Previous Page Next Page 
మొగలిబాకు పేజి 5

  

    "ఎంతయిందేమిటి?" ఆసక్తిగా, ఆత్రుతగా అడిగాడు జాలినాయుడు.
   
    "ఎంత....జస్ట్ ట్వంటీఫైవ్ లాక్స్.....అంటే.....ఇరవై అయిదు లక్షలు" చెప్పాడు హనుమాన్లు.
   
    "అనూ అగర్వాల్, పూజా బేడీ.....మమతాకర్ణభేరి ఎవరువాళ్ళు?" అమాయకంగా అడిగాడు జాలినాయుడు.
   
    "కేడీలూ, కర్ణభేరీలు కాదండీ బాబూ.....వాళ్ళు ప్రస్తుతం లీడింగ్ హిందీ సినిమా ఫీల్డ్  హీరోయిన్లు"
   
    "అవసరమయితే.....మీరు మనక్కూడా ముత్తయిదువుల్ని తీసుకురాగలరా" ఆనందమిళితమైన గొంతుతో అడిగాడు జాలినాయుడు.
   
    "మన నేటివిటీకి దగ్గరగా వుండే తెలుగువాళ్ళయితే మీకు సరిపోతుంది" అన్నాడు హనుమాన్లు.
   
    "తెలుగు సినిమాలో ముత్తయిదువులు ఎవరున్నారు?" ఎక్సయిటింగ్ గా అడిగాడు జాలినాయుడు.
   
    "డిస్కోశాంతి, జయలలిత.....ఇంకా పాకీజా"
   
    "వాళ్ళకు కబురెట్టి రెడీగా వుండమనండి అబ్బాయ్. ఇప్పుడు చెడగొట్టే కార్యక్రమానికి వాళ్లెందుగ్గానీ ......మనింట్లో జరిగే ఫంక్షన్ కి వాళ్ళని పిలుద్దారి....ఏమంటావ్" చురుగ్గా నారాయణరావు వేపు చూస్తూ అన్నాడు జాలినాయుడు. సినిమా యాక్టర్ల పేర్లు వినగానే అతని ఒళ్లంతా అరముగ్గిన సీతాఫలపండులా అయిపోయింది.
   
    "అలాగే....మన కాంట్రాక్ట్ ఓ.కే. కావాలంటే మిస్ వీనియన్స్ ఎక్స్ పెండేచర్ లో సగం అడ్వాన్స్ గా కొట్టించండి....స్పష్టంగా మీ ఎడ్రస్ చెప్పండి" హనుమాన్లు ఆనందాతిశయంతో అన్నాడు.
   
    జాలినాయుడు ఒక జేబులోంచి నోట్లకట్టా, రెండో జేబులోంచి చిల్లర మూటా తీసి రెండువేల రూపాయల కాగితాల్ని మొదట నారాయణరావు చేతిలోపెట్టి చిల్లరని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.
   
    "పదిపైసలు, ఇరవయ్ అయిదు పైసలూ కలిపితే, ముప్పైఐదు పైసలు.....తర్వాత లక్షరూపాయలు ....అంటే ఎనిమిది అణాలు....." నెమ్మదిగా తన పద్దతిలో లెక్క పెట్టసాగాడు జాలినాయుడు.
   
    "గురూ.....మనమేదయినా సినిమాకెళ్ళి సినిమా చూసేస్తే కాస్త మంచిదేమో" అసహణంగా అన్నాడు.
   
    హనుమాన్లు దానికి జవాబు చెప్పకుండా చిల్లరను లెక్కపెడుతున్న జాలినాయుడువేపు భావంలేని చూపుల్తో చూస్తున్నాడు నారాయణ రావు.
   
    రెండుగంటలు గడిచాయి.
   
    జాలినాయుడు వంటినిండా చెమటలు పట్టేసాయి.
   
    ఆఖరికి మూడువేల రూపాయల చిల్లరను నారాయణరావు చేతిలో పెట్టి.....
   
    "పనిలా చేస్తావో చూస్తాను....." అన్నాడు.
   
    ఆ సమయంలో అతను నవ్వాడు. దుబ్బుమీసాల కారణంగా ఆ నవ్వు కనిపించలేదు.
   
    "పనిచేసాక అడగండి.....డోంట్ వర్రీ" లేచి నిలబడిన జాలినాయుడితో చెప్పాడు నారాయణరావు.
   
    జాలినాయుడు బయటికెళ్ళాడు.
   
    అక్కడ ఒక్క బ్లాక్ అంబాసిడర్ కారు తప్ప మిగతా వైట్ అంబాసిడర్ కార్లేవీ లేకపోవడంతో-
   
    "ఒరేయ్.....కార్లేవిరా....నా వెనకొచ్చిన మనుషులేర్రా...." అని గావుకేక పెట్టాడతను.
   
    "కుక్కలకు భయపడి అందరూ కార్లను తీసుకుని పారిపోయేరు. నేను ప్రాణాలు దక్కించుకోడానికి చెట్లెక్కాను"
   
    రోడ్డుమీదున్న చెట్టెక్కి కుక్కల బారినుంచి ప్రాణాలు కాపాడుకున్న బ్లాక్ అంబాసిడర్ కారు డ్రయివర్ అన్నాడు.
   
