"ఏం చేద్దాం బాబ్జీ...?" అడిగాడు భయంగా.
"నాకేం తెలుసు....? నాకూ భయంగానే ఉంది. అనవసరంగా రిస్కు తీసుకున్నావు. అసలు ఇప్పుడే పుట్టిన పాపనేవరైనా ఇలా తీసుకొస్తారా...? ఏమైనా అయితే మనిద్దరం జైల్లో కూర్చోవాలి. అదీ. యు డిడ్ ఎ మిస్టేక్...." అన్నాడు బాబ్జీ వణుకుతున్న స్వరంతో.
ఆదిత్య ఏం మాట్లాడలేదు. బాబ్జీ అంటుంటే తను చేసింది ఎంత తప్పో అర్ధం అవుతోంది. ఎలా ఇప్పుడు వెనక్కి వెళ్ళడమా....? ముందుకి వెళ్ళడమా...? వెనక్కి వెళితే పాప తనకి దక్కదు. ఈపాటికీ అక్కడ ఎంత రాద్దాంతం జరుగుతుందో . వెనక్కి వెళ్ళాలంటే ఇప్పుడు భయం వేస్తోంది. ఇంకా వంద కిలోమీటర్లు ఉంటుందేమో. దేవుడా....! ఏం చేయను. టోల్ గెట్ సమీపించింది. గాభరా అనుచుకుంటూ గ్లాస్ దించాడు. జేబులోంచి డబ్బులు తీసి చేయి బైటకి పెట్టాడు. టోకెన్ ఇచ్చి చిల్లర ఇచ్చాడు . కౌంటర్లో కూర్చున్న వ్యక్తీ వెళ్ళమన్నట్టుగా గేటు తీశాడు.
రిలీఫ్ గా ఊపిరి పీల్చుకునో కారు వేగంగా పోనిచ్చాడు.
"థాంక్ గాడ్.." అన్నాడు బాబ్జీ. "నాకెంతో అనుమానంగా ఉందిరా. పాపకి ఆకలి వేయలేదా? ఇంతవరకూ ఏడవలేదేంటి...?"
బాబ్జీ అలా అనగానే ఆదిత్య సడన్ బ్రేక్ వేశాడు. "ఏంటిరా ఎందుకలా అంటున్నావు..?" కంగారుగా అడిగాడు వెనక్కి తిరిగి బాబ్జీని చూస్తూ.
"పాప లేచి పాలన్నా తాగాలి కదా...."
"ఇంతకూ ముందు కొంచెం పాలు తాగింది కదా..."
"కొన్ని చుక్కలేగా...."
"పుట్టగానే లీటరు పాలు తాగుతుందా' విసుగ్గా అంటూ కారు స్టార్ట్ చేశాడు. "ఏం కాదు నువ్వేం భయపడకు తెల్లవారే టప్పటికీ మా అమ్మమ్మ దగ్గర ఉంటాం మనం..."
"ఇల్లెలా తెలుసుకుంటావు.
"తెలుసుకోడానికి అదేం మహా పట్నమా చిన్న ఊరు."
"ఏం కాదు చాలా హిస్టారికల్ ప్లేస్. పల్నాటి చరిత్ర అక్కడిదే. నాకు తెలుసురా. నువ్వేం వర్రీ అవకుండా కాస్సేపు నిద్ర పో నేను లేపుతాను...."
"ఏం నిద్రో ఈ టెన్షన్ తో నిద్రేం వస్తుంది." అంటూ ఆవలించి కళ్ళు మూసుకున్నాడు బాబ్జి....
తెల్లవారి సుమారు ఏడవుతుండగా కారు మాచెర్ల మీదుగా కారంపూడి చేరింది. తెలిసిన గుర్తులతో అమ్మవారి గుడి దగ్గర ఆపాడు.
మగవాళ్ళు, కొందరు పిల్లలు అరుగుల మీద కూర్చొని వేప పుల్లలు నముల్తున్నారు. ఆడవాళ్ళు వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు లేస్తున్నారు. కొంతమంది స్నానాలు చేసి, పాత పట్టుచీరలు కట్టుకుని గుడికి వెళ్తున్నారు. గుడి గోపురం కనిపిస్తోంది. అప్పుడప్పుడూ గంటలు మోగుతున్నాయి.
కారు దిగి అరుగు మీద కూర్చున్న ఓ వృద్దుడి దగ్గరకు నడిచి "లలితమ్మ గారుండేది ఎక్కడ..?" అని అడిగాడు.
