Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 4

 

    ఇక ఇప్పుడు జరగబోయే సీనేమిటో తనకి తెలుసు.
    
    ముందుగా...
    
    గొంతు సవరించుకుంటాడతను.
    
    (ఆమె అలా అనుకోగానే.....నిజంగానే జెయ్ చందర్ గొంతు సవరించుకున్నాడు.)
    
    "ఏవండీ!" అంటాడు.
    
    (నిజంగానే "ఏవండీ!" అన్నాడతను).
    
    అతని గొంతు వణుకుతుంటుంది.
    
    (సత్యప్రమాణంగా జెయ్ చంద్ర గొంతు వణికిపోతూనే వుంది.)
    
    "మీతో ఓ విషయం మాట్లాడాలి" అంటాడు.
    
    (మీతో ఓ విషయం మాట్లాడాలి!" అన్నాడు జెయ్ చంద్ర.)
    
    "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అన్నాడు జెయ్ చంద్ర.)
    
    వెంటనే ఒంగి, ఎడం కాలికున్న చెప్పుతీసింది సితార. చెప్పుతెగేటట్లు అతని చెంపమీద కొడదామనుకుందిగానీ అప్పటికే తెగిపోయింది చెప్పు! ఖర్మ!
    
    అయినా తెగిన చెప్పుతోనే సాహసంగా అతని చెంపమీద శక్తికొద్దీ కొట్టింది.
    
    "అయ్ బాబోయ్!" అని అరిచాడతను.
    
    అప్పుడు స్పృహలోకి వచ్చింది సితార.
    
    ఇంతా చేస్తే ఇదంతా కేవలం తన వూహే!
    
    అతగాడు ఇంకా తనకేసేవస్తూండడం మాత్రమే నిజం.
    
    ఈ మాటలూ, తను కొట్టడం అంతా తన విష్ ఫుల్ థింకింగ్ అన్నమాట.
    
    విష్ ఫుల్ థింకింగేవిట్లే!
    
    ఇప్పుడో, ఇంకో క్షణంలోనో అతగాడు లవ్ టాక్ మొదలెడ్తాడు. అది తనకి ఒకటో ఎక్కం అంత బాగా తెలుసు.
    
    తను తక్షణం అతని చెంప పగలగొడుతుంది.
    
    ఆమె అలా ఊహించుకుంటూ వుండగానే...
    
    "ఏవండీ!" అన్నాడు జెయ్ చంద్ర మర్యాదంతా ఆ మూడక్షరాల్లో గుప్పించేస్తూ.
    
    ఒక చేతిని ఇంకో చేత్తో గిల్లి చూసుకుంది సితార.
    
    అబ్బే! ఈసారి ఊహకాదు! నిజమే!  

 

    అతని పిలుపు విని కూడా ఉలుకూ, పలుకూ లేకుండా ఊరుకుంది సితార.
    
    "మిమ్మల్నే!" అన్నాడతను మళ్ళీ.    
    
    సమాధానం చెప్పకుండా నడకవేగం మాత్రం ఎక్కువ చేసింది సితార.  

 

    "ఏవండోయ్!?"
    
    ఠక్కున ఆగిపోయింది సితార.
    
    గిరుక్కున వెనక్కి తిరిగింది.
    
    వీడికి మూడిందివాళ తన చేతిలో నిజంగానే.
    
    ఇలా ఒంటరిగా ఎప్పుడు దొరుకుతానా, విరహవేదన వెళ్ళగక్కేద్దామా అని చూస్తున్నట్లున్నాడు.....యిన్నాళ్ళనుంచీ.
    
    చెప్పుతెగుతుందివాళ! చూపిస్తుంది తన తడాఖా! తప్పదు. వీడికి డబ్బుంటే ఎవడిక్కావాలి?
    
    వీళ్ళమ్మ డాక్టరయితే ఎవడికి గొప్ప?
    
    వాళ్ళ గొప్పలు వాళ్ళ దగ్గరే వుంచుకొమ్మను.    

 

    "మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నాడు జెయ్ చంద్ర ఉరఫ్ ఆలీబాబా ఉరఫ్ దేశద్రోహి పేట్రేగిపోతూ.
    
    నిప్పులు కక్కుతూ చూసింది సితార.
    
    ఇంక అతను పలకబోయే తరువాయి వాక్యం ఏమిటో తెలుసు తనకి.
    
    అయితే అది కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా?
    
    అందులో ఎన్నెన్ని విశేషణాలుంటాయి, ఎన్ని వ్యాకరణ దోషాలుంటాయి, తన జెడ గురించి ఎంత వర్ణన వుంటుందీ, డబుల్ మీనింగ్ తో ఎంత వల్గారిటీ వుంటుందీ అన్నదే సరిగ్గా తెలీదు.
    
    జెయ్ చంద్ర చెప్పడం మొదలెట్టాడు.
    
    కోపంతో ఊపిరి పీల్చడం మర్చిపోయి వింటోంది సితార.
    
    "మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి!" అన్నాడు మళ్ళీ జెయ్ చంద్ర.
    
    అరిగిపోయిన రికార్డులాగా ఏంటీ?
    
    విషయంలోకి వచ్చేయరాదూ?
    
    రారా!
    
    నీ పని పడతా! అనుకుంటోంది సితార.
    
    "మీతో అర్జెంటుగా మాట్లాడాలి! చాలా చాలా ముఖ్యమైన విషయం అది" అన్నాడతను.
    
    గిరుక్కున వెనక్కి తిరిగి చురుగ్గా అతని మొహంలోకి చూసింది సితార.
    
    అప్రయత్నంగానే ఆమెకనిపించింది.....అందగాడేలే!
    
    అయినా సరే!
    
    అతని మొహం అప్పచ్చి మొహంలా కనబడుతోంది తనకి.
    
    లేకపోతే ఆవడలా కనబడుతుంది.
    
    (అని తనని తను భ్రమ పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది సితార)
    
    అతను సినిమాటిక్ గా గొంతు సవరించుకున్నాడు.
    
    "నేను చెప్పబోయేది ఎంత ముఖ్యమైన విషయమంటే, అది ఓ రెండు జీవితాలకు సంబంధించిన సమస్య!" 

   

    అబ్బ! అపర శరత్ బాబు డైలాగులు.
    
    శరత్ బాబంటే సినిమా శరత్ బాబుకాదు.
    
    అసలు సిసలయిన బెంగాలీ శరత్ బాబు.....రచయిత!
    
    తనకిష్టం! ఎంతో యిష్టం!
    
    "అదేనండీ! పెళ్ళి విషయం" అన్నాడతను.
    
    తన ఊహ కరెక్టయినందుకు కలిగిన సంతోషాన్ని ఆపుకుంటూ,  వంగబోయింది సితార.
    
    ఎందుకూ? చెప్పు అందుకోవడానికి!    
    
    అంతలోనే ఠకీమని అన్నాడతను -
    
    "కుమారి సీతారామలక్ష్మిగారూ! మీరు మా విశేష్ ని పెళ్ళి చేసుకుంటే బావుంటుందని నా వుద్దేశ్యం?"
    
    ఢామ్మని ఆటంబాంబొకటి తన నెత్తిమీదే పేలినట్లుంది సితారకి.
    
    "ఏమిటీ?! పెళ్ళా? ఆ శేషుగాన్నా?" అంది.   

 Previous Page Next Page