Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 3

    గడీలో ఉంటున్నాడని పేరేగాని మూడు రోజుల్నుంచి రెడ్డిగారి దర్శనం కాలేదు పాణికి. పొద్దుగడవడం కష్టంగా ఉంటే అలా చింతలతోపుకు వెళ్ళాడు. హడావిడిగా ఉంది. పెళ్ళికి జరిగేటంతటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొందరు తాటాకూ దింపుతున్నారు. కొందరు ఒకపక్క పందిళ్ళకు తాటాకు వేసి కుడ్తున్నారు. మంచాలు, కుర్చీలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఒక చింతక్రింద మంచం మీద కూర్చొని అజమాయిషీ చేస్తున్నారు రెడ్డిగారు. కరణం వెంకట్రావు హడావుడిగా వచ్చి "మంచాలియ్యమంటున్రట ఊళ్ళోళ్ళు. చాకలోళ్ళు ఊరికేనే తిరిగొచ్చిన్రు" అని షికాయతు (ఫిర్యాదు) చేశాడు తాను పంపుతే ఇవ్వనందుకు తగిన శాస్తి జరిపించాలనే ఉద్దేశంతో "మస్కూరోళ్ళ (తలార్లు)ను తోలి ఇండ్లలోంచి గుంజుకురమనున్రి. ఇయ్యకుంటే  ఇండ్లల్ల మాల మాదుగుల్ను జొర పెడ్తమని చెప్పమనుర్రి" అని ఆదేసించారు రెడ్డిగారు. కరణం అదేమాట చెప్పి తలార్లను పంపించాడు.
    రెడ్డిగారు ఉద్రేకంలో ఉన్నారు. దర్శనం చేసుకోవాలా, వద్దా? అని వెనకా ముందాడుతున్న పాణిని చూశారు రెడ్డిగారు. వంకరకర్ర ఊతమీదలేచి "జర గడీదాకా పోయొస్త" అని కరణంతో చెప్పి బైల్దేరాదు రెడ్డిగారు. పాణి దగ్గరికి వచ్చి "రా పంతులూ!" అని సాగిపోయారు. పాణి ఏదో విన్నవించుకోవాలని మధనపడసాగాడు. ఎలా ప్రారంభించాలో అర్ధం కాక తికమక పడ్తుండగా "దొరా! దండం పెడ్త" అన్న మాటలు వినిపిస్తే దొర అటు చూచాడు. ఒక వ్యక్తి తలగుడ్డ తీసి మోకాళ్ళు వంచి నమస్కారించాడు రెడ్డిగారికి.
    "ఏమ్ర మల్లిగ! ఏటో వచ్చినావూ?" అడిగారు రెడ్డిగారు.
    "నీకాడికే వచ్చిందొర! గడీలకి పోతే చింతల్తోపులున్నడు దొర అని చెప్పిండు ఎంకటయ్య ఆన్నించి నీకాడికే వస్తాన్న బాంచెను."
    "ఏంది కత?" ఠీవీగా అడిగారు సాగిపోతూ.
    రెడ్డిగారి వెనక నడుస్తూ చెపుతున్నాడు మల్లిగాడు:
    "పాత కతేనండి. మా అయ్య సచ్చినాక భూమి అన్నకు నాకు హిస్సి (భాగాలు) పంచిన్రు కదనుండి. నాకేమో గొడ్డు, గోద, ఎగుసం (వ్యవసాయం) లేదాయె. మా అన్నకి ఇచ్చిన నాపాలు భూమి సుత మునాఫ (కౌలుకు) మక్తగింజలు (కౌలు గింజలు) ఇగిస్త నంటడు. మూడేండ్లాయె ఎగబెడ్తాండు. దొరతో చెప్పుతనంటే కాళ్ళుపట్టుకుంటడు, కడుపులు పట్టుకుంటడు, ఏడుస్తడు, ముసల్దాన్నేమో ఎల్లగొట్టింది మా వదిన. నీ కాల్మొక్త - నాకేమన్న మళ్ళున్నయా మాణ్యాలున్నాయా? మక్త గింజలడిగెతందుకు పొయిన్నుండి నిన్న. మా అన్న మక్తలేదు గిక్తలేదు పో అని వెల్లగొట్టిండు. నీ బాంచను. ఎట్టియ్యవో చూస్త దొరతానికి (దొరదగ్గిరకు) పోతున్ననని ఎళ్ళినుండ్రీ, ఎనకనుంచొచ్చి కిందపడేసి గొరగొర గుంజ్కు పోయిన్రు ఆల్మగలు. చావగొట్టిన్రున్రి ఇద్దరూ కలిసి" అని కంట తడిపెట్టి వీపు చూపించాడు ముందుకు నడిచి. చర్మం లేచిపోయింది రెండుచోట్ల. దద్దులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "దొరతానికి పొయ్యి చెప్తనని' వస్తాంటే పోర! దొరేం తలకొట్టి మొలేస్తడా: నేనొక్క గింజియ్యనను పో' అని తుపుక్కున ఉమ్మేసిండుండి. దొరలు మీరే రచ్చించాలే. గరీబోన్ని. పిల్లలు గల్లోన్ని" అని రెడ్డిగారి కాళ్ళ మీద పడ్డాడు వీధిలోనే.
