Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 4

    పాట పూర్తిచేసి ఫిడేలు క్రింద పెట్టి కండువాతో ముఖం తుడుచుకున్నాడు పాణి. తన్మయులై విన్నాడు రెడ్డిగారు. లోకాన్ని మరిపించి మనసును మురిపించే శక్తి సంగీతంలో ఉందని గ్రహించారు.
    "పంతులూ! బాగ పాడినవయ్యా! నిషా వచ్చినట్లయిందనుకో. దినాం (రోజూ) ఈయాళకొస్త, దినాం ఒక పాట పాడు. నువ్వీ గడీల ఎన్నోద్దులున్నా అడిగేటోడు లేడు. ఇన్నావా? ఏమంటవ్?" అని కుర్చీమీది నుంచి లేచారు.
    "చిత్తం. అలాగేనండీ!" అని, "పా....ఠా....లు.... "నసిగాడు పాణి. అది వినిపించుకోనట్లుగానే వెళ్ళిపోయారు రెడ్డిగారు.
                                                                      2
    తెల్లవారే వరకల్లా స్నానం చేశారు రెడ్డిగారు. వైస్రాయ్ ధోవతి కట్టుకొని, జరీపనిచేయబడిన షేర్వానీ వేసుకొని, ఎర్రని కుచ్చుటోపి ధరించి, బూట్లు తొడుక్కొని దస్తార్ (పటకా) నడుముకు కట్టుకొని, అత్తరు పూసుకొని ముస్తాబై బైల్దేరారు చింతల తోపులోకి, అక్కడికి చేరేవరకు సుమారు అలాంటివేషంలోనే ఉన్న కరణం వెంకట్రావు కనిపించాడు. తేడా ఏమంటే కరణంగారికి ఊర్ధ్వపుండ్రాలున్నాయి. నారయ్య కోమటి వెంకయ్య, కిష్టయ్య ధోవతులు కట్టుకొని, కమీజులు వేసుకొని, రుమాళ్ళు చుట్టుకొని ఉన్నారు. మామూలు షేర్వాని, చుడిదార్ పైజమాలో ఉన్నాడు నిజామొద్దీన్.
    రెడ్డిగార్ని చూసి అంతా నమస్కరించారు. ఒకసారి పందిరంతా కలయజూచి, ఏర్పాట్లన్నింటినీ అజమాయిషీ చేసి, వంటలకోసం ఏర్పాటయిన స్థలం చూడ్డానికి బైల్దేరారు రెడ్డిగారు. బస్తీ నుంచి తెప్పించిన పెద్ద పెద్ద దెగ్చాల్లో (గుండిగలలో) వంటలు జరుగుతున్నాయి. ఆవు మాంసం ఎర్రగా, కుప్పగా పడి ఉంది. రెడ్డిగారి గుండె కలుక్కుమంది అది చూచి. గోవును దేవతగా పూజించే తాను గోమాంశరాశి చూడాల్సి వచ్చింది. అయ్యవారు చెప్పిన పురాణాలు గుర్తుకువచ్చాయి. రాక్షసులు మాత్రమే గోవులను హింసించేవారట! కలిపురుషుడు గోవును తన్నినంత మాత్రానే పరీక్షితు ఉగ్రుడైపోయాడు. ఎంతటి కలికాలం! తాను గోమాంస భక్షకులకు సేవచేయాల్సి వచ్చింది కదా అనుకున్నారు. గిరుక్కున తిరిగి అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
    ఒక మస్కూరు (తలారి) పరుగెత్తుకొని వచ్చి, బండ్లు వస్తున్నాయని తెలియజేశాడు. దూరంగా గజ్జలచప్పుడూ వినవచ్చింది. రెడ్డిగారు పరుగు పరుగున పందిరి కిందికి వచ్చారు. బోర్లపడివున్న ఒక కుర్చీని సరిచేయమని ఆదేశిస్తూ చేతులు కట్టుకొని నుంచున్నారు. వారిపక్కన కరణం. కరణం పక్కన నిజామొద్దీన్ అతని పక్కన నారయ్య, ఆ తరువాత కోమటి కిష్టయ్యా, వెంకయ్యా నుంచున్నారు.
