"అబద్దమాడాల్సిన ఖర్మ ఈ పెద్దవయసులో నాకెందుకు?" రాఘవేంద్రరావు గట్టిగా అన్నాడు.
"అబద్దాలు కూడా ఓ వయసులోమాత్రమే వాడాలన్నమాట, మహానుభావా! మంచి నీతే నీది." వింటున్న సీత అనుకుంది.
"సీత ముక్కుకుసూటిగా పోయేరకం." అంది శాంతకుమారి.
"అది మాటల్లో కావచ్చు, చేతల్లో వుండాలనేముంది? ఎనకటికో ఆసామి నమ్మకమైన నౌకరుకోసం గాలిస్తున్నాడట. అదితెలిసిన ఓ టక్కరి కనపడ్డవస్తువల్లా తీసుకొచ్చి ఇచ్చి "ఇది నాకు దొరికింది నాది కానీవస్తువు నే ముట్టను." అనేవాడట. ఆసామికి టక్కరివాడిపై నమ్మకం కుదిరి నౌకరీలో పెట్టుకున్నాడు. తనపై పూర్తీ నమ్మకం చిక్కిందాకా టక్కరి వాడు న్యాయంగా విశ్వాసపాతృడిలా పనిచేసి ఇంటి తాళాలు చేజిక్కగానే ఇనపెట్టెలో మొత్తం డబ్బు, ఇంతావిడితోసహా మాయమయ్యాడట. అలాగే ఈ సీత....?"
"మీరు ఇంత చెపుతున్నా నాకెందుకో సీత అబద్దాలాడుతున్నాదనిపించటం లేదు."
"నే కళ్ళారా చూసింది, చెవులారా విన్నది అబద్దమంటావ్?"
"అదికాదు....?"
"అది కాదు లేదు, ఇదికాదు లేదు. ఆరోజు సాయంత్రం నే బజారునుంచి వస్తున్నానా? రోడ్డుకి ఇవతల పేవ్ మెంట్ మీద నే నడుస్తున్నాను. అవతల పేవ్ మెంట్ మీద సీతనడుస్తున్నది. నాపక్కన నడుస్తున్న వాడు, సీతా! సీతా!" అని కేకలు పెట్టాడు. సీత విన్నదో, వినలేదో, చకచకా వెళ్ళిపోయింది. రోడ్డుకడ్డంగా దాటటానికి కార్లు, లారీలు బస్సులు రిక్షాలు-వాడు ఆగిపోయాడు.
"ఆ వెళ్ళే అమ్మాయినేనా అబ్బాయ్ పిలుస్తున్నావు?" అనడిగాను.
"అవునన్నాడు వాడు. ఆ తర్వాత ఆ సీత నీకేమవుతుంది? ఏంటి కథ?" అనడిగాను వాడు వివరంగా చెప్పాడు.
వీడూ, అది, అంజమ్మ హొటల్లో పని చేసేవారట. సీత ఏవూరినుంచో వచ్చిందట. సీతకెవరూ లేరట. హొటల్లో తనతోపాటు ఆరుగురు మగాళ్ళు పనిచేస్తున్నారట, ఓరాత్రి ఆరుగురిలో ఒకడు సీతని రేప్ చేశాడట. సీత హొటల్లో గోలచేసి, అంజమ్మతో పోట్లాడి రాత్రికి రాత్రి బైటకొచ్చేసిందట....." రాఘవేంద్రరావు చెప్పుకుపోతున్నాడు.
"ఇందాక చెప్పారుగా మళ్ళీ దేనికి? సీతగురించి వాడు చెప్పింది నిజమని ఎలా నమ్మటం? అబద్దం కావచ్చుగా?" అంది శాంతకుమారి.
"అబద్దమేమీకాదు. అక్షరాలా నిజం. అంజమ్మ హొటల్ కూడా చూశాను. ఇదిట్లావుండనియ్యి, ఇంకో వింత, సీత మధ్య మధ్య మా ఇంటి కెళ్ళోస్తానని వెళ్ళోస్తుంటుంది. వాళ్ళింటికి కాదు. ఎందుకంటే సీతకి తన వాళ్ళంటూలేరు. వాళ్ళకో ఇల్లు లేదు."
"మరి సీత వెళ్ళివస్తుంటుందిగా?"
"నీలాంటి అమాయకులుంటే కళ్ళుగప్పి ఎక్కడికైనా వెళ్ళి వస్తూనే వుంటుంది. ఈ ప్రశ్నలన్నీ ఎదురవుతాయనే, ముంచే తెలిసిన నేను ఒకటికి రెండుసార్లు సీత ఇంట్లోంచి బైలుదేరగానే సీత ననుసరించి వెళ్ళాను. ఓసారి మ్యాట్నిసినిమా కెళ్ళింది. మరోసారి రెండుగంటలసేపు ఆ వీధి ఈవీది తిరుగుతూ గడిపింది. ఇంకోసారి దేముడి గుడి కెళ్ళోచ్చింది. ఓసారి గాంధీహిల్, మరోసారు కనకదుర్గ కొండ. వెళ్ళాలంటే ఎన్ని ప్రదేశాలు లేవు."