    'జరుగు' అని కాళ్ళు వదిలించుకొని సాగిపోతూ "మక్త ఇప్పిస్తలేరా! వానికి మస్తీ (పొగరు) ఎక్కింది నాల్గెకరాల పొలం ఉంటే టార్కల్ల. దొర పిలుస్తాండని పట్కరాపో, తోళ్ళొలుస్త. దొర తలకొడ్తడో మొలేస్తడో చూస్త" అన్నారు.
    "దర్మదొరలు నీ గులాపోన్ని. ఎట్లనన్న మఖ్త ఇప్పించురి" అని అక్కడే నిల్చిపోయాడు, మరొకసారి మోకాళ్ళు వంచి దండం పెట్టి.
    పాణి ఎలా ప్రారంభించాలా అని తర్కించుకుంటుండగా ఉభయులూ మౌనంగా సాగిపోతున్నారు.
    ఇంటిముందరి అరుగుమీద కూర్చున్న కౌసాలి బ్రహ్మయ్య దొరను చూసి బీడీ ఆర్పి జేబులో వేసుకొని లేచి నుంచొని 'దొరా! దండం పెడ్త' అన్నాడు చేతులు జోడించి.
    "ఏం బ్రహ్మయ్య! దొంగ సొమ్మేమన్న గలాయిస్తున్నావా(కరిగిస్తున్నావా)?"
    "దొంగ సొమ్మేడి ద్దొరా?" వెంట నడుస్తూ, "పనే దొరకటం లేదు" అన్నాడు.
    "చిందొరసాని చంద్రహారం కావల్నంటున్నది, చేసి పెడ్తవా?"
    "ఎందుకున్ననండి ఊళ్ళ, దొరల పన్లు చేయటానిక్కి కాకుంటే?" అని ధ్వని తగ్గించి రమ్మంటారా గడీలకి' అని అడిగాడు వినయంగా.
    "ఇయ్యాల్రేపాగు."
    "దొరవారూ!" అని దగ్గరికి వెళ్ళి మెల్లగా "తురకల్ను చేయటాన్కీ వస్తున్రట అప్సర్లు(ఆఫీసర్లు)?" అని అడిగాడు.
    "మాల మాదిగోండ్లను చేస్తరట."
    "మహబూబ్ పాషా (అప్పటి నిజాం తండ్రి) ఇట్ల లేకుండె నుండి ధర్మాత్ముడు. చచ్చి ఏ సొర్గానున్నడోకాని. ఏన్గనెక్కి పోయేటప్పుడు పైసల్చల్లించెటోడట! బాపన్ల క్కూడ సంభావన్లిచ్చేటోడట కాదుండీ!"
    "అంటారు."
    "బస్తీల ఇన్న, హనుమకొండలో కరణపాయనే తురకల్ల కల్సిండట కాదుండి, ఆయన పేరేదో చెప్పిన్రు, యాదికి (జ్ఞాపకానికి) రావటంలే. నమాజు చేస్తడట. మసీదులకి పోతడట. నిజమేనా నుండి?"
    "ఊ"
    "వాళ్ళన్న కొత్తపల్లి దేశ్ ముఖ్ కూడా కలిసిండట కాదుండి తురకల్ల? బాపనోళ్ళతో కూడా నమాజు చేయిస్తుండట!"
    "హు, రాజ్యం తురుకోళ్ళది. మళ్లిస్తరు, మాన్యాలిస్తరు, తురకల్ను చేస్తరు. ఏమంటవు?"
    "నేనంటే మాత్రం ఆగుతాదుండి. ఏదో తెలియకడుగుత! 'ఆరుతరాల్నుంచి రాజ్యం చేస్తున్నం. ఇంకా నా రాజ్యం నూటికి ఎనభై మంది హిందూలున్నరు' అని విచారపడ్తున్నడట కాదుండి మన హుజూర్?"
    గడీ రావడంతో "సరేగాని ఎల్లుండొచ్చి బంగారం తీస్కపో. జల్దిచేసియ్యాలే. లేకుంటే యాదున్నదా?" అని ఉరిమారు రెడ్డిగారు.
    "జేల్ల పడ్డది మరుస్తానుండీ?" అని వెనక్కు తగ్గాడు బ్రహ్మయ్య.
    గడీలోకి వెళ్ళిపోయారు రెడ్డిగారు, పాణివైపు చూడనైనా చూడకుండా.
