ఈ విషయాలన్నీ నలభై ఏళ్ళు వచ్చిన తనకే గందరగోళంగా వుంటాయి ఏది కరెక్టో తెలియని తను కూతురికైనా సరే నీతి బోధలు చేయడం అపహాస్యంగా అనిపించింది. అలాగని కూతురు రాత్రిపూట ఎవరో అబ్బాయిని అంకాళమ్మ గుడిదగ్గర కలుసుకుంటూ వుందంటే ఊరకనే వుండడం కూడా అంత మంచిపనిగా తోచడంలేదు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?
శతరూప అలా ఆలోచనలతోనే కిందామీదా పడుతుండగా సాయం కాలం అయిపోయింది.
మామూలుగా అయితే తల్లి అలా నిస్తేజంగా వుంటే ఇందుమతి ఒప్పుకునేది కాదు. జోక్ లు వేసో, ధైర్య వచనాలు చెప్పో, మామూలు మూడ్ లోకి తెచ్చేది. అయితే ఇప్పుడామె పరిస్థితి లేదు. భరణి తప్ప మరో ఆలోచన రావడంలేదు.
చీకట్లపడెకొద్దీ ఇందుమతి ఒళ్ళు అదురుతోంది. అతనితో వెళ్ళి పోవాలన్న ఆలోచన చేసినప్పుడు కాళ్ళు వణుకుతున్నాయి. కళ్లు బెదురుతున్నాయి. చల్లగాలి శరీరానికి తగులుతున్నా చెమటలు పడుతున్నాయి. ఏదో తెలియని దిగులు కాళ్ళకు అడ్డంపడుతోంది.
తన తల్లి గురించి ఎక్కువసేపు ఆలోచించడంవల్లే తనకు ఉత్సాహం రావడంలేదని ఇందుమతికి తెలుసు. అందుకే తను వెళ్లిపోయినా తల్లికి ఏంకాదని ఆలోచిస్తే మాత్రం భరణితో వెళ్లిపోవడం తన ఒక్క దానికే పట్టిన అదృష్టంలా అనిపిస్తోంది. ఈ పేదరికం నుంచి తనను ఐశ్వర్యంలోకి గిరవాటేసేందుకు స్వయంగా భరణిని పంపించినట్టు తోస్తోంది.
ఆమె అలా అటూ ఇటూ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండగానే సాయంకాలం కరిగిపోయి వెన్నెల ప్రవేశించింది. చందమామ లోకమంతా మల్లెపూలని పరిచినట్టు అనిపిస్తోంది.
ఏదిఏమైనా భరణితో వెళ్లిపోవాలని ఇందుమతి నిశ్చయించుకుంది. అలా ఓ నిర్ణయానికి రావడంతో అంతకుముందున్న టెన్షన్ అంతా ఎగిరిపోయింది. భరణితో కలిసి తను కాలానికి నగిషీలు కుట్టడం గురించి ఊహిస్తుంటే గుండె రక్తపుపువ్వులా విచ్చుకుంటోంది. తనతోపాటు ఏమైనా తీసుకెళ్లాలా అని ఆలోచించింది. "బట్టల్లాంటివి ఎత్తుకురాకు. మనం టౌన్ కు వెళ్లగానే నీకు కావాల్సినన్ని బట్టలు కొనుక్కోవచ్చు" అని భరణి చెప్పడం గుర్తొచ్చింది.
"నీ అందాలు మాత్రం పదిలంగా తీసుకురా చాలు" అని అతను చెప్పేవాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే అనాలోచితంగా ఇందుమతి తన గుండెలకేసి చూసుకుంది. వెన్నెలంతా కప్పుపోసినట్లుగా ఎత్తుగా కనిపిస్తున్న తన ఎదకేసి సంతృప్తిగా చూసుకుంది. భరణి అల్లరి కళ్ళల్లో మెదిలి చిన్న నవ్వు పెదవుల్ని సాగదీసింది. మరిక ఏం ఎత్తుకెళ్లాలి?
