Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 13


                                                                                          11
    సాయంత్రంపూటా సీత వంటచేస్తుంటే శరత్ బాబు వంటగదిలోకి వచ్చాడు.
    "సీతా!" అంటూ మృదువుగా పిలిచాడు.
    శరత్ బాబు అందంగా వుంటాడు. ఆడపిల్ల ముఖం, ఆడదానిలా అలంకరిస్తే ఆడాళ్ళకే ముద్దొచ్చి బుగ్గలు కోరికే ప్రమాదంవుంది. మెడదాకా  గిరజాలక్రాపు, సైడ్ లాక్స్, మీసాలు అసలు మొలిచాయా లేదా? అనేటట్లువుండే గడ్డము, మూతిచుట్టూ భాగము షవ్ చేసినట్లు తెలియనే తెలియదు. అలా నున్నగా వుంటుంది. తల్లి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు! బొద్దుగా, ముద్దుగా తెల్లగా, ఉండటమేగాక, బూరెల్లాంటి బుగ్గలు, విశాలమైన నుదురు, సన్నని చిన్న పెదవులు, చూడగానే ఆకర్షించే రూపం.
    శరత్ బాబు పిలుపువిని నెమ్మదిగా  వెనుదిరిగి  "ఏమిటి?" అంది సీత.
    "ఏమిటంటే....? అది....ఆ__అదే నీకు భరతుడి వ్యాసంలో ప్రథమ బహుమతి వచ్చిందటగా! నీరద చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్." అన్నాడు శరత్ బాబు.
    వెంటనే థాంక్స్ అనాలని సీతకి తెలుసు. తెలిసి అనలేదు. అదేదో నీరదాగారికి చెప్పండి." అంది అలమర దులపి ప్లాష్టిక్ డబ్బాలు సర్దుతూ.
    "నీరద చెప్పింది. బహుమతి మీకు రావటమేమిటి, వద్దనటమేమిటి? నాకేం బాగుండలేదు." అన్నాడు శరత్ బాబు.
    "నాకూ బాగుండలేదు."
    "బాగుండనిది. ఆ పనిచేసింది ఎందుకు? శుభ్రంగా మీ పేరుతో వివరాలు పంపింఛవచ్చుకదా?"
    "నీరదగారివల్ల అన్ని వివరాలు తెలుసుకున్నారు. తెలిసి పనికట్టుకు మీరొచ్చి నాకు కంగ్రాచ్యులేషన్ చెప్పటం నాకు బాగుండలేదు."
    "ఆ....?" తెల్లబోయాడు శరత్ బాబు.
    "కాఫీగాని, ఓవల్ టిన్ గాని, టీ గాని కావాలా?" మృదువుగాఅడిగింది సీత.
    "టీ ఇచ్చేయి."
    సీత టీ డికాషన్ చేయటంలో నిమగ్నురాయింది.
    "సీతా!"
    "ఏమిటి?"
    "నువ్వు  తప్పక ఇంగ్లీషు చదివుంటావని నా ధృడమైన అభిప్రాయము. నిజం చెప్పు సీతా! నువ్వు ఎందాకా చదివావు? ఎప్పుడు ఆపేశావు?"
    "ఇంగ్లీషు ఏం ఖర్మ హిందీకూడా చదివాను. వానాకాలంలో నా చదువు మొదలయింది. ఎండాకాలం  రాగానే  పడకొట్టి 'హరీ' అంది. తెలుసుకుని ఏమిలాభం?"
    "పోనీ. ఎందాకా చదివింతరువాత చదువు 'హరీ' అందో చెప్పు." నవ్వుతూ అడిగాడు శరత్ బాబు.
    "చెపుతాను. ఓ  ఉపకారం చెస్తారా?"
    "ఆ....ఏమిటో చెప్పు."
    "ఎందాకా చదివానో వివరం చెపుతాను. చిన్న ఉపకారం చేయండి: నెలకి మూడు, నాలుగొందలు జీతంవచ్చే జాబ్ చూసిపెట్టండి."
    "బాప్ రే జాబ్! చదువుకోటంతప్ప నాకేం తెలియదే, మాడాడీతో చెపితే చూస్తారు."
    "అయితే ఆలశ్యం చేయకుండా వెంటనే మీ డాడీతో చెప్పండి. గట్టిగా ప్రయత్నించి నాకు జాబ్ వచ్చేటట్లు చేయండి."
    "నీకు జాబ్ చూడమని నేను మా డాడితో చెప్పనా?"
    "తప్పేముంది?"
    "అహా....తప్పనికాదు. అదేదో నువ్వే అడిగితే  బాగుంటుంది. సీతకి జాబ్  కావాలంటే సీత అడుగుతుంది. మధ్యలో నీకెందుకని డాడీ నన్ను కోప్పడవచ్చు!"
    "అయితే అదేదో నేను మీ నాన్నగారితో మాట్లాడతాను."