    తాసిల్దార్ బండి వచ్చేసింది ముందు. బండ్లోంచి తాసిల్దార్ దిగగానే వంగి వంటిచేత్తో మూడుసార్లు సలాం చేశారంతా. సలాములు అందుకొని "ఇంతజాములు ఠీక్ (సరిగా) ఉన్నయా?" అని అడిగారు రెడ్డిగార్ని. రెడ్డిగారు వెంట నడువగా పందిరంతా కలయజూచి వచ్చేశా రిద్దరూ.
    ఈలోగా మిగతా బండ్లు కూడా వచ్చేశాయి. బహద్దూర్ యార్ జంగ్, ఖ్వాజా ఇనాయతుల్లా బేగ్ లాహరీ ముస్సఫ, షేక్ లతీపుల్హసన్ అమీను, కొందరు పోలీసులు దిగారు. ఒకరి తర్వాత ఒకరు తాసిల్దారుకు చేసినట్లే అందరూ, అందరికీ సలాములు చేశారు. బహదూర్ యార్ జంగ్ కు గ్రామాధికార్లను పరిచయం చేశాడు తాసిల్దార్. అందరూ పందిట్లోకి వెళ్ళి కూర్చున్నారు. వారికి ఎదురుగా కొద్దిదూరంలో హరిజనులు కూర్చున్నారు.
    "దేశ్ ముఖ్ సాబ్! వీళ్ళను ముసల్మాన్లుగా చేయటాన్కి మీకేమైనా ఏత్ రాజ్ (అభ్యంతరం) ఉన్నదా?" అని అడిగాడు బహద్దూర్ యార్ జంగ్.
    "మాకేమి ఏత్ రాజ్ ఉంటది? సర్కార్ హుకుమ్ తామీల్ (అమలు) చేసోటోళ్ళం" అని కారణం వైపు చూచారు రెడ్డిగారు.
    "అంతే జనాబ్! మే మెంత? మా ఏత్ రాజ్ ఎంత?" అన్నాడు కరణం.
    అక్కడున్న వారందరితోనూ వారికెలాంటి అభ్యంతరం లేదనిపించుకొని ఉర్దూలో ఉపన్యసించాడు:
    "హిందువులు మాల మాదుగుల్ను చాలా నీచంగా చూస్తూ వున్నారు. "హరిజనులు వింటున్నారనే విషయం ధృవపర్చుకొని మళ్ళీ సాగించాడు: "వారిని తమ బావుల దగ్గరికీ, గుళ్ళల్లోకీ రానివ్వరు. తాకితే మైలపడతామంటారు. అతి నీచం అయినా పనులు చేయిస్తారు. ఊరిబయట ఉంచుతారు. అంటే వారు హిందువులు కారని అర్ధం. అట్టివారికి ఇస్లాం మతం ఇచ్చి వారిని ఉద్దరించటానికి ఇత్తేహాదుల్ ముసల్మీన్ (మహమ్మదీయుల సంస్థ) వెలిసింది. ఆలా హజ్రత్ (నిజాం రాజుకున్న బిరుదు) దయతల్చి 'ఇస్లామ్ ముసల్మీన్' అనే సేగా (డిపార్టుమెంటు, శాఖ) ప్రారంభించారు. ఆ సేగా నవ ముసల్మానుల 'సంక్షేమానికి' కృషి చేస్తుంది. వారికిగాను బావులు త్రవ్వించడం, భూములు చూపడం, విద్య చెప్పించడం వారి పనులు.
    "ప్రపంచంలో 'ఇస్లాం' ఒక్కటే మతమనీ, అల్లా ఒక్కడే దేవుడనీ, హజ్రత్ మహమ్మద్ ప్రవచించినారు. ముసల్మానులంతా ఒక్కటే.
