Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 5


    "సరే కానీ, ముందు భోంచెయ్యి" అంది యశోద.
    
    ఫోన్ రింగ్ అవడంతో వెళ్ళి కార్డ్ లెస్ తీసుకుని "హలో.... ఇందిరా! ఔను, బాబొచ్చాడు. సాయంత్రం రమ్మని నేనే పిలుద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే చేశావు. వచ్చేటప్పుడు స్మితని కూడా తీసుకురా..... ఇదిగో ఇస్తున్నాను మీ అల్లుడితో మాట్లాడు" అంటూ యశోద మాధవ్ చేతికి ఇస్తూ "జగన్నాధరావుగారి భార్య....ఇందిరా ఆంటీ! మాట్లాడు" అంది.
    
    ఆ పేరువిని కేశవరావుకూడా ఉత్సాహంగా చూశాడు.
    
    మాధవ్ ఎడమచేత్తో ఫోను అందుకుని "నమస్తే ఆంటీ! బాగున్నారా?" అన్నాడు. ఆ తర్వాత నవ్వుతూ "అందం, ఆనందం అనేవి మనస్సులో ఉంటాయి ఆంటీ ప్రదేశాల్లో కాదు! అమ్మకిస్తాను!" అని యశోదకి ఫోను అందించాడు.
    
    యశోద మరోసారి రమ్మని ఆహ్వానించి పెట్టేసింది.
    
    "జగన్నాధరావుగారికి సి.ఎం దగ్గర చాలా ఇన్ ఫ్లుయెన్స్ వుంది. ఆయనలాంటి పరిచయస్తులుండటం మన అదృష్టం. అసలు ఆయనికి కానీ, ఆయన భార్యకి కానీ గర్వమే లేదు!" అన్నాడు కేశవరావు.
    
    "ఆడపిల్ల తండ్రి మన దగ్గర ఎందుకు గర్వం చూపిస్తాడూ?" యశోద నవ్వుతూ అంది.
    
    కేశవరావు ఏదో అర్ధమైనట్లు ..... "అంటే వాళ్ళకి మనవాడిని అల్లుడిని చేసుకోవాలన్న ఉద్దేశం ఉందంటావా?" అన్నాడు.
    
    "అబ్బ! మీది ఒట్టి మట్టిబుర్రకాదు. నల్లరేగడి మట్టిబుర్ర! అబ్బాయి వచ్చాడని తెలీగానే భార్యను కూతురితో సహా పంపిస్తున్నాడంటే అర్ధం కావడం లేదూ!"
    
    విసుక్కుంది యశోద.
    
    "కానీ, ఆయన స్టేటస్ కి మన సంబంధం....?" అని నసిగాడు కేశవరావు.
    
    "మనవాడికేం తక్కువండీ? ఇంజనీరింగ్ చేశాడు. అందగాడు.....బుద్దిమంతుడూనూ!" సాగదీసింది యశోద.
    
    మాధవ్ లేచి వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కుంటూ చెప్పాడు. "సంబంధాలు ఇద్దరి వ్యక్తుల మనసులకి కుదరాలమ్మా....రెండు ఫ్యామిలీల స్టేటస్ లకీ, ప్రాపర్టీకి కాదు!"
    
    "నువ్వు ఓసారి స్మితని చూడు..... అప్పుడు మాట్లాడుదువుగాని!" కొడుక్కి నాప్కిన్ అందిస్తూ ధీమాగా అంది యశోద.
    
                                                         * * *
    
    స్మిత అతనికి తగిలేటంత దగ్గరగా మంచం మీద కూర్చుని ఉంది. హెన్నా చేసిన జుట్టును మాటిమాటికీ చేత్తో పాయలుగా విడదీసి సర్దుకుంటోంది.
    
    "డు యూ స్మోక్?" అడిగింది మాధవ్ ని.
    
    "నో!" అన్నాడు.
    
    "అందుకే మీ పెదవులంత యెర్రగా వున్నాయి!" ఆమె నవ్వింది.
    
    మాధవ్ కి అరచేతుల్లో చెమట్లు పట్టినట్లయి అనీజీగా కదిలాడు.
    
    కిందనుండి పెద్దవాళ్ళ నవ్వులూ, మాటలూ పెద్దగా వినిపిస్తున్నాయి.
    
    మ్యూజిక్ సిస్టమ్ లోంచి మంద్రంగా 'తుషార శీతల సరోవరానా ... అనంత నీరవ నిశీధిలోనా .... ఈ కలువ నిరీక్షణ నీ కొరకే' అని వినిపిస్తోంది.
    
    అంత దగ్గరగా కూర్చున్న ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు కూడా అతనికి అసహనాన్ని కలిగిస్తున్నాయి.
    
