Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 12


    "వండ్రపుల్ సీతా! నీయక్షన్ కి మెచ్చి ఉచితంగా మంచిబిరుదివ్వవచ్చు. ప్రస్తుతం నాదగ్గరేంలేదు. ఆవిషయం తరవాత చూద్దాము. ప్రస్తుతం గుడ్ న్యూస్ ఏమిటో చెపుతాను. సీతా! నువు లక్కీఫేలోవి. యిదైనా ఎందుకోచెప్పు?"
    "నేను లక్కీఫెలోనా! బాగుంది జోక్."
    "జోక్ కాదు సీతా! నిజం."
    "ఏమిటో ఆలక్."
    "అమ్మ  ఆశ, నేచెప్పనుగా నువ్వే కనుక్కో."
    సీత ఎంతఆలోచించినా అర్థంకాలేదు. నీరద చెప్పలేదు.
    "తాడూ బొంగరంలేకుండా గుడ్ న్యూస్, లక్కీఫెలోవిఅంటే ఎవరుచెపుతారు. నేనో మామూలుమనిషిని. ఈ ఇంట్లో వంటకికుదరటమే ఓపెద్దఅదృష్టం. యిదైనా ఈమాత్రం సాగిపోతేచాలని సంతోషిస్తున్నాను. ఫస్టుక్లాసులో పరీక్ష పాస్ అయానని లక్కీ ఫెలోనా? లాటరీలో ప్రధమబహుమతి అయిదులక్షలొచ్చాయని లక్కీఫెలోనా? ఈరెండూ జరగనిపని గాబట్టి లక్కీ ఫెలోనా? నాలాక్ సరీగానేవుంటే సీత మామూలుగాఅన్నా మాటల్లో వ్యధ తెలుస్తునేవుంది.
    నీరద ఆగలేకపోయింది. "సీత! నీభరతుడి వ్యాసానికి ఫస్టుబహుమతి వచ్చింది. పుస్తకంమధ్యలో దాచిన కార్డుతీస్తూ అంది.
    "నా భరతుడెవడు? వ్యాసంఏమిటి?" సీతకి అర్థంకాలేదు.
    "చూడు" సీతచేతిలో కార్డుపెట్టింది నీరద.
    సీత కార్డు చదివింది. అది  పత్రికనుంచి వచ్చింది. సీతపేరునే వుంది. కుమారి సీతాదేవిగారికి, అని మొదలుపెట్టి....వ్యాసరచన పోటీలో రామాయణంలో భరతుడినిగురించి రాసినవ్యాసం బాగుంది కాబట్టి ప్రధమ బహుమతి నూటపదహార్లు వ్యాసంపడిన పత్రికతోపాటు పంపగలము. మీ  పూర్తివివరాలు, హాబీలు తెలిపితే పత్రికలో ప్రచురిస్తాము. మీకు అభ్యంతరంలేకపోతే ఫోటోపంపండి. అభినందనలతో" ఆగి సబ్ ఎడిటర్ రత్నపాప అని రాసుంది.
    సీత ఆశ్చర్యపోతూ నీదని చూసింది.
    "చూశావా? ఎంత గుడ్న్యూసో! అప్పటికైనా వప్పుకుంటావా? లక్కీఫెలోవని" అంది నీరద.
    "ఈవ్యాసం నేను రాయందే."
    "కాగితంమీద కలంపెట్టి రాయలేమిటి." దీర్ఘంతిసింది నీరద.
    "మరి...."
    "ముందు కూర్చో, వివరంగా చెపుతా!" అంది నీరద చెయిర్ లాక్కుని దానిలో సీత భుజాలు పట్టుకు కూర్చోపెట్టింది. సీత ప్రక్కనే వున్న చెయిర్ లో తను కూర్చుంది. "ఆ రోజు ఏమైందంటే...."అంటూ మొదలుపెట్టింది.
    "ఏ రోజు?" అంది సీత.
    "అడ్డు ప్రశ్నలెయ్యకు. ఆ రోజు....ఏ రోజంటే- నేనూ, నా ఫ్రెండ్స్ జానకి, శారద రామాయణంలో పాత్రల స్వరూప స్వభావాల గురించి మాట్లాడుకుంటుంటే నువ్వొచ్చావు! ఆ రోజు నువ్వు వివరంగా ప్రతి పాత్ర గురించి చెప్పావుకదా____! నేనూ, శారద, జానకి మూడు వ్యాసాలు నువ్వు చెప్పిన విధంగానే రాశాము. ఒకరు రాముని మీద, మరొకరు రావణునిమీద, వేరొకరు సీతమీద.....అప్పుడు నాకో ఐడియా వచ్చింది. అన్నయ్యచేత లక్ష్మణుడి మీద, రైటింగ్ మార్చి నీ పేరు పెట్టుకుని భరతుడి మీద..... ఇంకా రెండు వ్యాసాలు రాసి పోస్ట్ చేశాను.
