"అన్నీ ఉన్నాయి...." అంటూ ఆదిత్య గబగబా వెళ్ళి కారు లోంచి బాస్కెట్ తీసుకొచ్చి అమెకిచ్చాడు.
"మీరెళ్ళి ముఖాలు కడుక్కోండి....." అంటూ పాపకి వేసిన గౌను తీసేసింది. నాగలక్ష్మీ తీసుకొచ్చిన వేడి నీళ్ళ లో గుడ్డ ముంచి పాప ఒళ్ళంతా తుడిచింది. బాస్కెట్ లో ఉన్న పాల పొడి డబ్బా, పాల సీసా బైటకి తీసి ఈసీసా శుభ్రంగా కడుగు అంటూ నాగాలక్ష్మీ కి సీసా ఇచ్చి పాలపొడి వేడినీళ్ళ తో కలిపింది. రెండు నిముషాల్లో నాగాలక్ష్మీ విప్పిన గౌను తొడిగింది.
మంచం మీద వెనక్కి జరిగి గోడ కానుకొని, కాళ్ళు చాపుకొని పాపాయిని కాళ్ళ మీద పడుకో బెట్టుకుంది. నెమ్మదిగా కాలు ఆడిస్తూ , పాపాయిని ఓదారుస్తూ నాగలక్ష్మీ చల్లార్చి ఇచ్చిన పాలు సీసాలో పోసి, నెమ్మదిగా పట్టసాగింది.
ఆవిడకి అంతా అయోమయంగా ఉంది.
కుర్రాడ్నీ చూస్తె ఇంకా మీసాలు కూడా పూర్తిగా రాలేదు. అలాంటిది వీడికి పెళ్లవడం.... ఒక కూతురు పుట్టడం... దాన్ని పుట్టిన వెంటనే తీసుకొని ఇంత దూరం తనని వెతుక్కుంటూ రావడం అంతా ఏదో కలలోగా అనిపిస్తోంది...కానీ, కాళ్ళ మీద ఉన్న పాపాయి, ఆ స్పర్శ అదంతా నిజమని చెప్తోంది.
పాలు తాగడం అయిపోయినట్టుంది పాప ముఖం తిప్పెసుకుంది . కళ్ళు తెరిచి సంచలంగా చూస్తోంది.
చక్కటి కళ్ళు, గులాబీ రంగు ఒళ్ళు, నల్లని ఉంగరాల జుత్తు. ఎంత ముద్దుగా ఉందో.
అయ్యో దీనికి పుట్టగానే వైద్యుల పర్యవేక్షణ ఎంత అవసరం....? వీడికేవరు చెప్పారు ఇలా చేయమని....ఇంతకీ ఈ పాప తల్లి ఏమైంది....?
స్నానాలు చేసి ఫ్రెష్ గా వచ్చిన ఆదిత్య నూ...బాబ్జీని చూస్తూ పాపని నెమ్మదిగా కాళ్ళ మీద నుంచి తీసుకొని ఎత్తుకొని మంచం మీద పడుకో బెట్టింది లలితమ్మ.... "ఇప్పుడు చెప్పండి. ఎవరీ పాప ఎందుకు తీసుకొచ్చారు...?" మీరిద్దరూ నా మనవళ్ళేనా." అడిగింది సావకాశంగా.
ఆదిత్య చెప్పడం ప్రారంభించాడు. .. ఏదీ దాచకుండా తనకి ఇంట్లో ఒంటరితనం, తనకి ప్రఖ్యతో కలిగిన స్నేహం, ఇద్దరూ ఆకర్షితులు అవడం, ప్రఖ్య తల్లి అబార్షన్ చేయించాలనుకోవడం , తను డాక్టర్ ని కలవడం మొత్తం పూస గుచ్చినట్టు చెబుతోంటే ఆవిడ విభ్రాంతి గా వినసాగింది.
అంతా చెప్పి అన్నాడు ఆదిత్య.
"అమ్మమ్మా! నాకు పాపాయి కావాలి. నేనే పెంచుకుంటాను నా పాపని. అందాకా అంటే నా చదువు పూర్తీ అయిందాకా మీరు పెంచాలి. తరవాత నేను పెంచుకుంటాను. పాపని ఎవరికీ ఇవ్వడం నాకిష్టం లేదు..."
