Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 14

    "అయితే వచ్చి కలిశాడా?"

    "ఊహూ!"

    "మరి ఈ సంగతులన్నీ నీకెలా తెలుసు?" ఫణికుమార్ లో అనుమానం బిగుసుకుంది.

    "ఇవన్నీ ఇలా జరిగివుండవచ్చని ఊహించాను" ఆనందమూర్తి తేలిగ్గా నవ్వేశాడు.

    "నేను నమ్మను!" ఆమాట అంటున్నప్పుడు ఫణికుమార్ గొంతు కటువుగా ధ్వనించింది.

    "చూడు ఫణీ! విశ్వాసమున్న చోట ప్రేమ వుంటుంది. ప్రేమ వున్నచోట శాంతి వుంటుంది. శాంతివున్న చోట సత్యం వుంటుంది. సత్యం వున్నచోట భగవంతుడు వుంటాడు. నేను చెప్పిన విషయాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం" ఫణిలో ఉక్రోషం పెరిగిపోతోంది. అతికష్టంమీద అణచుకుంటున్నాడు.

    "ఫణీ! పతన దశకు ప్రధమ సోపానాలు మూడు. నిర్లక్ష్యం, నీతిరాహిత్యం, స్వార్ధం. ఈ మూడూ ఏ వృత్తిలో వున్నవాళ్ళకైనా ప్రాణాలతో చెలగాటం వుంటుంది. నీకు ఈ మూడు లక్షణాలు పుష్కలంగా వున్నాయి. నువ్వు నా స్నేహితుడివి కాబట్టి, నీ మీద వున్న ప్రేమతో, చనువుతో ఈ మాటలు చెబుతున్నాను. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే బాగుపడతావు. అహంకారం, అసూయ, అత్యాశా ఇవన్నీ శృతిమించితే పాతాళానికి తోసేస్తాయి" కొంచెం ఆవేశంగానే చెప్పాడు ఆనందమూర్తి.

    లతిక, హర్షిత కూడా ఆనందమూర్తి ఆవేశంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. అతను అంత ఆవేశంగా ఎప్పుడూ మాట్లాడడు. అతను ఆవేశపడ్డాడంటే అతనిలో అంతకి రెండింతల కోపం, ఆవేదనా వున్నాయన్నమాట. ఫణికుమార్ యింతకుముందు ఆనందమూర్తితో పరుషంగా అతడు 'హర్ట్' అయ్యేలా మాట్లాడటం వల్లే ఇప్పుడు ఆనందమూర్తి ఇంత ఉపన్యాసం ఇచ్చాడని అర్ధమయింది లతికకీ, హర్షితకీ.

    ఫణికుమార్ మాత్రం ఆనందమూర్తి మాటలను జీర్ణించుకోలేకపోతున్నాడు. అతనిలోని అసూయ పడగవిప్పిన పాములా బుసలు కొడుతోంది. ఎంతో కష్టంమీద ఓర్చుకున్నాడు. అతని గుండెల్లో మండిపోతూన్న మంటల తీవ్రత కళ్లల్లోకి వచ్చినట్లు ఫణికుమార్ కళ్ళు నిప్పుకణికల్లా ఎర్రగా మారాయి.

    "ఫణి! నువ్వెందుకు ఉద్రేకపడుతున్నావో కారణం తెలీడంలేదు" అంది హర్షిత. ఫణికుమార్ హర్షిత కేసి చూశాడు. "నా ఉద్రేకానికి కారణం తెలీడం లేదా హర్షితా! అయినా నువ్వు ఆనందమూర్తిని తప్ప నన్నెందుకు సపోర్ట్ చేస్తావు. అయినా నేనెలా అనుకుంటాను. అతడు నీ భర్త, ఇంటర్ మీడియట్ వరకూ నీతో చదివిన నీ మానసచోరుడు. ప్రేమించి పెళ్లాడినవాడు. అసలు ఆ రోజుల్లో నుంచే నీకూ వాడికీ కూడా నన్నాటపట్టించటం సరదా. అలవాటైన విద్య .అప్పట్లో మీరిద్దరూ ఒకటై నా జీవితాన్ని దెబ్బకొట్టారు. ఇప్పుడు నా వృత్తిమీద దెబ్బకొట్టి నన్ను సర్వనాశనం చెయ్యాలనుకుంటున్నాడు ఆనంద్. స్నేహం నటిస్తూ సలహా ఇస్తున్నట్లు ప్రవర్తిస్తూ, కడుపులోని విషాన్నంతా కక్కుతున్నాడు. అవును మరి! రూపాయీ అర్ధా తీసుకుని దరిద్రులకి ట్రీట్ చేసే వాడికి నా సంపాదన చూస్తే కన్నెర్రగానే వుంటుంది. పేరుకోసం పాకులాడుతూ నా సంపదని చూసి ఏడుస్తున్నాడు."