    శరత్ ముఖం ఆనందంతో విప్పారింది.
    "నువు స్వయంగా మాట్లాడితే మరీ మంచిది- ఇంతకీ నువ్వెంత వరకు చదివావు?"
    "జాబ్ చూసేది మీ నాన్నగారు. నే ఎందాకా  చదివింది. ఆయన తోనే చెపుతాను!"
    "అదికాదు సీతా!"
    "పెంచకండి. అధికప్రసంగం నాకిష్టంవుండదు. టీ తయారయింది. తాగి వెళుదురుగాని." టీ డికాషన్ ఫిల్టర్ చేస్తూ అంది!
    శరత్ బాబుకి ఏం మాట్లాడాలో తెలియలేదు. నీరద అన్నట్లు ఈ సీత కొరగానికొయ్య, అనుకున్నాడు.
    "నాకు కొందరిని చూస్తే చాలా  జాలికలుగుతుంది సీతా! కొందరెండుకు సుఖపడాలి! కొందరెందుకు కష్టపడాలి? ఇదెక్కడి నాయ్యం? ఈ దేశంలో ఇదెప్పటికి రూపుమాపిపోతుంది. ఇలా ఎన్నో అనుకుంటాను."
    సీత, శరత్ బాబుకి టీ ఇచ్చింది.
    "నేనూ మీలాగానే అనుకుంటూ వుంటాను."
    "భలే అచ్చం  నాలాగానే అన్నమాట...?"
    "కానీ ఏం లాభం? అనుకోటంవల్ల అందరికో చెప్పటంవల్ల ప్రయోజనం ఏముంది? ఆచరణలో పెడితేనే ఫలితం. కబుర్లుతో కడుపులు నిండవు. ఇది నా కర్తవ్యం అనుకుంటూ డబ్బుగల మారాకుల  పూనుకుంటే కాలం వ్యర్థం  కాదు. ఓ ప్రయోజనమూ వుంటుంది.  పలువురు సుఖపడే మార్గమూ ఏర్పడుతుంది." సీత కాస్త అవేకంగా అంది
    "నే ఆచరణలో పెడతాను."
    "మంచిది." ముక్తసరిగా అని, శరత్ బాబు ఖాళీచేసిన టీ కప్పు, తీసుకుని అవతలివేపు  వసారాలోకి వెళ్ళింది సీత.
    కాసేపు నుంచున్నాడు శరత్ బాబు, సీత వస్తుందేమో అని.
    సీత రాలేదు. శాంతకుమారి వచ్చింది.
    "ఇక్కడేం చేస్తున్నావురా శరత్?" అంది శాంతకుమారి వస్తూనే.
    "కాఫీ కావలసివచ్చాను. సీత కాచి ఇచ్చింది, తాగాను." శరత్ బాబు కొంచెంగా తడబడుతూ చెప్పాడు.
    టీ కప్పు తొలిచి చేతిగుడ్డతో కప్పుని తుడుస్తూ సీత వచ్చింది.
    "సీతా! వంట పూర్తయిందా?" సీతని పరిశీలనగాచూస్తూ అడిగంది శాంతకుమారి.
    "ఇప్పుడే మొదలుపెట్టాను." శాంతకుమారి మొహంలో అనుమానం గ్రహించింది సీత.
    "అహా! శరత్ కాఫీ అడిగాడట. నెస్ కేఫ్ ఇచ్చావా?బ్రూ కలిపావా?"
    రెండూ కాదు. టీ కావాలంటే కాచి ఇచ్చాను."
    "ఒక ఆడ, ఒక మగ నాలుగు గజాల వెడంగా నుంచున్నాఒంటరిగా వుంటే ఎందుకో యింత అనుమానం?" అనుకుంది సీత.
    "మరి శరత్  కాఫీ తాగానని చెప్పాడు?"
    "నే చేసిన టీ కాఫీలా రుచివచ్చిందేమో? అడిగి చూడండి." అంది సీత మెస్ లో కప్పులు  సర్దుతూ.
    శరత్ బాబు కంగారుపడ్డాడు."అదికాదమ్మా! టీయే ఇచ్చింది. నేనే పొరపాటున కాఫీ అని చెప్పాను." అన్నాడు.
    "టీకి, కాఫీకి బేధం తెలియటంలేదన్నమాట....,"
    "అది కాదమ్మా!" ఏదో చెప్పబోయాడు శరత్ బాబు.
    "ఊఁ....టీ తాగావుగా, వెళ్ళు." శాంతకుమారి కాస్త తీవ్రంగానే అంది.
    శరత్ బాబు తల్లి ఎదురుగుండా సీతనిచూసే ధైర్యంలేక  గిరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
    "శాంతకుమారి మాట్లాడలేదు. సీత మాట్లాడలేదు. ఓ నిమిషం ఇరువురూ మౌనంగా వుండిపోయారు. వంటకాలు ఏమిచేయాలో తెలుసుకోటానికి సీత నోరు తెరిచింది.
