మాధవ్ ప్రసన్నంగా విన్నాడు.
రాధ ఏదో అనబోయింది. శాంత ఆమె నోటికి తన చేయి అడ్డుపెట్టి మాట్లాడవద్దని కళ్ళతో బతిమాలింది.
"విన్నావుగా... రేపు ఉదయాన్నే బస్సుంది. బయల్దేరు!" అన్నాడు ప్రకాశం.
"మీరు చెప్పడం అయితే నేనూ రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను!" చిరునవ్వుతో చెప్పాడు మాధవ్.
"ఈ ఊళ్ళో అన్నయ్య చెప్పాక మళ్ళీ మాట్లాడే పనిలేదు. ఆయన మాటంటే సుప్రీంకోర్టు జడ్జి తీర్పులాంటిది!" అన్నాడు కరకుగా ప్రకాశం.
"ఏ జడ్జీ వాద ప్రతివాదనలు వినకుండా జడ్జిమెంట్ ఇవ్వడు!" నవ్వుతూనే అన్నాడు మాధవ్.
"కానీ మా ఇంట్లో..." ప్రకాశం మాట పూర్తవ్వకముందే సుబ్బారాయుడు చెయ్యి చూపించి, తమ్ముడ్ని వారించి, "ఏమిటో త్వరగా చెప్పు!" అన్నాడు మాధవ్ ని.
"నన్ను మీ అల్లుడ్ని చేసుకోవాలని మీరు ఇంతకుముందు అనుకున్నారుగా!"
"అవును అమెరికా నుంచి వచ్చావూ హాయిగా ఏ సిటీలోనో హోదాగా ఉద్యోగం చూసుకుంటావూ, లేదా పెళ్ళి చేసుకుని ఎంచక్కా పెళ్ళాంతోసహా అమెరికా చెక్కేస్తావూ అనుకుని అల్లుడ్ని చేసుకోవాలనుకున్నాను."
"ఇంటిల్లిపాదీ నిన్ను అల్లుడిగా ఆదరించాం కూడా!" ప్రకాశం కినుకగా అన్నాడు.
మాధవ్ పార్వతమ్మ వెనకాల నిలబడ్డ రాధవైపు చూశాడు.
ఆమె రెండు కళ్ళూ నీటితో నిండి పొంగడానికి సిద్దంగా ఉన్న కృష్ణా గోదావరుల్లా ఉన్నాయి.
అతను ఆమెకి రెప్పపాటుకాలంలో కళ్ళతో భయపడవద్దన్న ఓదార్పునిచ్చాడు.
సుబ్బారాయుడు కోపం పట్టలేక అటూ ఇటూ తిరుగుతూ, "కానీ...నువ్వేంచేశావు? పల్లెటూళ్ళూ భాగ్యసీమలూ అంటూ లేని జంఝాటాన్ని నెత్తినేసుకుని ఒక అత్తనీ, చిన్నాన్ననీ, పెద్దనాన్ననీ వేసుకునొచ్చి హరోంహర అని ఈ ఊళ్ళో కాపురం పెడతానంటున్నావు. ఏం ఉందయ్యా ఈ ఊళ్ళో నా కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి ఓ సినిమానా....షికారా? అదీ వాళ్ళమ్మలాగే పేడెత్తుకుంటూ పిడకలు చరుచుకుంటూ ఆ ఉమ్మడి కుటుంబంలోపడి గానుగెద్దు జీవితం ఈడవాలా? నా ఒక్కగానొక్క కూతుర్ని అట్లాంటి కొంపలో పడేసేకర్మ నాకేమిటి? అందుకే రాజాలాంటి సంబంధం చూశాను. పిల్లాడు పెళ్ళవగానే అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఇద్దరూ చిలకా గోరింకల్లా హాయిగా కాపురం చేసుకుంటారు. ఇదే నా నిర్ణయం!" తిరుగులేనట్లు చెప్పాడు.
"చాలా బాగా చెప్పారు. ఓ కన్నతండ్రి తన కూతురి భవిష్యత్తు కోసం ఎంతగా ఆలోచిస్తాడో మీ మాటల్నిబట్టి అర్ధమవుతోంది!" అన్నాడు మాధవ్.
"మరి..." అన్నాడు అర్ధం చేసుకోమన్నట్లుగా సుబ్బారాయుడు.
"అందుకే నాకు పల్లెటూళ్ళన్నా, నిష్కల్మషంగా ప్రేమించి నిర్మొహమాటంగా తిట్టే మీలాంటి పెద్దలన్నా మక్కువ పెరిగిపోతోంది! సింప్లీ..... ఐ కాంట్ హెల్ప్ లవింగ్ దిస్ కంట్రీ" అన్నాడు మాధవ్.
"ఏమంటున్నాడు ఇంగ్లీషులో?" గణపతి దగ్గరకెళ్ళి అడిగాడు సుబ్బారాయుడు.
