ఆ పక్కన ఆకుపచ్చని చీరలో గ్రీన్ సలాడ్ లా మెరిసిపోతూ ఓ అమ్మాయి.
ఆ అమ్మాయి పేరే సంధ్య. కారు ఆగగానే డోర్ తెరుచుకొని ఆ కుర్రాడికి గబగబా థాంక్స్ చెప్పీసి థియేటర్ మెయిన్ గ్లాస్ డోర్ వేపు వెళ్ళింది.
"ఐ వాంట్ టు మీట్ థియేటర్ మేనేజర్" అలా అడుగుతున్న ఆ అమ్మాయివేపు కళ్ళప్పగించి చూస్తూ......
"లోపాలున్నారమ్మా.....వెళ్ళండి" వినయంగా చెప్పి దారిచ్చాడు గేట్ కీపర్.
ఠీవీగా లోనకెళ్ళి మేనేజర్ రూమ్ లోకి అడుగుపెట్టింది సంధ్య.
"వాట్ డు యూ వాంట్ మేడమ్?" అతని కళ్ళలోకి చూసి, ఎర్రటి పెదవుల్తో తియ్యగా నవ్వి......
"మీకు మా బ్రదర్ ఫోన్ చేసాడనుకుంటాను"
"మీ బ్రదరా.....దేనికీ.....టిక్కెట్లకోసం.....అవునా.....టూ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గారు.....మీ బ్రదరా?" మాట్లాడకుండా మళ్ళీ నవ్విందామె.
"సి.ఐ.గారు ఫామిలీతో వస్తానన్నారు.....అయిదు టిక్కెట్లు....." నసిగాడు మేనేజర్ తన జేబులోంచి టిక్కెట్లను బయటకు తీస్తూ.
"మా బ్రదర్, సిస్టర్ ఇన్ లావాళ్ళు వచ్చేసరికి కొంచెం లేటవుతుందన్న మాట.....అందుకని...."
అతని చేతిలోని టిక్కెట్లను లాక్కున్నట్టుగా తీసుకుని "థాంక్యూ సర్" అని వెనుతిరిగిందామె.
"మరి డబ్బులో...." గబుక్కున సీట్లోంచి లేచాడు మేనేజర్.
"మా బ్రదర్ ఇచ్చేస్తాడు లేవయా.....అయినా నీ పిచ్చిగాని.....పిచ్చిమేనేజరు.....పోలీసు లెక్కడన్నా - దేనికన్నా డబ్బులిస్తారా? దేశం మొత్తం మీద.....ఇస్తారని పందెం కడతావా?" గబ గబా బయటి కెళ్ళింది సంధ్య.
టిక్కెట్లతో బయటికొస్తున్న సంధ్యవేపుచూసి క్యూలో నుంచున్న అమ్మాయిలూ బయటికొచ్చేసారు.
"నువ్వు సడన్ గా మాయమైపోవడంతో - ఎంత కంగారు పడ్డామో తెలుసా?" ఒక అమ్మాయి అంది.
"ఇంకా ఫైవ్ మినిట్స్ వుంది.....గబగబా కూల్ డ్రింక్స్ తాగేస్తూ టికెట్స్ సంపాదించిన విధమును చెప్పెదను గాక....పదండి...." కొంచెం దూరంలో ఉన్న కూల్ డ్రింక్ షాపు వేపు నడుస్తూ అంది సంధ్య.
అయిదుగురూ కూల్ డ్రింక్స్ తాగుతుండగా, సంధ్య అసలు కహానీ చెప్పింది.
"ఇలాంటి ధియేటర్ వాళ్ళు-మనం కార్లో వచ్చి, ఎదురుగా దిగితేనే మన బుట్టలో పడతారు__అందుకని ధియేటర్లోంచి బయటికెళ్ళి చినవాల్తేర్ బస్టాపు దగ్గర నిలబడ్డాను. ఎర్రగా బుర్రగా ఒకడు మారుతీ కార్లో వస్తున్నాడు. అంతే చిన్న స్మైల్ విసిరాను. ట్రక్ మై బ్రేకేసాడు. లిఫ్ట్ అని అడిగా__డోర్ తీసాడు. ఎక్కాను. ధియేటర్లో దిగి, మేనేజర్ దగ్గర కెళ్ళాను.....అంతే....పాపం....ఎవరో ఒకరి కోసం, ఈ మేనేజర్లు టిక్కెట్లుంచుతారని తెల్సు...... అంతే....ఎవడో సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఫామిలీ కోసం ఉంచిన టిక్కెట్లు....అతగాడి చెల్లెల్ని నేనే నని చెప్పి, కొట్టేసా.....ఎలా ఉంది ట్రిక్?"
ఆమె చెప్పిన కథ వినగానే వాళ్ళందరూ నవ్వారు పెద్దగా.
"జగత్ కిలాడీ వంటే నువ్వేనే...." ఒకమ్మాయి పొగిడింది.
"జగత్ కిలాడీ ఓల్డ్ వర్డే బాబూ.....న్యూ వర్డ్.....మాయలేడీ...."ఇంకో అమ్మాయి అంది.
"తర్వాత సీరియస్ గా పొగుడుదురుగానీ.....ముందు పదండే....." షాపువాడికి డబ్బులిచ్చేస్తూ అంది సంధ్య.
