అదీకాక ఆమెకు పెళ్ళయిన వెంటనే భర్త వదిలేయడంతో తను అందంగా కనిపించాలన్న అవసరం కూడా ఆమెకు శుభ్రంగా వుండటం నేర్పించింది.
ఆమెకిప్పుడు నలభై ఏళ్ళకు అటూ ఇటుగా వుంటాయి. ఆమె యవ్వనంలో ప్రవేశించింది మొదలు ఆమె జీవితం ఎన్నో మలుపుల్ని చవిచూసింది. ఒక గొప్ప గ్రంథకర్త కూడా అన్ని మలుపుల్ని సృష్టించలేడు. పెళ్ళయిన ఆరునెలలకే ఆమె భర్తను వదిలేయాల్సి వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే భర్త ఇచ్చిన కడుపూ, మెడలో మంగళసూత్రం, తల్లి మాత్రం మిగిలినట్టు తెలిసింది. అప్పట్నుంచీ ఆమె జీవితం ఎన్నో కుదుపులకి గురయింది.
ఒక్కోసారి ఒక్కో విషయాన్ని చూసి బతకాలన్న ఆశను నిలుపుకుంటూ వచ్చింది. లేకుంటే ఆమె ఈపాటికి ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది.
భర్త వదిలేశాక ఆమె పుట్టింటికి చేరుకుంది. ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించింది బిడ్డను కన్నది.
ఆ తరువాత జరిగిన చాలా పరిణామాలు ఆమెను ఎన్నో ఊళ్ళకు తరిమాయి. ఈలోగా ఆస్తి మొత్తం హరించుకుపోయింది. చివరికి గోపాల పురానికి చేరుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తగా చేరింది. రోజుకు ఇరవై రూపాయల కూలీ. వెళ్ళని రోజు ఆ ఇరవై రూపాయలు కూడా రావు. ఆ వచ్చే అయిదు వందలో ఆరువందలతో రోజుల్ని లాక్కొస్తోంది శతరూప.
ఆమెకున్నది ఒకే బాధ్యత. ఇందుమతి పెళ్ళి నానా తంటాలుపడి ఇందును ఇంటర్మీడియట్ వరకు చదివించిందిగానీ ఆ పైన వీలుపడలేదు. ఇంట్లో బంధించడం ఇష్టంలేక అప్పటికీ హరికథల్ని నేర్పించింది. ఆ చదువుకి మంచి ఉద్యోగం వస్తుందని ఆశించిందిగానీ అది అత్యాశేనని తరువాత తెలిసింది.
అప్పటికి ఇందుమతి చిన్న చిన్న ఉద్యోగాలను సంపాదించిందిగానీ ఒక్కటీ నాలుగు కాలాల పాటు నిలబడలేదు. దాంతో ఇక పెళ్లి చేసెయ్యడం ఉత్తమం అని శతరూప నిర్ణయించుకుంది.
అయితే ఈ కాలంలో ఆడపిల్ల పెళ్లి చేయడం అంత సులభమైన విషయం కాదు. పెళ్ళికి ముఖ్యంగా కావాల్సిన డబ్బు శతరూప దగ్గరలేదు. పెళ్లికొడుక్కి కనీసం వాచీ ఉంగరం పెట్టే స్తోమత కూడా లేదు. ఆమె గత జీవితం అంత కుదురుగా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురిపెళ్లి ఎలా చేయాలో అర్దం కాదు. మగ దిక్కు లేని కుటుంబం. అందులోనూ చుట్టాలు ఆమెవైపు కన్నెత్తి చూడడం మానేసి చాలా కాలమే అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేవుడే తనకు ఓ దారి చూపించాలని ఆమె రాత్రి పడుకునే ముందు ఆకాశం కేసి చూస్తూ కనిపించదని దేవుళ్లను ప్రార్దిస్తూ వుంటుంది.
శతరూప అద్దంముందు నుంచి కదిలి బయటకి వచ్చింది. అనసూయమ్మ ఇంకా దగ్గు ఆపలేదు. తల్లి అలా దగ్గుతుంటే భయమేసింది శతరూపకు. ఉన్న ఒకే దిక్కు తన అమ్మ. ఆమె పోతే తామిద్దరే అయిపోతారు. తామిద్దరిలో ఎవరో ఒకరికి ఏదైనా జరిగితే చెప్పుకుని ఏడ్వడానికిక్కూడా మనిషి వుండరు. అందుకే అంత కష్టంలోనైనా సరే తల్లి ఆరోగ్యానికి కొంత డబ్బు వెచ్చిస్తూ వుంటుంది.
"ఈ రోజు చీకటికదే" అంటూ అనసూయమ్మ కూతురుకు గుర్తుచేసింది.
