"గుర్తుపెట్టుకో- రేపటినుంచి ప్రతిరోజూ రాత్రి తొమ్మిదిగంటలనుంచి మూడుగంటల వరకు నిరీక్షిస్తుంటాను" చివరిసారి చెప్పి లేచి నిలబడ్డాడు.
ఆమెకి లేవడానిక్కూడా శక్తి చాలడంలేదు.
"ఈ పదిహేనురోజుల్లో ఏదో ఒకరోజు నువ్వొస్తావనే అనుకుంటాను" అని అడుగులు ముందుకేశాడు.
ఆమె మాత్రం చాలాసేపటివరకు అలానే వుండిపోయింది.
* * *
ఉదయంక నిద్రలేవడమే ఇందుమతికి భరణి గుర్తొచ్చాడు. అతను నీరెండలో పరకాయప్రవేశం చేసి తనచుట్టూ నులివెచ్చగా చుట్టుకుంటున్నట్టు. గాలిలో దూరి. అల్లరల్లరిగా ముఖంమీద వాలుతున్న తల వెంట్రుకలను స్పృశిస్తున్నట్లు, తన పర్మిషన్ లేకుండానే తనపైటలో ప్రవేశించి ఎత్తయిన అందాలను సవరిస్తున్నట్టు, బొడ్డుచుట్టూ వలయాకారంతో పరుచుకుంటున్నట్లు ఫీలయ్యింది.
ఈ రోజు రాత్రి నుంచి అమావాస్య వరకు అంకాళమ్మ రావిచెట్టు దగ్గర వెయిట్ చేస్తూంటానన్నాడు. తను వెళ్ళాలా? వద్దా? వెళ్ళితే ఇక పర్మినెంట్ గా అతనితోనే తన జీవితం అయిపోతుంది.
ఉదయం లేచింది మొదలు పక్కిళ్ళకు వెచ్చాల బదులు కోసం వెళ్ళాల్సిన దరిద్రం నుంచి, తన గొంతును, గుండెను రెండు చేతుల్తో నులిమేసే ఒంటరితనం నుంచి థార్ ఎడారిలో తను ఒంటరిగా నిలబడిపోయినట్లనిపించే ఈ ఏమీ తోచనితనం నుంచి తనను పూలతోటల్లోకి, పచ్చని పైర్లలోకి, నీలి సముద్రం ముంగిళ్ళలోకి, సూర్యోదయాల, సూర్యాస్తమయాల ఇంద్రజాలాన్ని వీక్షించే వీలున్న లోయల్లోకి తనను ఎగరేసుకుపోయే మహా మంత్రం భరణి.
అతనితో వెళితే మరి అమ్మ? తనకోసం బతికే అమ్మ ఏమైపోతుంది? ఆమెను మాత్రం దరిద్రాన్ని వదిలేసి తను సుఖాన్ని వెదుక్కుంటూ వెళ్ళటం భావ్యమా? తను ఎవరితోనే లేచి వెళ్ళిపోయానంటే ఊరుఊరంతా నూరు గొంతులున్న కోడై పోయి అమ్మ చెవుల్లోనే కూస్తుంది.
మాటల ముక్కుల్ని తగిలించుకుని బంధువులు రాబందుల్లా అమ్మను పొడుచుకుతింటారు తనకు ఎవరూ లేరని బాధపడే అమ్మ తనూ వెళ్ళిపోతే ఆ దిగులుతోనే చచ్చిపోతుంది. అప్పుడు తను హాయిగా, ఆనందంగా వుండగలదా? కానీ గుండెల్ని పూలగుత్తుల కింద మార్చేసే ప్రేమలేకుండా అమ్మకోసం జీవచ్ఛవంలా బతుకు వెళ్ళ దీస్తూ ఇక్కడ వుండడం తనకు సాధ్యమవుతుందా? ఇప్పుడు ఏమిటి చేయడం?
ఇందుమతి ఏ పని చేస్తున్నా ఆమె మనసు మాత్రం భరణిని ఆధారం చేసుకుని ఊహల మొగ్గల్ని వేస్తోంది.
