అప్పుడిక చదువు వద్దంది విశాలాక్షి
నవ్వేశాడు విశ్వేశ్వరం. "అమ్మా! సంధ్య పుట్టుకలోనే నీ చేయి జారిపోయింది.సాంప్రదాయికమైన అమ్మవారి పేరు పెట్టలేదు. మీలాగా గుడ్డలు కట్టించలేదు, సిగ చుట్టించలేదు. బిడ్డ ముఖాన ఆ బొట్టు పెట్టించలేదు. అక్షరాభ్యాసం నాడు ఏదో మిగిలివున్న బంధం సడిలిపోయింది.
ఆంగ్ల పాఠశాలలో విద్యాభ్యాసానికి వెళ్లినరోజు అది తెగింది
ఇప్పుడిక ఏమిటి? అని తిరస్కరించాడు .
నిర్లక్ష్యం చేశాడు. లెక్కపెట్టలేదు.
ఆ రోజే కనకదుర్గకి పూనకం వచ్చింది.
ఆ పూనకంలో ఆమె 'భర్తని'తిట్టింది, కొట్టింది. ఒరే అంది, శపించింది
సంధ్య జీవితాన్ని శాసించింది. ఆమె జాతకాన్ని చదివింది ' సంధ్యకి పెళ్లి వద్దంది.
అయినా విశ్వేశ్వరం లెక్కపెట్టలేదు. అతనికి పూనకం వచ్చిన కనకదుర్గ తన 'భార్య' లాగే కన్పించింది.
అందుకే "సంధ్యకి పెళ్లి వద్దంటున్నావు దుర్గా! కానీ ఆమెకి పెళ్లి కాదు అనటం లేదు నువ్వు. చూశావా! మీరిద్దరూ దేవతా ప్రతినిధులు మీకే మీ వాక్కుపై శాసనం లేదు. అధికారం లేదు" అన్నాడు
కనకదుర్గ వాదించలేదు
ఆ తర్వాత విశాలాక్షికి పూనకం రావటం లేదు
కనకదుర్గ శరీరంపై స్వామి పునేవాడు
అదే విశ్వేశ్వరానికి ఒక అలుసైంది
స్వామి ఆడపడుచుని అవహించాలి. ఇంటి కోడలిని అవహించటమేమిటి? తప్పుకదా!
దేవుడే ధర్మం తప్పితే_నే తప్పటంలో తప్పేమిటి?
అయినా కూతురి మేలు కోరటం తప్పా? అన్నాడు
రోజులు అలాగే గడిచాయి. అవి వారాలయ్యాయి. అవి నెలలూ, సంవత్సరాలుగా మారిపోయాయి. జరిగి పోయాయి.
సంధ్య బి.ఏ.పూర్తి చేసింది.
అప్పుడే ఆదిత్యని ప్రేమించింది
ఆమెని ఆదిత్య పెళ్ళి చేసుకోమని అడిగిన రోజున విశ్వేశ్వరం గారికి బాహ్యస్మృతి పోయింది. రూపంలో నిర్లక్ష్యం వచ్చింది. వేషంలో మర్పొచ్సింది భక్తి హెచ్చింది, ప్రార్ధన పెరిగింది.
ఉద్యోగం పూడింది
అదిగో! అప్పటినుంచి సంధ్య పెళ్ళి విషయం ప్రసక్తి ఎక్కడైనా సరే_ఎప్పుడైనా సరే_ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చిన సరే _కనకదుర్గకి పూనకం వస్తూంది.
ఇప్పుడు మళ్ళి అదే జరిగింది
వాకిట్లోకి వస్తూనే సంధ్య అంతా గమనించింది. బరువుగా నిట్టూర్చింది ఇంట్లో అడుగు పెట్టింది.
"నీకు పెళ్లి జరిగేందుకు వీల్లేదు" అని గట్టిగా అరిచింది . కనక దుర్గ కూతుర్ని చూడగానే.
సంధ్య జవాబివ్వలేదు .
విశ్వేశ్వరం నాగాష్టకం బిగ్గరగా చదవడం ప్రారంభించాడు. విశాలాక్షి శైత్యోపచారాలు చేయసాగింది.
4
గేటు తీసుకుని లోపలికి వచ్చేడు ఆదిత్య
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది ఎప్పటిలాగే
ఏ అలికిడీ లేదు.
అంతా ప్రళయ శాంతి!