    "ఈపూట కూర ఏం చేయమంటారు?"
    "ఏరోజు ఏమి చెయ్యాలో వివరం చెప్పాలా? కొన్నాళ్ళ అనుభవం వుందికదా, తెలిసి మసులుకోవాలి, తెలిసి చేయాలి. తెలివికలదానివి, ఈమాత్రం గ్రహింపులేదా."
    "గ్రహింపు, తెలివి, ఉన్నంతమాత్రాన స్వటంగా చేయాలని లేదే? ఈరోజు బీన్స్ కూరయితే, రేపు బంగాళాదుంపల చిప్స్. ఎల్లుండి బీరకాయ కూట్, అలామార్చిచేయవచ్చు, కానీ....ఈ యింటికి యజమానురాలు మీరు, మిమ్మల్ని అడిగి చేయటం నా ధర్మం. ఫలానా అని చెప్పటం మీ కర్తవ్యం."
    "మంచిది సీతా! అది నీకు తెలుసుకదా? లా తెలిసి మసులు కోటం కూడా మంచిదే! ఏదో చెప్పబోయానుగాని సీతా! నీకు తెలియంది ఏముంది? తన  స్థానం గుర్తుంచుకుని ఎదుటివారిని గౌరవించే తెలివి అందరికీ వుండదు." శాంతకుఅమారి శాంతంగా అంది.
    "నిజం చెప్పారు. తనస్థానం మరచి ప్రవర్తించేవారికి గౌరవం ఎలా పోతుందో, గౌరవస్థానంలోవున్న వ్యక్తులు, తమకి తగిన స్థాయిగాని వారి వద్దకి వస్తే వారి గౌరవమూ తగ్గుతుంది. కిందనున్నవారికి పై నున్నవారికి తెలిసివుండటం మంచిది, ఏమంటారు!" సీత, శాంతకుమారిని ఓరగాచూస్తూ అంది.
    ఏమంటుంది శాంతకుమారి? "నిజమే." అని ఊరుకుంది.
    "శరత్ బాబుని వలలో వేసుకుంటానని ఈమెగారి భయంలాగుంది. జాగ్రత్త చెప్పపోతున్నది. నా స్థానం ఈ ఇంట వంటమనిషి. ఈమె ఈ ఇంటి యజమానురాలు. తప్పేముందిలే." అనుకుంది సీత.
    "సీత చాలా తెలివికలది. నా మాట నాకే తిప్పికొట్టింది. తెలివి కలదయితే ఫరవాలేదు. వంటమనిషిగా ప్రవేశించి కోడలి స్థానం సంసాదిస్తే ఆ తెలిసి  మాకు నెత్తిన ముళ్ళకిరీటం పెట్టినట్లే, ఈమధ్య శరత్ లో ఏదో మార్పు  ఎప్పటిలాగానే వుంది. నిండుకుండ తొణకదంటారు. టక్కరి చిక్కడు అంటారు. ఈ రెండిటిలో సీత నిండుకుండా? తక్కరా?" శాంత కుమారి ఆలోచిస్తున్నది.
    చాలాసేపు తర్వాత సీత అడిగింది "ఏం కూర చేయమంటారు?" అని.
    "బీట్ రూట్ కూరచేసి, మైసూర్ రసంపెట్టు." అంది శాంతకుమారి.
    "అలాగే." అంది సీత.
    శాంతకుమారి వంటింట్లోంచి బైటకెళ్ళిపోయింది.
                                                                                       12
    బజారు నుండి కూరలు తేవాలన్నా, మరేదైనా ముఖ్యమైన వెచ్చాలు అర్జంట్ అయితేను సీత అప్పుడప్పుడు బజారుకెళ్ళి తెస్తుంటుంది.
    సీత కూరగాయల మార్కెట్ నుంచి నిండు కూరల బుట్టతో ఇంట్లో అడుగు పెట్టింది, హాలులో రెండు గదులు దాటింతరువాత వంటగది వస్తుంది. సీత ఓ గది దాటింది. రెండోగది దాతబోతున్నది. గదిలోంచి "సీత" అన్నమాట వినపడింది. తనపేరు వింటూనే సీత టక్కున ఉన్న చోటునే నిలబడిపోయింది.
    రాఘవేంద్రరావు, శాంతకుమారి, సీతగురించి మాట్లాడుకుంటున్నారు.
    సీత కావాలని చెవి యొగ్గి నుంచుండిపోయింది. ఎవరిగురించో మాట్లాడుకుంటుంటే చాటుగా వినటం సీతకి అలవాటు లేదు. తన పేరు వినటం....ఈ మధ్య ఇంట్లోవాళ్ళల్లో వచ్చిన మార్పు...సీతని నిలబెట్టాయి.
    "మీరు నిజమే చెపుతున్నారా?" అంది శాంతకుమారి.

 Previous Page Next Page