ఆ ఊర్లో చీటీలు వేసేవాళ్లు ఎక్కువే. నెలకు వంద రూపాయల నుంచి వేయి రూపాయాల వరకు చీటీలున్నాయి.ఎంతమంది సభ్యులుంటే అన్ని నెలలు ముందు నిర్ణయించుకున్న మేరకు డబ్బులు కట్టాలి. డబ్బులు చేరాక సభ్యులందరూ కలసి 'పాట' పాడతారు. ఎవరెక్కువ పాడితే ఆ పాట పాడిన సభ్యుడికి ఇచ్చేస్తారు. వేలంపాట డబ్బును మిగిలిన సభ్యులందరూ పంచుకుంటారు.
ఇందుమతి తరువాత శతరూప జీవితాన్ని ఆక్రమించుకున్నది చీటీలే ఏవో అవసరాలు పెరగడం, వాటి కోసం చీటి వేసి పాడడం, ఆ తరువాత డబ్బులు కట్టలేక పోవడం, చీటి ఓనర్ వత్తిడి చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఇంకో కొత్త చీటీ వేసి పాడడం, ఆ డబ్బులు తీసుకొచ్చి పాత చీటీ బకాయిలు చెల్లించడం, మరుసటి నెలనుంచి పాత చీటీ, కొత్త చీటీలకు డబ్బులు కట్టాల్సిరావడం, అందుకోసం కనిపించిన వాళ్లనందర్నీ అప్పులగండం - నెలకో చాలా రోజులు శతరూప ఇలా అవస్థలు పడుతూ వుంటుంది.
"రామదాసు చీటీనే కదా" చాలా చీటీలు వుండడంవల్ల ఆ రోజు వున్నది ఎవరి చీటీనో తెలియక అలా అడిగింది శతరూప.
"ఆఁ" అనసూయమ్మకి గుర్తే. ఆ వయసులో కూడా తన కూతురు, మనవరాలి కోసం ఆమె పడే తాపత్రయాన్ని చూస్తే మనిషికి అంతిమ ఘఢియల్లో సైతం కుటుంబంమీది తీపి పోదనిపిస్తుంది.
ఆ చీటో కోసం వారం రోజులు నుంచి ఎంతో కష్టంతో కూడబెట్టిన వంద రూపాయల్ని తీసుకుని బయల్దేరింది శతరూప.
రామదాసు కూడా శతరూప ఆసుపత్రిలోనే వాచ్ మేన్ గా పని చేస్తాడు. అతను కూడా ఆమెలాగే రోజువారీ కూలీ. ఆసుపత్రి కట్టేటప్పట్నుంచి పనులకు వెళ్లి వస్తూ శతరూప, రామదాసు చివరికి ఆ ఉద్యోగాలను సంపాదించారు. రామదాసు ఆ ఊర్లో తన కష్టాన్ని వడ్డీకి తిప్పుతుంటాడు.
"ఆ ఆసుపత్రివారు ఇచ్చే ఆరువందలు ఏ మూలకీ సరిపోతాయి. అందుకే ఈ వడ్డీలకోసం కక్కుర్తి పడేది" అని అతను అప్పుడప్పుడు ఇతరుల దగ్గర మొరపెట్టుకుంటూ వుంటాడు.
"అప్పు తీసుకునేప్పుడు ఎంత వినయ విధేయతలు చూపిస్తారో తిరిగి మన డబ్బు మనకు ఇచ్చేటప్పుడు అన్ని పేచీలు లేవదీస్తారు, ఒక పట్టాన ఇవ్వరు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఏం చేద్దాం? వడ్డీ డబ్బుల కోసం వాళ్లు కొట్టినా కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి" అంటూ బాధపడుతుంటాడు రామదాసు.
అతనికి నలుగురు పిల్లలు. పెద్దవాళ్లిద్దరూ ఆడపిల్లలు. వాళ్లు పెళ్లిళ్లకు ఎదిగిపోయి తమకు పెళ్లెప్పుడు చేస్తారని తల్లిదండ్రులవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకోసమే రామదాసు తనకు తెలిసిన అన్ని దారుల్లోంచి డబ్బులు సంపాదిస్తుంటాడు.
రామదాసుకు ఆసుపత్రిలో రాత్రి డ్యూటీ కాబట్టి తెల్లవారే చీటీ నిర్వహిస్తుంటాడు.
శతరూప వేళ్ళేటప్పటికి రామదాసు ఇంటినిండా జనం వున్నారు. వాళ్లంతా చీటీలో సభ్యులే, శతరూప మొదటి చీటీనే వాడి డబ్బులు తీసుకోవడంతో ఇక పాడే అవకాశంలేదు అందుకే వంద రూపాయలిచ్చి తిరిగి వచ్చెయ్యడానికి లేస్తుంటే "రూపమ్మా! నీతో ఓ విషయం మాట్లాడాలి" అన్నాడు రామదాసు.
"ఏమిటన్నా?"
" అలా రా చెబుతాను" అన అతను పెరట్లో దారి తీశాడు. ఇద్దరూ తులసి చెట్టుకు అటూ ఇటూ కొమ్మల్లాగా నిలబడ్డారు.