    భరతుడ్ని గురించి నువ్వెలా చెప్పావో అలాగే రాశాను. పేరు నీది, అడ్రస్ నాది ఇచ్చాను. ధన్ మని లెటర్ వచ్చింది, నీకు ప్రథమ బహుమతి వచ్చిందని, మరి దీన్నేమంటారు, లక్ గాక.....?"
    సీత మాట్లాడలేదు.
    "ఆ....ఇప్పుడర్థమైంది కదా! ఊఁ....క్విక్ గా జవాబివ్వాలి."
    "ఇస్తాను, ఏ  ప్రశ్నకి?"
    "ఏ ప్రశ్నకేమిటి? బోలెడు ప్రశ్నలకి. నీపేరు, నీవూరు, నీహాబీలేమిటి? ఏం చదువుతున్నావు? పెళ్ళయిందా? కాలేదా? ఇదే మొదటిసారా? ఇదివరలో ఏమైనా రాశావా? రాస్తే, అవి ఏమిటి? అవి ముద్రితాలా? అముద్రితాలా? నీ అభిమాన రచయిత్రి ఎవరు? నీ అభిమాన నటీ, నటుడు ఎవరు? చాలు.....ఈ వివరంబులన్నియు చెప్పిన రాసిపంపుదును." ఇంటర్వ్యూలో చెత్త ప్రశ్నలేసే ఆఫీసరులా అడిగింది నీరద.
    "ఎవరిపేరున పంపేది?"
    "ఎవరిపేరునా పంపను? బహుమతి నీ వ్యాసానికొచ్చింది. నీ పేరునే పంపుతాను."
    "డబ్బెవారు తీసుకోవాలి....చెప్పిన నేనా, కష్టపడి రాసిన మీరా?"
    నీరద, సీత ఇంచుమించు సమ వయస్కులు. సీత మామూలుగా జవాబు చెప్పి ఊరుకుంటుంది. తప్పనిసరి అయితే మాత్రం మీరు అంటుంది. ఆ ఇంట్లో నీరద చిన్నమ్మగారు, సీత వంట మనిషి. ఎట్టి పరిస్థితులలోనయినా గౌరవించక తప్పదు.
    సీత అనగానే నీరద ముఖం ముకుళించుకుపోయంది. 'నువ్వెంతో తెలివి గలదానివి, గొప్పదానివి అనుకున్నాను. తెలివయితే వుందిగాని గొప్ప  విషయమొస్తే అది మాబోటివారికి తగినమాట. వంటమనిషి, వంట మనిషే. సిగ్గెలా వుంటుంది. ఎంత హీనంగా అడిగింది? బీదవాళ్ళయితేనే వాళ్ళ అల్పబుద్ధి బయటపెట్టుకుంటారేమో!' అనుకుంది నీరద.
    నీరద ముఖంలో దోబూచులాడే భావాలు గ్రహించి సీత నవ్వుకుంది.
    "సీతా, నీకు ప్రైజొచ్చిందని నేను కుళ్ళుకోలేదు-మనస్పూర్తిగా సంతోషించాను. నాకే ప్రైజొస్తే ఎంత ఆనందించేదాన్ని. అంతేగాని, ఆఫ్ తరాల్ ముష్టి నూట పదహార్లకు మాత్రం సంతోషించేదాన్ని కాదు. అదలావుంచు. లష్టపడి రాసింది నేనయినా, భరతుడ్ని గురించి వివరంగా, విమర్శపూర్వకంగా చెప్పింది నువ్వు. సరిగ్గా నువ్వు  చెప్పిందే రాశాను. కాబట్టి- పేరు మనీ, నీది...."నీరద  ముఖం ఇంకా ముకుళించుకునే వుంది.
    ఆఫ్ ట్రాల్ ముష్టి నూట పదహార్లు. నిజమే నీరద సినిమాలకు, పుస్తకాలకు నెలలో సగం ఖర్చు చేసేంతలేదు. అదే తనకి నెలపై కొన్ని రోజులు కష్టించితే వచ్చే జీతం.....
    సీత ఆలోచిస్తున్నది.
    "సీతా!" నీరద ఏమనుకుందో మామూలుగా పిలిచింది.
    "ఆఁ!" అంది సీత.
    "వివరాలు అడుగుతాను చెప్పు. నోట్ చేసుకుంటాను." అని నీరద వైట్  పేపర్, పెన్ను తీసుకొచ్చింది.
    "ఊఁ..."
    "నీ పేరు బి.సీతాదేవి, అదెలాగూ తెలుసనుకో. వయసెంత?"
    "ఆడదాని వయసు అడగరాదు, చెప్పరాదు. కాబట్టి...టీనేజ్ అని రాసెయ్యి."
    "భలే, భలే! నీ తెలివే వేరు!" మెచ్చుకుంది నీరద.