మహేష్ బాబు లాంటి కుర్రాడు దగ్గరకు రాగానే కొంతమంది అమ్మాయిలూ గుమ్మాల దగ్గర నిలబడి చిత్రంగా చూడసాగారు.
"మీరెవరు బాబూ...?" అడిగాడాయన.
"నా పేరు ఆదిత్య హైదరాబాదు నుంచి వస్తున్నాను. లలితమ్మ గారి ఇల్లెక్కడ....?" అడిగాడు మళ్ళీ.
'అదే" ఎదురుగా ఉన్న ఎత్తు అరుగుల డాబా ఇల్లు చూపించాడు చేత్తో.
ఆదిత్య గుండె దడ దడలాడింది. సన్నగా కళ్ళలో వణుకు మొదలైంది. అక్కడే నిలబడి పూర్తిగా ఇంటి వైపు తిరిగి పరిశీలనగా చూసాడు. బాగా పాతకాలం ఇల్లు కానీ బలిష్టంగా ఉంది. రెండు వైపులా ఎత్తైన అరుగులు. మధ్యలో లోపలికి వెళ్ళడానికి ఆరు మెట్లు, మెట్లు కడిగి ముగ్గేస్తోందో అమ్మాయి.
"థాంక్స్" అంటూ ఆ ఇంటి వైపు నడిచాడు ఆదిత్య. మళ్ళీ వెనక్కి వచ్చి డోర్ తెరచి గుర్రు పెట్టి నిద్రపోతున్న బాబ్జీని లేపాడు. అలాగే ఒంగి బొంతతో సహా పాపాయిని చేతుల్లోకి తీసుకున్నాడు.
కళ్ళు నులుముకుంటూ లేచి "వచ్చేశామా..." అనడిగాడు బాబ్జీ.
"ఇదే ఇల్లు దిగు...." అంటూ నిటారుగా నిల్చుని అతి జాగ్రత్తగా పాప నెత్తుకుని అడుగులో అడుగు వేస్తూ మెట్లు ఎక్కసాగాడు. బాబ్జీ కూడా అతడిని అనుసరించాడు.
ఇద్దరు మగపిల్లలు ఒక పసిపాపతో లలితమ్మ గారింట్లోకి వెళ్ళడాన్ని నోరెళ్ళబెట్టుకొని విచిత్రంగా చూస్తూ నిలబడ్డారు అంతా. పెద్ద వసారా, ముగ్గేస్తున్న అమ్మాయి వీళ్ళిద్దర్నీ చూసి లోపలికి పరుగెత్తి "అమ్మగారూ ....ఎవరో చుట్టాలోచ్చా రండి..." అని అరిచింది.
"ఎవరే ..." అంటూ ఒక స్వరం... వెనకే తలంటుకున్న జుట్టు వేలు ముడి వేసుకుని జరీ అంచు గుంటూరు నేత చీర కట్టుకున్న ఒక డెబ్బై ఏళ్ళ స్త్రీ లోపల్నించి వచ్చింది.
ఆదిత్య నీ, బాబ్జీని చూస్తూ అయోమయంగా నిలబడి పోయింది.
బాబ్జీ భయంగా ఆదిత్య వెనక్కి నక్కాడు.
ఆదిత్య గుండె దడదడలాడింది. ఈమేనా తన అమ్మమ్మ... ఈ పరిసరాలు, ఈ ఇల్లు, ఈ స్త్రీ ఎప్పుడో... ఎక్కడో అస్పష్టంగా కళ్ళ ముందు మేదుల్తున్నాయి...ఎప్పుడో చిన్నప్పుడు తనకి జ్ఞానం లేనప్పుడు ఈ ఇంటికి వచ్చాడు. ఆరోజు ఈమె బాగా ఏడుస్తున్నట్టు గుర్తు. అమ్మ చెప్పింది ఆరోజు తాతయ్య చనిపోయారనీ, అందుకే చూడడానికి వచ్చారని, మళ్ళీ ఇప్పుడు ఇలా అమ్మతో వచ్చి ఉంటె బాగుండేదేమో....! ఇప్పుడు తనని తాను పరిచయం చేసుకోవాలి. ఆవిడ గుర్తు పడుతుందా...? పట్టలేకపోయినా వివరంగా చెబితే నమ్ముతుందా?"ఎవరో అగంతుకలని ఇద్దర్నీ తరిమేయదు కదా....!
వణుకుతున్న కాళ్ళతో మాట్లాడకుండా ఆమె వైపు నడిచాడు.
ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరు బాబూ మీరు....' అంది.
ఆదిత్య కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. దుఃఖంతో బొంగురు పోయిన స్వరంతో పిలిచాడు...