ఆవిడ ఒళ్ళంతా పులకించి పోయింది. "అమ్మమ్మ" అని అతను పిలుస్తుంటే ఈ డెబ్బై ఏళ్ళు ఆ పిలుపుకోసమే బతికి ఉన్నానన్న అనుభూతి కలుగుతోంది. అప్రయత్నంగా అడిత్యని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ అంది." చాలా తప్పు చేశావు నాన్నా!" ఏదైనా జరిగి ఉంటె ఎంత ప్రమాదమో పిల్లనసలు అట్లా తీసుకురావచ్చా....? డాక్టర్ కి చెప్పావా....?"
"లేదు...."
"మరి....అలా చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు....? ఆవిడ నీకోసమే కదా ఆ అమ్మాయికి అబార్షన్ చేయకుండా ఆపింది...."
"కానీ, ఆవిడ ఎవరికో దత్తత ఇవ్వాలనుకున్నారు...."
"నీకెలా తెలుసు....?"
"ప్రఖ్య వాళ్ళమ్మ కి చెప్తోంటే విన్నాను...."
"ఒకసారి నీకు మాట ఇచ్చాక తప్పుతుందా డాక్టర్.... తొందరపాటు కూడదు నాన్నా.... ఇప్పుడు ఆవిడ ఎంత కంగారు పడుతుంటారో....ఒకవేళ పాపని నువ్వు ఎత్తుకెళ్లావని పోలీసులకి ఫిర్యాదు చేస్తే....!"
'అమ్మమ్మా....!" భయంగా పిలిచాడు..."అలా అనకండి...నాకు భయం వేస్తోంది..."
"అండీ ఏంటిరా....? నేను నీకు అమ్మమ్మ ని నాన్నా.... మీ అమ్మకి నేనక్కర్లేక పోయినా నాకోసం వెతుక్కుంటూ వచ్చిన నువ్వు నా ప్రాణం రా, నా మీద కొండంత నమ్మకంతో ఈ పురిటి గుడ్డును తీసుకొని రెండు వందల కిలోమీటర్లు రాత్రివేళ రావడం నాకు తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పోడుస్తోంది. అలాగే తనువంతా పులకించి పోతోంది. మీ అమ్మ ఎలా ఉందిరా....?" కళ్ళలో నీళ్ళతో గాద్గదికంగా అడిగింది. ఆవిడకి ఇప్పుడు అర్జంటుగా శిరీష ను చూడాలని, గుండెలకు హత్తుకోవాలని అనిపిస్తోంది. కూతురు తన పట్ల నిర్లక్ష్యంగా, కఠినంగా ఉండటం వల్ల ఆవిడ కూడా అలాగే ఉంటోంది కానీ, ఆవిడ తల్లి మనసు కూతుర్ని తలచుకొని అనుక్షణం ఆవేదన అనుభవిస్తూనే ఉంది ఇంతకాలం. భర్త పోయాక దేవుడి సేవలో జీవితం గడుపుతుంది. ఏనాటికైనా కూతురు వస్తుందని, మిగిలిన ఈ ఇల్లూ, బంగారం ఆమెకి అప్పజెప్పి తను సెలవు తీసుకోవాలని ఎదురుచూస్తూనే ఉంది.
ఇరవై ఏళ్ళ ఈ ఆధునిక యువకుడి మనసులో ఉన్నట్టు శిరీష క్కూడా తనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉండాలన్న ఆశ, తపన ఉంటె ఎంత బాగుండేది....? వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన. ఆదిత్య వైపు పరిశీలనగా చూసింది... శిరీష పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పాప కూడా తండ్రి పోలికే.
"అమ్మమ్మా....సారీ" జాలిగా చూస్తూ అన్నాడు ఆదిత్య.
ఆవిడ కళ్ళనీళ్ళు తుడుచుకొని.... "నాగలక్ష్మీ అలా సెంటర్ వరకూ వెళ్ళి పాపాయికి జుబ్బాలు కొనుక్కురా, అలాగే పిల్లల డాక్టర్ గారిని నేనోసారి రామ్మన్నాని చెప్పు...." అని నాగలక్ష్మీ తో చెప్పి, పదండి మీరిద్దరూ టిఫిను తిందురు గాని అంటూ లేచింది.
ఆదిత్య పాపాయి వైపు చూశాడు కాసేపు కళ్ళు తెరిచి అటూ ఇటూ చూస్తూ ఉన్న పాప తిరిగి నిద్రలోకి జారింది. మెత్తటి పరుపు, చల్లగాలి, లలితమ్మ ఒళ్ళు తుడిచి నందుకేమో హాయిగా నిద్రపోతోంది.
