Previous Page Next Page 
ముగ్ధ పేజి 9

   

      "సరదాగా అందిలేవే! దాని సంగతి నీకు తెల్సుకదా! మొగుడ్ని మర్డర్ చేసేసి, నన్నే మర్డర్ చెయ్యబోయాడనే రకం" సురభి మధ్య వర్తిత్వం వహించింది.
    
    ఆ మాటకు అందరూ నవ్వారు.
    
    రెస్టారెంట్లోకి ప్రవేశించారు నలుగురూ.
    
    యువతరానికి వేదికలా వుంది ఆ రెస్టారెంట్ మెట్లెక్కి నడుస్తున్న ఆ నలుగురివేపే అక్కడున్న వందలకళ్ళు ఆశగా, ఆసక్తిగా అభిలాషగా చూస్తున్నాయి.
    
    ఆ నలుగురు మెల్లగా, హుందాగా వెళ్ళి ఎడమవేపు కార్నల్ లో వున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు.
    
    అక్కడున్న మిగతా వాళ్ళెవరికీ తెలీదు-
    
    అదొక స్వయంవర మండపమని.
    
    నలుగురూ నలుపక్కలా చూస్తున్నారు.
    
    నడివయసు సర్వరొచ్చి నిలబడ్డాడు.
    
    అలవాటుగా లిస్టుని చదివాడు - నలుగురూ యేవో ఆర్డర్స్ ఇచ్చారు.
    
    "ఏవే సురూ! మీ సైంటిస్ట్ సార్ యింకా రాలేదేమిటి? మీ ఇద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నారు?" సరదాగా అడిగింది నీలిమ.
    
    "అదో టాప్ సీక్రెట్ నేన్చెప్పను" బుంగమూతి పెడుతూ అంది సురభి.
    
    "టాప్ సీక్రెట్టో, టాప్ లెస్ సీక్రెట్టో, బోర్లా పడేసి, బుట్టలో వేసేస్తావా... చెప్పు? అసలు కలవగానే ఏం మాట్లాడుతావే? చెప్పవే సురూ....ప్లీజ్!" అలక వయ్యారాన్ని అభినయిస్తూ అడిగింది సురభిని.
    
    "మీటింగ్ అయ్యాక చెప్తాను. ముందు మీ హంటింగ్ మొదలెట్టండి" చుట్టూ చూస్తూ సలహా యిచ్చింది సురభి.
    
    "ఏం హంటింగో ఒక్క మంచి మొహం కనబడ్డంలేదు" చుట్టూ చూస్తూ అంది ముగ్ధ.
    
    "బాడీ లాంగ్వేజీలో పెద్ద ఎక్స్ పర్ట్ నని చెప్తావ్ చూడు, ఎంతమంది కుర్రాళ్ళున్నారో చూడు సరదాగా అబ్జర్వ్ చెయ్యి అందంగా వున్న వాడిని ప్రేమించాలనుకుంటున్నావా? అనాకారిణి ప్రేమించాలనుకుంటున్నావా? ముందు చెప్పు" సురభి అంది.
    
    "ప్రేమంటే అందంగా ఉండడం కాదు. అందంగా కన్పించడం కూడా కాదు. అనాకారిత్వమూ కాదు. ప్రేమంటే మనసుతో మనసుని తెల్సుకోవడం ప్రతి మనసుకో భాష వుంటుంది. ఆ భాష ఎదుటి మనసుకీ, తను కోరుకున్న ఎదుటి మనసుకు మాత్రమే అర్ధమౌతుంది. అదే ప్రేమ అందం ప్రధానం కాదు" స్థిరంగా అది ముగ్ధ నలువేపులా చూస్తూ.
    
    "ఔనే ముగ్దా! బాడీ లాంగ్వేజ్ గురించి నాకు చెప్పవే. నాకు కావాల్సినవాణ్ని నేను వెతుక్కుంటాను" అలక అంది.
    
    "బాడీ లాంగ్వేజ్ మేజిక్ కాదు చిటికెలో చేసి చూపించడానికి నీకు నచ్చిన ఎవర్నయినా చూపించు. వాడెలాంటివాడో చెప్తాను" ముగ్ధ ముగ్ధంగా అంది.
    
    "ఐతేసరే చూడు, ఆ కార్నర్ సీట్లో కూర్చున్నాడు చూడు. విమల్ ఎడ్వర్టయిజ్ మెంట్లో మోడల్లా లేడూ! అతడి గురించి చెప్పు వినాలని వుంది" కళ్ళతోనే ఆ ముగ్గురికీ, తనకు నచ్చిన ఆ కుర్రవాడ్ని చూపిస్తూ అంది అలక.
    
    మిగతా ముగ్గురమ్మాయిలూ ఆ యువకుడివేపు చూశారు. అతను ఎర్రగా చక్కగా వున్నాడు. పెదిమలు ఎర్రగా వున్నాయి. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో నవ్వుతున్నాడు. ఆ నవ్వు చాలా బాగుంది.
    
    నవ్వుతూ అతడివేపు చూసింది. నిశితంగా చూసింది. మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న అతడి కనురెప్పలు, పెదిమలు, చెంపలూ, చేతులూ, నెమ్మదిగా తగులుతున్న ఏసీ గాలికి ఎగురుతున్న అతడి మెత్తని జుట్టు, అతను కుర్చీలో కూర్చున్న భంగిమవేపూ అలా చూస్తోంది ముగ్ధ.
    
