Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 21

    నిజానికి ప్రఖ్య ని ఆదిత్య పెళ్ళి చేసుకుంటే ఆమెకి అభ్యంతరం  ఏం లేదు. ... కానీ, ఇంకా జీవితంలో ఏమాత్రం ఎదగని పిల్లలిద్దరూ పెళ్ళి, సంసారం అంటూ మొదలు పెడితే, భవిష్యత్తు నాశనం అవుతుందని ఆమెకి తెలుసు. కాకపోతే ఇప్పుడు సెటిల్ చేసుకొని బీటెక్ అవగానే పెళ్ళి చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. స్నేహితురాలు వియ్యపురాలు అవడం కంటే ఏం కావాలి...? పైగా ఇద్దరూ ఒకే దారిలో ప్రయాణిస్తున్నారు భావాలు ఒకటే.
    కానీ, భాను మాత్రం ఎట్టి పరిస్తితు ల్లోనూ నా కూతురిని ఇలాంటి సైకోకి ఇచ్చి చేస్తారా అంటూ మండి పడింది. ఆమె మాటలు శిరీష హృదయాన్ని గాయం చేశాయి. ఇంతకాలం ప్రఖ్య కోసం భరించింది. ఆ పిల్లకి డెలివరీ అవగానే భానుకి దూరంగా వెళ్ళాలనే నిశ్చయించుకుంది.
    ఇంక ఇప్పుడు వాళ్ళిష్టం.... ఆవిడ కూతుర్ని బీటెక్ తో అపేస్తుందో, ఎంటెక్ చేయిస్తుందో, అమెరికా కి పంపెస్తుందో ఏం చేస్తుందో. ఇంకా ఏదైనా గొప్ప చదువు చదివిస్తుందో అవిడిష్టం. ఒక నైతిక బాధ్యతతో ఇప్పటి దాకా ఆమె అసహ్యించుకున్నా, అవమానిస్తున్నా తనుఆ ఇద్దరితో సంబంధం వదులుకోకుండా వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంది.
    ఇంక వాళ్ళ జీవితాలు వాళ్ళవి....
    శిరీష బయటకి వచ్చేటప్పటికి వివేక్ ఎదురు చూస్తున్నాడు...
    అతడిని చూడగానే ఆగలేకపోయింది శిరీష... అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "రిలాక్స్ శిరీ... బాధపడకు... ఇంటి కెళ్దాం పద..."
    "వాడు....వాడు... ఎక్కడున్నాడో వివేక్...." వెక్కుతూ అంది...
    "వస్తాడు.... వాడే వస్తాడు... ఎక్కడికీ వెళ్ళడు... నీ మీద అలిగి ఎవరైనా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు లే. పద మనం వెడదాం అయిపోయిందిగా నీ బాధ్యత అయింది..."
    వెక్కుతూనే తలూపింది.
    "రా...! ఆమె భుజం పట్టుకుని నడిపిస్తూ బైక్ వరకూ తీసుకొచ్చాడు.
    వివేక్ బైక్ స్టార్ట్ చేశాడు. శిరీష వెనకాల ఎక్కి కూర్చుంది.... ఆమె కళ్ళింకా వర్షిస్తూనే ఉన్నాయి. చాటు నుంచి ఇదంతా చూస్తున్న ఆదిత్య కి కూడా ఏడుపొచ్చింది. కానీ, ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన పని చేయాలి తను. వెంటనే అతను మళ్ళీ హాస్పిటల్ వెనక్కి వెళ్ళిపోయాడు.
    ప్రఖ్య పడుకున్న దగ్గరికి నడిచింది భానుప్రియ... యుద్దంలో అవిరామంగా పోరాడి, అలసి పోయిన సైనికుడిలా ప్రశాంతంగా పడుకొని ఉంది ప్రఖ్య. "హౌ ఆర్ యు బేబీ" అడిగింది భాను ప్రియ ప్రఖ్య ముఖం మీద చిందర, వందరగా ఉన్న వెంట్రుకలు సవరిస్తూ . ప్రఖ్య మాట్లాడటానికి ఓపిక లేనిదానిలా సన్నగా నవ్వింది. ఒకసారి కళ్ళు విశాలంగా చేసి, తన పక్కన పాప కోసం చూసింది.
    పాప లేకపోవడంతో నొసలు చిట్లించి తల్లి వైపు చూసింది.
