Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 6


    సాయంకాలం కిరణాలకి ఇంటి ముంగిలి ఎర్రబడి, బంతిపూల రాసులతో కలిసి పసుపూ పారాణీ అద్దినట్లుంది.
    
    ఆకుల మధ్య నుండి సూదుల్లా పొడుస్తున్న కిరణాలకి జడిసి వసారాలో మంచాన్ని ఇంకా అవతలకి లాక్కుని పడుకుంది తాయారమ్మ.
    
    బావి పళ్ళెం దగ్గర కూర్చుని అంట్లు తోముకున్న పనిమనిషి నరసమ్మ,  మల్లెపందిరి కింద కూర్చుని పూలు కడుతున్న శాంతతో.
    
    "ఈ ఏడు చిన్నమ్మకి పెళ్ళి చేసెయ్యాలమ్మా! ఇంటికి పెళ్ళి కళచ్చేసింది!" అంది.
    
    "వాళ్ళ చిన్నాన్నకి అదింకా పసిపిల్లే! పెళ్ళి మాటెత్తితేనే తన గుండెకాయ నెవరో దొంగిలించుకుపోయినట్లు మొహం పెట్టేస్తున్నారు!" కాస్త నిష్టూరం, దాన్ని మించిన అభిమానం కలిపి అంది శాంత.
    
    రాత్రి వంటకి కూరలు తరుగుతున్న సూరమ్మ "ఇదేం చోద్యమమ్మా! ఈడేరి ఐదేళ్ళయింది. ఆడపిల్లవాళ్ళు అడగాల్సింది పోయి, మగపిల్లాడి తరపువాళ్ళు వచ్చి అడిగినా ఉలకరూ పలకరూ ఈ ఇంటి మగాళ్ళు!" అంది.
    
    బియ్యం కడుగునీళ్ళు కరివేపాకు చెట్టు మొదలులో పొయ్యడానికి వచ్చిన పార్వతమ్మ "మీ తమ్ముడితో వీలైనప్పుడల్లా చెప్తూనే ఉన్నాను వదినా! గంగరాజు గారి సంబంధం మాటెత్తితేనే మండి పడుతున్నారు!" అంది.
    
    "ఇంటికి పెద్దకొడుకు... రెండొందల ఎకరాల కొబ్బరితోటుంది. ఏం తక్కువట ఆ కుర్రాడికి?" నోటిమీద వేలేసుకుంటూ అడిగింది సూరమ్మ.
    
    "ఆయన మనసులో ఏం ఉందో తెలుసుకోవడం ఎవరి వల్ల అయ్యేనూ?" నిస్పృహగా అంది పార్వతమ్మ.
    
    "ఒకేళ .... అయ్యగారికి మేనల్లుడికిచ్చి చేసి ఇల్లరికం ఉంచుకోవాలని గానీ ఉందేమోనమ్మా!" పాయింటు పట్టేసిన లాయర్ లా హుషారుగా అంది నరసమ్మ.
    
    ఆ మాటలకి అందరూ మ్రాన్పడిపోయినట్లయి మాటలాపేశారు.
    
    శాంత తల వంచుకుని, "అక్కా! మరువం, కనకాంబరాలూ కలిపి కదంబం కట్టనా! ఉట్టి మల్లెపూలే కట్టనా" అని అడిగింది.
    
    సూరమ్మ ముందుకన్నా వేగంగా కూరలు తరగసాగింది.
    
    పార్వతమ్మ అన్యమనస్కంగా తల ఊపి "కదంబమే కట్టు!" అని లోపలికి వెళ్ళిపోతుండగా, మంచంమీద పడుకున్న తాయారమ్మ లేచి కూర్చుంటూ అడిగింది.
    
    నరసమ్మలాగే నలుగురూ అనుకుంటారు రేపు! ఇంట్లో మేనరికం పెట్టుకుని బయట సంబంధం చూడటమేమిటి? గణపతికేం తక్కువా?" అని కోడల్ని నిలదీసింది.
    
    అప్పుడే వచ్చిన సన్యాసిరావు ఆ చివరిమాటకి "అదేం మాట అత్తా! మల్లికీ, పుల్లికీ పొత్తుకుదురుతుందా?" అన్నాడు చేతులు తిప్పుతూ.
    
    "నువ్వూ చెప్పొచ్చేవాడివయ్యావా? నా మానవడేం నీలా ఆడంగిరేకుల వెధవ కాదు! ఇస్త్రీ పట్లాం, చొక్కా తొడుగుకొని వెళ్తూ ఉంటె నవాబులా ఉంటాడు!" అంది కోపంగా తాయారమ్మ.
    
    "గణపతికి తక్కువని కాదు, అత్తయ్యా! కానీ ఒకింట్లో కలిసి పెరిగారు ఇద్దరూ.... అందుకని!" అంటూ అత్తగారికి ఎదురుచెప్పలేక నాన్చింది పార్వతమ్మ.
    
