"వెళ్దాం" "ఏం, పిక్చర్ బోర్ గా వుందా?" మహతి కలవరపడింది. "ఐ కాంట్ బేరిట్- ఐ డోంట్ లైక్ ఇట్" నిటారుగా లేచి నిలబడ్డాడు. అతనితోపాటు మహతి యాంత్రికంగా లేచి నిలబడింది. ఓ క్షణం ఆలోచించిముందుకు దారి తీసింది. అతను ఆమెను అనుసరించాడు. కారు సినిమాహాలు గేటు దాటి రోడ్డు ఎక్కింది. "ఒంట్లో బాగాలేదా?" స్టీరింగ్ మీది నుంచి ఎడం చెయ్యి తీసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు రవి. "సారీ మహతీ! సారీ నిన్ను సినిమా చూడకుండా చేశాను. సో సారీ!" "ఓ దట్సాల్ రైట్, నాకూ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఏదో తీరావచ్చాం గదా అని..." అతను తల తిప్పి ఆమెకేసి చూశాడు "నా కోసం అలా అంటున్నావ్. అవునా?" "కాదు నిజంగానే" "రియల్లీ!" గుండెలనిండుగా గాలి పీల్చుకుని వదిలాడు. "కనీసం నీ కోసమైనా పిక్చర్ పూర్తి అయ్యేదాక హాల్లో కూర్చోలేకపోయాను. నన్ను క్షమించు మహతీ". "ఛ.ఛ! ఏమిటది. నీ మనసు నాకు తెలుసు రవీ. నా కోసమే అసలు నువ్వు పిక్చర్ చూడడానికి ఇష్టపడ్డావని, తెలుసు.
నువ్వెందుకు బాధపడుతున్నావో, నీ మనసు దేని మీద ఉందో కూడా తెలుసు" రవి అలవోకగా నవ్వి "అదేమిటో?" అన్నాడు. "దొరకని తీగకోసం" తన సమాధానానికి అతను ఏమంటాడో నని కుతూహలంగా చూసింది. "కాదు. తెగిన తీగకోసం" మహతి త్రుళ్ళిపడింది. కారు మెయిన్ రోడ్డు వదిలి పక్క రోడ్డుకు తిరిగింది. "రవి పదింబావే అయింది. క్వాలిటీలో భోంచేసివెళ్దామా?" సందేహిస్తూనే సజెస్టివ్ గా అంది మహతి. "నీ ఇష్టం" కారాపి రివర్స్ గేర్ వేశాడు. "డిన్నర్ మధ్యలో లేచి పోతాననవుగదా?" ఆమె తమాషాగా అంది. అంతలోనే ఎందుకన్నానా అని బాధపడింది. అతను కొద్ది క్షణాలు మౌనం వహించాడు. "సినిమా అయితే మళ్ళీ చూడొచ్చు. డిన్నర్ అయితే మరోసారి చెయ్యొచ్చు. కానీ---కానీ...." "ఆ( కానీ...?" "నువు నన్ను మధ్యలో వదిలిపోతే...." "రవీ!" ఆమె కంఠం పూడిపోయింది. "మహతీ! నన్నువదిలి వెళ్ళనని ప్రామిస్ చెయ్య్!" "రవీ?" ఆమె గుండె నీరైంది. "జీవితాంతం నాతోనే ఉంటానని మాట ఇవ్వగలవా మహతీ?" "రవీ!" ఆమె కళ్ళలో నీళ్ళు చిమ్మాయి. "సారీ! మహతీ! నిన్ను అలా అడిగే అర్హతనాకు లేదని తెలుసు. అయిన ఆపుకోలేక పోయాను" "రవీ జీవితాంతం నీతోనే ఉంటాను. నీడలానిన్ను వెన్నంటే ఉంటాను". మహతి రవి భుజం మీద వొరిగిపోయింది.
"హల్లో! ఎవరూ?" "నేను! మహతీ! నేనే!" "రం....." "ఓ అతగాడితో ఇవాళ ఎంగేజ్ మెంటుందా?" అవతలి కంఠం విరుపుగా పలికింది. "నో! నో! అలాంటిదేమీ లేదు కిరణ్" తడబడింది. "మరి రవి నుంచి ఫోన్ ఎక్స్ పెక్టు చేస్తున్నట్టున్నావుగా?" "లేదు కిరణ్ అలాంటిదేమీ లేదని చెప్తున్నాగా?" నొక్కి అంది మహతి. "మహతీ! డోంట్ ట్రై టు బ్లఫ్ మీ" "ప్లీజ్ కిరణ్ నా మాటనమ్ము. నువొచ్చెయ్" ఆతృతగా అంది. "తీరా నేను వచ్చాక అతడూ వస్తే?" "ఏం వస్తే? రానియ్! నీకేంనష్టం?" "వాడంటే నాకు వళ్ళుమంట" అతడు పెద్దగా అరుస్తున్నాడు. మహతి ఫోన్ చెవికి దూరంగా పట్టుకుంది. "కిరణ్ ఇంతకూ నువ్వొస్తున్నావా? లేదా" "ఆ రవిగాడు వస్తున్నాడా? ముందా విషయం చెప్పు" "ఓ కిరణ్! అతను రావడంలేదని చెప్తున్నాగా?" "నిజమేనా?" "నిజమే! నువువస్తున్నావని తెలిస్తే అసలే రాడు" "ఏమో స్నీకీ బాస్టర్డ్! వాడ్ని నమ్మకూడదు" ఓ క్షణం ఆగి "సరే! వస్తున్నాను" అని ఫోన్ పెట్టేశాడు.