    సారంగపాణి గదిలో ప్రవేశించి మంచంమీద పడిపోయాడు.
    రెడ్డిగారు దర్శనం చేసుకుంటే నాల్గు సంగీతపు పాఠాలు దొరుకుతాయని ఆశతో వచ్చాడా ఊరు. ఎలాగో ఒక సంవత్సరం గడుపుకొని తనదేశం చేరాలని అతని సంకల్పం. రెడ్డిగారి దర్శనమే గగనమైంది. గడీలో ఉండమని ఆశ్రయమిచ్చాడు. బాగానే ఉంది. తింటూ కూర్చోగలడా మనిషి? వచ్చింది కూడా మరచిపోతానేమో అనుకున్నాడు. రెడ్డిగారికి తన విషయం విన్నవించుకోడానికే సమయం దొరకడం లేదు. చింతల తోపుకు వెళ్తే తనను చూచి లేచి వచ్చాడు ఎందుకో? మల్లిగాని పోట్లాట? వాడు చెప్పింది నిజమేనా? ఏమో? తనకెందుకు? బ్రహ్మయ్యేమన్నాడు? బ్రాహ్మణులు సైతం తురకలైపోతున్నారా? ఇలా మతాలు మారుస్తూ రాజ్యమంత తురకల్ను చేస్తాడేమో నిజాం నవాబు. పోల్చిచూస్తే ఇంగ్లీషువాళ్ళే దేవతల్లా కనిపిస్తున్నారు. దీనికి ప్రతిక్రియ లేదా? గాంధీజీకి ఈ విషయాలు తెలియవా? అనుకున్నాడు. సహాయ నిరాకరణ, విదేశ వస్తు దహనం, ఉప్పు సత్యాగ్రహం గుర్తుకు వచ్చాయి. వనజ గుర్తుకు వచ్చింది. ఏ ఆకర్షణ ఉంది ఆమె దగ్గర! కాస్సేపు తీయగా మాట్లాడకూడదూ వచ్చి! కళ్ళల్లో ఎంత అమాయకత ఉంది!
    వనజ అతని కళ్ళలో మెదిలింది.
    "ఏం పంతులూ, మంచిగున్నదా ఈడ?" అంటూ గదిలో ప్రవేశించారు రెడ్డిగారు ఆ రాత్రి.
    దొరవారి కంఠం విని ఉలిక్కిపడి మంచంమీంచి దూకాడు పాణి. చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి "మీ దయవల్ల మంచంమీంచి దూకాడు పాణి. చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి "మీ దయవల్ల సుఖంగా ఉన్నానండీ" అన్నాడు సవినయంగా.
    రెడ్డిగారు కుర్చీలో కూర్చున్నారు. చేతులు జోడించి హనుమంతునిలా పక్కనే నుంచున్నాడు పాణి.
    "సర్లేగాని ఇంతజాముల్ల(ఏర్పాట్లలో) మస్రూపుండి (నిమగ్నుడైవుండి) మర్చిన.....నువ్వీడికేం పనిమీ దొచ్చినవ్, నన్నేం చేయమంటవ్?"
    "చిత్తం. సమయం దొరికినప్పుడు విన్నవించుకుందా మనుకున్నా. మాది బెజవాడ. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం చదువుకున్నాను. సంగీతం నేర్చుకున్నాను. ఒక నెల తేడాతో తల్లితండ్రులిద్దరూ చనిపోయారండీ! నాకింకెవరూ లేరు. ఆ దుఃఖం భరించలేక దేశ సంచారం బైల్దేరాను. నైజాంలో అడుగుపెట్టినప్పన్నుంచి మీ దయవల్ల ఆదరణ జరుగుతూనే ఉంది. ఏదో రెండుపాఠాలు కుదిర్చిపెడ్తే మీ పంచన ఒక సంవత్సరంపాటుండి వెళ్ళిపోతానండీ! మీరు రసికులనీ ధర్మాత్ములనీ విని వచ్చాను. మీ దయ."
    రెడ్డిగారు తల గోక్కుని ఏదో ఆలోచించారు. కొద్దిసేపటి తరువాత "పంతులూ! ఒక పాటైతే పాడు" అన్నాడు. ఫిడేలు శ్రుతిపెట్టి ప్రారంభించాడు పాణి:
    "యోచనా! కమలలోచనా!
    ననుబ్రోవ యోచనా!
    సూచన చేతుననుచు నీకు తోచెనా
    ద్యుతి విజితాయుత విరోచన!
    నన్ను బ్రోవ నింకా యోచనా||
    కాచన, నిజభక్తి నిచయ, పాప విమోచన
    గల బిరుదెల్లగాని నన్నేచిన
    కృతి విపినరాబి హేచన!
    త్యాగరాజ పూజిత కమలలోచన!
    యోచనా నను బ్రోవ"

 Previous Page Next Page