"అమ్మమ్మా....!"
"అమ్మమ్మ.....నువ్వెవరివి బాబూ...." ఆవిడ సంభ్రమాశ్చర్యాలతో అడుగు ,ముందు కేసింది....
ఆదిత్య కొంచెం వేగంగా నడిచి ఆమె దగ్గరకి వచ్చి పాప నందిస్తూ..... "నా పేరు ఆదిత్య... మా అమ్మ పేరు శిరీష..... ఈ పాప నా కూతురు.." అంటూ ఒంగి ఆవిడ పాదాలు తాకాడు.
ఆవిడ అప్రయత్నంగా ఆదిత్య చేతుల్లోంచి పాపను తీసుకుని, పాపను ఆదిత్య నూ నిర్ఘాంత పోయి చూడసాగింది. పాప అకస్మాత్తుగా కెవ్వుమని ఏడుపు ప్రారంభించింది. ఆవిడ నిలువెల్లా వణికిపోసాగింది. ఏంటిది? ఏం జరుగుతోంది? ఆవిడకేం అర్ధం కావడం లేదు. ఈ అబ్బాఏంటి ? తన మనవడేంటి? ఇన్నేళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని తన కూతురు కుటుంబంలోంచి ఒక వ్యక్తీ వచ్చి పసికందును ఇచ్చి, ఏంటిది? ఇదేదో సినిమాలో దృశ్యమో, నాటకమో కాదు కదా! పోనీ కలా? కాదు.
'అమ్మమ్మా...! నేను చాలా చిన్నప్పుడు వచ్చాను కదా మీ దగ్గరకి. నాకు రావాలని చాలాసార్లు అనిపించింది. కానీ, మా అమ్మ తీసుకురాలేదు. ఇప్పుడు నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకంటె ఈ పాప కోసం...."
ఆవిడ నోట మాట రానిదానిలా నిలబడిపోయింది. శిరీష, ఏనాటి శిరీష! పన్నెండేళ్ళవుతుందేమో! తల్లీ కూతుళ్ళ మధ్య సంబంధాలు తెగిపోయి. అలాంటిది ఇప్పుడు ఈ కుర్రాడు నేను మీ మనవడునీ అంటూ వచ్చి, తనకో కూతురుండేదని గుర్తు చేస్తున్నాడు. ఆవిడ కళ్ళల్లో అశ్రువులు ధారలు కట్టాయి.
అప్పటిదాకా ముగ్గేస్తున్న అమ్మాయి వచ్చి అమ్మగారి చేతుల్లోంచి అతి జాగ్రత్తగా ఏడుస్తున్న పాపాయి నందుకుంది.
పాప ఏడుపాపకుండా సన్నగా ఏడుస్తోంది. ఆ అమ్మాయి పాప పొట్ట చూసింది. ఆకలిగా ఉన్నట్టుంది. అప్పటికే ఆవిడ ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని పాప వైపు చూసింది.
"పసి కూనమ్మ గారు..... ఎప్పుడు పుట్టింది ఈ పాప....?' అడిగింది నాగలక్ష్మీ. చేతుల్లో ఉన్న పాపాయిని ఊరుకోబెట్టడానికి చిన్నగా చేతులూగిస్తూ.
"నిన్న రాత్రి...." అన్నాడు ఆదిత్య.
"నిన్నరాత్రా....!" ఆవిడ వెర్రిదానిలా చూసింది. ఆదిత్య తల వంచుకున్నాడు.
"నిన్న రాత్రి పుట్టిన పిల్లని ఇంత దూరం తీసుకొచ్చారా....? ఎలా తీసుకొచ్చావు....? అసలెందుకు తీసుకొచ్చావు....? ఎవరు చెప్పారు నీకిలా తీసుకురమ్మని.... "గబగబా ప్రశ్నలు వేస్తూ పాపాయిని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి పాపకి చుట్టిన బ్లాంకెట్ తొలగించింది. పాప ఒంటి మీద ఒక లూజు గౌను ఉంది. సైజు తెలియక కొన్నట్టుంది ఆ గౌను. పాప సన్నగా ఏడుస్తూనే ఉంది.
ఆవిడ కొన్ని క్షణాలు అచేతనంగా కూర్చుండి పోయి ."నాగలక్ష్మీ ....! ముందు వేడి నీళ్ళు కాయి త్వరగా....అంటూ పాపని నాగలక్ష్మీ చేతుల్లోంచి తీసుకొని ఆదిత్య నీ, బాబ్జీని చూస్తూ...."ఈ పాపకి పాలేమైనా తెచ్చారా....?" అంది.