    ముగ్ధ అతడి గురించి ఏం చెప్తుందోనన్న ఆత్రుతతో మిగతా ముగ్గురూ అతడివేపు, ముగ్ధవేపు చూపులు మార్చి చూస్తున్నారు. మాట్లాడే భాషకు ఎంత శక్తి వుందో, మాట్లాడని శరీరానికి కూడా అంతే శక్తి వుంది.
    
    భాషకు అక్షరాలు ఎంత ప్రధానమైనవో, శరీరానికి కదలికలు అంతే ప్రధానమైనవి.
    
    అదే బాడీ లాంగ్వేజి - శరీర కదలికల శాస్త్రం.
    
    మనిషి మానసిక స్థితిని అంచనా వేయడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతోంది.
    
    మనిషి ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన సృష్టేమీ కాదు. దేవుడనే వాడుంటే మనిషి అనే ప్రాణిఈద అతనికి ప్రత్యేకమైన ప్రేమ, మార్దవం ఏమీలేవు. ఇతర ప్రాణుల సృష్టి ఎలా జరిగిందో మానవ సృష్టి కూడా అలాగే జరిగింది. మనిషి జంతువులోంచి పుట్టినవాడే. జంతువు లాంటివాడే అని మానవ జగతి ఉనికిని డార్విన్ సిద్దాంతీకరించి, సంచలనం రేపితే, తన ఇష్టం వచ్చినట్టు వూహాలోకాల్లో విహరించడానికి మనిషి అహానికి ప్రధాన కారణమయిన మనసుమీద, ఎన్నో తెలియని 'అచేతన సహజాతాలు' (Unconscious Instincts) తమ బలమైన ముద్రను వేస్తుంటాయని విశ్వవిఖ్యాత మానసిక శాస్త్రవేత్త ఫ్రాయిడ్ చెప్పాడు.
    
    ఆ అన కాన్షస్ ఇన్ స్టింట్స్ మీద వేసిన బలమైన ముద్రలను మనం ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.
    
    ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తన మాటలద్వారా, చేతలద్వారా, హావభావవిన్యాసాల ద్వారా ఆకర్షిస్తాడు. దీనినే కమ్యూనికేషన్ అంటాం. ఇద్దరు వ్యక్తులమధ్య ఈ కమ్యూనికేషన్ సరిగ్గా వుంటే అది నిజమయిన స్నేహానికిగాని, సాంగత్యానికిగానీ, కలిసి బతకడానికిగాని పునాదులు వేస్తుంది. లేనప్పుడు అది వికటిస్తుంది. అందుకే మనిషికి నాలుకే ప్రధమ శత్రువు అని అనేది. మంచి తెచ్చినా, చెడు తెచ్చినా నాలుకే తెస్తుంది.
    
    శరీరభాగాల్లో ఏ భాగం, ఏ భావ ప్రకటన చేసినా అది బాడీలాంగ్వేజ్ శాస్త్రంలో ఒక భాగమే.
    
    మనిషి ఉనికి గురించి చెప్పిన చార్లెన్ డార్విన్ శాస్త్రజ్ఞుడే (The Expression of the Emotions in Animals) అనే గ్రంథం ద్వారా 1872లోనే ఈ బాడీ  లాంగ్వేజ్ క్కూడా శ్రీకారం చుట్టాడని చాల మందికి తెలీదు. డార్విన్ ప్రతిపాదించిన ఈ సూత్రాన్ని విశదీకరించి అభివృద్దికి తెచ్చి, దీనిని ఒక శాస్త్రంగా రూపుదిద్దినవాడు ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే శాస్త్రవేత్త.
    
    ఒక వ్యక్తి దగ్గర్నించి ఇంకో వ్యక్తికిగానీ, ఒక ప్రాణినుంచి మరో ప్రాణికిగానీ ఒక సమాచారం చేరే సమయంలో కేవలం ఏడు శాతం మాత్రమే మాటలు ఉపయోగపడితే యాభై ఐదు శాతం అభినయం కారణమౌతుంది.
    
    మిగతా ముఫ్ఫై ఎనిమిది శాతం శబ్దం, దాని చుట్టూవున్నా వాతావరణం ఆ ప్రకటనలోని భావాన్ని సరైన రీతిలో చేర్చగలుగుతాయి.
    
    ఒక సాధారణ మనిషి ఒక రోజులో కేవలం, నిజంగా కేవలం పది నుంచి పదకొండు నిమిషాలు మాత్రమే మాట్లాడుతాడు. అందులో ఆ వ్యక్తి తన భావ ప్రకటనకు వాడే వాక్యం, తీసుకునే సమయం కేవలం 2.5 సెకండ్లు మాత్రమే. అలాగే ఒక మనిషితో ఇంకొక మనిషి ముఖాముఖిగా మాట్లాడే సమయం 35 శాతమే వుంటే, దాదాపు 65 శాతం తన హావభావ వ్యక్తీకరణ ద్వారానే సమాచారాన్ని అందజేయగలుగుతాడు.
    
    మనం లొడలొడ వాగే మాటల వెనక యింత కథ వుందని తెలిస్తే ఎంతో ఆశ్చర్యపోతాం.
    
    శాస్త్రీయంగా ఎన్నో ప్రయోగాలద్వారా రుజువైన ఈ సిద్దాంతంలో మనిషి తన మాటలకన్నా చేతలకే ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇస్తాడని ఆలోచిస్తే, మనిషి అనే ప్రాణికి మూలం జంతువు అనే విషయం సులభంగా అర్ధమౌతుంది.

 Previous Page Next Page