    "వారికి కులాలు లేవు. ఒకే మసీదులో అలా హజ్రత్ మరియు ఫకీర్ నమాజ్ చేయవచ్చు. అన్నపానముల వద్ద భేదము లేదు. అల్లాదృష్టిలో అందరూ సమానులే. హజ్రత్ మహమ్మద్ పేదవారికొరకే కృషిచేసినారు. అలా హజ్రత్ కూడా పేద ముసల్మానులను ఉద్దరించ తలచినారు. కాబట్టి ఇందు విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండరాదు. మేము వీరిని చాటుగా ముసల్మాన్లను చేయటం లేదు. మీ సమక్షంలోనే చేస్తున్నాము. ఇందుకు మీరందరూ సాక్షులు."
    రెడ్డిగారి రక్తం వేడెక్కింది. దాచాలన్నా దాగక కరణం కళ్ళు ఎర్రవారేయి. అయినా లోపల్లోపల తిట్టుకున్నారేగాని పైకి ఒక్కమాట మాట్లాళ్ళేదెవ్వరూ.
    ఖాజీ (మహమ్మదీయ పురోహితుడు) ఆదేశం మేరకు, వారివెంట వచ్చిన తురక మంగళ్ళు హరిజనుల్ను వరుసన కూర్చోపెట్టి నెత్తులు గొరిగారు. జుట్టు రహితంగా క్షౌరం చేయించుకున్న తరువాత మామూలుగా చూసుకున్నట్టు తలమీదికి చేయిపోనిచ్చి చూసుకున్నారు. బహద్దూర్ యార్ జంగ్ అంతటివానిముందు కూర్చోవడం, అతడు చెప్పిన మాటలు వారికి కొంత సంతోషాన్నిచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ, జుట్లుపోతే చిన్నబుచ్చుకున్నారు వారంతా. అవి వారికి చిన్నతనంనుంచేకాక, తరతరాల్నుంచి వస్తున్నవి. తమ ఆస్తి ఏదో పోయినట్టు బాధపడ్డారు. అయినా ఎవరూ మాట్లాల్లేదు. యమదూతల్లాంటి పోలీసుల్ని చూచి.
    తరువాత ఖాజీ ఒక్కొక్కని మొలత్రాడు రెండుచేతుల్తోనూ పుట పుటా తెంపేశాడు. తమతో తెచ్చిన గుడ్డలు పంచిపెట్టారు అధికార్లు అందరికీ. పైజమాలూ కుడ్తాలు తొడుక్కొని అంతా ముసల్మాన్లయి పోయారు. ఖాజీ వారిపేర్లు మార్చి మహమ్మద్, హసన్, హుసేన్ మున్నగు పేర్లు పెట్టాడు. ఆ పేర్లన్నీ వ్రాసుకున్నాడు తాసీల్దార్ 'ఇస్లామ్' ముసల్మీన్(ముసల్మానుల సంక్షేమం కొరకుగాను ఏర్పాటుచేసిన శాఖ)కు పంపడానికి.
    ఆడవారి వంతు వచ్చింది. మంగళసూత్రాలు తెంపడానికి సాగాడు ఖాజీ. వాటిని తెంపనియ్యమన్నారు ఆడవాళ్ళు.
    "పుస్తె తెంచుతే మా పెద్దాయనకు గండమొస్తది. పుస్తె వుంచి తురకల్ల కలుపుతే కలుపురి. లేకుంటే మాల మాదిగోళ్ళంగనే ఉంటం.  ఏమ్మాతాతల్తండ్రుల్చచ్చినా?" అన్నది మిసి.
    "మంగళసూత్రం లేకున్నా" అని ఏదో అనబోయాడు ఖాజీ. "మనకెందుకసే గీ తురకమతం గిరకమతం? మొగోళ్ళకు సిగ్గులేకపోయే మనకన్న ఉండొద్దే. పదురి. పదురి గుడిసెల్లకు. చస్తే మాల మాదిగులంగనే చస్తం" అని వెనక్కు తిరిగింది మైసి. అందరూ ఆమెననుసరించారేకాని అక్కడున్న కొత్తచీరెలు వారి మనస్సులో రెపరెపలాడేయి. 
