Previous Page Next Page 
ముగ్ధ పేజి 10

  

      ఈ శరీర కదలికల శాస్త్రం ప్రధానంగా నాలుగు భాగాలు. చేష్టల ద్వారా, అంగవిన్యాసం ద్వారా, స్థితి ద్వారా, దూరం ద్వారా ఈ హ్యూమన్ కమ్యూనికేషన్ (మానవ సమాచారం) అందించడం జరుగుతుంది.
    
    ఈ నాలుగు పద్దతులే ఇంత సమాచారం అందించదానికి మూలమా? అది నిజమా? అని మనకు సహజంగా సందేహం కలగొచ్చు.
    
    నిజమే-దీనికి ఏకైక ఉదాహరణ-
    
    చారీ చాప్లిన్ సినిమాలు.
    
    భాష, శబ్దం లేకపోయినా చాప్లిన్ అద్భుతమైన తన అంగ విన్యాసం ద్వారా, అనన్య సాధ్యంగా చేసే భవప్రకటన చూస్తే చాలు మనకు తెలుస్తుంది.
    
    ఈ శాస్త్రం గురించి ఒక వంద పుస్తకాలు చదవడంకన్నా ఒక్క చార్లీ చాప్లిన్ సినిమా చూస్తే చాలు.
    
    మన నిజ జీవితంలో మన కదలికల్ని స్పష్టంగా గమనిస్తే చాలు మనకెన్నో ఉదాహరణలు దొరుకుతాయి.
    
    మనిషి నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మౌనంగా వున్నప్పుడు, దెబ్బలాడుతున్నప్పుడు, కొండెక్కి దిగుతున్నప్పుడు, నగ్నంగా తయారయినప్పుడు, దుస్తులు వేసుకున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నిట్టూర్చినప్పుడు, కోపంతో అరిచినప్పుడు, అసహ్యంతో ద్వేషించినప్పుడు, కోరికతో కాలిపోతున్నప్పుడు, ద్వేషంతో రగిలిపోతున్నప్పుడు, పెను నిరాశ ఆవరించినప్పుడు, ఉత్సాహంతో ఉప్పొంగి పోతున్నప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు, చెల్లెలి బుగ్గమీద ముద్దాడుతున్నప్పుడు, ప్రేయసి కనురెప్పల కాతుకమీద పెదవులా నించినప్పుడు, భార్యను కౌగిలిలో బంధించినప్పుడు, పిల్లవాడ్ని లాలించినప్పుడు, బస్ పొగిడితే కాలర్ ఎగరేసినప్పుడు, తిడితే తలవంచుకున్నప్పుడు, నిరుద్యోగంలో కుమిలిపోయినప్పుడు, నిందలు భరించినప్పుడు, అనుకోని  సంఘటన జరిగినప్పుడు, ప్రకోపంతో హత్యచేసినప్పుడు, జైలుకెళ్ళినప్పుడు ఉరితీయడానికి ఒక్కక్షణం ముందు....
    
    మనకు తెలిసి, తెలియకుండా జరిగే ఎన్నెన్నో సంఘటనలు- మనం గుర్తుపెట్టుకోలేని గొప్ప, స్వల్ప సంఘటనలు - పిల్లలు, పెద్దవాళ్ళు స్త్రీలు, పురుషులు అందరికీ అనుభవంలోకొచ్చే సంఘటనలు.
    
    ఆ సంఘటనలే మనిషి జీవితాన్ని మలుపులు తిప్పుతాయి.
    
    ఆ మలుపు తిప్పే సమయంలో-
    
    ఆ వ్యక్తి, లేదా జీవి
    
    ఆధారపడే బాడీ లాంగ్వేజ్ మీదే.
    
    బాడీ లాంగ్వేజ్ లో ఏదైతే ప్రధానమైన అంశమో, ఆ కదలికలు ఆయా మనుషుల్లో అందరిలో ఒక్కలాగా వుండవు.
    
    ఎక్కువమంది కుడి చేత్తోనే రాస్తారు. అతి తక్కువమంది మాత్రమే ఎడం చేత్తో రాస్తారు దానిక్కారణం అలవాటు-
    
    తరతరాలుగా వచ్చే సాంప్రదాయం-జన్యుశాస్త్ర సంబంధమైన అంశాలు కూడా మనిషి కదలికల్లో ప్రధానమైన పాత్రను వహిస్తాయి.
    
    ఎక్కువమంది మగవాళ్ళు తమ షర్టుల్ని కుడిచేతి మీదుగానే తొడుక్కుంటారు. స్త్రీలు తమ జాకెట్లను ఎడం చేతిమీదుగా తొడుక్కుంటారు.
    
    ఒక రద్దీగా వున్న మార్కెట్లో ఒక స్త్రీ, ఒక పురుషుడు నడుస్తున్నారనుకోండి - ఆ పురుషుడు తనను ఆకర్షించిన స్త్రీ తన ముఖాన్ని కాకుండా తన రొమ్ము భాగాన్ని పక్కకు తిప్పుకోడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు సంఘటనలూ ఏ స్త్రీ, పురుషుల్లోనయినా సహజమైనవే వారికి ప్రకృతి పరంగా వచ్చినవే తప్ప, ఎవరూ నేర్పగా రాలేదు.
    
