"విషమా? వాసన చుశార్టనా?
"ఏమో!అలా అనుమానించారాయన?"
ఆదిత్య ఏం మాటాల్లేదు.
తండ్రి మంచంపై ఓ చివర కూర్చున్నాడు.
నిమిషాలు గడుస్తున్నాయి, అరుంధతిగారు కొడుకుని భోజనానికి వెళ్ళమన్నారు. కానీ ఆదిత్య అక్కడి నుంచి కదిలేందుకే ఒప్పుకోలేదు. అలాగే కూర్చున్నాడు.
అరుంధతి లోపలికి వెళ్లి కాసిని బిస్కట్స్, పాలు తెచ్చింది. రెండు బిస్కట్లు తిని, గ్లాసుపాలు తాగేడు ఆదిత్య, ఆమె అవికూడా తినలేదు, తాగలేదు. మంచినీళ్ళు తాగింది. రాత్రంతా మేలుకున్నారు.
5
'ఏమైంది?' నింపాదిగా అడిగింది సంధ్య. ఆమె కంఠంలో ఆ వేగం లేదు. ఆదుర్దా లేదు ఆ ప్రశ్న చాలా కాజువల్ గా వుంది అంతే!ఆ సమయంలో ఏదైనా విషాద వార్త వినవలసి రావచ్సినా ఆమె గుండె నిబ్బరంతో వుంది.
"మళ్ళి మీ అమ్మకి పూనకం వచ్చింది!'
'అత్తయ్యా' మా అమ్మని డాక్టర్ వద్దకి తీసికెళదాం. ఆమెని యిదేదో హిస్టిరియాలాంటి జబ్బు పట్టుకుంది!'
'ష్!' పెదాలపై వేలుంచింది విశాలాక్షి. "మరీ ఎంత చదువుకున్నా_ఎంత తెలివి మీరినా అలా మాటాడోద్దు సంధ్య! మా మీనాక్షి అత్తయ్య, ఆమె అత్తయ్య కామాక్షి. ఆమె అత్తయ్య విశాలాక్షి, మళ్ళి ఆమె అత్తయ్య మీనాక్షి. ఆమె అత్తయ్య కామాక్షి, ఆమె అత్తయ్య విశాలాక్షి...
'అత్తయ్య!' విసుగ్గా పిలిచింది సంధ్య. 'ఈ యింటి అడబదచులు వంశక్రమం ఏకరువు పెట్టక. నాకిప్పటికి ఎన్నిసార్లో చెప్పావు_ అందులో విశేషం ఏముంది? అందరూ గణాచార్లు_ ఓ పెళ్ళి లేదు_ ఓ ముచ్చుట లేదు. ఓ సంతానం లేదు సుఖం లేదు. ఆఖరికి శయ్యాసుఖం భోజన సుఖం కూడా మీరు ఎరుగరు.అన్నిటికి దూరంగా బ్రతుకుతూ ఆ తీరని కోర్కెలలో మనస్సులో ఓ విధమైన ఎలర్జీ పెంచుకుంటూ మాములుగా బ్రతికే వాళ్ళని ఏడ్పించుక తిన్నారు.
అత్తయ్యా_
విధవాదపడుచులే యమ డేంజర్. అత్తపోరు, అడబిద్దపోరు తరతరాలుగా యీ యింటి కోడళ్ళు అనుభవించారు. తీరని కోర్కెలతో సగం తీరిని వాంఛలతో విధవలు సాటి స్త్రీలని మానసికంగా హింసిస్తారు ఇక పెళ్లవని ఆడపడుచులు_ అందునా పెళ్ళి చేసుకునే అవకాశమే లేని యీ స్త్రీలు యింకా ప్రమాదం.
ఇంటిల్ల పాదినీ మీరు మీ చాందసాలతో, మీ ఆజ్ఞలతో, కట్టుబాట్లతో గిరిగీసి బంధించి మానసికంగా హింసించారు.ఇంకానా _ ఇక పై అన్నట్టు మీ మూడాచారాలకి నేను ఎదురు తిరిగాను ఓ విధంగా చెప్పాలంటే మా నాన్నే ఎదురు తిరిగేడు అయితేనేం ఆయనా ఓడిపోయారు.