    అతని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి హర్షితకి, ఆనందమూర్తికీ!

    లతికకిదంతా అయోమయంగానూ, భయంగానూ వుంది.

    ఫణికుమార్ ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నాడో ఆమెకి అంతుబట్టలేదు.

    "ఫణీ! నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా?" ఆనందమూర్తి అనునయంగా అన్నాడు ఫణికుమార్ భుజం తడుతూ. మరీ సీరియస్ గా మారిపోతున్న వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ. "నేను కలలో వుండి మాట్లాడడం లేదు స్పృహలో వుండే మాట్లాడుతున్నాను. నేను డీల్ చేసేది కాస్ట్లీ పేషంట్లేనని నీకు తెలుసు. నువ్వు దరిద్ర నారాయణుల దేముడివి. నువ్వు నెలంతా కష్టపడి సంపాదించేది., నేను ఒక్క రోజులో సంపాదిస్తాను. అందుకే ఇప్పుడు నీ దృష్టినా పేషంట్ల మీద నా ప్రాక్టీసు మీదా నా సంపాదన మీదా పడింది. నా పేషంట్లని నువ్వు నీవైపు తిప్పుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈ సంఘటనతో అర్ధమయింది" ఫణికుమార్ ఉద్రేకంతో ఊగిపోతూ అననాడు.

    ఆనందమూర్తి ఫకాల్న నవ్వాడు,

    "ఫణీ! ఫూల్ లాగా మాట్లాడకు. నీలో దోషాలు వుంచుకొని ఇతరుల దోషాలను చూపించే అధికారం నీకు లేదు. పైగా లేని దోషాలు లెక్కగట్టి నిందలు వెయ్యడం నీచం. అర్ధం లేకుండా మాట్లాడకు. నేను రూపాయీ అర్ధరూపాయీ ఇచ్చే దరిద్రనారాయణులనే ట్రీట్ చెయ్యొచ్చు కానీ, నాకొచ్చే పేషంట్ల సంఖ్య నీకన్నా పదింతలనీ, నీకిప్పటికే తెలిసుండొచ్చు.. నా సంపాదన కూడా నీకన్నా పదింతలే! అయితే నీలాగా ధనవంతులకు మాత్రమే నేను వైద్యం పరిమితం చేసుకోలేదు. నా దగ్గరికి వచ్చినవాడు పూర్తి ఆరోగ్యం చేకూరి వెళ్లాల్సిందే. చాలామంది పేషంట్లను ట్రీట్ చెయ్యడానికి నాకు టైమ్ లేక నీకు రిఫర్ చేసి పంపాను కూడా! అలాంటిది నీ పేషంట్లను నావైపు తిప్పుకునే అవసరం నాకు లేదు. నువ్వే నీ పేషంట్లకి ప్రాణం మీదికొచ్చినప్పుడు నాకు కబురు పెడతావు. వచ్చేదాకా వదలవు. ఆ వామనరావు కొడుకు, నువ్వు నన్ను పిలవడం చూశాకే తన తండ్రిని బతికించుకోవాలన్న ఆతృతతో, నాచే వైద్యం చేయించుకోవాలని తాపత్రయపడటం. అందులో నా ప్రమేయం, ప్రయత్నం ఏమాత్రం లేదు కాబట్టి నా తప్పూ కాదు" ఫణికేసి నిశితంగా చూస్తూ అన్నాడు ఆనందమూర్తి.

 Previous Page Next Page