Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 7


    
    డాక్టర్ సుధీర్ గుండె ఉద్వేగంతో అతి స్పీడుగా కొట్టుకోవడం మొదలెట్టింది. రక్తం శరీరమంతటా వడివడిగా ప్రవహించడం మొదలెట్టింది. ఒళ్ళు జ్వరం వచ్చినట్లు అయింది. తల కొంచెం బరువుగా అయి, చెవులు దిబ్బెళ్ళు పడినట్లు అయిపోయాయి.
    
    రేప్!
    
    అవును!
    
    ఆ శంకర్రావు భార్యని రేప్ చేస్తే ఎలా వుంటుంది?
    
    డాక్టర్ సుధీర్ ఉద్రేకంతో కొద్దిగా వణకటం మొదలెట్టాడు.
    
    అవును! ఇదే కరెక్ట్ సమయం! ఇదే కరెక్ట్ స్థలం! ఇదే కరెక్ట్ పార్టీ!
    
    భార్య వూళ్ళో లేదు. భారీ రేటుకి కొనబోయిన అమ్మాయి దొరకలేదు. ఎవడో కాంపౌండరుగాడి పెళ్ళాం ఒంటరిగా మేడమీద ఉంది.
    
    తనకేం భయం లేదు! ఉహూ! నిజంగానే తనకేం భయంలేదు!
    
    వణకటం ఎక్కువయింది.
    
    అతని కనుపాపలు పెద్దవయినాయి. వెర్రివాడిలా చూస్తున్నాడు.
    
    ఏం చేస్తుంది? అరుస్తుందా? అల్లరి చేస్తుందా?
    
    అల్లరి చేస్తే తనే అల్లరైపోతుంది. ఒకవేళ మొగుడితో చెప్పేస్తుందా? వాడొచ్చి తన ప్రాణాలు తీసేస్తాడేమిటి?
    
    ఆఫ్టరాల్, కాంపౌండరుగాడు! శశి ఇచ్చే జీతంతో బతికే ముష్టి వెధవ!
    
    లేచి నిలబడి, గట్టిగా వూపిరి పీల్చి, వణుకుతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని, మేడమీదికి నడిచాడు. మెట్లమీద ఒక్కక్షణం ఆగి సిగరెట్ అంటించాడు.
    
                                        2
    
    కేరళలో...వసుమతి పెళ్ళి అయిపోగానే -
    
    "వసూ ! ఇంక వెళ్తానే!" అంది శశి.
    
    డాక్టర్ వసుమతి మళయాళీ అమ్మాయి. కానీ, ఉండడం హైదరాబాద్ లోనే! శశితోపాటే హైదరాబాద్ లో మెడిసన్ చదివింది. రెండేళ్ళు జూనియర్. ఇంకా ఎక్కడా రెగ్యులర్ జాబ్ దొరకలేదు. మంచి ఉద్యోగం దొరికేదాకా తన నర్సింగ్ హోమ్ లోనే వర్క్ చెయ్యమంది శశి. వసుమతి ఒప్పుకుంది.
    
    "అప్పుడే వెళ్తానంటావేమిటే? ఒక్కరోజుకి ఏమీ అయిపోడులే నీ మొగుడు! రేపు సరదాగా సముద్రపు ఒడ్డున కొబ్బరితోటల్లో పిక్నిక్ వేసుకుందాం ఉండు!" అంది వసుమతి ఖచ్చితంగా.
    
    నిస్సహాయంగా చూసింది శశి.
    
    "ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటావ్ నువ్వు? ఇంటినిండా చుట్టాలు! కాస్త ఇబ్బందిగా ఉందికదూ నీకు? పోనీ నాగదిలో పడుకుందామా అంటే ఇవాళ మాకు చాలా పని ఉండె!" అంది వసుమతి నవ్వుతూ.
    
    "నీకు సిగ్గులేదు!" అంది శశి చిరుకోపంగా.
    
    "పోనీ మేడమీద గదిలో పక్కేయించనా? కొంచెం బిక్కుబిక్కుమంటూ వుంటుంది గానీ, ఫర్వాలేదు. ఒకటో రెండో దెయ్యాలున్నాయిట ఆ గదిలో. నీకు అభ్యంతరం లేకపోతే..." అంది వసుమతి నవ్వుతూ.
    
    "నోర్ముయ్! నీతో స్నేహం చేసిన తర్వాత ఇంక దెయ్యాలంటే భయమేముంటుందే, రాక్షసీ! అక్కడే వేయించు నాపక్క" అంది శశి.
    
    రాత్రికి ఆ గదిలో పడుకుంది శశి. లైటు లేదు. హరికేన్ లాంతరు పెట్టారు.
    
    నీరసంగా చీకటితో పోట్లాడుతోంది అది. మసక మసగ్గా ఉంది వెలుతురు.
    
    సుధీర్ గుర్తొచ్చాడు శశికి. అతన్ని గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది.
    
                                                              * * *
    
    సుధీర్ మేడమెట్లమీద నిలబడి చూశాడు. క్రింద కారిడార్ కి చివరగా ఉన్న మంచంమీద పడుకుని ఉన్న నర్స్ కొద్దిగా కదిలింది.
    
    శారద గదిలోకి నడిచాడు.
    
    సౌందర్యం అంతా కుప్పపోసినట్లు పడుకుని ఉంది శారద.
    
    మాతృగర్భస్థ శిశువులాగా, అమాయకంగా పక్కకి ఒదిగి కాళ్ళు కొద్దిగా కడుపులోకి ముడుచుకుని చెంప అరచేతిలో ఆనించి నిద్రపోతూంది.
    
    కనురెప్పలు మూసుకుని సీతాకోకచిలుక రెక్కల్లాగా అందంగా వున్నాయి. పెదిమలు అరవిచ్చిన గులాబీల్లాగా కొద్దిగా తెరుచుకుని చిరునవ్వు నవ్వుతున్నట్లు వున్నాయి. నిద్రలో కూడా పమిట తొలగలేదు. పాదాలు చీరలోకి లాక్కుని వుంది. మొహానికి చిరుచెమట పట్టి నుదుటిమీద పడిన ముంగురులు అతుక్కుపోయాయి.
    
    మెడలో మంగళసూత్రం కొద్దిగా పక్కకి జారి వుంది. అది వుత్త పసుపుతాడు! దానికి ఎర్రవీ, నల్లవీ రెండు పూసలున్నాయి. దానికి అల్పంగా కనబడుతున్న రెండు పల్చటి గుండ్రటి బంగారు రేకులు.
    
    ఆ మంగళ సూత్రం ఆమె మెడలో కట్టిన శంకర్రావు కూడా అల్పమైన మనిషే!
    
    ఆ మంగళసూత్రాల వెనుకాతల వున్నంతగా వున్న గుండె లయబద్దంగా కదులుతూంది. లేతగా వున్న పొట్ట కూడా క్రమబద్దంగా కదులుతోంది. ఉచ్చ్వాస నిశ్వాసాల శబ్దం సన్నగా వినబడుతోంది.

 Previous Page Next Page