచ్చిదికాదు, అమాయకురాలు కాదు. కాపోతే లోకానుభావం లేదు. ఆవేశం, ఆత్మాభిమనాం లాంటివి కొన్ని లక్షణాలున్నాయి. వరదరాజులు అప్యాయంగా మాట్లాడినా ముక్తసరిగా  అదీ ఎంతో అవసరం అయితే జవాబిచ్చి అర్జంట్ పనున్నట్లు అవతలికెళ్ళేది.
    "పొగరమోతులు, రౌడీలు, కేడీలు, ఖూనీకోర్లు, వాళ్ళెలాంటి వెధవపనులు చేసినా వాళ్ళవెనకో కథ వుంటుందని పాపం మంచివాడని సినిమాలలో చూపిస్తుంటారు. అలాంటి కథలయితే సినిమాలు తీస్తారు కదా అని రచయిత్రులు, మొగాళ్ళకి గీర వెధవబుద్దులు ఆడదానికి అపనిందలు, జోడించి నవల్స్, కథలు రాసేస్తారు." అలాంటి సినిమాలుచూసి  అలాంటి కథలు నవల్స్  చదివిన సీత, వరదరాజులిని సినిమావాడితో పోల్చి, నవలవాడితో పోల్చి, మారలేదు, సీతదృష్టిలో వరదరాజులు వచ్చి రౌడీ, పాముకి కోరల్లో విషముండటం ఎంత నిజమో, బల్లికి తోకలో పాయిజన్ వుండటటం ఎంత కరెక్టో,  వరదరాజులు బుద్ది పాపపు బుద్దనేది అక్షరాలా నిజం. అందుకే సీత ఎంత కరెక్టో, వరదరాజులు బుద్ది పాపపు బుద్దనేది అక్షారాలా నిజం. అందుకే సీత ఎంతవరకుండాలో అంతవరకే వుంది.
    అంజమ్మ హొటల్ కి ఈ మధ్య రెండుసార్లు ఒకామె వచ్చింది. ఆవిడని చూడగానే అంజమ్మ కౌంటర్ ముందునుంచి లేచి వెళ్ళి మహా గౌరవంగా ఎదురెళ్ళి తీసుకొచ్చి స్పెషల్ కాఫీ, టిఫెన్ ఇప్పించి అప్యాయంగా మాట్లాడి పంపించేది.
    ఆవిడపేరు అనసూయ, ఎప్పుడొచ్చిణా కారులో వస్తుంది. వంటి మీద పట్టుచీర, రాళ్ళనగలు, ఆవిడ అంతస్తుని చాటుతుంటాయి. చూడగానే అనసూయమీద గౌరవం కలగదు, భయం కలుగుతుంది. ఎందుకంటే అనసూయ ముఖం  రుసరుస లాడుతున్నట్లు వుంటుంది. ఎదుట వ్యక్తిని కళ్ళార్పకుండా తీక్షణంగా చూస్తుంటుంది. అనసూయ ముఖం తీరంతే. అది అనసూయ తప్పుకాదు. అనసూయని పుట్టించిన దేముడి తప్పు.
    అనసూయ, సీతని  పలకరించింది. "బుద్దిమంతురాలివమ్మాయ్." అంటూ మెచ్చుకుంది.
    సీత పొంగిపోలేదు. ముఖం మాడ్చుకోనూలేదు.
    మరోరోజు అనసూయ వచ్చింది. అంతక్రితం అంజమ్మ చెప్పింది. తనదీ అనసూయదీ ఒకేవూరని.....అనసూయ మొగుడు  లక్షాధికారని.......చిన్నవ్యాపారం చేసి అలా అలా వృద్ది అయి ఇప్పుడు లక్షాధికారి అయ్యాడని.....అనసూయాది జాలిహృదయం అని.....గర్వం పిసరంతకూడా లేదని......అడగగానే సహాయం చేస్తుందని.....అదని.....ఇదని...అందుకే తనని చూడటానికి వస్తుందని....చాలా చెప్పింది అలా... అలా.....
    అంజమ్మ  చెప్పిందంతా సీత వింది "అనసూయ మంచిదయితే నాకేమిటి, చెడ్డదయితే నాకేమిటి?" అనుకుంది.
    అనసూయ, సీతవద్దకొచ్చింది.
    "మావారి ఆఫీసులో ఓ పోస్ట్  ఖాళీగా వుందట. లెటర్స్ చూడటం రాయటం. అంతకుమించి పనిలేదు. జీతం రెండువందల ఎనభై, నువ్వు  చూడబోతే చదువుకున్నదానిలా వున్నావు, హొటల్ పనేమిటి? అంజమ్మ చెపితేనే నిన్ను అడుగుతున్నాను.....ఉద్యోగం చేస్తావ సీతా!" అంది  అనసూయ.
    'అవును సీతా! నేనే అనసూయతో చెప్పాను. నువ్వు నాకు భారం కాదు. ఈ హొటల్ పనే నీ కిష్టమయితే ఇక్కడే వుండు. కాదంటే చక్కగా ఉద్యోగం చేసుకో. అక్కడ  కష్టంతోస్తే వచ్చేసేయి." అంది అంజమ్మ.
    సీతకి ఇది కలో, వాస్తవమో తెలియలేదు. "నిజంగా?" అంది.
    "నిజం." అంది అంజమ్మ.
    "నిజంగా!" అంది అనసూయ.
    సీత ఉద్యోగం చేయటానికి సంతోషంగా ఒప్పుకుంది.
    "రేపొచ్చి నిన్ను తీసుకెళతాను. ఆఫీసులో పైపై ఇంటర్వ్యూ లాంటిది జరుగుతుంది. అది నలుగురికోసం చేసే తతంగంలే, ఇంట ర్వ్యూలో నువ్వే నెగ్గుతావు. ఉద్యోగం నీకే వస్తుంది. వారంరోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అవుదువుగాని." అంది అనసూయ.
    సీత అన్నింటికీ తల వూపింది.
    సీతకి అనసూయ ఓ దేవతలా కనపడింది.     

 Previous Page Next Page