ఒక విధంగా ఆయన సైకిక్ ఆయన్ని న్యూరో సర్జన్ కీ చూపించాలి. మా అమ్మని సైకియాట్రిస్ట్ కి చూపించాలి, ఆరోగ్యం చేకూరుతుంది కానీ నా మాట ఎవరు వింటారు?
'నీకు మతి పోయింది' నిర్దాక్షిణ్యంగా అంది విశాలాక్షీ "మేం దేవదూతలం. దైవాంశ సుభూతులం. దైవ ప్రలినిధులం_ "
'నా ముఖం_' మాటల మధ్యలోనే అడ్డుకుంది "అసలు దేవుడే లేడు అదంతా మన భావన సాటి మనుషులపై అధికారం చలాయించాలనుకునే కొంతమంది కల్పన యీ దేవుడు మతం అనే మత్తుమందుకో మామూలు జనాన్ని లోంగదీసుకున్నారు అప్పటి వాళ్ళు అవిద్య,పేదరికం, ఆజ్ఞానం యీ మామూలు మనుషుల్ని మానసికంగా బానిసలని చేసింది"
విశాలాక్షి కళ్ళెర్రబడ్డాయి ముక్కుపుటాలు అదిరేయి. పెదవులు కంపిస్తున్నాయి. వాదనలో చేతకానితనం వచ్చేసింది.
'సంధ్యా! ముగ్గురమ్మలే అమ్మలు ముగ్గురయ్యారు భ్రమరాంబ, ప్రసూనాంబ, మాణిక్యాంబ. వాళ్ళే ముగ్గు రక్షులు_విశాలాక్షీ, మీనాక్షి, కామాక్షి. వాళ్ళు ముగ్గురూ యీ యింటిని_యీ వంశాన్ని _ యీ కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. మేం_'
"ఈ తరంతో మీ పని అయ్యిందత్తాయ్యా_అందుకే మీరు ఆఖరికి మీ పేరు కూడా నిల్పుకోలేక పోయారు_"
"ఏది ఏమైనా నీ పెళ్ళి జరిగేందుకి వీల్లేదు_"
"జరిగి తీరుతుంది_"
"చూద్దాం_"
"లక్షణంగా చూడండి వచ్చి ఆశీర్వదించండి_" నవ్వుతూ అంది సంధ్య అమాయకురాలూ, అవిద్యావతీ. తనేదో గొప్పజన్మగా భావించుకునే యీ అత్తయ్యని ! యీ సృష్టిలో ఆడదానికి మొదటి శత్రువు ఆ ఆడదే _ఆ తర్వాత శత్రువు అందం. ఆ తర్వాత శత్రువు విజ్ఞానం.
మనం కొడుకుగా,సోదరుడుగా,తండ్రిగా అభిమానించి ప్రేమించే యీ మగవాడు భర్తగా తన అధికారాన్ని అధిపత్యాన్ని నిల్పుకోటానికి ఎన్నెన్నో సృష్టించాడు అందులో ఒకటి యీ కుటుంబ వ్యవస్థ.
మనం లేనిదే యీ కుడురులేదు. మనం లేనిదే యీ సృష్టిలేదు. దీనికి పెంపుదల లేదు, ఉన్నతి లేదు. సుఖం లేదు అయినా మనం దగాపడుతూనే వున్నాం మన అందాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఆ మగవాడికి దానం చేస్తున్నాం ధారపోస్తున్నాం_"
'సంధ్యా !వారించింది విశాలాక్షీ "ఆఖరిసారిగా చెబుతున్నాను నీ పెళ్ళి జరగటానికి వీల్లేదు_"
ఒక్క క్షణం జాలిగా చూసింది సంధ్య
ఆమెకి విశాలక్షీలో శాడిస్ట్ కనిపించింది. ఆమెలో ఎక్కడ లేని దయా సానుభూతీ పుట్టుకొచ్చాయి
అందుకే ఆమె నేమీ అన్లేదు
'నువ్వు పెళ్ళి చేసుకుంటే మీ నాన్న చస్తాడు_'
నిర్ఘాంతపొయింది సంధ్య
'రాత్రి నాకు కలలో స్వామి కనిపించాడు,అయిదు తలలతో పడగలు విప్పుకుని నాల్కలు చాస్తూ కనిపించాడు. స్వామి కోపంగా వున్నాడు. కోరలు కనిపించేలా బుసలు కొడుతున్నాడు.