    'కలువమిటారవు ... కన్నులలోనా ... కళలూ ... కాంతులూ ... నీ కొరకేనా...'
    
    కళ్ళు అరమోడ్చి వింటున్న వాడల్లా పాట ఆగిపోవడంతో టక్కున కళ్ళు తెరిచాడు.
    
    "నేనే ఆఫ్ చేసేశాను. బోర్ గా లేదూ!" అంది.
    
    టైట్ గా వున్న జీన్స్ పాంట్, టీషర్టు ఆమె భారతీయ సౌందర్యాన్ని దాచలేక అవస్థపడుతున్నాయి. చేతులు వెనక్కి ఆన్చి కాళ్ళు జాపి కూర్చున్న భంగిమలో మచ్చుకయినా ఆడతనం లేదు. ఇరవై సంవత్సరాల అమ్మాయిలో ఉండాల్సిన అందం ఉంది. కానీ, ఏదో లేదు ... అదేమిటీ?
    
    "అమెరికాలో ఎవరయినా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా?" అని అడిగింది.
    
    అతను జవాబు చెప్పలేదు. చెయ్యి నోటికి అడ్డుగా పెట్టుకుని చిన్నగా దగ్గాడు.
    
    "ఎవరినయినా డేట్ చేశావా?" షేవ్ చేయించిన కనుబొమలు తమాషాగా పైకిలేపి అడిగింది.
    
    అతను లేచి బాల్కనీలోకి నడిచాడు.
    
    గాలి వీచినప్పుడల్లా కడియాల రవళుల్లా కొబ్బరాకుల సవ్వడి.... మృదువుగా వచ్చి ఒంటికి చుట్టుకునే పొన్నాగపూల పరిమళం! తను చిన్నతనంలో వదిలి వెళ్ళిన ప్రకృతి అలాగే వుంది! ఏమీ మారలేదు.
    
    స్మితకూడా చిక్లెట్ నములుతూ వచ్చి అతని పక్కనే నిలబడి "ఇండియాలో కూడా డేటింగ్ చాలా కామన్ అయిపోయింది. నువ్వు అక్కడ చెయ్యలేదంటే ఎలా నమ్మడం?" అంది.
    
    కడగంటి చూపుల్లో సిగ్గు చివురులు పూయిస్తూ.... ముసిముసి నవ్వుతో అమాయకత్వాన్ని పెదవి అంచున బిగబట్టే ఆ ముగ్ధత్వం ఏదీ?
    
    ఆ కనబడని భావాల సువాసనలు ఏవి?
    
    దానిమ్మ పూరేకువంటి ఆ చిన్నది ఏది? ఆర్చిమీదకి పాకుతున్న మాలతీలతా నిష్కల్మషంగా నవ్వే పూగుత్తుల్ని సుతారంగా కదిలిస్తోంది.
    
    ఇన్ని వేల సంవత్సరాలయినా మల్లె తన స్వచ్చతని, కోయిల తన గానంలో మాధుర్యాన్నీ.... నెమలి తన నడకలో నాట్యాన్నీ.....వెన్నెల తన వెలుగులో చల్లదనాన్నీ పోగొట్టుకోలేదు. అవి సృష్టి సహజమైన విషయాలు!
    
    మరి ప్రకృతికి మారుపేరయిన స్త్రీ .... మార్పూ, చైతన్యం పేరిట ఏం పోగొట్టుకుంటోందీ?
    
    స్మిత అతని భుజంమీద చెయ్యివేసి 'ఏమిటా ఆలోచన .... కమాన్ యార్' అని నవ్వింది.
    
    ఆనందభైరవి రవళిస్తున్న హృదయాంతరాళంలో పుటుక్కున తీగతెగిన శబ్దం!
    
    మాధవ్ ఆమె చేతిని మృదువుగా తప్పించి అక్కడనుండి కదిలాడు.
    
    అతని ఆలోచనల్లో 'ఆమె' నవనీత హృదయ .... ఉర్విపై జారిన సుధామయూరి....
    
    ఆశాపథాంతరాళ పారిజాతమ్ము! ఆమె ఎక్కడుంది?
    
    ఏ సంపెంగ గుబురుల్లోనో పాలపిట్టవోలె  దాగుంది రూపంలేని పొగమంచులా జారి, మాయలోంచి వాస్తవంలోకి మారి ఏదో ఒకనాడు దర్శనం ఇవ్వకపోదు!
    
    వరుసగా ఉన్న రైలు పెట్టెలను వెదుకుతూ వెళ్తూండగా ఏదో ఒక పెట్టెలో నుండి అమాంతం బయటపడి మిణుగురు రేణువుల్లాంటి చిరునవ్వుని ప్రసరిస్తుంది. ఆమెకోసమే అతని అన్వేషణ!
    
                                                               * * *   

 Previous Page Next Page