బాబ్జీ వైపు చూసి నవ్వాడు ఆదిత్య. ఆ నవ్వులో చూశావా....? నేను సాధించాను. అనే చిన్న ఆత్మవిశ్వాసం కనబడింది. అప్పటిదాకా బిగదీసుకుని టెన్షన్ గా ఉన్న బాబ్జీ కూడా చిన్నగా నవ్వాడు.
లలితమ్మ పెట్టిన వేడి వేడి ఇడ్లీ , ఘుమఘుమ లాడే నెయ్యి వేసిన కారప్పొడి కొబ్బరి పచ్చడితో చెరో ఆరు ఇడ్లీలు లాగించి, కమ్మని కాఫీ తాగి ఒళ్ళు మరిచి నిద్రపోయా రిద్దరూ.
వాళ్ళిద్దరూ నిద్ర లేచేటప్పటికి ఇంటి నిండా ఆడవాళ్ళు చాలామంది పాపాయి చుట్టూ మూగి ఉన్నారు. అందరి గొంతులూ కలగాపులగంగా గట్టిగా వినిపిస్తున్నాయి.
వాళ్ళందరి మధ్యలో పాపాయిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని లాలితాంబ పాపని అందరికీ చూపిస్తూ "నా ముని మనవరాలు నన్ను వెతుక్కుంటూ వచ్చింది చూశావా కాంతం...' అంటూ చెప్తోంది ఎవరికో.
ఆ దృశ్యం చూడగానేఅదిత్య ఒళ్ళు పులకిన్చినట్టయింది... ఇంతమందిని ఒక దగ్గర చూస్తుంటే ఎంతో బాగుంది....అది కూడా వాళ్ళంతా తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు తన అమ్మమ్మ కి ఏమవుతారో తెలియదు కానీ.... వాళ్ళకీ, ఆవిడకీ ఏదో అపూర్వమైన అనుబంధం ఉందని పిస్తోంది. పుట్టగానే ఇంతమంది బంధువులను సంపాదించుకున్న తన చిట్టితల్లి ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తోంది. అర్ధం కాకపోయినా వాళ్ళందరి మాటలు వింటూ అలా మంచం చివర బొమ్మలా కూర్చుండి పోయాడు. అందరి గొంతులూ వినిపిస్తున్నాయి.
"ఎవరి పోలికో గానీ, పిల్ల మాత్రం పెద్ద అందగత్తె అవుతుందని పిస్తోంది పిన్ని...." అంటోందెవరో ఒకావిడ....
"చాల్లేవే ఇప్పుడే తెలుస్తుందా ఏంటి....? పిల్ల మాత్రం మంచి రంగు వస్తుంది. అదిగో అరికాళ్ళు, అరిచేతులు గులాబీరంగులో ఎంత బాగున్నాయో..."
"రంగేమిటి....? ఆ కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో....అప్పుడే కళ్ళు తెరిచి చూస్తోంది... ఈ కాలం పిల్లలు పూవు పుట్టగానే పరిమళించినట్టు పుట్టిన వెంటనే చాలా తెలివి తేటలతో పుట్టేస్తున్నారు.."
"కాలం తల్లీ ....కలికాలం...."
"అవును మరి....కాలం...."
"అవును పెద్దమ్మా.... మరి నీకు పురుడు లేదూ...."
ఆదిత్య ఆసక్తిగా వినసాగాడు.
"పురుడో, గిరుడో ఆ పిల్ల అక్కడెక్కడో ప్రసవించింది. నేనిక్కడ పురుడంటూ కూర్చుంటే గడుస్తుందా ....? పది రోజులు కాగానే పుణ్యహవచనం చేయించేస్టాలే..."
"వాళ్ళమ్మ ని కూడా పిలిపించి ఎంచక్కా బారసాల చేయి పిన్నీ.... ఎంత కాలమైందో నీ ఇంట్లో ఓ శుభకార్యం జరిగి..."అంటున్నారెవరో అవతలి నుంచి సమాధానం రాలేదు.... కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి....తరువాత మెల్లిగా అంటున్నారెవరో.... "అయ్యో పిన్నీ బాధపడకు. నీ బాధలన్నీ తీర్చడానికే ఈ పిల్లని పంపించాడా దేవుడు. ఊరుకో ఊరుకో పిన్నీ....పంతాలు, పట్టింపులు ఎంతకాలం ఉంటాయి చెప్పు. ఇప్పుడు ఈ మనవరాలి కోసమైనా ఆ అమ్మాయి నీ దగ్గరకు రావాల్సిందే. ఊరుకో. పిల్ల మీద కంటనీరు పదనీయకు....నాలుగైదు స్వరాలు ఓదారుస్తూన్నాయి ఆవిడని.