    ఆమె భావం అర్ధం చేసుకున్న దానిలా భానుప్రియ భుజం మీదుగా వెనక్కి తిరిగి డాక్టర్ వైపు చూసింది. పాపకి స్నానం చేయించి తెల్లటి, మెత్తటి టవల్ లో చుట్టి రెండు అరచేతుల్లో పట్టుకొని వచ్చి డాక్టర్ చేతికిచ్చింది నర్సు. భానుప్రియ వైపు చూసింది డాక్టర్. భానుప్రియ చూపు గమనించి అలాగే తీసుకొచ్చి ఆవిడకి అందివ్వబోయింది పాపని.
    భాను అయిష్టంగా కొంచెం వెనక్కి తగ్గి "వాళ్ళకి కాల్ చేశారా డాక్టర్" అని అడిగింది.
    "చేశాను కానీ, ఇప్పుడెలా వస్తారు..? రేపు మార్నింగ్ వస్తారు..." అంది డాక్టర్.
    "రేపు మార్నింగా....?" కొంచెం విసుగ్గా అసహనంగా అంది భాను. మళ్ళీ ఏమనుకుందో , "ఒకే ...." అంటూ తిరిగి ముఖం తిప్పుకుని ప్రఖ్యను చూస్తూ రెస్ట్ తీసుకో బేబీ" అంది భాను. ప్రఖ్య అలాగే అన్నట్టుగా తలాడించి కళ్ళు మూసుకుంది.
    తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కూడా పాప వైపు చూడటానికి ఆసక్తి చూపించక పోవడంతో ... చికాకు పడిన డాక్టర్ పాపని సిస్టర్ చేతికిచ్చి "పాలు తాగించు " అంటూ బైటకి వెళ్ళిపోయింది.
    సిస్టర్ పొత్తిళ్ళలో ఉన్న పాపని మురిపెంగా చూస్తూ ప్రఖ్య దగ్గరగా వచ్చి, గుండెల మీద చేతులు పెట్టుకుని పడుకున్న ప్రఖ్య ని"చేయి తియమ్మా.... పాపకి పాలివ్వాలి" అంది వంగి పాపని ప్రఖ్య గుండెల మీద పడుకోబెట్టపోతూ.
    ప్రఖ్య నైటీ జిప్ లాగాబోతుంటే భానుప్రియ చిరాగ్గా అంది... "ఇప్పుడే డెలివరీ అయింది పాలు పడవు వేరే పాలు పట్టండి...."
    సిస్టర్ ఆవిడ వైపు చిత్రంగా చూస్తూ, "అదేంటండీ పాపకి పాలివ్వకపోతే ఎట్లా? తియ్యమ్మా నైటీ తీయ్..." అంటూ కొంచెం బలవంతంగా పాపని ప్రఖ్య గుండెల మీద పడుకోబెట్టి గుండెల మీంచి నైటీ పక్కకి తొలగించి పాపకి తల్లి రొమ్ము అందించడానికి ప్రయత్నించసాగింది.
    ఆ తంతంతా ఇష్టం లేనిదానిలా భానుప్రియ అసహనంగా చూస్తూ చేతి వాచీ చూసుకుంది.
    ఇంకా పన్నెండు గంటలు ఈ పాప ఇక్కడే ఉండాలా....?" చిరాగ్గా అనుకుంది భాను.
    ఇంతలో డాక్టర్ అటు వైపు వచ్చింది.
    "వాళ్ళకి చెప్పాల్సింది లేట్ అయినా వచ్చేయమని, ఇప్పుడు పాలివ్వడం, తరువాత ఇంకోటి అలా అవుతూనే ఉంటుంది...' నసుగుతూ అంది భాను ప్రియ.
    "అలా తొందర పడితే ఎలా...?" డాక్టర్ కొంచెం సీరియస్ గా అంది. "అయినా డెలివరీ పగలైతే వెంటనే తీసుకెళ్ళి పోయేవాళ్ళు మీరు ఆపరేషన్ వద్దు నార్మల్ డెలివరీ కావాలన్నారు. అందుకే వెయిట్ చేశాం. నా తప్పేం లేదు' అని చెప్పేసి కేస్ షీట్ తీసుకుని ఏదో రాసి "సిస్టర్ ఈమెని రూం నెం ఫోర్ కి షిప్ట్ చేయండి....' అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
    పాపతో పాలు తాగించడానికి ప్రయత్నిస్తున్న సిస్టర్ "ఒకే డాక్టర్" అంటూ పాపని రెండో వైపుకి జరిపి "ఇక్కడ కూడా ఇవ్వమ్మా , ఒక వైపే ఇవ్వకూడదు..." అంది ప్రఖ్యతో. ప్రఖ్యకి ఆ అనుభవం తమాషాగా ఉంది.