సరిగ్గా అదే సమయంలో ధియేటర్ లోకి ఓ పోలీస్ జీప్ ప్రవేశించింది.__
అందులోంచి ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్, ముగ్గురు యువతులూ, ఒకబ్బాయి దిగారు.
మెయిన్ గేట్ వేపు నడుస్తున్న సంధ్య సర్కిల్ ఇన్ స్పెక్టర్ ని చూడగానే కెవ్వుమని అరిచింది.
"ఒసేవ్ చూడవే....." మిగతా నలుగురూ చూసి, గుండెలమీద చేతులు వేసుకుని__
"ఇప్పుడెలాగే......వాళ్ళకి టిక్కెట్లిచ్చి వెళ్ళిపోదామా?"
"టిక్కెట్లిచ్చి వెళ్ళిపోవడం ఏంటి? షేమ్....షేమ్......ముందు మీరెళ్ళండి....తర్వాత నేనొస్తాను....ఈ లోపల ఆ సిఐని నేను మేనేజ్ చేస్తాను.....గదా...."ధీమాగా అంది సంధ్య.
నలుగురమ్మాయిలూ భయం భయంగా బాల్కనీ వేపు నడిచారు.
అప్పటికే, సతీ, సుత, మరదళ్ళ సమేతంగా లోనకెళ్ళిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ మేనేజర్ తో ఇజ్జత్ కా సవాల్.....అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నాడు.
మేనేజరు, దేవుడి పటాల మీద ఒట్టేసి చెపుతున్నాడు.....వాళ్ళిద్దరి సంభాషణ ఎలా, ఎంత రసవత్తరంగా సాగుతోందో, ఊహించుకుంటూ తనెలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలో ఆలోచిస్తూండగా-
రోడ్డు మీద నుంచి ఒక అమ్మాయి గాభరాగా పరుగెత్తుకుని ఆయాసంతో వగరుస్తూ గబుక్కున వచ్చి-
సంధ్య చేతిని పట్టుకుంది- సంధ్య తలతిప్పి చూసింది.
"ఏవిటే జానకీ.....ఏవిటిది.....ఎప్పుడొచ్చావ్ ఊర్నించి....." అడిగింది గాభరాగా.
"ఇప్పుడే వచ్చాను గానీ.....అర్జంటుగా నీతో పనుంది.....నాతో రా....." ముందుకు లాగుతూ అంది జానకి.
"మరి సినిమా...." ఏదో ఆలోచిస్తూ అంది సంధ్య.
"నీకు సినిమా ముఖ్యమా....నా జీవితం ముఖ్యమా...." సీరియస్ గా ఓ భారీ డైలాగుని వదిలింది జానకి.
"ఈ సినిమా, ఎవరూ ఆడించకపోయినా, స్వయంగా యింకో ముప్పై, నలభయ్ రోజులాడుతుంది నాకు నీలైఫ్ ముఖ్యం...పద.....కానీ....నువ్వు నాకొ చిన్నపని చెయ్యాలి."
"ఏంటది....." అడిగింది జానకి.
"నువ్వు ఈ టిక్కెట్టుని అక్కడ మేనేజర్ తో మాట్లాడుతున్నాడే ఇన్ స్పెక్టర్ అతనికిచ్చేసి రావాలి....నేను సిటీ బస్టాప్ దగ్గర నుంచుంటాను....."
తన చేతిలోని టిక్కెట్ ను జానకి చేతిలో పెట్టి, రెండో పక్కకు చూడకుండా ధియేటర్ లోంచి బయటికెళ్ళి ట్రాఫిక్ ఐలాండ్ దాటి సిటీ బస్టాపులో నుంచుంది.
టిక్కెట్ల తతంగం ఏమీ తెలియని జానకి, మేనేజర్ తో మాట్లాడుతున్న ఇన్ స్పెక్టర్ దగ్గరకెళ్ళి..... మామూలుగా ఆ టిక్కెట్టును ఇవ్వకుండా, కొంచెం స్వంత తెలివి తేటలు ఉపయోగించి మరీ ఇచ్చింది__
"ఇన్ స్పెక్టర్ గారూ__మీకో టిక్కెట్టు కావాలనుకుంటాను.....నా మూడ్ బాగులేక నేను సినిమా కెళ్ళడం లేదు.....మీరెళ్ళండి...." అన్చెప్పి, ఆ టిక్కెట్టిచ్చి చక్కా బయటకు వెళ్ళిపోయింది జానకి.
మేనేజర్ ఇన్ స్పెక్టర్ వేపు, ఇన్ స్పెక్టర్ మేనేజర్ వేపు వైట్ ఫేసుల్తో చూసుకున్నారు.
ఆ తర్వాత మేనేజర్ సదరు టిక్కెట్ మీదున్న సీరియల్ నెంబర్ చూసి, కెవ్వుమని కేకేసి, కళ్ళ ముందే మెరుపు తీగ, ఎలక్ట్రిక్ వైర్ లా కనబడినట్టయి ఢామ్మని కిందపడిపోయాడు.
* * * *
సముద్రం వడ్డున ఇసకలో కూర్చున్నారు సంధ్య, జానకి.
"ఇప్పుడు చెప్పు.....నీ జీవితానికి ఏం డేంజరు ఏర్పడిందో?" ప్రశ్నించింది సంధ్య.