    టీనేజ్ ఆడపిల్లలు తమ వయసుకన్నా కొంచెం ఎక్కువ వయసున్న మగాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపద్నంతగా, తోటి వయసున్న మగపిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడరు. అలాగే టీనేజ్ అబబయిలు తమంత వయసున్న అమ్మాయిల్తోనే మాట్లాడడానికి ఇష్టపడతారు. తన కంటే ఎక్కువ వయసున్న స్త్రీలతో మాట్లాడ్డానికి జంకుతారు. దీనిక్కారణం కనుక్కోగలరా?
    
    ముగ్ధ దూరంగా కార్నర్ సీట్లో తన ఎదురుగా కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్న వ్యక్తి తీరుని స్పష్టంగా, పరిశీలనగా చూస్తోంది అతను ముదురు నీలంరంగు సూట్లో వున్నాడు. లేత నీలం రంగు టై అతని కంఠానికి అందంగా అమరింది. కుడిచేయి చూపుడువేలు చంపమీద, మధ్యవేలు పెదవులమీద వుంది- ఎడమచేయి మడత దగ్గరుంది-పొడవాటి ముక్కు, విశాలమైన కళ్ళు, కాలిమీద కాలు వేసుకుని కూర్చున్నాడతను.
    
    బాడీ లాంగ్వేజ్ థీరీ ప్రకారం అలా ఆ నిమిషంలో కూర్చున్న వ్యక్తి, ఎదుటి వ్యక్తి చెప్పేదానిని, తనకిష్టం లేకపోయినా బలవంతంగా వింటున్నాడనీ అర్ధం. నువ్వు చెప్పే దాంతో నేను ఏకీభవించడం లేదని అర్ధం.
    
    "అలా కూర్చున్న ఆ వ్యక్తి భావం ఏమై వుంటుందో అలకతో చెప్పింది ముగ్ధ."
    
    "నేన్నమ్మను,. నువ్వు చెప్పిందే కరెక్టని నమ్మకం ఏమిటి?" ప్రశ్నించింది నీలిమ.
    
    "కావలిస్తే అలకను వెళ్ళి అడగమను తెలుస్తుంది" మళ్ళీ అంది ముగ్ధ.
    
    "మరి వాళ్ళే విషయం మాట్లాడుకుంటున్నారో వూహించగలవా?" అలక ప్రశ్నించింది.
    
    "ఏ విషయం గురించైనా మాట్లాడుకోవచ్చు. వూహించి చెప్పడానికి నేనేం పామిస్టుని కాను. ఆ ఫోజ్ ని కామన్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ క్లస్టర్ అంటారు. అలాగ కూర్చున్న ప్రతి వాళ్ళల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం అలాంటి స్పందనే వుంటుంది" తన వాదనను సమర్ధించుకుంది ముగ్ధ.
    
    "అయితే చూడు... అతని కెదురుగా కూర్చున్న వ్యక్తి నోటికి అడ్డంగా చూపుడువేలు వుంచుకుని, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడా? మరి దానర్ధం" అలకే అడిగింది.
    
    ఆ వ్యక్తి వేపు చూసింది ముగ్ధ.
    
    మొదటి వ్యక్తికంటే ఆ వ్యక్తి వయసులో కొంచెం పెద్దగా వున్నాడు. తల నెరిసింది.
    
    "వాంటెడ్ గా ఒక అబద్దాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, ఆటోమేటిగగా అతని ఎడమ చేయి అతని మూతి దగ్గరకు వస్తుంది. ఆ సమయంలో అతను నెమ్మదిగా మాట్లాడతాడు. ఆ మాటలు అవతలి వ్యక్తికి స్పష్టంగా వినబడవు. మనుషుల్లో ఈ అలవాటు చిన్నప్పటినుంచి అలవాటవుతుంది. చిన్నపిల్లలు అబద్దం ఆదినపుడు వాళ్ళని గమనిస్తే వాళ్ళు చేత్తో నోరు మూసుకోడానికి ప్రయత్నిస్తూ అబద్దం ఆడేసి పారిపోతారు. పెద్దయ్యాక కూడా వాళ్ళల్లో ఈ అలవాటు పోదు. అందుకు ఇదే నిదర్శనం" చెప్పింది ముగ్ధ.
    
    "భలే బాగుందే.... నీ థీరీ..." సురభి మెచ్చుకోలుగా ముగ్ధను చూస్తూ అంది.
    
    కానీ ముగ్ధ సురభివేపు చూడడం లేదు. అలకవేపు చూస్తోంది. ఆ సమయంలో అలక చూపులు ముదురు నీలం రంగు సూటు వేసుకున్న వ్యక్తిమీదే ఉన్నాయి.
    
    "ఏయ్ అలకా....వరుడు దొరికేడేమిటే" కవ్విస్తూ అంది ముగ్ధ.
    
    నవ్వుతూ తల తిప్పింది అలక.
    
    అదే సమయంలో సర్వర్ టిఫిన్ ప్లేట్లతో రెడీగా వచ్చాడు. అందరూ టిఫిన్ల మీద పడ్డారు. అదే సమయంలో టిఫిన్ చేస్తున్న నీలిమ చూపులు దూరంగా కూర్చున్న ఓ పల్లెటూరి అమ్మాయిమీద పడ్డాయి. ఆ పల్లెటూరి అమ్మాయి, ఎదురుగా వున్న భర్త ఏవేవో చెపుతుంటే అయిష్టంగా వింటోంది. భుజాల నిండుగా పైట కప్పుకుని, ఒక కాలిమీద ఇంకొక కాలును వేసుకొని కూర్చుంది.

 Previous Page Next Page