ఆరోజు ఆదివారం కావడంతో శతరూప ఆలస్యంగా నిద్ర లేచింది. వారంరోజుల్లో ఆ రోజు ఒక్కరోజే ఆటవిడుపు. మిగిలిన రోజుల్ని అనుపత్రికి ఇచ్చేసి, ఆదివారాన్ని మాత్రం తన ఒక్కదానికోసం దాచుకున్నట్లు అన్పిస్తుంటుంది శతరూపకు, అందుకే ఆరుగంటలకల్లా మెలకువ వచ్చినా అటూ ఇటూ దొర్లుతూ గడిపిందే తప్ప పడకనుంచి లేవలేదు.
ఇందుమతి నిద్రలేచి ఆ పనీ ఈ పనీ చేస్తుండటాన్ని గమనించింది. రెండేళ్ళ క్రితం వరకు కూతుర్ని చూస్తూనే ఏదో ఆనందం గుండెల్ని ఊపేసేది తెలియని ప్రేమ మనసుని విప్పారించేది.
నాకూ 'నా అన్న జీవి వుందన్న, ఆత్మసంతృప్తి ఒంటరితనాన్ని దూరంగా తరిమేసేది.
కానీ ఇప్పుడలా లేదు. దిగులు నీళ్ళలో నానిన బఠానీగింజ బాగా గుండెల్లో ఉబుకుతోంది. పెళ్ళి చేయాలన్న తలంపు, ఎలా చేయాలన్న బాధ; తన నిస్సహాయత. కలగాపులగమై కుళ్ళిపోయిన ద్రవంలా గుండెల్నుంచి విరజిమ్ముతోంది. దరిద్రం తమ బతుకుల్ని ఎంత దుర్భరంగా మార్చేసింది తెలుస్తుంది. తన కూతురికి పెళ్ళి చేయలేనేమోనన్న బాధ మనసులో బర్మాలాగా దూరి తొలిచేస్తోంది.
కూతురు ఒక్కతే పనిచేస్తుంటే చూడడం ఇష్టంలేక తనూ పడక మీద నుంచి లేచింది శతరూప.
లేస్తూనే కూతుర్ని పలకరించింది. ఆ తరువాత తల్లి దగ్గరకు వెళ్ళింది. తను చచ్చిపోతే తన కూతుర్ని, తన మనువరాల్ని ఎవరు చూస్తారన్న ఒకే ఒక కారణంవల్ల ఇంకా తను బతుకుతున్నట్లు వుంటుంది అనసూయమ్మ. ఆమెకి ఎన్నిజబ్బులున్నాయో చివరికి ఆమెకు చికిత్స చేసే డాక్టర్ కు కూడా తెలియదు.
వార్థక్యానికి వేలాడదీసిన గుదిబండల్లాగా రకరకాల జబ్బులు ఆమెను శ్మశానంకేసి లాగుతుంటాయి. కానీ అటువైపు చూడడానిక్కూడా ఇష్టపడకుండా మొరాయిస్తున్నట్టు ఎంత రోగమైనా ఆమె నిలదొక్కుకుని వుంటుంది. ఆమె అప్పుడప్పుడు జబ్బుపడ్డా మిగిలిన సమయాల్లో ఊరి మొగదాలలో నాటిన అంకాళమ్మ రాయిలా గట్టిగా వుంటుంది.
శతరూప తల్లిని లేపి అద్దం ముందుకెళ్ళి నిలబడింది. అద్దంలో తనముఖం చూసుకుంది. ఎన్ని కష్టాలొచ్చినా పసిపిల్లాడు పుస్తకంలో నెమలికన్నును భద్రంగా దాచుకున్నట్టు ఆమె ఇప్పటికీ అందంగానే వుంటుంది. ఉన్నంతలో శుభ్రంగా, నాగరికంగా వుండటానికే ప్రయత్నిస్తుంది, బతుకుమీది ఆశ నువ్వు వేసుకునే బట్టలమీద, నువ్వు ఇతరులకు కనిపించే విధానంమీద ఆధారపడి వుంటుంది. అందుకే వీలైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించు అన్నది ఆమె ఫిలాసఫీ.