"నేను నా ప్రేమకి సహాయం చేసుకోలేను అంటున్నాడు!" అన్నాడు గణపతి.
మాధవ్ తల పట్టుకున్నాడు.
తిలక విసుగ్గా చూసి, ముందుకొచ్చి, "నేను ఈ పల్లెను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు" అంది.
"అయితే ఇప్పుడేమంటావు?" విసుగు, కోపం కలిసి అడిగాడు సుబ్బారాయుడు.
ప్రకాశం కలగజేసుకుని, "మా అన్నయ్య చెప్పినట్లు మనసు మార్చుకుని అమెరికా వెళ్ళిపోయే మాటైతే ముందుగానే మాకా పేపర్లూ అవీ చూపించి పెళ్లి చేసుకోవాలి!" అన్నాడు.
"ఊహుఁ" అన్నాడు మాధవ్.
"మరి నువ్వు తర్వాత నేను అమెరికా వెళ్ళనని మోసం చేస్తేనో?" అన్నాడు ప్రకాశం.
"నేను అలా మోసం చెయ్యను. అసలు నేను అమెరికా వెళ్తేకదా! ఇక్కడే ఎంచక్కా ఫాక్టరీ పెట్టి పెస్టిసైడ్స్ తయారుచేసి రైతులకి సప్లయ్ చేస్తాను! మీ అమ్మాయి మీరనుకుంటునన్ని కష్టాలేం పడదు. ఇక్కడా రోడ్లు వేయిస్తే ఓపెల్ ఏస్ట్రా కారులో తిరగొచ్చూ ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసీ అన్నీ అమర్చుకోవచ్చు. మనతోబాటు ఇంకో నలుగురికి ఉపయోగపడాలి. మనం మానని వెలేసుకుని వలసపోవడం తెలివైన పనికాదు. అసలు బ్రైన్ డ్రైన్ అంటే మీకు తెలుసా?"
"చెప్పింది చాలుగానీ..... ఇంకెళ్ళు!" దూకుడుగా అన్నాడు సుబ్బారాయుడు.
"నే చెప్పేది పూర్తిగా విని మాట్లాడండి!"
"అక్కర్లేదు, ఆ సంతంతా ఇంట్లోనే ఉంటారుగా?" కోపంగా అరిచాడు సుబ్బారాయుడు.
తాయారమ్మ మంచంలోనే దగ్గుతోంది.
"ఆ దగ్గు ఎంతకాలం భరిస్తారు? ఆవిడ్ని తీసుకుపోయి ఏ ఆశ్రమంలోనో చేర్పించండి!" గట్టిగా అన్నాడు మాధవ్.
"ఏమన్నావ్? మా అమ్మని అనాధాశ్రమంలో చేర్పించాలా? ఎంత ధైర్యం? వినకూడని మాట విన్నట్లు అరిచాడు సుబ్బారాయుడు.
"ఆగండి.... మీ అమ్మగారంటే మీకెంత ఆపేక్షో, నావాళ్ళంటే నాకూ అంతప్రేమ! వాళ్ళని సంతా, మందా అనకండి! ఆనందం అనేది అమృతం తాగితేరాదు. అమృతం తాగి మనవాళ్ళు అనేవాళ్ళ మధ్యన ఉంటేనే వస్తుంది!" అన్నాడు మాధవ్.
"ఎందుకయ్యా బాబూ ఈ సుత్తి? మా అమ్మాయిని నీకిచ్చే ఉద్దేశం లేదంటున్నాంగా! మా ఇష్టం వచ్చినచోట ఇచ్చుకోనీ!" అన్నాడు ప్రకాశం.
"కానీ అమ్మాయికి ఏదిష్టమో తెలుసుకోవాలిగా?" అన్నాడు మాధవ్.
"నేను ఏదిష్టమంటే అదే ఇష్టపడుతుంది మా అమ్మాయి!" గర్వంగా సుబ్బారాయుడు.
"ఓ అరగంటముందు నాతో ఉండిపోతానంది. దానికేమంటారు?" అన్నాడు.
"పిచ్చిపిల్ల దానికేం తెలుసు?" కొట్టిపారేశాడు ప్రకాశం.
"నాకు తెలుసు! నేను మాధవ్ నే పెళ్ళిచేసుకుంటాను!" అన్న రాధను ఉరిమినట్లు అరిచాడు సుబ్బారాయుడు.
ఆడవాళ్ళు భయపడిపోయారు.
శాంతా, తిలకా కలిసి రాధని బలవంతంగా లోపలకు తీసుకెళ్ళారు.
"మావయ్యా...! మనిద్దరం ఓ అగ్రిమెంట్ కి రావడం న్యాయం అని నేను అనుకుంటున్నాను!" అన్నాడు మాధవ్!