    బుల్లి నోటితో పాప రొమ్ములు చప్పరిస్తుంటే ఒంటినిండా గులాబీ రెక్కలు పోసిన మధురానుభూతి కలుగుతోంది.
    ఎంత హాయిగా ఉంది ఈ అనుభూతి. ఏదో మత్తుగా ఉంది.
    కళ్ళ ముందు మంచు పూల రెక్కలు రాలుతున్న అనుభూతి.
    సిస్టర్ స్వరం ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఉంది. పాప పాప వైట్ రోజ్.... వైట్ రోజ్.... అంటోంది.
    "ఎవరూ పాపనా? పాపేనా...? వైట్ రోజ్..."
    పాప పుట్టిన మరుక్షణం డాక్టర్ నోటి నుంచి వచ్చిన మాట అది... వైట్ రోజ్ ఎంత బాగుంది....?
    క్రమంగా అనస్తీషియా ప్రభావం చూపించడం ప్రారంభించింది. అప్పటి దాకా మెలకువా, నిద్రా కాని స్థితిలో ఉన్న ప్రఖ్య కళ్ళు మూతలు పడసాగాయి. మత్తుగా కళ్ళు మూసుకుంది.
    సిస్టర్ పాపని ప్రఖ్య గుండెల మీంచి తీసి, ఆమె నైటీ సరిచేసి అప్పుడే అక్కడి కొచ్చిన ఆయా చేతికిచ్చింది. "క్రెడిల్ లో పడుకోబెట్టి తీసుకురా...రూమ్ నెంబర్ ఫోర్" అంటూ భాను వైపు చూసి మీరు కూడా రండి... అంటూ ప్రఖ్య పడుకున్న స్ట్రిచ్చర్ తోసుకుంటూ రూం బయటికి నడిచింది.
    స్ట్రెచ్చర్ కదలిక కి కళ్ళు తెరిచిన ప్రఖ్య ఆయా పొత్తిళ్ళ లో ఉన్న పాపను ఒక్కసారి చూసింది. అంత మత్తు లోనూ గుండెల్లోంచి ఏదో సెగ వెచ్చగా ... పాప నెత్తు కోవాలనిపిస్తోంది. ఇంకాసేపు ఈ గుండెల మీద మెత్తటి పాప స్పర్శను పొందాలనిపిస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఇంతకాలం తను మోసి, కష్టపడి కన్న ఈ పాపని ఎవరికో ఇచ్చేస్తుందా డాక్టర్.
    పాప తనది. తనే అమ్మ. తన పాపని ఎవరికో ఇచ్చేయాలా...? దుఃఖం వచ్చింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగానే మగత కమ్మేసింది. ఆయా పాపని గుండెలకి హత్తుకొని బయటికి నడిచింది.భానుప్రియ సిస్టర్ వెనకాల వెళ్ళిపోయింది.
    అయా కారిడార్ లోకి వచ్చింది.
    కారిడార్ ప్రశాంతంగా ఉంది... ఎవరూ లేరు... రూం నెంబర్ ఫోర్ కి వెళ్ళే దారిలో రెండుగా వై ఆకారంలో చీలిక ఉంది.ఆ వైపు నుంచి వెడితే ఆసుపత్రి వెనుక వైపువస్తుంది... ఆయా వేగంగా అటు నడిచింది... ఆమె గుండెలు దడదడలాడుతున్నాయి. కాళ్ళు వణికిపోతున్నాయి.... తప్పు చేస్తున్నావు అని ఎవరో హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తోంది... అయినా అలాగే తడబాటుగా ముందుకి నడిచింది. ఆవరణలో కొన్ని లైట్లు ఆర్పేసి ఉన్నాయి. చిరు చీకట్ల లో అశోక వృక్షం నీడలో ఎదురు చూస్తున్న ఆదిత్య దగ్గరికి చేరింది.
    అప్పటికి పాప పుట్టి రెండు గంటలైంది.
    ఆమెని చూసిన ఆదిత్య చెట్టు నీడ నుంచి గబగబా వచ్చి చేతులు చాచాడు. ఆయా తన చేతిలో ఉన్న పాపని అతని చేతుల్లో పెడుతూ "జాగ్రత్త ...పాపముద్దుగా ఉంది. ఎలా చూసుకుంటావో ఏమో...." అంది. 

 Previous Page Next Page