    అధికార్ల ఒళ్ళు మండిపోయింది. పోలీసు అమీను పళ్ళు పటపటమని కొరికాడు. తాసిల్దారు గుడ్లెర్రచేశాడు. మున్సఫ్, బహద్దూర్ యార్ జంగ్ తో ఏదో గుసగుసలాడాడు.
    రెడ్డిగారూ, కరణమూ సంతోషించారు లోపల్లోపల.
    మున్సఫ్ ఏవో సంజ్ఞ చేశాడు. ఖాజీ వారందర్నీ పిలిచాడు:
    "రాండి..... రాండి, పుస్తెలు తెంపకుండనే తురకల్ను చేస్త".
    చీరల మురిపం వారిని వెనక్కు తిప్పింది. "నీ కాల్మొక్త ఎనకటి నుంచి వస్తాన్నది కాదుండి పూస్తే, చూస్తా చూస్తా ఎట తెంపుదుం?" అన్నది మైసి రాజీపడుతున్నట్లు. తనచేత్తో వారి బొట్లు చెరిపేశాడు ఖాజీ.
    మతం మార్చుకున్న మగవారిస్థితి ద్రౌపదీ వస్త్రాపహరణమప్పటి పాండవుల్లా వుంది.
    ఆడవాళ్ళందరికీ తురక చీరలు కట్టించారు. దాంతో వారూ తురకలైపోయారు. అందరినీ వరుస నుంచోపెట్టి తాను చెప్పినట్టు చెప్పమన్నాడు ఖాజీ.
    "లా ఇలాహీ, ఇల్లల్లాహీ, మహమ్మదున్ రసూలల్లాహీ."
    'కొత్త తురకలు' ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతా కలసి రాయిలాగా అనేశారు.
    "అట్లకాదు. ఒక్కొక్క మాట అనండి" అని "లా ఇలాహీ" అని చెప్పాడు ఖాజీ.
    "రా ఇలాగా" అన్నారందరూ.
    "అట్లాకాదు. లా ఇలాహీ" అన్నాడు ఖాజీ.
    "లాయరప్పా" అన్నారంతా.
    ఎవరూ అనలేకపోతే ఏదో అనిపించి సంతృప్తిపడ్డారంతా. మొత్తంమీద కొత్త ముసల్మానులన్నది ఇలా వుంది :
    "లాయిలప్పా, ఇల్లెల్లా మా అమ్మకు రాసురల్లా".
    దానిని గురించి ఇలా చెప్పాడు ఖాజీ:
    "అల్లాతప్పవేరు దైవంలేదు. మహమ్మద్ ఒక్కడే దేవుని దూత. ఈ విషయమును నోటితో పఠించి మనసార విశ్వసించుటే ఇస్లాం. ఇదియే మీ మతము. ఇదియే మీ విశ్వాసము. ఇది మిక్కిలి నిరాడంబరమైన మతము. దీనిలో ధనవంతుడని, పేదవాడని భేదము లేదు. ముసల్మానులందరూ సహోదరులే. 'ఆల్ ముస్లిం ఆఖల్ ముస్లిం' కాబట్టి నేటినుండి మనమందరము సోదరులము. అందరమూ కలిసి నమాజు చేయుదుము. నేనెట్లు చేసిన మీరందరు నట్లే చేయవలెను" అన్నాడు ఖాజీ.
    అందరూ వరుసలుగా నుంచున్నారు. నవ ముసల్మానులు అధికారుల ప్రక్కలా, వెనుకా నుంచున్నారు.  ఖాజీ ముందు నుంచున్నాడు. అతడు చెవుల్లో వ్రేళ్ళు పెట్టుకుంటే అంతా పెట్టుకున్నారు. అతడు వంగుతే అంతా వంగారు. కానీ, అతడు లేవకముందే కొత్త తురకలంతా లేచారు. వంగివున్నాడని తెలుసుకొని మళ్ళీ వంగారు. ఖాజీ లేచాడు. వారు లేవలేదు. లెమ్మన్నాదతను. అందరూ లేచారు. ఇలా నమాజు ముగిసిందనిపించాడు ఖాజీ.

 Previous Page Next Page