Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 5


    
    తనకు తెలీకుండానే....
    
    "పెళ్ళి అంటూ గింటూ జరిగితే అది అచ్చం నీలాంటివాడితోనే జరగాలి" అన్న అర్ధం ఆ ఆశ్చర్యార్దకంలో ధ్వనిస్తోందని అర్ధం చేసుకోకుండా.
    
    "అవునండీ! మన శేషు....అదే విశేష్ గాడిని మీరు పెళ్ళాడితే మహబాగా వుంటుందని మేమంతా తీర్మానించాం" అన్నాడతను.  

 

    "మేం అంటే ఎవరు?" అంది గంభీరంగా.
    
    "అదేనేమో, మా సత్రకాయలూ, కాలక్షేపం బఠానీగాళ్ళు అందరూ వుంటారుగా? మేమందరం కలిసి మీటింగ్ పెట్టాం."
    
    వింటున్న సితార ముక్కుపుటాలు కోపంతో పెద్దవయ్యాయి.
    
    "తీర్మానాన్ని ఓటింగుకి పెడితే అనుకూలంగా వెయ్యీ, వ్యతిరేకముగా ఒక్కటి ఓట్లు పడ్డాయి" అన్నాడతను వుత్సాహంగా.
    
    ఒక్కసారిగా చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చేసింది సితారకి.
    
    పట్టలేనంత ఉక్రోషం కలిగింది.
    
    ఏదో తెలియని డిసప్పాయింట్ మెంట్ ఫీలయింది తను.  

 

    అతనింకా "వాగుతూనే" వున్నాడు.
    
    "మేడమ్! మా విశేష్ పాపం మంచోడు. ఎంతో మంచోడు. అతను పుట్టడమే మంచివాడుగా పుట్టెను. పుట్టినప్పుడుకూడా అస్సలు ఏడవలేదుట. వెర్రిగొడ్డులా వుంటాడు నిజమేననుకోండి! కానీ మహా మంచోడు. నోట్లో వేలుపెడితే కొరకలేడు. నిజానికి వాడికి నోట్లో సగం పళ్ళు లేవు. చదువు, సంధ్యల గురించి మీకు భయమవసరంలేదు. అత్తెసరు మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక వుద్యోగం గురించి కూడా దిగుల్లేదు. వాళ్ళ నాన్న శవాలు మోసేవాడు. ఉద్యోగం దొరక్కపోతే వీడూ అదే పని చూసుకుంటాడు. అలా శవవాహకుడిగా నాలుగు రాళ్ళు సంపాదించి, ఆలుబిడ్డలని పోషించగలడు. మీకు అత్తమామల, ఆడబిడ్డల ఆరళ్ళు వుండవు. ఎందుకంటే వాడు అనాధ. సత్రంభోజనం మఠం నిద్రగా పెరిగాడు కాబట్టి, వాడికి కష్టసుఖాలు తెలుసు. వాడికి స్వయంపాకం వచ్చు కాబట్టి మీకు వంటలో సాయపడగలడు. కాబట్టి విశేష్ ని పెళ్ళాడి ఓ బడుగుజీవిని ఉద్దరించమని కోరుతున్నాను" అన్నాడు ఆయాసపడుతూ.
    
    ఉక్రోషంతో కళ్ళవెంబడి నీళ్ళు తిరిగాయి సితారకి.
    
    "సితారగారూ!" అన్నాడు జెయ్ చంద్ర మళ్ళీ.
    
    "మీరు కడు బీదవాళ్ళు! బీదల కష్టాలు మీకు తెలిసినంతగా మరెవరికి తెలియును. మా విశేష్ మీకంటే మరీ కడు బీదవాడు. మీ మొగుడు కావడానికి మరి వాడికి అంతకంటే క్వాలిఫికేషన్ యింకేం కావాలీ! వాడు బావుండడు. నిజమే! అట్టే తెలివైనవాడుకాడు. అదీ నిజమే! వాడిని మీరు చేసుకుంటే అదే అసలైన అభ్యుదయ వివాహం అవుతుంది. అవునంటారా? కాదంటారా?" అన్నాడు.
    
    ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చిపోయినట్లు అనిపించింది సితారకి.
    
    ఉక్రోషంతో ఊగిపోతూ మళ్ళీ గిరుక్కున వెనక్కి తిరుగుతున్నప్పుడు గబుక్కున అర్ధం అయ్యింది ఆమెకి.
    
    జెయ్ చంద్ర తనని పెళ్ళి చేసుకోమని అడగనందుకు ఎంత డిసప్పాయింట్ మెంటు ఫీలవుతోంది తను. తనే!
    
    మళ్ళీ అంతలోనే అనిపించింది.
    
    తనకెందుకు డిసప్పాయింటుమెంట్? వాడెవడు? తనెవరు?
    