మహతి ఫోన్ పెట్టేసి, త్వర త్వరగా డ్రెస్ చేసుకొని, కిరణ్ కోసం ఎదురు చూస్తూ డ్రాయింగ్ రూంలో కూర్చుంది. టైం చూసుకుంది. 10.35 అయింది. తలుపు తోసుకొని, విజిల్ వేసుకొంటూ, తుఫాన్ గాలిలా లోపలకు వచ్చాడు కిరణ్. "హల్లో మహతీ! ఇంకా కూర్చున్నావేం! గెట్ అప్! బయలు దేరు" "లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు వస్తూనే పోదాం- పోదాం, అంటావ్. కూర్చో కాసేపు" మహతి అతని ముఖంలోకి చూస్తూ అంది. ఒక్కక్షణం ఆగి "ఇంతకీ ప్రోగ్రాం ఏంటి?" అంది తాపీగా. "అబ్బ! నీతో ఎప్పుడూ ఇదే ఇబ్బంది. ఊరికే కూర్చోవడం నావల్లకాదు. చెడ్డ చిరాకు వేస్తుంది. పద! వెళ్దాం". మల్టీ కలర్ బుష్ షర్టు, సన్ గ్లాసెస్, పైకి దువ్విన వత్తైన జుట్టూ- వాడిన మొహంలో పదునైన చూపులు. అతడ్ని చూస్తూ అలాగే కూర్చుండి పోయింది మహతి. "ఓ మైగాడ్ నువు అలామొద్దులా చూస్తూ కూర్చుంటే...?" "మత్తుగా ఉంటుంది" అందుకని అంది మహతి. "ఇంకా నయం ముద్దుగా ఉంటుంది అనలేదు. లే! లే! కిక్! బయలుదేరు. కమాన్" అంటూ వంగి ఆమె చెయ్యి పట్టుకొన్న కిరణ్ కు ఆమె వెనగ్గా దివాన్ మీద ఉన్న వీణ కన్పించింది. మహతి చెయ్యివదిలేశాడు. చివాల్న వెనక్కు జరిగాడు. "ఓ ఐసీ! రవికోసం ఎదురు చూస్తున్నావన్న మాట? మరి నన్నెందుకు రమ్మన్నావ్?" అతని కంఠం కర్కశంగా ఉంది.
మహతి అతని కళ్ళలోకి చూస్తూ మత్తుగా అంది. అతను చల్లబడ్డాడు. మహతి లేచి అతని చెయ్యి పట్టుకొని గుంజి సోఫాలో కూర్చోబెట్టింది. "రవి అంటే నీ కెందుకంత కోపం కిరణ్?" "ఏమో! డర్టీ క్రీచర్. నాకు అతనంటే పరమఅసహ్యం" కారణం?" మెత్తగా అడిగింది. కిరణ్ మొహం పక్కకు తిప్పుకొని "ఏమో" అన్నాడు. "నేను చెప్పనా?" మహతి టీజింగ్ గా అడిగింది. "వద్దంటే ఊరుకుంటావా ఏం? చెప్పూ?" "రవి నన్ను....నన్ను...." ఆగి అతని ముఖంలోకి చూసింది సూటిగా. "ఆరాధిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. అంతేగా?" కసి కసిగా అన్నాడు కిరణ్. "కరెక్టు" పకాలున నవ్వింది మహతి. "అయితే ఇంకా ఈ నాటకం అంతా ఎందుకూ?" "తెర దించెయ్యమంటావా?" "హాంగ్ యువర్ సెల్ఫ్ విత్ స్నీకీ బాస్టర్డ్" సోఫాలో నుంచి లేవడానికి ప్రయత్నించిన కిరణ్ భుజాలు వొత్తి పట్టి, ముందుకి వంగి, అతడి కళ్ళల్లోకి చూసింది. అతడు వదులుతున్న వేడిగాలి సోకి ఆమె చెంపలు కంది పోయాయి. "ఈ మూడ్ లో నువు నాకెంతో అందంగా కన్పిస్తావు కిరణ్" అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి గోముగా మహతి అంది. "నువ్వాడుకోడానికి నేనేం కీలుబొమ్మను కాను" ఆమె చేతుల్ని తోసేస్తూ అన్నాడు కిరణ్. "బట్ ఐలవ్ యూ" అతని చేతులు ఆమె నడుం చుట్టూ పెనవేసుకున్నాయి. "అబ్బ! ఉండు కిరణ్. అమ్మ ఇంట్లోనే ఉంది" మహతి అతని చేతుల్లో నుంచి తప్పుకుంది. పవిట సర్దుకొని ఎదురుగా కూర్చుంది. "ఇంతకీ నువొస్తావారావా? తేల్చి చెప్పు" అతని గొంతు తీవ్రంగా ఉంది.