"శాంతకుమారి ఆలోచిస్తున్నది. ఏమీ మాట్లాడలేదు.
రాఘవేంద్రరావుకి ఆ మౌనం నచ్చలేదు. శాంతకుమారి సీతని ఛడామడా తిడుతుందేమో అనుకుంటే అదేం కనపడలేదు.
"అసలు సీతది కులమేమిటో, గోత్రమేమిటో? మనింట్లో వంటకి పెట్టుకున్నాము. రేపు సీతది మన కులం కాదని తెలిసి....లేక మరేదైనా జరిగితే మన పరువేంకావాలి? దానిదేముంది దానిదోవన అది పోతుంది. మధ్యన పరువూ మర్యాద పోయి చచ్చేది మనం. ఆ తర్వాత ఏమనుకుని ఏం లాభం?"
"నిజమే!"
"నిజమే అని ఊరుకుంటే ఎలా? పని మానిపించి పంపించు. ఇలాంటి కిలాడీ రేపు మన శరత్ ని వలలో వేసుకోదని ఏమిటి?"
"నా తల పగిలిపోతున్నది. నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి." శాంతకుమారి విసుగ్గా అంది.
"ఆలోచించు, సీత బజారు నుంచి వచ్చే వేళయింది. మళ్ళీ వస్తాను."
రాఘవేంద్రరావు గదిలోంచి బయటికొస్తాడని తెలిసన సీత రెండంగల్లో వంట గదిలోకి వెళ్ళిపోయింది. సీత ఏ మాత్రం తొణక్కుండావింది.
సీత తీవ్రంగా ఆలోచిస్తూ వంట మొదలుపెట్టింది.
'ఈ ముసలినక్క వల్ల తన కథ సగం బయటపడింది. మిగతా సగం కథ- తానో శీలం చెడిన ఆడదానిలా, దొంగలా చిత్రీకరించబడింది. ముందు ఏం జరుగుతుంది? రాఘవేంద్రరావు తనపై సి.ఐ.డి. పని చేస్తున్నాడన్నమాట....
రెండు వారాల క్రితం రాఘవేంద్రరావు. ఈ ముసలి నక్క అర్థరాత్రి తనని లేపి, తన శీలం కోరటం, తను తిడితే "నువ్వు నోరు మూసుకుని ఊఁ అను శరీరంలో కోరిక తీరుతుంది, చీరలు, నగలు కానుకలుగా వస్తాయి. ముసలాడినని చూస్తున్నావా? పడుచువాడికన్నా బలం వుంది ఈ విషయంలో, ఓసారి చూడరాదా? నీకే తెలిసిపోతుంది." అనటం, తను పెద్దగా అరిచి గోల చేస్తానంటే తోక ముదవటం- తనకి, రాఘవేంద్రరావుకి తెలుసు. తను లోంగాలేదని కోపం....
శాంతకుమారి గారు ఆలోచిస్తుంది. అంజమ్మ హొటల్లో తనని గురించి ఎంక్వయిరీ చేస్తుంది. చేయనీ.... అంతమాత్రాన అంజమ్మ జరిగింది చెపుతుంది గాని లేనికథ సృష్టంచి చెప్పదు. ఓ వేళ చెపితే అది తన ఖర్మ.
ఊళ్లో తనవాళ్ళున్నారని చెప్పింది. అదెలాగూ అబద్దమే. అయినా తను దానికి తగిన సంజాయిషీ చెప్పుకోవచ్చు. నాకెవ్వరూ లేరంటే వందప్రశ్నలేస్తారు. నేనూ, నా జీవితం మీ కనవసరం, న్యాయంగా పని చేస్తాను, పని ఇవ్వండి అంటే ఇవ్వరు. అప్పుడు అనుమానంగా చూసి సవాలక్ష ప్రశ్నలేస్తారు. నిజం నమ్మరు. అబద్దం నమ్ముతారు. అబద్దం దాగదని తెలిసి అబద్దమడాను. నా పనిలో వంకవుంటే చెప్పండి.... అని వినయంగా విన్నవించుకోవచ్చు. తర్వాత సంగతి తన అదృష్టదురదృష్టాలపై ఆధారపడివుంది.
శాంతకుమారి గారు ఊరుకోరు. తప్పకుండా తనని అడుగుతారు. ముసలినక్క ఆ రోజు అలా అన్నాడని చెప్పినా నమ్మరు. ఎందుకంటే తను కొన్ని అబద్దాలు చెప్పి ఈ ఇంట్లో స్థానం సంపాదించుకుంది.