    ఆఖరుకు నారాయణరావు, హనుమాన్లు కర్రలు పట్టుకొని నిలుచోగా జాలినాయుడు, డ్రయివరొచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. మరో రెండు నిమిషాల తర్వాత కారు అక్కడనుంచి మాయం అయిపోయింది.
   
    ఆ కారలా వెళ్ళగానే......
   
    నాణాల సంచీని తప్ప, మిగతా డబ్బుని హనుమాన్లు చేతిలో పెట్టి.....
   
    "నువ్వర్జంట్ గా ఆఫీస్ స్టాఫ్ కి జీతాలిచ్చెయ్....అలాగే ఆఫీసు రెంట్ ఇచ్చెయ్....వెళ్ళిపో__తర్వాత నేను ఠీవిగా వస్తాను" ప్రొప్రయిటర్ ఫోజుతో చెప్పాడు.
   
    "ఎస్.....బాస్.....ముందు నా జీతం తీసుకుంటాను పూర్తిగా.....మిగతాది వాళ్ళకిస్తాను. అద్సరే ......ఇక్కడ ఇంటద్దె ఇవ్వాలనుకుంటాను" అడిగాడతను.
   
    "నువ్వెళ్ళు ముందు.....ఇక్కడింటద్దె__ఇప్పుడు మనం ఇవ్వం"
   
    హనుమాన్లు సైకిలు తీసుకొని ఎక్కాడు. గబుక్కున పక్కకు తిరిగి రూమ్ లోకి వెళ్ళబోయిన నారాయణరావు......
   
    "దా....నాన్నా.....ఇలాదా నాన్నా" అని ముద్దుగా పిలుస్తున్న హౌస్ వానరుడివేపు నవ్వలేక, ఏడ్వలేక చూశాడు.
   
    "చూడు నారాయణమ్.....నువ్విప్పుడు చచ్చినా అబద్దాలాడలేవు కదూ....."
   
    గబగబా ముందుకొచ్చి ఆ చిల్లర సంచిని లాక్కుని గబుక్కున మూడో పోర్షన్ లోకి పరుగెత్తాడు హౌస్ వానర్.
   
    కసికసిగా, బయటకు వినపడకుండా, బండబూతులన్నీ తిట్టుకొని నీరసంగా రూమ్ లోకి ప్రవేశించి, విషాదంగా బోర్లాపడిపోయాడు నారాయణరావు.
   
    అప్పుడు సరిగ్గా సమయం ఉదయం పదిన్నర దాటింది.
   
                                               *    *    *
   

    ఉదయం సరిగ్గా పది నలభై నిమిషాలు.
   
    విశాఖపట్నం సిటీ మధ్యలోనున్న జగదాంబా ధియేటర్ మార్నింగ్ షోకి ఇంకా ఇరవయ్ నిమిషాల టైముంది.
   
    టిక్కెట్ కౌంటర్ ల ముందు క్యూలు చాంతాడంతేసి వున్నాయి.
   
    అదొక హిందీ సినిమా గత అరవయ్ రోజులుగా నాల్గు షోలూ హౌస్ ఫుల్ అవుతూ....హిట్ అయిన సినిమా.
   
    ఆ సినిమాను మొదట తమిళంలో తీయగా, దానిని ఆ తర్వాత తెలుగులో తీసారు. అలా తీసి పదేళ్ళయిన తర్వాత సదరు తెలుగు సినిమాని మళయాళంలో తీయగా అక్కడనుంచి హిందీలోకి వెళ్ళిందది.....
   
    సినిమా థియేటర్ లోకి వెళ్ళి ఫస్ట్ సీన్ చూస్తేగానీ జనాలకు ఆ సినిమా గురించి తెలీదు-అలా ఆ సినిమా సూపర్, డూపర్ సక్సెస్ అయిపోయింది.
   
    బాల్కనీ, లేడీస్ కౌంటర్ దగ్గరున్న పొడవైన క్యూలో ఆ చివర గంటసేపట్నించీ నుంచున్న నలుగురమ్మాయిలూ చెమటతో తడిసిపోయారు.
   
    "ఇవ్వాళ మనకు టిక్కెట్లు దొరకవు" ఒకమ్మాయి కామెంట్ చేసింది.
   
    "అయితే వెళ్ళిపోదామా?" ఇంకొకమ్మాయి అంది.
   
    "ఇంతకీ మన సంధ్య ఏదీ?" ఇంకొకమ్మాయి తన ముందున్న లేడీస్ వేపు చూస్తూ అంది.
   
    "అవును.....ఏదీ.....? ఇప్పటివరకూ నీముందే వుండాలికదా....."
   
    కంగారుగా ఆ అమ్మాయి నలువేపులా చూసింది.
   
    సరిగ్గా......
   
    అదే సమయంలో గేట్లోంచి సర్రున ఓ రెడ్ కలర్ మారుతీ కారు దూసుకొచ్చింది. డ్రయివింగ్ సీట్ లో అందమయిన కాలేజీ కుర్రాడు వున్నాడు.

 Previous Page Next Page