ఆ యిల్లు ఎప్పుడూ ప్రశాంతంగానే వుంటుంది. ఉన్న ఒక్క పనిమనిషిని అరుంధతిగారు ఎన్నడూ కేకలు వెయ్యదు . ధర్మరాజుకి అలా పనిమనుషలని యాగీ చెయ్యటం బొత్తిగా గిట్టదు దానికి తోడు అరుంధతి సహజంగా జాలిగుండె
కలది.
ధర్మరాజుగారికి బుక్స్ అంటే ప్రాణం. న్యూస్ పేపర్స్ మేగజీన్స్ తర్వాత ఇంగ్లీషు నావేల్స్ అవీ ఆయన ప్రాణ స్నేహితులు. వాటికి తోడు స్ట్రాంగ్ కాఫీవుంటే చాలు ఆయనకి ఇంకేం అక్కర్లేదు.
ఆ తల్లిదండ్రుల కొడుకుగా ఆదిత్యకీ అవే లక్షణాలు అలవడ్డాయి మొదటినుంచీ అతనంతే!స్టడీబుక్స్ అవి తప్పితే ఇక లైబ్రరీ బుక్స్ లిటరేచర్, జనరల్ నాలెడ్జి, టెక్నికల్ బుక్స్ అన్నీ పరీక్షకి చదివినట్టు చదవడం అలవాటైంది.
అంచేత ఆ యిల్లు నిశ్శబ్దంగా వుంటుంది. ఎప్పుడయినా రేడియో మ్రోగితే బాలమురళి గోంతో,ఈమని విణో వినిపించాలి లేదా టేప్ రికార్డర్ అనయితే మెహిదీ హసన్ గజల్స్, ఎమ్మెస్ పాటలు, ఇంకా పూర్వకాలం నాటకాలు,సినిమాల సంగీతం_అంతే!
ఆ యిల్లు ఒక ప్రశాంతి నిలయం.
కానీ_యిప్పటి నిశ్శబ్దంలో ఏదో అపశృతి వినిపిస్తోంది
ఏమైంది ?
వడివడిగా నడిచాడు ఆదిత్య.
కొడుకుని చూడగానే అరుంధతిగారికి గుండెల్లోంచి తన్నుకొచ్చింది దుఃఖం. ఒక్కసారిగా కెరటం శిలని తాకి విరిగి విరుచుక పడ్డట్టుగా దుఃఖవీచిక విరిగింది.
'బాబూ!'అంది ఆర్తిగా
ఆ ఒక్క పిలుపు అతనికేదో చెప్పింది.
'ఏమైందమ్మా?'ఒక్క ఉదుటలో అక్కడికి వెళ్ళేడు
మంచం మీద తండ్రి స్పృహలేకుండా పడి వుండటం చూశాడు.భారంతో ఊపిరి పీల్చుకుంటున్నారాయన ...ఎంత విషాదకర దృశ్యం
తండ్రి చేతిని మెల్లిగా స్పృశించాడు. తర్వాత ఆయన ఛాతీమీద మృదువుగా నిమిరాడు. నుదుటిపై చేయివేశాడు.
'గంటైంది, ఫోన్ లో మాటాడుతూ మాటాడుతూ స్పృహతప్పిపోయారు. నేను లోపలినుంచి వచ్సిచూస్తే సోఫాలో నిస్తేజంగా పదివున్నారు కాఫియిచ్చి వెల్లోచ్చేలోగా యింత జరిగిపోయింది_'
'ఎప్పుడు?'
'సరిగ్గా ఆరు_ఆరుంబావు మధ్య!'
'సరిగ్గా ఆరు_ఆరుంబావు మధ్య'తనలో తను అనుకున్నట్టుగా అన్నాడతను..'అప్పుడే కదూ చెట్టుమీద నుంచి పాము జారిపడింది. ఏమిటిది?
తనూ సంధ్యా పెళ్ళి ప్రసక్తి అనుకుంటే యిలా జరుగుతుందేమిటి?
అక్కడ పాము కనిపించింది_
మరి ఇక్కడ?
అతని మనస్సు ఉద్వేగానికి లోనైంది."ఏం జరిగిందమ్మా? డాక్టర్ గారొచ్చి వెళ్ళారా?ఏం చెప్పారు? అడిగాడు గాబూగా'
వచ్చారు.ఇంజక్షన్ యిచ్చారు.. స్పృహ రేపు వస్తుందట. రాత్రంతా జాగ్రత్తగా వుండాలన్నారు. మీ నాన్నగారు ఏదో 'విషాన్ని'వాసన చూసి వుండాలని అనుమానించారు డాక్టర్...'