    "అసలు నీకే ఇష్టం లేనట్లుందే చూడబోతే....!" అని మండిపడుతున్న తాయారమ్మ "అమ్మా!" అన్న సూరమ్మ కేకకి ఆగిపోయింది.
    
    "నా మేనకోడలు పుత్తడిబొమ్మ....! దానికోసం ఏ రాజకుమారుడో పుట్టే ఉన్నాడు కానీ, పుట్టకలేడు! చదువుసంధ్యలూ, బుద్దినిలకడ లేక గాలివాటుగా తిరిగేవాడు నా కన్నకొడుకైనా సరే, దాన్ని ఇచ్చి చెయ్యమనడానికి నాకు నోరు రాదు! నీకీ పాడుబుద్దెట్లా పుట్టిందో నాకు అర్ధం కావడం లేదు..... ఛ!" అంటూ ఈసడించి సూరమ్మ లోపలికి వెళ్ళిపోయింది.
    
    "కన్నతల్లే ఇట్లా అంటే వాడి బతుకేం కావాలి"?" సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ ముడుచుకుని పడుకుంది తాయారమ్మ.
    
    పెద్దవాళ్ళ గొడవల్లో చచ్చినా తల దూర్చకూడదని నోరు మూసుకుని గబగబా అంట్లు తోమసాగింది నరసమ్మ.
    
    శాంత మాత్రం అక్కగారి వెనకాలే వంటింట్లోకి నడిచి, "రాధకి ఈ ఏడు పెళ్ళి చెయ్యాల్సిందే అక్కా!" అంది.
    
    పార్వతమ్మ గంభీరంగా కుతకుతలాడుతున్న అత్తెసరుకేసి చూస్తూ ఉండిపోయింది.
    
    "గంగరాజు గారబ్బాయి ముకుందానికి ఇస్తే బానే ఉంటుంది. పిల్ల కళ్ళముందు తిరుగుతూంటుంది. బావగారితో ఈ విషయం నువ్వు కదపకపోతే, ఈ వేళ నేనే మాట్లాడేస్తాను!" కాస్త గట్టిగా అంది శాంత.
    
    "బావగారి మనసులో ఏదో దాచుకుని తిరుగుతున్నారు. అదేమిటో బయటపడటంలేదు!" అన్నాడు పీట వాల్చుకుని కూర్చుంటూ సన్యాసిరావు.
    
    "అదేమిటో ఈరోజు అడిగేస్తాను!" పైట చెంగుతో మొహం తుడుచుకుని చెప్పింది పార్వతమ్మ.
    
    "మీరెవరూ మాట్లాడకపోతే నే మాట్లాడతాను. ఇంటికి పెద్దని వాడు నాకంటే చిన్నేగా!" అంది సూరమ్మ.
    
    "ఔను... ఔను.....!" అనుకున్నారంతా.
    
                                                            * * *
    
    ఆకాశంలోని చుక్కలన్నీ రాలిపడినట్లుగా ఉంది కలువలతో నిండిన కోనేరు మంద్రంగా కదులుతున్న గాలిలో అలలు అలలుగా వినిపిస్తున్నాయి చిరుగంటల మోతలు.
    
    ఎవరో ఇల్లాలు సంతానం కోసం కాబోలు అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. నువ్వుల నూనె, కొబ్బరి నీళ్ళూ, అగరవత్తుల ధూపంతో ఆ ప్రాంగణమంతా అదోలాంటి సువాసన వేస్తోంది. నైవేద్యం వేళయినట్లుంది తెరమాటు నుండి నెయ్యితో చేసిన చక్కెరపొంగలి వాసన ఘుమ్మని కొడుతోంది. నివేదన చేస్తున్న గుర్తుగా మధ్యమధ్యలో పూజారి గంట మోగిస్తున్నాడు.
    
    ధ్వజస్తంభం మీద వరుసగా వాలిన పావురాలు పేరంటానికొచ్చిన ముత్తయిదువుల్లా ఉన్నాయి.
    
    అటూ ఇటూ వింజామరలు వీస్తున్న భక్తుల్లా ఒద్దిగా ఉన్నాయి దేవగన్నేరూ, నాగమల్లీ, పొగడ, పారిజాతం వృక్షాలు.
    
    వీపుకున్న ఎయిర్ బాగ్ తీసి మండపంలో ఓ పక్కగా పెట్టి నూతి దగ్గర కాళ్ళు కడుక్కొచ్చాడు మాధవ్.    
    
    'ఎవడవురా నువ్వు?' అన్నట్లు పళ్ళన్నీ బయటపెట్టి కిచకిచలాడింది నిద్రగన్నేరు చెట్టుమీదున్న కోతి.
    
    'కౌసల్యా సుప్రజా రామ ... పూర్వాసంధ్యా ప్రవర్తతే ...!' చిన్నప్పుడు నేర్చుకున్న స్తోత్రాన్ని గుర్తుతెచ్చుకో ప్రయత్నిస్తుండగా...

 Previous Page Next Page