బంగారం కనీసం ఒక గ్రాముకూడా లేదు. బంగారు కమ్మలు వుండేవి. వాటిని ఈ మధ్యే ఓ చీటికి డబ్బులు కట్టాల్సి రావడంతో మోతుబరి రైతు భార్య వాణిశ్రీ దగ్గర కుదువపెట్టేసింది అమ్మ. కాబట్టి తను ఉత్తి చేతులతోనే వెళ్లాలి. తను ఎలా వెళ్ళినా భరణి ఏమీ అనుకోడు. అతను ప్రేమిస్తోంది తననుగానీ తన బంగారాన్నో తన డబ్బునో కాదు.
సో - తను ఎలావుందో అలా వెళ్లిపోవాలి.
ఈ రోజురాత్రి నుంచి అమావాస్య వరకు ప్రతిరాత్రి తొమ్మిది గంటలనుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు నిరీక్షిస్తూ వుంటాడు.
వెళ్లిపోవాలనుకున్నప్పుడు వాయిదా వేయడం ఎందుకు? రాత్రి తొమ్మిది కాగానే పిన్నీవాళ్ల ఇంటికెళ్లి టీ. వీ. చూసివస్తానని బయట పడడం మంచిది. పిన్ని ఇంటికంటే తల్లికి అనుమానంరాదు. అలా బయల్దేరి పిన్ని ఇంటికి వెళ్లకుండా అంకాళమ్మ గుడిదగ్గరి కెళ్లిపోతే భరణి వుంటాడు. అతనితో వెళ్లిపోతుంది.
"వాకాడులో నాకు తెలిసిన మిత్రుడు బ్యాంక్ లో మేనేజర్ గా వుంటున్నాడు. వారి దగ్గరికెళ్లిపోతే మన పెళ్లిజరిపిస్తాడు. ఇక ఇటునుంచి ఎటైనా వెళ్లిపోయి హాయిగా బతికెద్దాం" అదీ భరణీ తనకు చెప్పిన ప్లాన్.
సినిమా అయిపోగానే ఇంటికి రాని తనకోసం తల్లి వెదుక్కుంటూ తన పిన్ని ఇంటికి వెళుతుంది. ఇక అక్కడ తను లేకపోతే ఏమనుకుంటుంది? వెంటనే ఊహిస్తుందా? ఆ రాత్రి తెలియకపోయినా తెల్లవారేటప్పటికి తెలిసిపోతుంది.
అప్పుడు ఏమవుతుంది అమ్మా? ఇక అమ్మ గురించి ఆలోచించకూడదని ఒట్టు పెట్టుకుంది.
తల పైకెత్తి గోడకు అతుక్కుపోయినట్లు కనిపించే గడియారం వంక చూసింది.
టైమ్ ఎనిమిదైంది. 'ఇంకొక్క గంట' అనుకుంటూ భోజనం చేయడానికి పళ్లెంముందు కూర్చుంది ఇందుమతి.
ఎనిమిది గంటలు అవడంతోనే తయారైపోయాడు భరణి. తెల్లటి ప్యాంట్ మీద నల్లటి గళ్లున్న వైట్ షర్ట్ టక్ చేసుకున్నాడు బ్రీఫ్ కేసులో అదనంగా మరో రెండు డ్రస్సులు సర్దుకున్నాడు. ఇందుమతి వస్తే లేచిపోవడానికి ఏమేం కావాలో అన్నీ అమర్చుకున్నాడు.
చివరగా జేబు తడుముకున్నాడు. రెండు వందలకు మించిలేవు. నెల చివరిరోజులు. అందులోనూ పల్లెటూరు కాబట్టి కలెక్షన్లు సరిగా జరగవు. ఏదో బొటాబొటీగా బండిని లాక్కొస్తున్నాడు.
జేబులోంచి డబ్బు తీసి లెక్క పెట్టుకున్నాక చిత్రను కేకేశాడు. అప్పుడే భోజనం ముగించి లేచివచ్చింది చిత్ర. "ఎనిమిదే గదా. మరో అరగంటాగి బయల్దేరు" అంది గడియారం వంక చూస్తూ.