Previous Page Next Page 
అర్చన పేజి 13


    వేణు దిగ్గున తలెత్తి చూశాడు. చింతనిప్పుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. "మీరు.....మీరనేది?"
    "అక్షరాలా నిజం. ఇఫ్ అయామ్ కరెక్ట్.....నువ్వు అర్చనని బలవంతంగా అనుభవించావు."
    వేణు అపరాధిలా కళ్ళు దించుకున్నాడు.
    "అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వేణూ! నిజానికి చట్టపరంగా నువ్వు చేసింది తప్పే. నీ భార్య అయినా ఆమెకిష్టం లేకుండా ఆమెని అనుభవించడం నేరం. కానీ మనం కొంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నువ్వు చేసింది అంత పెద్ద నేరం కాదనే నేననుకుంటాను. ఎనీవే ఇప్పుడు అర్చన తిరిగి వస్తుందన్న ఆశ నీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనుకుంటా. ఆమె గుర్తుగా ఆమె మిగిల్చిన బాబుని స్వీకరించి, మరో పెళ్ళి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించు. జరిగిందంతా మర్చిపో."
    "ఎలా? ఎలా మర్చిపోను?" ఆవేదనగా అన్నాడు వేణు.
    "వేణూ! ఆఫ్ట్రాల్ ఇది లైఫ్. ఎప్పటికప్పుడు గతం మర్చిపోతూ, వర్తమానంతో రాజీపడుతూ భవిష్యత్తుని నిర్మించుకుంటూ సాగిపోవడమే జీవితానికి అర్ధం. కాబట్టీ నువ్వు ఇకనైనా అర్చనని మర్చిపోవడం మంచిది. పెద్ధదాన్నీ, నీ శ్రేయోభిలాషిని ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నా మాట విను."
    వేణు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు "అయితే, బాబు నిజంగా నా కొడుకేనా?"
    నవ్వింది ప్రజ్ఞ. "మగవాడివనిపించుకున్నావు. కట్టుకున్న నిన్నే తన ఒంటిమీద చేయి వేయనివ్వని అర్చన ఇంకెవరికో పిల్లవాడ్ని కంటుందా?"
    "అదికాదు. నా ఉద్దేశం" కలవరంగా అన్నాడు.
    "నీ ఉద్దేశం పక్కన పెట్టు. ఆ బాబు ఖచ్చితంగా నీ కొడుకే. కావాలంటే డి.ఎన్.ఎ. టెస్టు చేయించు."
    "నో....అవసరం లేదు. వెంటనే నా బాబుని నేను తీసుకొచ్చుకుంటాను."
    "గుడ్... బాబు నీ జీవితాన్ని ట్రెమండస్ గా మార్చేస్తాడని ఆశిస్తాను."
    వేణు లేచాడు. అతని మనసిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబుని అర్జంటుగా చూడాలని ఆరాటంగా కూడా ఉంది.
    "వెళ్తాను" అన్నాడు.
    "ఓకే గుడ్ లక్" ప్రజ్ఞ చేయి అందించింది.
    "థాంక్యూ" వేణు బైటకి నడిచాడు.
    అతను వెళ్ళినవైపు చూస్తూ సన్నగా నిట్టూర్చింది ప్రజ్ఞ.

                                                                                             * * * * *

    ఏలూరు బస్టాండ్ లో బస్ దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ, ఉమ్ములు, అరటిపండు తొక్కలు తొక్కకుండా, చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని, జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డుమీదకు వచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్ధం కాలేదు. కొద్దిసేపలాగే ఒక న్యూస్ పేపర్ షాప్ ముందు నిలబడిపోయింది. అటు ఇటూ రకరకాల దుకాణాలు. లోపలికి వెళ్ళే బస్సులు, బస్టాండులోంచి బైటకి వచ్చే బస్సులతో రద్దీగా, హడావుడిగా ఉంది.
    'ఏవిటీ జీవితం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? వేణుని వదిలి వచ్చి తను తప్పు చేసిందా?'
    కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది.
    సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోతోన్న తనని అమ్మ పరిగెత్తుకు వచ్చి పట్టుకుంది.
    అస్పష్టంగా ఏదో తెలుస్తోంది.
    వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్నా, అన్నయ్యా, అమ్మా తనని బాగా తిట్టారు. అతనిలాంటి మంచివాడితో రాజీపడి బతక్కుండా అలా రావడం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయింది అర్చన. విచక్షణారహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాడినన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే కళ్ళు బైర్లు కమ్మాయి. వేణు చేసిన అవమానం, తల్లితండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అభిమానాన్ని, అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణం బడలిక, ఖాళీ కడుపు దిమ్మతిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది.
    అమ్మ ఏడుస్తూ "ఏదో జరిగింది. ఆడపిల్ల ఎక్కడికి వెళుతుంది ఉన్నపళంగా. దాని ఆరోగ్యం బాగున్నట్టు లేదు. డాక్టర్ ని తీసుకురండి" అంటోంది.
    కాస్సేపటికి ఏవో పరీక్షలు. నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా, తీయగా హార్లిక్స్ కావచు. "బలహీనంగా ఉందమ్మా అమ్మాయి. జాగ్రత్తగా చూసుకోండి. మందులేం అవసరం లేదు. పళ్ళు, పాలు బాగా ఇవ్వండి. బంగారంలాంటి మనవడు పుడతాడు" డాక్టర్ స్వరం.
    ఆ తరువాత తనకి భవిష్యత్తంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది.
    "ఒట్టి మనిషి కాదురా. దాని పురుడు పోసిందాకా ఉండనీ. ఆ అబ్బాయికి ఉత్తరం రాసి రమ్మని చెప్పు" అమ్మ స్వరం.
    "అతడ్ని నీ కూతురు వదిలేసి వచ్చింది. నేనే మోహం పెట్టుకుని ఫోన్ చెయ్యనమ్మా, దానికసలు కృతజ్ఞత ఉందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్ళి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయి ఉంటే దని బతుకేమయేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపరం చేస్తూ సుఖంగా ఉండక అతన్నొదిలేసి ఎందుకొచ్చినట్టు? అమ్మా! ఆడది ఆడదానిలా ఉంటే ఈ సమస్యలు వస్తాయా? తనేదో రాణీ రుద్రమని అనుకుని వెధవ్వేషాలేసింది. మగాడు, అందులోనూ రౌడీ వెధవ ఊరుకుంటాడా?"
    "అయిందేదో అయిందిరా! భవిష్యత్తు సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కాదు."
    "ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడి దగ్గరకెళ్ళి బతకమను. ఈ సమాజంలో మగాడ్ని ఎదిరించి బతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు."
    మగతగా పడుకున్న అర్చన చెవుల్లో పదునైన గుండుసూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తోంది. నిప్పుల కుంపటిలాగా గుండె మండుతోంది. నోటి కొచ్సినట్టు మాట్లాడుతున్న అన్నగారిని ఎడా పెడా చెంపలు వాయించాలనిపిస్తోంది. కానీ పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయస్థితి. ప్రతి మగవాడూ ఆడవాళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు, మగాడి తరఫునే మాట్లాడతాడు. ఈయనకి వచ్చే భార్య ఎలా బతుకుతుందో! భగవంతుడు దయతలచి ఇతని భావాలకి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి గనక వస్తే...అస్పష్టమైన ఆలోచనల్తో కళ్ళు మూతలుపడ్డాయి.

 Previous Page Next Page