    'నీరద ఉత్త పిచ్చిపిల్ల, అల్పసంతోషి.' అనుకుంది సీత.
    "పేరయిపోయింది, వయసయిపోయింది. ఆ.... ఏం చదువుతున్నావు?"
    "జీవితంలో చేదు నిజాలు."
    పొరపాటుకి నీరద నాలుక కొరుక్కుంది.
    "ఎంతవరకు చదివావు?"
    "ఎదుటి మనిషిని చూడగానే చదవగలినంతవరకు."
    "పో__సీతా! ఒక్కదాని కికూడా సరిగ్గా జవాబివ్వవ్! పోనీ.... హాబీ ఏమిటి?"
    "వంట చెయ్యటం."
    "ఉహూఁ, ఇది రాస్తే ఏం బాగుంటుంది? పోనీ...ఛస్ ఆడటమనో! ఫ్రెండ్స్ తో  కబుర్లు, స్టాంపులు సేకరించటం, అబ్బాయిల నేడిపించటం, తరుచు సినిమాలు చూడటం.... ఇలాంటి దేదయినా రాస్తే బాగుంటుంది."
    "బాగుంటుందని రాస్తామా? వాస్తవం రాస్తామా? ఫరవాలేదు. నిజం గాకపోయినా. ఫలానా తారకి ఐస్ క్రీమ్ ఇష్టం, ఫలానా రచయిత్రికి తోటకూర పప్పు ఇష్టమని పత్రికలు రాస్తుంటాయిగా! అలా చెప్పనా? వద్దులే, వాస్తవంరాద్దాము. ఉద్యోగం వంటలక్క, హాబీ వంటచేయటం, బ్రాకెట్ లో తప్పనిసరి కూడా. అని  రాసెయ్యవచ్చు." "ఏమిటి సీతా , నేనెంతోసంతోషిస్తూ ప్రశ్నలేస్తుంటే నీకంతా వేళాకోళంగా వుంది."
    "నేనొకటి చెప్పనా?"
    "ఊఁ!"
    "నా పేరు వద్దు, ఊరు వద్దు, బహుమతి డబ్బు అసలే వద్దు. పెన్ నేమ్ సీత అని పెట్టుకుని రాశాను. నా పేరు నీరద అంటూ వివరాలు మీరే రాసుకోండి."
    "అదేమిటి?"
    "అంతాశ్చర్యం దేనికి? పేపర్లో నా ఫోటో, నా వివరాలు, చూసి మురిసిపోయేటంత యోగంగాని అభిరుచిగాని నాకులేదు. నా పేరుతో పంపుతున్నానని ముందే చెపితే వద్దనేదాన్ని. ఇప్పుడయినా కొంప మునిగిందేమీ లేదు. మనస్పూర్తిగా  చెపుతున్నాను. మీరు రాసుకోవచ్చు."
    "అలా వద్దు సీతా! నాకేమిటో బాధగా వుంది."
    "నాదేం  దొంగలించలేదు. నా అయిష్టంతో ప్రవర్తించటం లేదు. బాధ దేనికి?"
    "నిజంగా అంటున్నావా?"
    "అబద్దం మటుకు కాదు."
    "నీరద ఆలోచిస్తూవుండిపోయింది. సీత మౌనం వహించింది.
    "మరోసారి అడుగుతున్నా సీతా!"
    "ఎన్నిసార్లు అడిగినా నా అభిప్రాయం మారదు."
    "సరే అంత కష్టంగా  వుంటే బలవంతం చేయను. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తాను! పోనీ బహుమతి డబ్బు నువ్వు తీసుకో!"
    "ఉహూఁ! దానిలో  ఓ పైసా  కూడా ముట్టుకొను! ఆ డబ్బు వాడుకున్నా, ఉచితంగా ఎవరికైనా ఇచ్చినా నాకు సంతోషమే!"
    "ఏమిటి సీతా, నామీద కోపం వచ్చిందా?"
    సీత చెయిర్ లోంచి లేచింది.
   "మీ మీద  నాకు కోపమొస్తే,  నా అంత నీచురాలు మరొకటి వుండదు. కోపం లేదు. ప్రేమే ఎక్కువ. ఈ విషయం వదిలెయ్యమంటున్నాను అంతే! మీరేమీ అనుకోవద్దు.  తోచింది మీ పేరుతో రాసుకోండి, అవతల చాలా పని ఆగిపోయింది, మళ్ళీ వస్తాను."
    సీత మరోమాట కాస్కారమివ్వకుండా వెళ్ళిపోయింది.
    "సీత గురించి  ఏమనుకోవాలో తెలియటంలేదు. సీత ఓ పెద్ద మిష్టరీకేసు, హృదయాన్ని ఆపరేషన్ చేసినా లోతు తెలుసుకోలెము."
    నీరద తలపట్టుకు కూర్చుంది.

 Previous Page Next Page