    అసలు వాడు తనని పెళ్ళి చేసుకోవటమేమిటీ?
    
    వాడు పెళ్ళి చేసుకోమని అడగనంత మాత్రాన తనకీ దుఃఖమేమిటీ?
    
    బ్బెబ్బెబ్బె! ఇదేం బాలేదు.
    
    బొత్తిగా అర్ధం పర్ధంలేని వ్యవహారంలాంటిది ఇది. ఆ అమ్మడికి అది బొత్తిగా అర్ధం పర్ధంలేని వ్యవహారంలా కనబడినా, కానీ దానిఅర్ధం మాత్రం ఆ వెనకనే ఆగిపోయిన జెయ్ చంద్రకి బాగా తెలుసు.
    
    అతను సైకాలజీలో ఎక్స్ పర్టు!
    
    అందుకే గదా స్టూడెంట్ లీడరయ్యాడు మరి.
    
    కాలేజీలో అందరూ అతని వెనకేపడతారు.
    
    అందులోనూ ముఖ్యంగా ఆడపిల్లలు.
    
    బహుశా వాళ్ళు తనవెనక పడుతుండడం వల్లే తనకి వాళ్ళంతే గ్లామరు లేదేమో! అని ఓ ప్లాష్ లా మెరిసింది జెయ్ చంద్ర బుర్రలో.    

 

    సరే! మరి ఇదే రీజనింగు ఈ సితార వ్యవహారంలోకూడా అప్లయి చేసి చూస్తే-
    
    తన వెనక పడకపోవడం వల్లే తనకి ఈ సితార ఉరఫ్ సీతారామలక్ష్మి అంటే యింత గ్లామరు కలిగిందేమో! అయి వుండనోపు గదా!    
    
    అదే రీజనింగుని తెగేదాకా సాగదీస్తే -
    
    తను వెనకబడుతున్నాడనే ఈ పిల్లకు తనంటే తగని నిర్లక్ష్యం ఏర్పడి పోయిందేమో కూడా.
    
    అది చాలనట్లు తను దుష్టుడనీ, దుర్మార్గుడనీ, దుర్మతిఅనీ, దుశ్శాసనుడనీ, ఖలుడనీ బోల్డెంత రాంగ్ ఇంప్రెషను కూడా!
    
    అందుకనే తను యివాళ ఈ సైకోబాంబుని ఢామ్మని పేల్చేశాడు.
    
    సైకోబాంబే! ఆటంబాంబుకి బాబు లాంటిది సైకో బాంబ్!
    
    తను వెనకబడి వస్తూంటే తనేదో ప్రేమ డైలాగులు వల్లిస్తాడని ఎదురు చూసింది ఈ పిల్ల.
    
    ప్రేమ డైలాగులు పేల్చగానే, తన చెంప చెళ్ళుమనిపిద్దామని ఉబలాట పడిందేమో కూడా! అయ్యే వుంటుంది. కిశోర్ కుమార్ ఏమన్నాడూ? "జవానిహూ యా బుఢియా నన్నీసీ గుడియా, కుభ్ బీ హూ ఔరత్ జహార్ కీ పుడియా" అన్లేదూ? అంటే దాని టీకా తాత్పర్యం ఏంటి? పడుచుపిల్లగానీ, ముసిలి పీనుగగానీ, పసిపాపగానీ ఆడదంటేనే విషపు మాత్రలాంటిది అని.
    
    వద్దులే! సితారని అంత ఘోరంగా ఊహించుకోలేడు తను.
    
    అసలు సితార ఆడది కాదండీ!
    
    అసలు సిసలైన దేవత.
    
    "మరి దేవతల్లో ఆడాళ్ళు వుండరా? వాళ్ళకి ఆడబుద్ది వుండదా? వాళ్ళు మాత్రం విషపు గుళికలుకారా?" అని ప్రశ్నలు గుప్పించేస్తే అది వేరే సంగతి.
    
    ఏదైతేనేం? ఈమెగారు తన చెంప పగలగొడదామనుకుంది. కుక్కకాటుకి చెప్పుదెబ్బలా తను ముందే రివర్స్ లో వెళ్ళిపోయి ఆమె గుండె బేజారయి జారిపోయేట్లు చేశాడు.
    
    శేషుగాడితో సితారకి పెళ్ళి.
    
    కాకి ముక్కుకి దొండపండూ -
    
    వగైరా సామెతలన్నీ కట్టగట్టుకు గుర్తొచ్చెయ్యడంలేదూ-
    
    హ్హె హ్హె హ్హె హ్హె!!!
    
    సితారకి కరెక్ట్ మొగుడు తనే!
    
    తనకి తగిన జోడీ సితార. తన కోసమే సితార పుట్టింది.

 Previous Page Next Page