ఏం చెయ్యాలి??
అంజమ్మ హొటల్లో పనిచేసే పుల్లారావా? ఓబయ్యా? సాంబా? మరింకెవడైనానా ఆ రోజు తనని పిలిచింది? పిలిస్తేపిలిచాడు, తన శీలం హొటల్లో మగ పురుగుల దయవల్ల పోయిందనిచెపుతాడా? ఇడియట్.... పూల్....బ్రూట్...వెధవ....కుంక....గాడిద....
రేపు అంజమ్మ హొటల్ కి వెళ్లాలి. వాడెవడో తెలుసుకుని పీక నులిమెయ్యాలి. అందాకా ....అందాకా...తన మనసెందుకు పాడుచేసుకోవాలి? రోట్లో తలదూర్చి రోకటి పోటుకి వేరవటమా? ఇంపాజిబుల్..... ఈ సీత కలియుగ సీత. కానియ్ ఏం జగరనుందో!?'
సీత తీవ్రంగా ఆలోచించి గట్టి నిర్ణయానికొచ్చి, ఏమీ జరగనట్లు చకచకా వంట చేయటంలో మునిగిపోయింది.
13
గాఢ నిద్రపోతున్న సీతకి చటుక్కున మెలుకువ వచ్చింది.
సీత మీదికివంగి శరత్ బాబు పిలుస్తున్నాడు. "సీతా, సీతా!" అని తగ్గుస్వరంతో. అందుకే సీతకి మెలుకువ వచ్చింది.
మంచం మీదనుంచి చటుక్కున లేచికూర్చుంది సీత.
సీత ఎప్పుడూ వసారాలో మడత మంచం మీద పడుకుంటుంది. ఇంట్లో అందరూ ఎవరి గదుల్లో వారు పడుకుంటారు. సీత వంటరిగా వసారాలో పడుకుంటుందని తెలిసే రాఘవేంద్రరావు ఓ రాత్రి వచ్చాడు. ఈ రాత్రి శరత్ బాబు వచ్చాడు.
సాయంత్రం రాఘవేంద్రరావు, శాంతకుమారి మాటలు విన్న తరువాత సీత మనసునెంత నిబ్బరపరుచుకున్నా, రాత్రి పడుకున్నా తర్వాత ఆలోచించి, ఆలోచించి ఎప్పటికో నిద్రపోయింది. ఇలా నిద్రపోయింది, అలా శరత్ బాబు వచ్చి లేపాడు.
వసారాలో పెద్దలైటు తప్ప బెడ్ లాంప్ లేదు. సీత పెద్దలైటు వెలుగు రాత్రి భరించలేదు. అందుకే లైటు లేకపోయినా వసారాలోనే పడుకుంటున్నది. వెన్నెల వెలుగు వసారాలోకి ప్రసరిస్తున్నది.
సీత మంచం మీదనుంచి లేచి కూర్చోటం చూసి శరత్ బాబు లేచి నిటారుగా నుంచున్నాడు.
"నిద్రెందుకు లేపారు?" అంది సీత.
"చెపుతాను. పెద్దగా మాట్లాడకు." గొంతు తగ్గించి అన్నాడు శరత్ బాబు.
"ఎవరైనా వింటారని భయమా....?" కావాలని స్వరం తగ్గించి అడిగింది సీత.
శరత్ బాబుకి ధైర్యం, సంతోషం ఏకకాలంలో కలిగాయి.
"అవును. భయం కాదా ఏమిటి?" అని- "సీత! మంచం మీద కూర్చోనా?" అన్నాడు.
సీత మంచం మీదనుంచి లేచింది. "ఈ ఇంటికి చిన్నయజమానులు మీరు. కూర్చోండి." అంది.
శరత్ బాబు మంచం మీద కూర్చున్నాడు. సీత నుంచుంది, వసారాకున్న స్థంభాని కానుకుని.
"ఈ సమయంలో ఎందుకొచ్చారు?"
"చెపుతాను."
"అర్థరాత్రి నిద్రలేపి చెప్పేదేముంది? పగలు చెప్పొచ్చుగా?"
"కొన్ని చాటుగా చెప్పేవి, కొన్ని పబ్లిక్ గా చెప్పేవి వుంటాయి. చాటుగా చెప్పేవాటికి వంటరి సమయం దొరకాలి. అర్థరాత్రి సేప్టీ కదా!"
"అవునవును." సీత వ్యంగ్యంగా అంది.
శరత్ బాబు సీత మాటలో వ్యంగ్యం గుర్తించాడో లేదో గాని మామూలుగానే వున్నాడు. "సీతా! నా గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు.