Previous Page Next Page 
అర్చన పేజి 12


    అర్చన పెనుగులాడింది. "వదులు, నన్ను వదులు ప్లీజ్."
    "వదలను. ఇన్ని రోజులనుంచీ ఎంతో సహనం వహించాను. నా వల్ల కాదు. నేనూ మనిషినే, నేనూ మగాడినే. భార్య ఉండగా బ్రహ్మచారిగా బతకాల్సిన అవసరం లేదు."
    "నీ ఇష్టం వచ్చినవాళ్ళతో ఎంజాయ్ చెయ్యి. దయచేసి నన్నొదులు."
    "నాన్సెన్స్ నువ్వుండగా నాకు వేరేవాళ్ళతో ఎంజాయ్ చేయాల్సిన ఖర్మేంటి?"
    "నాకిష్టం లేదు కాబట్టి. నిన్ను నేను సుఖపెట్టలేను కాబట్టి."
    "ఆలాంటప్పుడు పెళ్ళికి ఎందుకొప్పుకున్నావు?" కోపంతో ఊగిపోతూ అరిచాడు.
    "నేను ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా ఒప్పించారు." అరిచింది అర్చన లేవబోతూ.
    "ఏం నాకేం తక్కువైంది? నిన్నెంత ప్రేమించాను. ఎంత ఆరాధించాను. నీమీద నాకు సర్వహక్కులూ ఉన్నాయి" ఆమె లేవకుండా అదిమిపెడుతూ అన్నాడు.
    "కావచ్చు. అలా అని నాకిష్టం లేకుండా నన్ను అనుభవించే హక్కు నీకు లేదు."
    "ఏం? ఎందుకు లేదు?"
    "లేదు... లేదు... నన్ను వదులు... వదులు..." అతడి చేతులనుండి వదిలించుకోడానికి పెనుగులాడుతూ ఏడుపు స్వరంతో అంది.
    "వదలను. ఏం చెడిపోయిన నీకు నాకన్నా గొప్పవాడు దొరుకుతాడా?"
    అర్చన దెబ్బతిన్నట్టుగా చూసింది. "ఏం అన్నావు?"
    "అవును నేనేం తప్పు అనలేదు. నువ్వు చెడిపోయావు. నిన్ను నాగరాజు కిడ్నాప్ చేయడమే కాదు. రేప్ చేశాడు. అవునా? నిజం చెప్పు. అందుకేనా నీకు సెక్స్ ఇష్టం లేదు" ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు.
    ఆమె నిశ్చేష్టురాలైనట్టుగా చూస్తోంది.
    "చెప్పు నిజం చెప్పు. నేను కాబట్టి, నిన్ను మనసారా కోరుకున్నాను కాబట్టి, అంత జరిగినా పోనీలే అని పెళ్ళిచేసుకున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. కానీ, నువ్వే రాక్షసివి. నీకసలు మనసనేదే లేదు. కనీసం కొంచమైనా కృతజ్ఞత ఉందా? ఎవరూ నిన్ను పెళ్ళిచేసుకోరని, తల్లితండ్రుల గుండెలమీద బరువుగా, వాళ్ళకో ప్రశ్నార్ధకంగా మిగిలిపోతావని, నేనెంత త్యాగం చేశానో నీకు తెలుసా? ఇంతగా క్షోభపెడతావా నన్ను!"
    అర్చన గుడ్లప్పగించి చూడసాగింది వేణుని. ఆమె కళ్ళలో అంతులేని విస్మయం కనిపిస్తోంది. కొన్ని వందల ప్రశ్నలు కళ్ళల్లో తిరుగుతూ జవాబు కోసం వేణువైపు చూస్తున్నాయి.
    నెమ్మదిగా ఆమె నోట్లోంచి అనేక ప్రశ్నలు బాణంలా వచ్చాయి, "నువ్వు నన్ను జాలిపడి పెళ్ళిచేసుకున్నావా? నీకు నామీద ప్రేమ లేదా? అబద్దం చెప్పకు వేణూ! వివాహానికి పునాది జాలి, దయ, కృతజ్ఞత అని నేనెప్పుడూ అనుకోలేదు. పరస్పర ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరికి అవగాహన, గౌరవం, అభిమానం ఉండాలనుకున్నాను. మనశ్శరీరాలు పంచుకుంటూ బ్రతికే భార్యాభర్తల మధ్య కృతజ్ఞత ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే... అందుకే ఈ పెళ్ళి వద్దన్నాను. ఎవరన్నా విన్నారా? నన్నెలాగైనా వదిలించుకోవాలని మా అమ్మా, నా నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నన్ను దక్కించుకోవాలన్న స్వార్ధంతో నువ్వు నన్ను ఊపిరి సలపనివ్వకుండా చేసి, బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. నా బతుకేదో అయిపోయిందని, నువ్వు పెళ్ళిచేసుకుని నాకీ జీవితం ఇవ్వకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో అనే అభద్రతాభావంతో నిన్ను పెళ్ళి చేసుకోలేదే నేను! నాకా ఆలోచనే లేదే! ఏం వేణూ, నేనూ అందరిలాంటి ఆడపిల్లను కానా? నాకంటూ వేరే కోరికలు, ఆశలూ ఉండకూడదా? నా కాబోయే జీవితభాగస్వామి పట్ల నాకొక నిర్దుష్టమైన ఆలోచన, కోరికా ఉండకూడదా? ఎవడో ఒళ్ళు పొగరుతో నామీద కక్షతో రెండు రోజులు నన్ను బంధించిన పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలి? వద్దు. నా అంతరాత్మని అనుక్షణం చంపుకుని బతికే ఈ స్థితి నాకు వద్దు. దయచేసి నన్ను మర్చిపో. నీకు కావాల్సినవాళ్ళను పెళ్ళిచేసుకో... నాకీ బతుకొద్దు వేణూ! వద్దు" అర్చన రెండు చేతుల్లో మొహం దాచుకుంది.
    అప్పటికే చక్రవర్తి మాటల ప్రభావంతో ఒక పక్క ఆమె మీద కాంక్షతో మరో పక్క కాగిపోతున్న వేణుని ఆమె ఏడుపు కదిలించలేకపోయింది. అందుకే కసిగా అన్నాడు. "నో...అదంతా నాకు తెలియదు. నేను నీ భర్తను. ఇప్పటిదాకా ఎంతో సహనం వహించాను. నా సహనం నా చేతకానితనంగాభావిస్తున్నావు నువ్వు. నేనింక ఉపేక్షించను. నిన్ను క్షమించదలచుకోలేదు. నాలో జాలి, దయ, ఏమీ లేవు. నా హక్కు నేను ఉపయోగించుకుంటాను."
    "అంటే... అంటే... నీకు నా శరీరంతోటే కానీ, మనసుతో ఏం సంబంధం లేదన్నమాట! నన్ను బలవంతంగా అనుభవించడానికి పెళ్ళి చేసుకున్నావన్నమాట. నీకసలు సంస్కారం లేదు. ఛీ..."
    "అవును లేదు. సంస్కారం లేదు సరేనా?" వేణు పళ్ళు పటపటలాడిస్తూ ఆమె చేతులు వెనక్కి విరిచిపట్టుకున్నాడు.

                                                                                           * * * * *

    వేణు హఠాత్తుగా టీ కప్పు టేబుల్ మీద పెట్టి రెండు చేతుల్లో మొహం దాచుకున్నాడు.
    ప్రజ్ఞ తెల్లబోయింది. అతడిని ఆ పరిస్థితిలో చూస్తుంటే ఆమెకి చాలా జాలేసింది. వేణుది నిజానికి చాలా మృదువైన స్వభావం. ఎవరినీ బాధపెట్టడం, హింసించడం అతని తత్వం కాదు. కాకపోతే తాననుకున్నది జరగాలన్న పంతం మాత్రం ఉంది. అర్చనని ఎంతో ప్రేమించాడు, ఆరాధించాడు, పెళ్ళిచేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో చేసుకున్నా ఆమెని తాను భార్యగా పొందానన్న తృప్తి గర్వం అతనిలో ఉన్నాయి. కానీ, అర్చన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. వేణు పట్ల కేవలం కృతజ్ఞత తప్ప, ప్రేమ చూపించలేకపోయింది. కారణం ఏవిటో అర్చనకే తెలియాలి. నిట్టూర్చింది ప్రజ్ఞ.
    ఏది ఏమైనా, అర్చన వేణు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవటానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేమిటో వేణు కొంచెం మానసికంగా తేరుకున్నాక తెలుసుకుంటే మంచిది. బహుశా వేణు ఆమె ప్రవర్తనకి విసిగిపోయి ఆవేశపడి ఉంటాడు. అనుభవజ్ఞురాలైన డాక్టర్ గా, ఓ స్త్రీగా వేణు పరిస్థితి అర్ధం చేసుకున్న ప్రజ్ఞ మృదువుగా అంది.
    "రిలాక్స్ వేణూ. రిలాక్స్. ఓకే ఏం జరిగిందో ఐ కెన్ అండర్ స్టాండ్. జరిగిందేదో జరిగింది. మర్చిపో. అర్చన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. దానికి కారణం నేను ఊహించింది అయితే, నువ్వన్నట్లు ఒక్కసారి మీ ఇద్దరూ శారీరకంగా కలిసినా ఆమెకి గర్భం వచ్చే అవకాశం ఉంది. అది బలవంతంగా కలిసినా, ఇష్టపూర్వకంగా కలిసినా మీ ఇద్దరూ కలిసిన పీరియడ్ ని బట్టి, ఆమెకి గర్భం రావచ్చు. అదే నిజమైతే అర్చన వదిలివెళ్ళిన బాబు నీ కొడుడే."

 Previous Page Next Page